శ్రీ వల్లభ రాయ స్వామి దేవస్థానం
సుమారు పదహారు వందల సంవత్సరాల చరిత్రకలిగి, చోళ రాజుల నిర్మాణంగా పేర్కొనే రెండు పురాతన ఆలయాలున్నాయి వంగిపురంలో.
ఒకటి శ్రీ వల్లభ స్వామి (విష్ణు ఆలయం) ఆలయం కాగా రెండవది శ్రీ అగస్థీశ్వర స్వామి(శివాలయం) ఆలయం.
ఈ రెండు ఆలయాలు పౌరాణిక ఘట్టాల నేపద్యం కలిగి ఉండటం విశేషం. చారిత్రక వైభవాన్ని తెలిపే ఈ ఆలయాలను ప్రతి ఒక్కరు సందర్శించవలసినవి.
భారత దేశంలో మొత్తం పది శ్రీ వల్లభ రాయ స్వామి ఆలయాలున్నట్లుగా తెలుస్తోంది. వంగిపురంలో ఉన్న ఈ ఆలయం వాటిల్లో ఒకటి.దక్షిణ భారత దేశంలో పెక్కు శివాలయాలు అగస్త్య మహామునితో ముడిపడి ఉన్నాయి. అలాంటి విశేష ప్రతిష్ఠిత లింగాలలో శ్రీ అగస్థీశ్వర స్వామి ఆలయం ఒకటి.
శ్రీ వల్లభ రాయ స్వామి మూలవిరాట్టు
శ్రీ రాజ్య లక్ష్మి అమ్మవారు
క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి
"అహిఛత్ర పురి" అని అనేక శాసనాలలో పేర్కొన్న వంగిపురంలో శ్రీ వల్లభ రాయ స్వామి వెలిసి ఉండటం వెనుక ఉన్న పురాణ గాద గజేంద్ర మోక్ష ఇతివృతంతో ముడిపడి ఉన్నది. భాగవత పురాణం ప్రకారం ఇంద్రదుమ్యుడు అనే రాజు అగస్త్య మహర్షి శాపంతో గజేంద్రుడు అనే ఏనుగుగా జన్మించాడు. "హుహు" అనే గంధర్వుడు "దేవలుడు" అనే మునీశ్వరుని పట్ల అవమానకరంగా ప్రవర్తించి ఆయన ఆగ్రహించి శపించిన కారణాన మొసలిగా మారిపోయాడు. మహా విష్ణు భక్తుడైన గజ రాజు ప్రతి నిత్యం నియమంగా స్వామిని ఆరాధించేవాడు. ఒకనాడు జల క్రీడలకు సరోవరానికి వెళ్ళిన గజేంద్రుని మొసలి పట్టుకొన్నది. శక్తి సామర్ధ్యాలు ఉన్నంతవరకు పోరాడిన కరి వీరుడు చివరికి శ్రీ హరికి మొరపెట్టుకొన్నాడు. భక్తుని భాదను తొలగించాలన్న తొందరలో సిరికిన్ చెప్పడు..... అన్నట్లుగా తరలి వచ్చిన స్వామి మొసలిని సంహరించి, గజెంద్రునకు మోక్షం ప్రసాదించారు. స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా ఈ పై ఉదంతం చోటు చేసుకొన్నది ఇక్కడే అని అంటారు. దానికి ఉదాహరణగా మూల విరాట్టు చేతులలో అపసవ్యంగా ఉన్న శంఖు, చక్రాలను చూపుతారు.
శ్రీ వల్లభరాయ స్వామి స్వయంభూ అని తొలి ఆలయాన్ని నాలుగో శతాబ్దంలో చోళ రాజులచే నిర్మింపబడినదని చెబుతారు. లభించిన మరియు ప్రస్తుతం ఆలయంలో ఉన్న వివిధ రాజ వంశాల శాసనాలు చాలా మటుకు తొమ్మిది నుండి పదహారో శతాబ్దల మద్య కాలానికి చెందినవి. వేంగి చోడులు, వెలనాటి చోడులు, కాకతీయులు, శాతవాహనులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, ఒడిస్సాను పాలించిన గంగ వంశ రాజ ప్రతినిధులు ఈ ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసారు.
విశాల ప్రాంగణంలో నిర్మింపబడిన ఆలయంలోనికి తూర్పున, దక్షిణాన ద్వారాలున్నాయి.
తూర్పున ఏక శిలతో చెక్కిన గరుడ స్తంభం, ధ్వజస్తంభం, గరుడాళ్వార్ సన్నిధి ఉంటాయి.
గరుడ స్థంభం పైన ఉన్న పెద్ద తెలుగు శాసనం విజయ నగర రాజు సదాశివ రాయలు 17. 08. 1557 న ముఖ మండపం నిర్మించిన సందర్భంలో సామంతులు మరియు స్థానిక పాలకులైన "కురిచేటి ముత్తి రాజయ్య దేవ, రామరాజు ఎర తిరుమల రాజయ్య దేవ"లు వేయించినట్లుగా తెలుపుతోంది.
దక్షిణం వైపున ఉన్న మండపం గుండా ప్రధానాలయం లోనికి ప్రవేశిస్తే కొద్దిగా ఎత్తు తక్కువగా ఉన్నముఖ మండపంలో ఒకపక్కన పన్నిద్దరు ఆళ్వారులు, శ్రీ రామానుజాచార్యులు ఒక పక్క, క్షేత్ర పాలకుడు శ్రీ హనుమంతుడు కొలువై ఉంటారు.
మండప పైకప్పుకు సుందర రాతి పుష్పాలు చెక్కబడి ఉంటాయి. మండప స్థంబాలకు తెలుగు లో చెక్కబడిన శాసనాలు చాలా కనిపిస్తాయి. చరిత్ర గురించి విలువైన సమాచారం ఇవ్వగల వీటిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
గర్భాలయంలో స్థానక భంగిమలో చతుర్భుజాలతో, అభయ ప్రదాత శ్రీ వల్లభారాయ స్వామి రమణీయ పుష్పాలంకరణలో నయన మనోహరంగా దర్శనమిస్తారు. అపసవ్యంగా ఉన్న ఆయుధాలు, మోమున మీసాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నిత్య జీవితంలో కలిగే ఇబ్బందులను తొలగిపోవడానికి, సంతానం కొరకు, పరీక్షలలో విజయం కొరకు ప్రతి రోజు ఎందరో భక్తులు వంగిపురం వస్తుంటారు. మొక్కిన వారి కష్టాలను దూరం చేసే స్వామిగా శ్రీ వల్లభుడు ప్రసిద్ధి. విడిగా ఉన్న సన్నిధిలో దేవేరి శ్రీ రాజ్య లక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు.
వైకుంఠ ఏకాదశి, శ్రీ రామ నవమి, జన్మాష్టమి, హనుమద్జయంతి, ధనుర్మాస పూజలు ఘనంగా జరుపుతారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు
శ్రీ వల్లభ రాయ స్వామి ఆలయానికి కొద్ది దూరంలో చెరువు గట్టున ఉంటుంది శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారి ఆలయం. హిమవత్ పర్వతం పైన జరగ బోతున్న శివ పార్వతుల కల్యాణం వీక్షించదానికి జనులు తండోప తండాలుగా తరలి వెళ్ళడంతో భూమి మీద సమతుల్యత అదుపు తప్పినది. అప్పుడు సదాశివుడు అగస్త్య మహామునిని దక్షిణ దిశగా వెళ్ళమని చెప్పారు. శిష్య ప్రశిష్యులతో కలసి మహర్షి దక్షిణానికి వచ్చి ఎన్నో క్షేత్రాలలో శివ లింగాలను ప్రతిష్టించారు.
వాటిల్లో వంగిపురంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారి లింగ రూపం కూడా ఒకటి. ఈ ఆలయం కూడా చోళ రాజుల నిర్మానంగానే పెర్కొనబడుతోంది. ఇక్కడ శిలా శాసనాలు ఏమీ కనిపించవు. ఆలయం మాత్రం పురాతనమైనదే. పక్కనే ఉన్న చెరువులో దొరికిన పురాతన విగ్రహాలకు సముచిత స్థానం కల్పించారు. వంగిపురం ఒకప్పుడు బ్రాహ్మణ అగ్రహారంగా పేరొందినది.
వెయ్యి సంవత్సరాలనుండి తరతరాలుగా ఆయా వంశాలవారే అర్చకత్వం నిర్వహిస్తున్నారు.
అప్పట్లో కీర్తి శేషులు వల్లూరు ఆనందయ్య గారు, ఆలయానికి మరమ్మత్తులు చేయించి కొంత పొలాన్ని ఆలయ నిర్వహణకు ఇచ్చినట్లుగా ఒక శాసనం ఆలయ గోపురం వద్ద ఉన్నది.
అష్ట భుజ వీర భద్ర స్వామి
శ్రీ భద్ర కాళి అమ్మవారు
శ్రీ అగస్తీశ్వర స్వామి
అరుదైన అలంకరణలో స్వామి వారు
నాగ దేవతలు
గర్భాలయంలో లింగ రూపంలో శ్రీ అగస్థేశ్వర స్వామి వారు నిత్యాభిషేకాలు, అర్చనలు, ఆరగింపులు అందుకొంటుంటారు. పక్కనే ఉన్న సన్నిధిలో శ్రీ పార్వతీ దేవి స్థానిక భంగిమలో దర్శనమిస్తారు. అరుదైన అష్టభుజ వీరభద్ర స్వామి శ్రీ భద్రకాళీ అమ్మతో కలిసి ఉపాలయంలో కొలువై ఉంటారు.
శివరాత్రి, వినాయక చవితి, నవ రాత్రులు, కార్తీక మాస పూజలు, మాస శివ రాత్రులు కాలంలో విశేష పూజలు జరుగుతాయి. మాఘ మాసంలో తొమ్మిది రోజుల పాటు స్వామి వారి కళ్యాణోత్సవాలు రంగ రంగ వైభవంగా నిర్వహిస్తారు.
గుంటూరు పట్టణం నుండి రహదారి మార్గంలో సులభంగా ప్రత్తిపాడు మీదగా వంగిపురం చేరుకోవచ్చును. ప్రత్తిపాడు దాకా బస్సులు, అక్కడి నుండి వంగిపురం చేరుకోడానికి ఆటోలు లభిస్తాయి. ముప్పై కిలోమీటర్ల దూరం. స్వంత వాహనాలలో చేరుకోడానికి రహదారి అనువుగా ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి