Kudupa - Temples


                      కలియుగ వరదుని కోవెల, కుదుప (కృష్ణ జిల్లా)


కుదుప కృష్ణా జిల్లా లోని చిన్న పల్లెటూరు. 
విజయవాడ నుండి మైలవరం మీదుగా చేరుకొనవచ్చును. సుమారు డెభై కిలోమీటర్ల దూరం.
పచ్చని పరిసరాలతో ప్రకృతికి పర్యాయ పదంగా నగర కాలుష్యానికి దూరంగా ఉన్న ఈ ఊరి మధ్యలో ఉన్న గిరి మీద సుమారు వంద సంవత్సరాల క్రిందట ఒక రైతుకు కలలో శ్రీ శ్రీనివాసుడు సాక్షాత్కరించి ఒకప్పుడు తాను సమీపంలోని జమలా పురం లో కొలువు తీరటానికి వెళుతూ ఇక్కడ పాదం మోపానని తెలిపి , పాద ముద్ర ఉన్న ప్రదేశం ఆనవాలు చెప్పారట.
దాని ప్రకారం తవ్వగా  శ్రీ వారి పాద ముద్ర ఉన్న ఒక రాయి దొరికినదట.
గ్రామ వాసులు తమ అదృష్టానికి పొంగిపోయి కొండ మీద స్వామి వారికి ఆలయం నిర్మించి, మండపంలో భక్తులందరూ పూజించుకోడానికి వీలుగా బ్రహ్మ కడిగిన పాదాన్ని ఉంచారు. 


గర్భాలయంలో శ్రీ వేంకటేశ్వరుడు స్థానక భంగిమలో చతుర్భుజాలతో నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. 
పక్కనే అమ్మవారు కొలువుతీరి ఉంటారు. 
అసలు ఊరిలోనికి ప్రవేశించడానికి ముందే దూరానికి నిలువెత్తు విగ్రహ రూపంలోఅంజనాసుతుడు సందర్శకులకు స్వాగతం పలుకుతాడు. 



కాల గమనంలో స్థానికులు ఆలయాభివృద్దికి చాలా పాటుపడ్డారు.
కలియుగ వరదునితో పాటు వివిధ దేవీ దేవతా ఆలయాలు నెలకొల్పబడ్డాయి.
మెట్ల మార్గంలో పర్వత పై భాగానికి వెళ్ళే మార్గంలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి , కొద్దిగా ముందుకు వెళితే శ్రీ హనుమత్  సీతా లక్ష్మణ సమేత రామచంద్ర మూర్తికోవేలలుంటాయి.
శిఖరాగ్రాన కైలాస నాధుడు కొలువుతీరి ఉంటారు.
గమనించ దగ్గ విషయం ఏమిటంటే ఉత్తర భారతంలో మాదిరి ఇక్కడ సదాశివుడు లింగ రూపంలోనే కాకుండా శ్రీ గంగా పార్వతి సమేతునిగా విగ్రహ రూపంలో దర్శనం ప్రసాదిస్తాడు.
సమీపంలోనే నవగ్రహ మండపం కూడా ఉంటుంది.






అన్ని పర్వదినాలను ఘనంగా జరుపుతారు. 
ఎందరో తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోరుకొంటూ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకొంటుంటారు. 
ప్రధాన అర్చనా దైవమైన శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం మే నెలలో రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 
కుడప ఆలయ సందర్శనం ఒక విధమైన మానసిక ప్రశాంతతను సందర్శకులకు ప్రసాదిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. 
కుదపకు విజయవాడ నుండి, మైలవరం నుండి బస్సులు లభిస్తాయి. 
రైలు మార్గంలో వచ్చే వారు ఎర్రుబాలెం స్టేషన్ లో దిగి తెలంగాణా తిరుపతిగా పేరొందిన "జములా పురం" సందర్శించుకొని ఇక్కడికి చేరుకొనవచ్చును. 
కాకపోతే ఎలాంటి సదుపాయాలు లభించవు. 
కనుక మైలవరం లేదా విజయవాడ నుండి రావడం ఉత్తమం. 
జై గోవిందా! జై శ్రీనివాసా!!




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram