15, జూన్ 2018, శుక్రవారం

Marudamalai






  శ్రీ మురుగన్ కోవెల, మరుదమలై 


                                                                                              = ఇలపావులూరి వెంకటేశ్వర్లు 



తమిళుల ఆరాధ్య దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. మురుగన్, కార్తికేయన్, కుమరన్,వేలాయుధన్,
సుబ్రమణియన్, పళణివాసన్, దండాయుధపాణి  ఇలాంటి పేర్లను తమ సంతానానికి పెట్టుకొని, స్వామి నామాన్ని నిత్యం స్మరిస్తూ తరిస్తుంటారు. ఈ కారణంగా ఎన్నో విశేష సుబ్రమణ్య ఆలయాలు తమిళనాడులో అధికంగా కనిపిస్తుంటాయి. 
భక్తులు పరమ పవిత్ర భావనతో సందర్శించుకునే ఆరు పాడై వీడు ఆలయాలు రాష్ట్ర నలుదిక్కులా నెలకొని ఉన్నాయి. అవే పళని, తిరుత్తణి, పలమదురైచోళై, తిరుప్పఱైకుండ్రం, స్వామిమలై మరియు తిరుచెందూర్. 
కార్తికేయుని ఆలయాలు ఎక్కువగా పర్వతాల మీద ఉంటాయి. ఒక్క తిరుచెందూర్ ఆలయం తప్ప! కానీ అది కూడా ఒకప్పుడు పర్వతమేనట ! కానీ కాలక్రమంలో సముద్ర అలల ధాటికి కరిగి సముద్రంలో కలిసిపోయిందట ! ఆలయంలో ఒక చోట పర్వతభాగం కనపడుతుంది. 
















ప్రసిద్ధ ఆరుపాడై వీడు ఆలయాలకు కొనసాగింపుగా కుమారుని ఏడో నివాసంగా తమిళులు భావించి సందర్శించే  క్షేత్రం మరుదమలై ! కోయంబత్తూర్ కి సుమారు పాతిక కిలోమీటర్ల దూరంలో పడమటి కనుమలలో నెలకొన్న క్షేత్రం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. 
తెల్ల మద్ది లేదా అర్జున వృక్షం అని పిలిచే చెట్లతో నిండి ఉన్నపర్వతాలు కావడాన ఈ పేరు వచ్చింది. మరుదు అనగా తెల్లమద్ది వృక్షాలు, మలై అంటే కొండ. సంగమ కాలం (క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దం నుండి క్రీస్తుశకం మూడో శతాబ్దం వరకు)నికి చెందిన "తిరు మురుగ తృపడి" అనే రచన ప్రకారం మురుగ అన్న పదానికి  అందం, యవ్వనం, తియ్యదనం, దైవత్వం అన్న అర్ధాలున్నాయి. అందుకనే కుమారస్వామి ఎక్కువగా పర్వతాల మీద ఆవాసం ఏర్పరచుకొని ఉంటారు అని విశ్వసిస్తారు.















 పళణినాధుని ఇతర ఆలయాల పురాణ గాధల లాగానే మరుదమలై పురాణగాథ కూడా స్కందుడు " సూరపద్ముడు" అనే అసురుని వరబలాన్ని అణచిన విషయం గురించే అని స్కాందపురాణం, మరియు పెరూర్ పురాణం తెలుపుతున్నాయి.
సూరపద్మునితో సమరం సల్పుతున్న షణ్ముఖుని రాక కోసం దేవతలు, మునులు ఈ పర్వతం మీద ఎదురు చూశారట. రాక్షసుని మదము అణచి తన సేవకునిగా చేసుకొని పార్వతీ నందనుడు వారికి ఆనందం కలిగించారట. వారి కోరిక మేరకు ఈ క్షేత్రంలో కొలువు తీరారని తెలుస్తోంది.
మరుదమలై కి ఇరుపక్కలా ఉన్న వెల్లింగిరి మరియు నిలి అన్న పర్వతాలతో కలిపి మూడింటిని సోమస్కంద రూపాలుగా ఋషులు పేర్కొన్నారు. సోమస్కంద అనగా కుమారుని మధ్యలో కూర్చోబెట్టుకొని ఆది దంపతులు దర్శనం ఇవ్వడం.
















సుమారు అయిదు వందల అడుగుల ఎత్తున ఉన్న ఆలయానికి చేరుకోడానికి సోపాన మార్గం మరియు రహదారి మార్గం ఉన్నాయి. దేవస్థానం వారు బస్సులను నడుపుతారు. సొంత వాహనాలలో వచ్చేవారు నేరుగా పైకి వెళ్లవచ్చును. కొండ క్రింద ఇదుంబన్ ఆలయం ఉంటుంది. సంతానం లేని దంపతులు ఇక్కడ ప్రత్యేక పూజలు జరిపించుకొంటారు.
కొండల మధ్య ఉన్న లోయలో నిర్మించబడిన ఆలయం ప్రశాంత వాతావరణానికి, ఆరోగ్యకరమైన గాలికి ప్రసిద్ధి. ఎన్నో అరుదైన మూలికలకు నిలయాలీ పర్వతాలు. వేప, రావి, మద్ది, అశ్వద్ధ మరియు నిద్రగన్నేరు వృక్షాలు పెనవేసుకొని ఒకటిగా ఎదిగిన స్థలంలో పంచముఖ గణపతిని ప్రతిష్టించారు. పక్కనే ఉన్న మూలస్థానంలో శ్రీ వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ రూపంలో కొలువై తొలిపూజలు అందుకొంటారు.

















పంబత్తి సిద్ధార్ అనే గొప్ప మహనీయుడు ఇక్కడ శరవణ దర్శనం కొరకు తపమాచరించారట. సిద్దారుకి  స్వామి సర్ప రూపంలో కనిపించారట. నడక మార్గంలో పంబత్తి సిద్ధార్ నివసించిన గుహ ఉంటుంది. వెలుపల రాతి సర్పాలను మురుగన్ అతని పైన చూపిన అనుగ్రహానికి గుర్తుగా ఉంచారు.
ప్రధాన ఆలయానికి ఇరువైపులా శ్రీ విశ్వేశ్వర స్వామి మరియు అన్న పూర్ణేశ్వరి దేవి ఉపాలయాల్లో వేంచేసి ఉంటారు. గర్భాలయంలో నిలువెత్తు విగ్రహ రూపంలో శ్రీ మరుదమలై నాథర్ రమణీయ పుష్ప అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు.
గ్రహ సంబంధిత అననుకూలతలు తొలగిపోవాలని, సంతానం కావాలని భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.
ధ్వజస్థంభం పక్కన ఉన్న నవగ్రహ మండపం వద్ద భక్తులు వారు కోరుకొనే కోరిక ప్రకారం ఎన్ని దీపాలను వెలిగించాలి అని రాసి ఉంటుంది. ఆ ప్రకారం దీపాలను వెలిగించి, నవగ్రహ మండపానికి ప్రదక్షణలు చేసి భక్తులు తమ ఇష్టదైవాన్ని తమ కోరిక విన్నవించుకొంటారు.



























లభించిన శాసనాల ఆధారంగా  ప్రస్తుత ఆలయం పదకొండవ శతాబ్దంలో నిర్మించబడినట్లుగా తెలియవస్తోంది. తదనంతర కాలంలో ఎందరో పాలకులు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేశారు.
ఉదయం ఐదున్నర నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి రెండు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు భక్తుల దర్శనార్ధం తెరిచి ఉండే ఆలయంలో నిత్యం ఎన్నో అభిషేకాలు, పూజలు, ఆరగింపులు జరుగుతాయి. షష్టి రోజున విశేష పూజలు జరుపుతారు.
చైత్ర పూర్ణిమ, వైశాఖ మాసం లో విశాఖ నక్షత్రం రోజున,ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం రోజున,ఆశ్వయుజ మాసం షష్టి నాడు, కార్తీక మాసం కృత్తిక నక్షత్రం రోజున,పుష్య మాసంలో పుష్యమీ నక్షత్రం నాడు విశేష పూజలు నిర్వహిస్తారు. డిసెంబర్ నెల ఆరుద్ర నక్షత్రం నాడు స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవంగా చేస్తారు. ప్రతి నిత్యం భక్తులకు అన్నప్రసాదం అందిస్తుంది దేవస్థానం. భక్తుల సౌకర్యార్ధం చక్కని మంచి నీటి వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆయుర్వేద ఆసుపత్రిని కూడా దేవస్థానం వారు నడుపుతున్నారు.
కోయంబత్తూర్ గాంధీపురం బస్టాండ్ నుండి బస్సులు లభిస్తాయి. కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద  అందుబాటు ధరలలో లాడ్జీలు ఉంటాయి. కోయంబత్తూర్ కి దేశం నలుమూలల నుండి రైలు లేదా విమాన మార్గంలో చేరుకోవచ్చును.
నమః శివాయ !!!!



 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...