26, ఏప్రిల్ 2013, శుక్రవారం

Attirala

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎన్నో అరుదయిన ఆలయాలకు నిలయం.
యుగాల క్రిందట రచించిన పురాణాలలో ఉదహరించబడి, వందల సంవత్సరాల చరిత్రకు ప్రత్యక్ష సాక్షులు ఈ ఆలయాలు. 
అలాంటి వాటిల్లో ఎన్నతగినది అత్తిరాల. 
అత్తిరాల అంటే ,
మహా భారత పురాణంలో పేర్కొన్న క్షేత్రం. 
సుమారు వెయ్యేళ్ళ చరిత్రను సొంతం చేసుకొన్న ప్రాంతం. 
లోకాలను పాలించే స్థితి లయకారులు, అవతార పురుషులు, మహా మునులు, మహోన్నత వ్యక్తిత్వం గల వారు నడయాడిన పుణ్యభూమి. 
కలియుగంలో శివ కేశవుల ఉమ్మడి నిలయం. 
ఆధునిక యుగంలో గత చరిత్రను భావి తరాలకు సవివరంగా తెలియ చెప్పడానికి పరిరక్షిస్తున్న కట్టడాల కేంద్రం.







పురాణ గాధ :

 సత్య యుగంలో లో శ్రీమన్నారాయణుని ఆరో అవతారమైన శ్రీ పరశురాముడు, ఇరవై ఒక్క మార్లు భూమండలంలో జరిపిన రక్త పాతం వలన సంక్రమించిన పాపంతో ఆయన గొడ్డలి హస్తానికి అంటుకొని రాలేదు. మహేశ్వరుని ఆజ్ఞ మేరకు పుణ్య నదులలో స్నానమాడుతూ, క్షేత్ర దర్శనం చేస్తూ ఇక్కడికి వచ్చారు. బహుదా నదిలో స్నానమచారించాగానే పరుశువు రాలి క్రింద పడిపోయింది. 
అలా పరశురామునికి చుట్టుకొన్న హత్య పాపం రాలిపోవడంతో "హత్యరాల" అన్న పేరొచ్చింది. అదే నేడు వాడుకలో "అత్తిరాల" గా పిలవబడుతోంది. 
కురుక్షేత్ర యుద్దానంతరం భంధు మిత్రుల మరణానికి, జరిగిన రక్త పాతానికి తనే కారణం అంటూ ఉదాసీనంగా ఉన్న ధర్మ రాజుకు కర్తవ్యం భోధిస్తూ, రాజ ధర్మాన్ని గురించి తెలియజేసే క్రమంలో శ్రీ వ్యాస భగవానుడు పలికిన పలుకులలో అత్తిరాల ప్రస్తావన వస్తుంది. ( శాంతి పర్వం , ప్రధమాశ్వాశం ). 
ద్వాపర యుగానికి పూర్వం శంఖుడు మరియు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఈ ప్రాంతంలో ఉండేవారు. 
సకల విద్యలలో, వేద వేదాంగాలలో నిష్ణాతులు. 
విడివిడిగా ఆశ్రమాలు ఏర్పాటుచేసుకోని తపస్సు చేసుకొంటూ ఉండేవారు. 
ఒకనాడు లిఖితుడు అన్నను చూడాలని వెళ్ళాడు. ఆ సమయంలో శంఖుడు ఆశ్రమంలో లేడు. 
