16, జులై 2024, మంగళవారం

Vallimalai, Velluru


                               కళ్యాణ క్షేత్రం - వల్లిమల 

ఆదిదంపతుల ప్రియపుత్రుడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎన్నో తమిళనాడులో కనిపిస్తాయి. ప్రతి ఒక్క క్షేత్రం తనదైన పౌరాణిక గాథ, చారిత్రక విశేషాలు కలిగి ఉంటుంది. దేశంలో మరెక్కడాలేని విధంగా శ్రీ కుమారస్వామి విశ్రాంతి తీసుకొన్న ఆరు పాడై వీడు క్షేత్రాలు కనపడతాయి. 
వాటితో సంబంధం కలిగివుండి, శ్రీ షణ్ముఖ కల్యాణంతో ముడిపడి ఉన్న ఒక క్షేత్రం తమిళనాడు లోని వెల్లూరు పట్టణానికి సమీపంలో ఉన్నది. 









వల్లి మలై 

మయూరవాహనుని ఇద్దరు భార్యలలో ఒకరైన వల్లీ దేవి జన్మస్థానంగా పేర్కొంటారు. 
వల్లీ దేవి ఈ ప్రాంత అడవికి రాజు అయిన నంబి రాజు కు పసిబిడ్డగా లభించిందట. అతను ఆమెకు వల్లీ అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకొన్నాడట. 
యుక్తవయస్సుకు వచ్చిన వల్లీకి వివాహం చేయ సంకల్పించారట తల్లితండ్రులు. ఆ సమయంలో నారద మహర్షి వచ్చి వారికి వల్లీ దేవి జన్మవృత్తాంతం చెప్పారట. 

వల్లీదేవి జన్మవృత్తాంతం 

ఒకసారి శ్రీ మహావిష్ణువు వృద్ధుని రూపంలో చేస్తున్న  తపస్సు ను భగ్నం చేయడానికి  శ్రీ మహా లక్ష్మి మనోహరమైన నాట్యం చేసిందట. ఆ సమయంలో ఆమె శరీరం నుండి ఒక స్వేద బిందువు ఈ ప్రాంతం లోని గడ్డి పరకల మీద పడిందట. ఒక ఆడ జింక గడ్డితో పాటుగా ఆ బిందువును కూడా  తీసుకొన్నదట. 
ఆ కారణంగా కొంతకాలానికి జింక చక్కని ఆడపిల్లకు జన్మనిచ్చినదట. 
మరో సంగతి ఏమిటంటే గత జన్మలో ఈ బాలిక తన సోదరితో కలిసి ఈ ప్రాంతంలో శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోరి తపస్సు చేశారట. వారి భక్తిశ్రద్ధలకు సంతసించిన వైకుంఠ వాసుడు దర్శనమిచ్చారట. వారు ఆయనను తమకు శివ పుత్రుడైన శ్రీ కార్తికేయునితో కళ్యాణం జరిగేలా వరం కోరారట. 
లక్మీనారాయణులు వచ్చే జన్మలో అది సాధ్యపడుతుంది. అప్పుడు ఒకరు దేవేంద్రుని కుమార్తె దేవసేనగా మరొకరు వల్లీ దేవిగా జన్మిస్తారు అని వరం అనుగ్రహించారట. 
అందువలన ఈ బాలిక శివపార్వతుల కుమారుడైన దేవసేనానికే చెందుతుంది. 
విషయం చెప్పిన నారదమహర్షి కైలాసానికి వెళ్లి శ్రీ కుమారస్వామికి వల్లీ దేవి గురించి తెలిపారట. బాలిక గుణగణాలు మరియు  సౌందర్య వివరాలు విన్న శరవణుడు వల్లిమలై వచ్చారట. వల్లీ దేవిని ఆకర్షిండానికి అనేక విఫలప్రయాత్నాలు చేశారట. చివరకు అన్న గణపతి సహకారం కోరారట.  
గణపతి ఏనుగు రూపంలో వచ్చి వల్లీ దేవిని భయపెట్టారట. ఆమె వేటగాడి రూపంలో ఉన్న మురుగన్ తో ఏనుగు బారి నుండి కాపాడితే వివాహమాడతాను అన్నదట. వారి కళ్యాణం జరిగింది. 
అలా వల్లి మల కళ్యాణ క్షేత్రంగా పేరొందినది. 

క్షేత్ర విశేషాలు 

వల్లి మలై లో కొండ క్రింద ఒక ఆలయం ఉండగా పైన ఒక గుహాలయం ఉంటాయి. 
 పచ్చని కొండలు, పల్లె వాతావరణం, స్వచ్ఛమైన గాలి. 
ఆహ్లాదం కలిగించే ప్రదేశంలో నెలకొని ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వల్లి మలై లో !
కొండ క్రింద ఉన్న ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మరియు శ్రీ గణపతి దర్శనమిస్తారు. 
కొండ మీదకు వెళ్ళడానికి  మార్గాలు ఉన్నాయి. ఆలయం లోపలి నుండి నాలుగు వందల మెట్ల మార్గం ఉన్నది. దీనిని అనంతర కాలంలో నిర్మించారు నిర్మించారు.  మరో పక్క నుండి పురాతన మార్గం ఉన్నాయి. పురాతన మార్గంలో  మెట్లు సరిగ్గా ఉండవు. 
కానీ చాలా విశేషాలు చూడటానికి ఉన్నాయి. 

జైన గుహలు 

ఒకప్పుడు వల్లి మల జైన తీర్థంకరుల నివాసం. 
పాత మార్గంలో పైకి వెళుతున్నప్పుడు పదవ శతాబ్ద కాలం నాటి గుహలు కనిపిస్తాయి. ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ గుహలు పడమటి చాళుక్యుల కాలంలో నిర్మించినవి అని శాసనాధారాలు తెలుపుతున్నాయి. సిద్ధంగా రాళ్లతో  ఏర్పడినవి   
రెండు గదుల వైశాల్యంలో ఉన్న ఈ గుహల పైభాగంలో తీర్థంకరుల శిల్పాలు చెక్కబడి కనపడతాయి. 
పైనున్న కోనేరుల తాలూకు నీరు ఈ గుహల మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది. 
ప్రశాంతంగా మరియు  ఆహ్లాదకరంగా ఉంటాయి. 







ఎగువ ఆలయం 

జైన గుహల నుండి ఎగుడు దిగుడు దారిలో ఉన్న మెట్ల మీదగా పైకి వెళుతుంటే కొండల మధ్య తామర పూవులతో నిండిన స్వతసిద్ద జలాశయం కనపడుతుంది. 
కుమారి తీర్థం అని పిలవబడే ఈ కోనేరుకు ఆ పక్కన పురాతన రాతి మండపం ఉంటుంది. వల్లీ దేవి ఈ మండపంలో స్నానానికి ముందు పసుపు కొమ్ములను దంచేదని చెబుతారు. 
కొద్దిగా ముందుకు వెళితే కొండ పైభాగానికి చేరుకొంటాము. ఒక దారి ప్రధాన ఆలయానికి వెళుతుంది. మరొక దారి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్న తిరుప్పుగళ్ ఆశ్రమానికి వెళుతుంది. 
ఈ తిరుప్పుగళ్ ఆశ్రమం శ్రీ తిరుప్పుగళ్ శ్రీ సచ్చిదానంద స్వామీజీ స్థాపించారు. గొప్ప సుబ్రహ్మణ్య స్వామి ఆరాధకులు. కవి శ్రీ అరుణగిరినాథర్ రచించిన శ్రీ సుబ్రహ్మణ్య కీర్తనల సంకలనం అయిన "తిరుప్పుగళ్" ను భక్తజన కూటముల లోనికి తీసుకొనివెళ్ళారు.  శిధిలావస్థలో ఉన్న ఆలయాన్ని  నిర్మించారని చెబుతారు. ఆయన జీవ సమాధి ఆశ్రమం పక్కనే ఉంటుంది. ఆశ్రమానికి వెళ్లే దారిలో వల్లీ దేవి గత జన్మలో శ్రీ మహా విష్ణువు గురించి తపస్సు ప్రదేశం వస్తుంది. 
ఈ ఆశ్రమంలో శ్రీ వల్లీదేవి "పొంగి"అన్న పేరుతొ  కొలువై ఉంటారు. 
ఇక్కడికి దగ్గరలో ఏనుగు ఆకారంలో ఉన్న కొండరాళ్ళు కనిపిస్తాయి. స్వామి వివాహానికి గణపతి గజరూపంలో వచ్చి సహాయం చేసారని తెలుసుకున్నాము కదా !
గణేష మలై అని పిలుస్తారు. 
ఇక్కడికి సమీపంలో మరో పెద్ద రాతి గుట్ట మీద నిర్మించిన ఆలయంలో కైలాసనాథుడు శ్రీ తిరుమల గిరీశ్వర స్వామి అన్న పేరుతొ కొలువై దర్శనం ఇస్తారు. 
ప్రస్తుతం  శిష్యులు ఆశ్రమ నిర్వహణ చూస్తున్నారు. 
చుట్టూతా పర్వతాలు. మధ్యలో చిన్నచిన్న పల్లెలు \. పచ్చటి పంటపొలాలు. నడిచి అలసిన శరీరానికి మరియు మనస్సుకు స్వాంతన చేకూరుస్తాయి. 
కొన్ని పెద్ద పెద్ద బండ రాళ్ళ మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన గుహాలయాన్ని పల్లవ రాజులు నిర్మించారు. అత్యధిక శాతం గుహాలయాలు పల్లవుల  నిర్మించబడినాయి. ఇక్కడ విమాన గోపురాన్ని రెండు రాళ్ల మీద నిర్మించారు. 
వెలుపల ఎత్తైన ధ్వజస్థంభం వద్ద శ్రీ వరసిద్ధి వినాయకుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నవ సేనాధిపతులు కొలువై ఉంటారు. ఆలయానికి వెళ్లే దారిలో వల్లీ దేవి వడిశెల ఒక చేతిలో మరో చేతిలో రాయి పుచ్చుకొని పంటల మీద వాలే పక్షలను తోలివేసే భంగిమలో కనిపిస్తారు. 
విశాలమైన గుహాలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ భంగిమలో దర్శనం ఇస్తారు. 
శ్రీ అరుణగిరినాథర్ ఆదిగా గల వారి సన్నిధులు కూడా ఇక్కడ ఉంటాయి. గుహ లోపల పెద్ద బిలం కనిపిస్తుంది. అది నేరుగా పళని ఆలయానికి వెళుతుంది అని చెబుతారు. 

















ఆలయ పూజలు - ఉత్సవాలు 

ప్రతి నిత్యం ఉదయం నుండి  సాయంత్రం రెండు గంటల పాటు  తెరిచి ఉండే ఆలయంలో నియమంగా పూజలు చేస్తారు. 
 హిందూ పర్వదినాలలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా మంగళ వారాలు, అమావాస్య, పౌర్ణమి,షష్టి తిథులలో మరియు శలవు దినాలలో అధిక సంఖ్యలో భక్తులు  తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ నుండి వస్తుంటారు. 
ప్రతి నెల ఒక ఉత్సవం జరిగే క్షేత్రంలో మాసి (మాఘ) మాసం లో పది రోజుల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ వల్లీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల కళ్యాణం జరుగుతుంది. రధోత్సవం, తెప్పోత్సవం మరెన్నో ఏర్పాటు చేస్తారు. 
కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. 
అశ్వయుజ మాసంలో స్కంద షష్టి తరువాత శ్రీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామివార్ల కళ్యాణం నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్బంగా ముత్తైదువులకు తిరుప్పుగళ్ ఆశ్రమం వారు పవిత్ర పసుపు కుంకుమ అందిస్తారు. 
వెల్లూరు కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్లి మలైకి బస్సు సౌకర్యం లభిస్తుంది. ఆలయం వద్ద తగుమాత్రపు వసతి మరియు భోజన సదుపాయాలు ఉన్నాయి. 
పర్వదినాల్లో ఇబ్బందులు ఉండవు. కానీ విడి రోజులలో వెల్లూరు నుండి వెళ్లి రావడం ఉత్తమం. 









ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః !!!!


























 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Durga bhavani Temple, Dhanakonda, Vijayawada

                        శ్రీ దుర్గ భవాని ఆలయం, విజయవాడ  ఇంతకు ముందు  చెప్పినట్లు మన రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ సరైన విషయసమాచారం అం...