15, జూన్ 2024, శనివారం

sri Jalapaleshwara Swamy Temple, Vemuluripadu

                                 గంగాధరా జలపాలేశ్వరా  !!

పంచ భూతాలకు అధిపతి కైలాసవాసుడు అని పురాణాలు పేర్కొంటున్నాయి. 
అందువలననే వివిధ ప్రాంతాలలో పంభూతాలైన నేల, నీరు, నింగి, నిప్పు, వాయువు రూపాలలో పూజించబడుతున్నారు పరమేశ్వరుడు. 
మనందరికీ తెలుసు పంచ భూత స్థలాలుగా ప్రసిద్ధికెక్కిన  చిదంబరం, కంచి, జంబుకేశ్వరం, తిరువణ్ణామలై మరియు శ్రీకాళహస్తి గురించి. 
కానీ అవే అంశాలతో ప్రసిద్ధికెక్కిన మరో జత పంచభూత క్షేత్రాలు తమిళనాడులోని సేలం చుట్టుపక్కల నెలకొన్న విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. 
ఇక్కడ ఒక విషయం తెలియచేయాలి. 
పంచభూత క్షేత్రాలు కాకపోయినా పరమేశ్వరుని అనుగ్రహంతో ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి క్షేత్రం అయినా నెలకొనవచ్చును అన్నది. 
అలా ఆ గంగాధరుని కృపతో ఏర్పడిన ఒక దివ్యధామం గురించి మీకు పరిచయం చేయదలిచాను. 
పదవ శతాబ్దంలోచోళ సామ్రాజ్యం ప్రగతి శోభాయమానంగా ఉండినది అని వారి రాజ్య విస్తరణ తెలుపుతోంది. దక్షిణాపధంలో ముఖ్యంగా నేటి ఆంధ్రప్రదేశ్ లోని అనేక రాజ్యాలు వారి అధీనంలోనికి వచ్చాయి. వాటిని జయించే క్రమంలో వారు అశేష సేనలతో ఈ ప్రాంతాలకు తరలి వచ్చారు. నేటి కొండవీడు ఉన్న ప్రాంతాలకు అర్ధరాత్రి సమయానికి చేరుకొన్నారట. 
ఆ సమయంలో అక్కడ ఎక్కడా నీటి సౌకర్యం లేదట. 
మహారాజు, మంత్రులు, సైన్యాధికారులు, వేలాది మంది సైనికులు ఇతర పరివారం. అందరికీ నీరు కావాలి. 
మహరాజు ఆరాధ్యదైవం అయిన గంగాధరుని ప్రార్ధించారు. ప్రార్ధన ఫలించి సమీప భూగర్భంలో నీరు ఉన్నట్లు తోచింది. 
కొద్ది  గంటలలోనే వందలాది మంది సైనికులు రాజు చూపిన ప్రదేశంలో త్రవ్వగా గలగలామంటూ గంగమ్మ ఉబికి వచ్చింది. 
 నాడు "యాబలూరు"గా  పిలవబడిన నేటి వేములూరిపాడు గ్రామంలో శ్రీ జలపాలేశ్వర స్వామి పేరుతొ తమ కుల దైవాన్ని ప్రతిష్టించారు అని ఆలయ గాధ. 
ఆ సమయంలో వేసిన ఒక శిలాశాసనం ఈ మధ్యనే వెలుగు చూసింది. 
అనంతర కాలంలో కొండవీటిని రాజధానిగా చేసుకొని పాలించిన రెడ్డి రాజులు తమ కులదైవం శ్రీ మూలాంకులేశ్వరి దేవితో పాటు శ్రీ జలపాలేశ్వర స్వామిని ఆరాధించేవారు. విజయనగర రాజులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్లుగా తెలుస్తోంది. 
నిత్యపూజలు జరిగే ఈ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని, కార్తీక మాస పూజలను విశేషంగా నిర్వహిస్తారు. వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలను, ఇతర హిందూ పర్వదినాలను కూడా ప్రత్యేక పూజలు జరుపుతారు. 
గుంటూరునుండి నర్సరావుపేట వెళ్లే ప్రధాన రహదారి కి పక్కనే వేములూరిపాడు గ్రామంలో ఉంటుంది శ్రీ జలపాలేశ్వర స్వామి ఆలయం. 
















వేములూరిపాడు గ్రామానికి సమీపంలో ఉన్న మరో విశేష ఆలయం శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయం. 
ప్రధాన రహదారి నుండి 2 కిలోమీటర్ల దూరంలో పుట్ట కోట వద్ద గరువుకొండ లో ఉన్న శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయం సుమారు అయిదు శతాబ్దాల క్రిందటిదిగా చెబుతారు. 
వేములూరిపాడు నుండి గరువు కొండ ఆలయం వరకు చక్కని రోడ్డు మార్గం ఉన్నది. పర్వత పాదాల వద్ద  సువిశాల ప్రాంగణం లో నూతనంగా నిర్మించిన ఆలయం. ఆలయానికి ఎదురుగా పెద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 
ఆస్థానమండపం, గర్భాలయం.  గర్భాలయంలో పెద్ద కొండరాతి మీద అంజనాసుతుని రూపాన్ని 
 చెక్కారు. ఆలయం పడమర ముఖంగా ఉన్నా స్వామి వారు దక్షిణాన్ని చూస్తుంటారు. 
ఇలాంటి  వాయునందనుని రూపాలు ఎక్కువగా శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో రూపుదిద్దుకొన్నవి గా తెలుస్తోంది. 
శ్రీ కృష్ణ దేవరాయలవారి ఆధ్యాత్మిక గురువు శ్రీ వ్యాస రాయలవారు శ్రీ హనుమంతుని ఉపాసకులు. వీరు అనేక ప్రాంతాలలో కొన్ని వందల రామదూత ఆలయాలను నెలకొల్పారు అని తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలో కూడా ఇలాంటి మారుతి రూపాలు కనిపిస్తాయి. వీటిలో ప్రత్యేకత ఏమిటంటే రాతి మీద రూపాన్ని చెక్కుతారు. విగ్రహం చేయరు. శ్రీ హనుమంతుని తోక స్వామివారి శిరస్సు మీదగా రెండవ పక్కకు తిరిగి ఉంటుంది. 
ఇలా కనిపించే రామదూత విగ్రహాలు పదహారవ శతాబ్దంలో విజయనగర రాజుల కాలం నాటివి అని అంటారు.  
ఇక్కడ కూడా ఇలాంటి  హనుమంతుని మరో రూపం పుట్టకోట(కొండ పైన)లో  ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి  ఆలయం పక్కన ఇదే మాదిరి పెద్ద రాతి మీద చెక్కబడి ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు అనేక ప్రదేశాలలో కనిపిస్తాయి. వినుకొండ, నంద్యాల వీటికి పెద్ద ఉదాహరణ. 
నంద్యాలలో ఉన్న నాగ నందీశ్వర స్వామి ఆలయంలోని భారీ హనుమంతుని విగ్రహం శ్రీ వ్యాస రాయలవారి ప్రతిష్ట అని చెబుతారు. అలాగే వినుకొండలో గుంటి ఆంజనేయ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి. రామాయణం నాటి విశేషాలతో ముడిపడి ఉన్న క్షేత్రం ఇది. 
ఉగాది, శ్రీ రామనవమి, మహాశివరాత్రి, హనుమజ్జయంతి ఇలా అన్ని హిందూపర్వదినాలలో పెద్ద సంఖ్యలో భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి తరలి వస్తారు. అన్నసమారాధన కూడా జరుపుతారు. 
వాయు శబ్ద కాలుష్యానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో దైవసన్నిధిలో మానసిక ఆహ్లాదాన్ని కలిగించే ప్రదేశం శ్రీ భక్త ఆంజనేయస్వామి కొలువైన గరువుకొండ. 
























నమః శివాయ !!!!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Durga bhavani Temple, Dhanakonda, Vijayawada

                        శ్రీ దుర్గ భవాని ఆలయం, విజయవాడ  ఇంతకు ముందు  చెప్పినట్లు మన రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ సరైన విషయసమాచారం అం...