శ్రీ శ్రీ శ్రీ బల్లి గిరి వెంకటేశ్వర స్వామి ఆలయం , విశాఖ పట్టణం
కలియుగ వరదుడు ఎన్నో స్థలాలలో స్వయంభూగా వెలసి భక్తులకు తమ సేవా భాగ్యం ప్రసాదిస్తున్నారు.
శ్రీ వారి కృపాకటాక్షాలకు ప్రాంతీయత లేక మతం ప్రతిబంధకాలు కావని, అదేవిధంగా సర్వాంతర్యామి ఏ రూపం లోనైనా తన శరణు కోరిన వారు ఎవరైనా ఎక్కడ ఉన్నా కరుణించి కష్టాల కడలి తీరం చేరుస్తారు అన్నదానికి నిదర్శనంగా నిలిచే క్షేత్రం శ్రీ బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం.
భారత దేశంలో సుందర సాగర తీర నగరాలలో ఒకటిగా గుర్తింపు పొందినది విశాఖ పట్టణం.
"సిటీ ఆఫ్ డెస్టినీ" గా పేరొందిన ఈ నగర మధ్యలో ఉన్న డాభా గార్డెన్స్ ప్రాంతంలో చిన్న కొండ (స్థానికంగా వెంకటేశ్వర గుట్ట అనిపిలుస్తారు)బల్లిగిరి అనే పేరు రావడానికి, ఇక్కడ బ్రహ్మాండ నాయకుడు కొలువు తీరడానికి వెనుక నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్నది అని తెలియవస్తోంది.
పదిహేడో శతాబ్దం లో కొందరు డచ్ వ్యాపారులు సముద్ర మార్గంలో ప్రయాణిస్తుండగా చిన్నగా ప్రారంభమైన వాన భీకర తుఫాన్ గా మారిందట.
అంధకారంలో తీవ్ర గాలుల మధ్య చిక్కుకొని దారీ తెన్ను లేకుండా సాగుతున్న నావలోని ప్రయాణీకులంతా భగవంతుని ప్రార్ధించారట.
కొద్దిసేపటికి దూరంగా మిణుకు మిణుకుమంటూ వెలుతురు కనపడిందట.
గాలి వాన కూడా తగ్గు ముఖం పట్టడంతో ప్రయత్నం మీద నావను తీరానికి చేర్చారట.
అప్పట్లో ఈ ప్రాంతం ఒక చిన్న పల్లె.
గుట్ట మీద పందిరి వేసుకొని గ్రామస్తులంతా గాలి వానకు భయపడి ప్రార్ధనలు చేస్తున్నప్పుడు వెలిగించిన దీపమే నావికులకు కనపడినది.
నాటి రాత్రి వారి నాయకునికి శ్రీనివాసుడు స్వప్నంలో కనపడి తాను ఇక్కడ ఒక రాతి మీద బల్లి రూపంలో ఉన్నానని తగిన నిర్మాణం చేస్తే అంతా మంచి జరుగుతుందని తెలిపారట.
ఉదయాన్నే ఈ ప్రాంతమంతా వెతకగా బల్లి రూపంలో శంఖు చక్రాలతో ఉన్న రూపం దర్శనమిచ్చినదట.
కోరకనే కరుణించిన కోనేటి రాయనునికి కృతజ్ఞతలు తెలుపుకొని స్వప్న సందేశం మేరకు కోవెల నిర్మించారట.
అలా బల్లి రూపంలో స్వామి సాక్షత్కరించినందున కొండ కావడాన బల్లి గిరి అన్నపేరొచ్చినది.
కాల గమనంలో భక్తుల సహకారంతో పూర్తి స్థాయి ఆలయ నిర్మాణం జరిగింది.
జనావాసాల మధ్య పర్వత శిఖరాన ప్రధాన ఆలయంతో పాటు శ్రీ అమ్మవారి ఆలయం, శ్రీ ఆంజనేయ ఆలయం ఉంటాయి.
ఈ రెండు ఆలయాలు ఉత్తర ముఖంగా ఉంటాయి.
అమ్మవారి ఆలయంలో శ్రీ వినాయక, శ్రీ దాసాంజనేయ మరియు శ్రీ సూర్యనారాయణ సన్నిదులుంటాయి.
అమ్మవారి కోవెల
శ్రీ ఆంజనేయ సన్నిధి
ప్రధాన ఆలయంలో చాలాకాలం బల్లి రూపానికే పూజాదులు నిర్వర్తించేవారు.తరువాత శ్రీ వెంకట రమణుని దివ్య రూపాన్ని ప్రతిష్టించారు.
మూల విరాట్టు పక్కనే బల్లి రూపంలో ఉన్న స్వయం భూ మూర్తిని వీక్షించవచ్చును.
సర్వాంతర్యామి అయిన శ్రీ హరి బల్లి రూపంలో వెలసిన క్షేత్రం ఇదొక్కటే !ఆలయ గుమ్మం వద్ద భక్తుల సౌలభ్యం కొరకు పంచ లోహ బల్లి రూపాన్ని ఉంచారు.
కొండ మీద శ్రీ గౌరిశంకర గ్రంధాలయం మరియు కళ్యాణ మండపం ఏర్పాటు చేసారు.
ప్రతి నిత్యం ఎన్నో నిర్ణయించిన పూజలు జరుగుతాయి.
చైత్ర మాసంలో మూడు రోజుల పాటు ఆలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
ఈ ప్రత్యేక విశేష క్షేత్రం విశాఖ నగర డాబా గార్డెన్స్ లో ఉంటుంది. రైల్వే స్టేషన్ లేదా బస్సు స్టాండ్ నుండి సులభంగా చేరుకొనవచ్చును.
వినా వెంకటేశం నాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి !
హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయస్థ ప్రయస్థ !
చైత్ర మాసంలో మూడు రోజుల పాటు ఆలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
ఈ ప్రత్యేక విశేష క్షేత్రం విశాఖ నగర డాబా గార్డెన్స్ లో ఉంటుంది. రైల్వే స్టేషన్ లేదా బస్సు స్టాండ్ నుండి సులభంగా చేరుకొనవచ్చును.
వినా వెంకటేశం నాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి !
హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయస్థ ప్రయస్థ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి