24, జులై 2024, బుధవారం

Guttikonda Bilam



                  గోపాలుడు నడయాడిన గుత్తి కొండ బిలం 

మన రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన గుహలు లేదా బిలాలలో ప్రథమస్థానంలో ఉన్నవి బొర్రా గుహలు. తరువాత ఆ స్థాయిలో కాకున్నా స్థానిక ఆకర్షణ పొందుతున్నవి నంద్యాల జిల్లాలోని బెలుం గుహలు. 
వీటికి భిన్నంగా ఉండే గుహలు కూడా ఉన్నాయి. 
అవే పల్నాడు జిల్లాలోని గుత్తికొండ గ్రామ సమీపంలోని గుహలు. 
క్షేత్ర గాథ ప్రకారం గుత్తికొండ బిలం పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ప్రదేశం.  అనేక మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. 
గత శతాబ్దంలో ఎందరో మహనీయులు ఇక్కడ ఆధ్యాత్మిక సాధన చేసి ముక్తిని పొందారని అనేక గాధలు ప్రచారంలో ఉన్నాయి. 
















క్షేత్ర గాథ 

పురాణాలలో చూసినట్లయితే మహర్షుల తపోభూములు ఎక్కువగా నదీతీరాలలో అంటే నీటి వసతి ఉన్న కొండ గుహలలో, దట్టమైన వనాలలో ఉన్నట్లుగా తెలుస్తుంది. జలం జీవం కదా ! వివిధ ప్రాంతాలలో కనిపించే  ఆలయాలు వారు తమ నిత్య పూజల నిమిత్తం ఏర్పాటుచేసుకొన్నవి అని కూడా అర్ధం చేసుకోవచ్చును. 
తొలి గుహాలయాలు పల్లవుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. 
గుత్తికొండ బిలం పురాణ ప్రాముఖ్యం తెలుసుకోవాలంటే భాగవతంలోని కొన్ని ముఖ్య పాత్రల పరిచయం చాలా ముఖ్యం. ఒకటొకటిగా తెలుసుకొందాము. 
గుత్తికొండ క్షేత్రగాథ ప్రధానంగా ముచికుందుడు అనే మహారాజుతో ముడిపడి  ఉన్నది. 
ఎవరీ ముచికుందుడు ?





ముచికుందుడు 

భాగవత పురాణం లో ఈయన ప్రస్థాపన ఉన్నది. సూర్యవంశానికి చెందిన మాంధాత మహారాజు పుత్రుడు. అనేక పురాణాలలో పేర్కొన్న అంబరీష మహర్షి ఈయన సోదరుడు. 
గొప్ప యోధుడు. సామ్రాజ్యాన్ని నలుదిశలా విస్తరింపచేసాడు. ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పాలన చేసేవారు. 
ఆయన కీర్తి, ధైర్యసాహసాలు దేవలోకాన్ని చేరుకొన్నాయి. ఆ సమయంలో అసురులతో పోరాడుతున్న అమరులు ఓటమి అంచున ఉన్నారు. దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువు సలహా మేరకు దూతలను ముచికుందుని వద్దకు పంపి యుద్ధంలో సహాయం చేయమని అర్ధించారు. 
వారి కోరికను మన్నించి దేవదానవ యుద్ధంలో పాల్గొన్నారు ముచికుందుడు. 
ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. దేవతలను విజయం వరించింది. 
ఆదిదంపతుల కుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాధిపతిగా భాద్యతలు స్వీకరించారు. 
ముచికుందుడు శ్రీ మహావిష్ణువును సందర్శించుకున్నారు. ఆయనను భూలోకానికి వెళ్ళడానికి అనుమతి కోరారు. 
శ్రీహరి ఇప్పుడు భూలోకంలో ద్వాపరయుగం నడుస్తోంది. నీ అన్న వారంతా గతించారు అన్ని అన్నారట. అప్పుడు ముచికుందుడు నా అలసట తీరేలా నిద్రించాలి. నాకు నిద్రాభంగం కలిగించినవారు నా కంటి చూపుతో భస్మం అయిపోయేలా వరం ప్రసాదించండి అని కోరుకొని భూలోకానికి వచ్చి గుత్తి కొండ బిలంలో నిద్రపోయారు. 
కాలం గడిచిపోతోంది. 

కాలయవనుడు 

గర్గుడు అనే రాజు యాదవ  గురువుతో జరిగిన పండిత చర్చలో ఓడిపోయారట. ఆ అవమానం తట్టుకోలేక మహేశ్వరుని తపస్సుతో ప్రసన్నం చేసుకొని యాదవుల చేతిలో ఓడిపోని కుమారుని పొందాడట. 
అతనే కాలయవనుడు. ఇతను బ్రహ్మ నుండి ఎవరి చేతిలో ఓటమి పొందకూడదని వరం పొందాడట. కొన్ని లక్షల సైన్యంతో ఎందరినో ఓడించి వరగర్వంతో శ్రీ కృష్ణుని మీదకు యుద్దానికి సిద్దపడసాగాడట కాలయవనుడు. 

జరాసంధుడు 

మగధ సామ్రాజ్య పాలకుడు. కంసుని అల్లుడు. తన మామని చంపిన శ్రీ కృష్ణ బలరాముల మీద పగతో మధురానగరం మీదకు పెక్కుసార్లు దండయాత్ర చేసి అన్నిసార్లు ఓడిపోయాడు. పాగా తీరే మార్గం కోసం వెతుకుతుండగా కాలయవనుని విషయం తెలిసింది. 
అతనిని తనకు సహాయపడమని కోరాడు. ఎప్పటి నుండో శ్రీ కృష్ణుని మీద ద్వేషంతో ఉన్న కాలయవనుడు మధురానగరానికి బయలుదేరాడు. 
కొంతకాలం క్రిందటే జరాసంధునితో యుద్ధం గెలిచిన బలరామకృష్ణులు కాలయవనుని దండయాత్ర గురించి తెలుసుకొని ప్రజలను మధుర నుండి ద్వారకకు పంపించివేశారు. శ్రీ కృష్ణుడు ద్వందాయుద్ధానికి రమ్మని చేసిన సవాలును స్వీకరించిన కాలయవనుడు ఒంటరిగా వచ్చాడు. 
అతనికి ఉన్న వరాల సంగతి తెలిసిన వాసుదేవుడు ఓడిపోయినట్లుగా పారిపోసాగారు. కోపంతో కాలయవనుడు ఆయను తరమసాగాడు. గోపాలుడు నేరుగా ముచికుందుడు నిద్రిస్తున్న గుహ లోనికి వెళ్లారు. ఆవేశంతో లోపలి ప్రవేశించిన కాలయవనునికి చీకటిలో శత్రువు కనిపించక వెతుకుతూ నిద్రిస్తున్న ముచికుందుని పట్టుకొన్నాడు. 
నిద్రాభంగం కలగడంతో కనులు తెరిచిన ముచికుందునికి ఉన్న వరప్రభావంతో కాలయవనుడు భస్మం అయిపోయాడు. 
వరగర్వంతో లోకాలకు కీడు చేస్తున్న ఒక లోకకంటకుడి మరణం సంభవించినది గుత్తికొండ బిలం లో అన్నది క్షేత్రగాథ. 
కాలయవనుని మరణం తరువాత శ్రీ కృష్ణుని దర్శనం పొందిన ముచికుందుడు ఇక్కడే తపస్సు చేసుకున్నారట. నేటికీ ఆయన అర్హులైన భక్తులకు దర్శనమిస్తారని, ఉపదేశం చేస్తారని కొన్ని గాధలు ప్రచారంలో ఉన్నాయి. 





యోగిని కోలా పోలమాంబ 

సమీపంలోని పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు గ్రామానికి చెందిన శ్రీ లింగారెడ్డి గారి పుత్రిక యోగిని కోలా పోలమాంబ. స్వయంగా ముచికుంద మహర్షి సాక్షాత్కారం మరియు ఉపదేశం  పొందిన మహనీయురాలు. ఎన్నో సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారని తెలుస్తోంది. సుమారు ఎనభై సంవత్సరాల క్రిందట యోగిని జీవ సమాధి చెందినా నేటికీ భక్తులను అనుగ్రహిస్తుంటారని చెబుతుంటారు. 
ఆమె జీవ సమాధి, యోగిని శిష్యురాలైన శనగపాటి సుభద్రమ్మ సమాధిని ప్రాంగణంలో దర్శించుకోవచ్చును. 
ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వార్ల సన్నిధులు, శ్రీ గణపతి మరియు నాగప్రతిష్ఠలు కనిపిస్తాయి. స్వామివారిని శ్రీ బాల మల్లేశ్వరస్వామి అని పిలుస్తారు. 














గుత్తికొండ బిలం 

 చుట్టూ పచ్చని పొలాలు. పచ్చని పరిసరాలు. స్వచ్యమైన గాలి. ప్రశాంత వాతావరణం నడుమ ఉంటుంది గుత్తికొండ బిలం. గుత్తికొండ ఊరి నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల మట్టి దారిలో ప్రయాణించాలి. 
ఎత్తులో ఉన్న ఆలయ ప్రాంగణం వరకు రహదారి ఉన్నది. 
ప్రాంగణం  లోని ఆలయాలను, జీవసమాధులను చూసిన తరువాత బిలం లోనికి వెళ్ళడానికి మనిషికి ముప్పై రూపాయల టికెట్. బిలం పక్కన భరతమాత సన్నిధి ప్రత్యేకం. 
బిలం యొక్క ముఖద్వారం పైన క్షేత్రగాథ ను తెలిపేలా మధ్యలో ముచికుంద మహర్షి ఇరుపక్కలా శ్రీ కృష్ణుడు మరియు కాలయవనుడు విగ్రహాలను ఏర్పాటు చేశారు. 
ఇంతకూ ముందు చెప్పుకున్నాము కదా ఇది ఒక మునివాటిక మునులు సాధువులు నివసించేవారని. అలంటి వారిలో ఒకరైన అవధూత శ్రీ స్వయంప్రకాశ స్వామి వారు బిలంలో శివలింగాన్ని 1754వ సంవత్సరంలో ప్రతిష్టించారని ఇక్కడి శాసనం తెలుపుతుంది. ఆ లింగాన్ని "చీకటి మల్లయ్య" అని పిలుస్తారు. 
సహజసిద్ధంగా ఏర్పడిన ఇందులోనికి వెళ్ళడానికి గతంలో కాగడాలు తీసుకొని వెళ్లేవారు.
బిలంలోనికి ప్రవేశించిన తరువాత మొదట దర్శనమిచ్చేది శ్రీ ముచికుంద మహర్షి విగ్రహం. పక్కనే శ్రీ చీకటి మల్లయ్య లింగం. 
గతంలో మొత్తం నూట ఒకటి బిలాలు ఉండేవట. కాలక్రమంలో ప్రస్తుతం ఏడు మాత్రమే మిగిలాయి. అందులో కూడా రెండు మాత్రమే చివరిదాకా వెళ్ళడానికి అనువుగా ఉంటాయి. 
చీకటి మల్లయ్య సన్నిధి దిగువన కొండరాళ్ళను తొలగించి విశాలమైన ప్రదేశాన్ని తయారు చేశారు. అక్కడ నుండి రెండు దారులు రెండు గుహలకు దారి తీస్తాయి. 
మొదటిది రేణుకా గుహ చాలా లోపలికి ఉంటుంది. ఎత్తు తక్కువ ఉన్న మార్గంలో ఏర్పాటు చేసిన మెట్ల మార్గంలో వెళ్ళాలి. విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసారు. 
గొప్ప అనుభూతి. గుహ చివర ఎక్కడ నుండి వస్తాయో తెలియదు స్వచ్ఛమైన నీరు. చల్లని నీటితో మొహం కడుక్కొని రెండు గుక్కలు తాగితే ఎక్కడలేని శక్తి ఉత్సాహం కలుగుతాయి. స్వానుభవం. 
తిరిగి వెనక్కి వస్తే రెండవ గుహకు నూతనంగా మెట్లను టీఏర్పాటు చేశారు. జల ఎదురుగా కనిపిస్తుంది. దీనిని బ్రహ్మనాయుడి బిలం అంటారు. రేణుక బిలం మాదిరిగా కాకుండా ఇది విశాలంగా ఉంటుంది. యాత్రీకులు ఎక్కువగా ఇక్కడే స్నానం చేస్తారు. 