సోదరుని రాకకు ఎదురు చూస్తూ, అక్కడి చెట్లకు కాసిన ఫలాలను కోసి తినసాగాడు. 
ఇంతలో తిరిగి వచ్చిన అన్న శంఖుడు తమ్ముని చూసి "ఎవరి అనుమతితో ఫలాలను తింటున్నావు?" అని ప్రశ్నించగా, తన తప్పు అర్ధమైన లిఖితుడు పరిహారం చూపమని అర్ధించాడు. 
"ఏదైన, ఎవరిదైన వస్తువు అనుమతి లేకుండా తీసుకుంటే అది దొంగ తనం క్రిందకు వస్తుంది. నువ్వు చేసినది అదే కనుక రాజు వద్దకు వెళ్లి నీ నేరానికి సరియైన శిక్షను అనుభవించు." 
అన్న మాట శిరసావహించి రాజ భవనానికి వెళ్ళాడు లిఖితుడు. 
అతని రాక తెలిసిన సుదుమ్న్య రాజు ఘనంగా ఆహ్వానించబోగా తిరస్కరించి, తన నేరం తెలిపి, శిక్షను విధించామని కోరాడు. 
ఒక మహా తపస్విని చిన్న నేరానికి దండించవలసిన పరిస్థితిని తెచ్చిన రాజాదికారాన్ని నిందించుకొంటూనే, అతని చేతులు నరకమని ఆజ్ఞాపించాడు రాజు. 
సంతోషంగా శిక్షను స్వీకరించి అన్న వద్దకు వెళ్ళాడు లిఖితుడు. 
శంఖుడు "నీవు చేసిన నేరాన్ని అంగీకరించి, శిక్షను పొంది పునీతుడవయ్యావు. ఇప్పుడు నీవు నదిలో భగవంతునికి, పిత్రు దేవతలకు అర్ఘ్యం సమర్పించు"  అని ఆదేశించాడు. 
నదిలో మునిగి లేచిన లిఖితునికి చేతులు వచ్చాయి.
బాహువులను ప్రసాదించిన పవిత్ర నదికి నాటి నుండి "బహుదా " అన్న పేరొచ్చినది.   
నాటి బహుదానదే నేటి "చెయ్యేరు". 
ప్రజాపతులలో ఒకరైన "పులస్త్య బ్రహ్మ" ఈ పవిత్ర క్షేత్రంలో తపమాచరించి శివ సాక్షాత్కారం పొంది, కోరిన కోర్కె మేరకు సదాశివుడు "శ్రీ త్రేతేశ్వర స్వామి" అన్న నామంతో పర్వతం మీద స్వయంభూగా వెలిశారు. 
సప్త మహర్షులలో ఒకరైన "భ్రుగు" కూడా ఈ పుణ్య స్థలిలో తపము చేసి శ్రీ హరిని ప్రసన్నం చేసుకొన్నారు. 
ముని కోరిక మేరకు ఒక పాదాన్ని గయలొను, రెండో పాదాన్ని అత్తిరాలలో ఉంచి "శ్రీ గదాధర స్వామి" గా ప్రకటితమయ్యారు. 
చెయ్యేరు నదిలో గతించిన రక్త సంభందీకులకు చేసే పిండ ప్రధానము, తర్పణం గయలో చేసిన వాటితో సమానము అని ప్రతీతి.  
అందుకే అత్తిరాలకు " దక్షిణ గయ" అన్న పేరొచ్చినది. 