పలనాటి బ్రహ్మనాయుడు 

మహాభారత యుద్ధంతో సరిపోల్చతగినది పన్నెండవ శతాబ్దంలో కారంపూడి వద్ద నాగులేటి ఒడ్డున నలగామ రాజు మరియు మలిదేవరాజుల సైన్యాల మధ్య జరిగిన భీకర యుద్ధం. 
విద్యావేత్త, రాజకీయ తంత్రాలలో మేటి, గొప్ప యోధుడు, చక్కని సలహాదారుడు అన్నింటికి మించి సంఘసంస్కర్త. తొమ్మిది వందల సంవత్సరాల క్రిందటి సమాజంలోని క్రిందివర్గాలకు తన ఆస్థానంలో సముచిత స్థానం ఇచ్చారు. 
యోధానుయోధులందరూ మరణించి యుద్ధం ముగిసిన తరువాత నలగామరాజుకు రాజ్యం అప్పగించి బ్రహ్మనాయుడు గుత్తికొండ బిలంలో చాలాకాలం ధ్యానంలో ఉండిపోయారని అంటారు. బిలం లోనికి వెళ్లిన తరువాత ఆయనను చూసినవారు ఎవ్వరూ లేరు. బిలంలో జరిపిన అన్వేహణలో బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఆయుధం పురావస్తుశాఖ వారికి లభ్యమయ్యింది అని తెలుస్తోంది. 
నూతనంగా నిర్మించిన మెట్ల వద్ద శ్రీ బ్రహ్మనాయుని విగ్రహం ఉంచడం సముచితంగా ఉన్నది,
నీరు ఎక్కడ నుండి వస్తుందో కానీ కొండరాళ్ళు తేమగా ఉంటాయి. ముఖ్యంగా రేణుకా బిలం లోనికి వెళుతున్నప్పుడు ఒక సాహసకార్యం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. 
గుత్తి కొండ బిలం వెళ్లడం అంటే ప్రామాణిత పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగిన ప్రదేశంలో చేసే  ఒక సాహస ఆధ్యాత్మిక యాత్ర !
ప్రయత్నం చేయండి. ఆస్వాదించండి !!!!

నమః శివాయ !!!! 

  








మేము నరసరావుపేట నుండి బయలుదేరి మాచర్ల వెళుతున్నాము మోటార్ సైకిల్ మీద. దారిలో నకిరేకల్లు దగ్గర ప్రధాన రహదారి నుండి మాచర్లకు తిరగాలి. 
అక్కడ ఒక బోర్డు మమ్మల్ని ఆకర్షించింది. 
స్వయంభూ శ్రీ వృక్షాఆంజనేయ స్వామి వారి దేవస్థానం. నా ఆరాధ్యదైవం శ్రీ హనుమంతుడు. ఎన్నో ప్రదేశాలలో శ్రీ మారుతీతనయుని ఆలయాలనుసందర్శించే అవకాశం ఆయన దయ వలన లభించింది. 
ఇది మరొకటి అనుకోని ఆగాము. 
అక్కడ ఉన్న టీ కొట్టు సోదరుడు మా బ్యాగ్గులను పెట్టుకోమని చెప్పడమే కాకుండా ఆలయానికి దారి కూడా చూపించాడు. ఒక అయిదువందల అడుగులు ఉంటుంది రోడ్డు మీద నుండి. నడుచుకుంటూ వెళ్ళాము. 
ఆలయ ముఖద్వారం కొత్తగా నిర్మిస్తున్నారు. అర్చకస్వామి ఎవరూ లేరు. 
ప్రశాంతంగా ఉన్నది. గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం తెలియకుండానే నన్ను ఆకర్షించింది. 
హనుమాన్ చాలీసా పఠిస్తూ ప్రదక్షిణలు చేసి స్వామిని కనులారా దర్శించుకొని వెలుపలికి వచ్చాము. 
ఆలయ వివరాలు తెలియ రాలేదు. కానీ ఒక మహత్తర దైవిక శక్తి అక్కడ ఉన్నది అన్న అనుభవం నేను పొందగలిగాను. చాలా తక్కువ ప్రదేశాలలో మాత్రమే అలాంటి అనుభవం కలుగుతుంది. 
ఆ మార్గంలో ప్రయాణించేవారు తప్పనిసరిగా అక్కడ ఆగి శ్రీ రామదూతను దర్శించుకొని వెళ్ళవలసినదిగా మనవి చేస్తున్నాను. 

జై శ్రీరామ్ !!!!





 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Durga bhavani Temple, Dhanakonda, Vijayawada

                        శ్రీ దుర్గ భవాని ఆలయం, విజయవాడ  ఇంతకు ముందు  చెప్పినట్లు మన రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ సరైన విషయసమాచారం అం...