చారిత్రిక విశేషాలు :

మహా భారతం లోనే ఉదహరించబడినదంటే క్షేత్ర ప్రాముఖ్యాన్ని గ్రహించవచ్చును. 
ప్రస్తుత పరశురామ ఆలయంలోని నిర్మాణాలను చోళ రాజుల సహకారంతో, ఏకా తాతయ్య దొర సారధ్యంలో పదో శతాబ్దంలో జరిపినట్లు  తెలుస్తోంది.   
చోళులు,పాండ్యులు, శాతవాహనులు, కాకతీయులు, విజయనగర పాలకులు, కాయస్థ వంశం వారు ఇలా ఎన్నో రాజ వంశాలు ప్రాంత అభివృధికి తమ వంతు సహకారం అందించారు. 
శ్రీ త్రేతేశ్వర, శ్రీ గదాధర, పురాతన ఆలయాలు శిధిలం కావడంతో భక్తుల సహకారంతో పురుద్దరించారు. 
గదాధర స్వామి ఆలయం వద్ద ఉన్న తూర్పు రాజ గోపురమే నేటికి మిగిలిన నాటి కట్టడం. 
ప్రాంతమంతా శిధిల విగ్రహాలు, నిర్మాణాలు చాలా కనపడతాయి. 

క్షేత్ర విశేషాలు :

చుట్టూ కొండలు, ఒకపక్క చెయ్యేరు ఆహ్లాదకర వాతావరణం, అన్ని పక్కలా ఆలయాలు కనపడుతూ అద్యాత్మికత వెల్లివిరుస్తుంది. మనస్సుకు అనిర్వచనీయమైన శాంతి కలుగుతుంది. 
కొండ మీద రాజ గోపురం చేరుకోడానికి సోపాన మార్గం.  వెనక ఎత్తైన పర్వతం మీద దీపస్తంభం. 
పైకి చేరుకొంటే శ్రీ త్రేతేశ్వర స్వామి ఆలయం. 
పడమర ముఖంగా లింగరూపంలో గర్భాలయంలో చందన కుంకుమ లేపనంతో, వీభూతి రేఖలతో, లయ కారకుడు నిరాకారునిగా కనిపిస్తారు. శ్రీ కామాక్షి అమ్మవారికి, వినాయకునికి విడిగా సన్నిధులున్నాయి. 
కొండ పైనుండే శ్రీ గదాధర స్వామి ఆలయానికి మార్గం ఉన్నది. 
రెండువేల ఐదో సంవత్సరంలో పునః నిర్మించబడినది ఈ ఆలయం. 
పురాతనమైన స్వాగత ద్వారం గుండా ప్రాంగణంలోనికి ప్రవేశిస్తే ఉత్తర ముఖంగా ఉన్న ప్రధాన ఆలయ ముఖ మండపం లోనికి తూర్పు వైపు నుండి మార్గం ఉంటుంది. దానికి ఎదురుగా అంజనా సుతుడు దక్షిణం వైపుకు చూస్తూ ప్రసన్న రూపునిగా దర్శనమిస్తారు. ముఖ మండప పై భాగాన శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వేదాంత దేశికులు, ఆళ్వారుల, సప్తఋషుల విగ్రహాలు కనిపిస్తాయి. 
ప్రక్కనే ఉన్న పురాతన రాజ గోపురం గుండా కొండ పైనున్న దీప స్తంభానికి చేరే మార్గం ఉన్నది. 
ముఖ మండపంలో శ్రీ గరుడాల్వార్, శ్రీ గణపతి, శ్రీ రామానుజులు, శ్రీ విశ్వక్సేనులు వేంచేసి ఉంటారు. 
చిన్న గర్భాలయంలో కొంచెం ఎత్తైన పీఠం మీదస్థానక భంగిమలో శ్రీ గదాధర స్వామి శంఖు, చక్ర, గదాధారులై అభయ ముద్రతో నయన మనోహరంగా దర్శనమిస్తారు. 
ఆలయ విమానం పైన దశావతారాలను, కృష్ణ లీలలను చక్కగా మలిచారు. 
ప్రహరి గోడ నలుదిక్కులా వినతా తనయుడు  వినమ్ర భంగిమలో ఆలయానికి కావలి అన్నట్లు ఉంటాడు.
వైకుంఠవాసుని సేవించుకొని మరో మార్గం ద్వారా నది ఒడ్డుకు, అక్కడి నుండి  ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ పరశురామ ఆలయానికి  చేరుకొవచ్చును. 
శిధిల ప్రధాన ద్వారం దాటగానే తమిళ భాషలో ఉన్నశాసనం ఒకటి, తెలుగు శాసనం ఒకటి కనిపిస్తాయి. 
ఎదురుగా డెభై స్థంబాల సుందర  ఉత్సవ / నాట్య మండపం ఉంటుంది. 
లభించిన ఆధారాల ప్రకారం ఈ నిర్మాణం పదో శతాబ్దానికి చెందినట్లుగా తెలుస్తోంది. 
గజ పృష్ట గర్భాలయ పైన సునిశిత చెక్కడాలు చూపరులను ఆకట్టుకొంటాయి. 
ఆలయ రెండో ప్రాకార గోడల పైనా కొన్ని తమిళ శాసనాలున్నాయి. 
ముఖ మండపంలో త్రవ్వకాలలో లభించిన విగ్రహాలనుంచారు. 
గర్భాలయంలో శ్రీ పరశురాముడు స్థానక భంగిమలో ఉంటారు. 
ప్రస్తావించవలసిన అంశం ఏమిటంటే మనకు తెలిసిన పరశురాముడు, శిఖ, గడ్డం మీసాలతో, నార బట్టలు, రుద్రాక్ష మాలలు ధరించి ఉంటారు. కాని ఇక్కడ ముకుట ధారిగా, స్వర్ణాభరణ భూషితులుగా రమణీయంగా దర్శనమిస్తారు. 
ఎదురుగా ముఖ మండపంలో ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన మహనీయులు శ్రీ ఏకా తాతయ్య గారు    పద్మాసనం వేసుకొని, ధ్యాన ముద్రలో ఉన్నట్లుగా ఉంటారు. ఇక్కడొక చిత్రమైన నమ్మకం ప్రచారంలో ఉన్నది.
తాతయ్య గారి చేతిలో నాణెం పెట్టి ఆయన విగ్రహాన్ని కౌగలించుకొంటే మనోభిస్టాలు నెరవేరతాయట. 
ఆయన వెనుక గోడకు ఉన్న రంధ్రం గుండా ప్రతి రోజు  సాయం సంధ్యా సమయంలో సూర్య కిరణాలు నేరుగా మూల విరాట్టును తాకుతాయి. అరుదైన నిర్మాణ విశేషం.



ఈ రెండు ఆలయాల నడుమ ఎన్నో పురాతన నిర్మాణాలు, చెదురుమదురుగా పడిఉన్న విగ్రహాలెన్నో కనిపిస్తాయి. 
అత్తిరాల లోని మూడో ఆలయం అత్యంత అరుదైనది. బహుశ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఒకే ఒక్క ఆలయంగా పేర్కొనవచ్చును. అదే శ్రీహరి ఆరో అవతారమైన శ్రీ పరశురామ ఆలయం. లభించిన ఆధారాల ద్వారా ప్రస్తుత నిర్మాణం పదో శతాబ్దం నాటిదిగా నిర్ణయించబడినది. ప్రస్తుతం పురావస్తు శాఖ వారి అధీనంలో ఉన్న ఇక్కడ మొత్తం తొమ్మిది శాసనాలున్నాయి. అందులో ఒకటి మాత్రమే తెలుగులో ఉండగా మిగిలిన ఎనిమిదీ తమిళంలో ఉంటాయి. 
పడమర దిశగా ఉండే ఈ ఆలయ విమానం గజ పృష్ట విమానం  ( శయనించిన ఏనుగు వెనుక భాగాన్ని పోలి ఉంటుంది). ఇలాంటి విమానమున్న ఆలయాలు చోళ రాజులు పాలించిన తమిళ నాడులో ఉన్నాయి. ప్రాంగణంలో డెభై స్థంభాల మండపం ప్రత్యెక ఆకర్షణ. రాజుల కాలంలో ప్రతిష్టించిన మూలవిరాట్టును ముష్కరులు దండయాత్రలో ధ్యంసం చేయగా తరువాత అలాంటిదే మరో  విగ్రహాన్ని ప్రతిష్టించారు. ధ్యంసం అయిన చాలా విగ్రహాలను ముఖ మండపంలో ఉంచారు. మామూలుగా మనకు తెలిసిన పరశురాముడు శిఖ, పెరిగిన గడ్డం మీసాలతో ఉంటారు. కానీ ఇక్కడ రాజకుమారుని మాదిరి శిలా రూపంలో దర్శనమిస్తారు. చక్కని శిల్ప కళకు నిలయం ఈ ఆలయం. 






పూజలు - ఉత్సవాలు 

రక్షిత నిర్మాణంగా పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నందున ఎలాంటి నిత్య పూజలు శ్రీ పరశురామేశ్వర స్వామి  ఆలయంలో ఉండవు. 
కాని శ్రీ త్రేతేశ్వర స్వామి వారికి, శ్రీ  గదాధర స్వామి వారికి ప్రతి రోజు పూజలు, అభిషేకాలు జరుగుతాయి. 
అత్తిరాలలో మహా శివ రాత్రి పర్వ దినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. జిల్లా నుండే గాక సమీప జిల్లాల నుండి కూడా భక్తులు అసంఖ్యాకంగా తరలి వస్తారు. 

భారత దేశంలోనే శ్రీ పరశురామ ఆలయాలు అరుదు. మన రాష్ట్రంలోని  ఒకే ఒక్క  ఆలయం ఉన్న ఈ పరశురామ క్షేత్రాన్ని ప్రచారంలోనికి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 







ఇంతటి ప్రాధాన్యతలకు నిలయమైన అత్తిరాల కడప జిల్లా రాజంపేటకు అయిదు కిలో మీటర్ల దూరంలో ఉన్నది. 
రాజంపేటకు రాష్ట్రంలోని అన్ని నగరాల నుండి బస్సు సౌకర్యం కలదు. 

సందర్శకులకు కావలసిన  వసతి, భోజనాలు రాజంపేటలో లభిస్తాయి.  తిరుపతి నుండి కూడా సులభంగా రాజంపేట చేరవచ్చును. 









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...