28, జులై 2018, శనివారం

Sri Villiputtur

                                        శ్రీ విల్లిపుత్తూరు 






తమిళనాడులోని ఆలయాల లేదా ఊరి పేర్లు అతి తక్కువగా శ్రీ తో ప్రారంభం అవుతాయి. అలాంటి వాటిల్లో ప్రముఖమైనవి శ్రీ రంగం, శ్రీ ముషీణం మరియు శ్రీ విల్లిపుత్తూరు. చిత్రమైన విషయం  ఏమిటంటే ఈ మూడు క్షేత్రాలకు సంబంధం ఉండటం.
త్రిభువన పాలకుడు, అనంతశయనుడు అయిన శ్రీ మహావిష్ణువు శ్రీ రంగనాథస్వామి గా కొలువైన శ్రీరంగం , భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి కెక్కినది. ఆయన ధరించిన అనేకానేక అవతారాలలో ప్రముఖమైన దశావతారాలలో మూడవది అయిన వరాహ అవతార రూపంలో వెలసిన ఏకైక ఆలయం ఉన్న ప్రదేశం శ్రీ ముషిణం.
మూడవదైన శ్రీ విల్లిపుత్తూరు, శ్రీ మన్నారాయణ మూర్తి పైన అపురూపమైన పాశురాలను గానం చేసిన పన్నెండు మంది శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ఇద్దరి స్వస్థలం. వారిలో ఒకరు శ్రీ రంగనాథుని ఆరాధించి ఆయనలో ఐక్యం అయిన ధన్యురాలు "ఆండాళ్ళు". ఈమెనే గోదాదేవి అని పిలుస్తారు. ప్రతి విష్ణు ఆలయంలో ఈమెకు ప్రత్యేక సన్నిధి ఉంటుంది. ఈమె రాసిన "తిరుప్పావై" గానం ప్రతి ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఆలయంలో నియమంగా  జరుగుతుంది.
శ్రీ విల్లిపుత్తూరు నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా కీర్తించబడటానికి కారణం ఆండాళ్ళు మరియు ఆమె పెంపుడు తండ్రి శ్రీ విష్ణుచిత్తుడు. ఈయనను పెరియాళ్వార్ అని కూడా పిలుస్తారు. 













ముకుంద మరియు పద్మ దంపతులు సంతానం గురించి శ్రీ వట పత్ర సాయి పెరుమాళ్లును ప్రార్ధించారు. ఆయన అనుగ్రహంతో పొందిన బిడ్డకు విష్ణు చిత్తుడు అని పేరు పెట్టి ప్రేమగా పెంచారు. పేరుకు తగినట్లుగా విష్ణుచిత్తుడు నిరంతరం శ్రీ మహావిష్ణు నామ ధ్యానంలో ఉండటం, రోజులో అధిక భాగం శ్రీ వటపత్ర సాయి ని సేవలో గడిపడం చేసేవాడు. అందుకని ప్రజలు ఆయన గరుత్మంతుని అంశ అని భావించేవారు. గౌరవంగా పెరియాళ్వార్ అని పిలిచేవారు.
అలంకార ప్రియునిగా శ్రీ మహావిష్ణువుకు పేరు. స్వామి వారి అలంకరణానికి అవసరమైన పుష్పాల నిమిత్తం విష్ణుచిత్తుడు నందనవనం ఏర్పాటు చేశారు. నిత్యం  ఉద్యానవనంలో పూలతోనే స్వామివారిని అలంకరించి చూసి మురిసిపోయేవారు. ఈయన పరమాత్మను యశోదాదేవి శ్రీ కృష్ణుని యెంత ప్రేమగా అబ్బురంగా చూసుకోనేదో అదే మాదిరి వ్యవహరించేవారు. అపురూపమైన  ఆప్యాయతను రంగరించి పెరియాళ్వార్ రచించిన పెరియాళ్వార్ తిరుమొళి మరియు తిరుపల్లాండు అనే పాశురాలు అదే విషయాన్ని స్ఫష్ఠంగా చూపుతాయి.




   






ఒకరోజు విష్ణుచిత్తునికి నందనవనంలోని తులసి చెట్టు క్రింద ముద్దులొలికే పసిపాప లభించినది. అంతర్యామి ప్రసాదించిన కానుకగా భావించి ఆమెకు "ఆండాళ్ళు" అన్న పేరు పెట్టి సొంత బిడ్డలాగా సాకసాగారు. తులసి దగ్గర  లభించినందున ప్రజలు "గోదా దేవి" అని ప్రేమగా పిలిచేవారు. ఆమె పెంపుడు తండ్రి దగ్గర రామాయణ, భాగవత గాధలు విని శ్రీ కృష్ణుని పట్ల అవాజ్యానురాగాన్ని పెంచుకొన్నది. తండ్రి నిత్యం శ్రీ వటపత్ర సాయి పెరుమాళ్ళుకు అలంకరించడానికి సిద్ధం చేసే దండలను ధరించి, మానసచోరునికి తగినదానినా కాదా అని బావి నీటిలో చూసుకొనేది. ప్రస్తుతం కన్నాడి (అడ్డం) బావిగా  పిలిచే ఆ నోటిని శ్రీ రంగమన్నారు ఆలయ ఆస్థాన మండపంలో ఈ రోజుకీ చూడవచ్చును. 
విజయ నగర సామ్రాజ్య నాధుడు శ్రీ కృష్ణదేవరాయలు ఈ ఉదంతం ఆధారంగా "ఆముక్త మాల్యద"అన్న గ్రంధం అచ్చ తెలుగులో రచించారు. ఈయన శ్రీవిల్లిపుత్తూరు ఆలయానికి ఎన్నో కైంకర్యాలు సమర్పించుకున్నారు. ఆముక్త మాల్యద అంటే తాను  ధరించినది తీసి సమర్పించినది అని అర్ధం. బాలిక చేసినది అదే కదా !
పెరియాళ్వార్ వాటినే స్వామికి అలంకరించేవారు. ఒకనాడు దండలో పొడుగాటి కేశము కనిపించింది. కుమార్తెను అనుమానించి మరునాడు గమనించాడు. ఆండాళ్ళు చేస్తున్నది గమనించారు. పుత్రిక పసితనంతో చేస్తున్న పనిని గమనించకుండా ధరించి తీసిన దండాలనే తానూ స్వామివారికి సమర్పించడం ఘోర తప్పిదనంగా భావించి నాడు దండలను అలంకరించలేదు. నాటి రాత్రి పెరుమాళ్ళు పెరియాళ్వారుకు స్వప్న దర్శనమిచ్చి దీనిలో గోదా దోషం ఏమీ లేదు. ఆమె ధరించిన పుష్పమాలలు అంటే తనకు ప్రీతి. వాటినే తనకు అలంకరించమని తెలిపారట.    











కన్నాడి బావి 







కొంతకాలానికి శ్రీ రంగనాథుని స్వప్నాదేశం మేరకు మహారాజు సకల లాంఛనాలతో గోదాదేవిని శ్రీ రంగం పిలిపించారు. ఆమె స్వామి వారి దివ్యమంగళ రూపం చూసి మైమరచిపోయి సశరీరంగా ఆయనలో ఐక్యం అయ్యింది.
గోదాదేవి రచించిన తిరుప్పావై, ఆండాళ్ తిరుమొళి ప్రజలలో విశేష ఆదరణ పొందాయి. శ్రీవైష్ణవ గురువులు, విశిష్టాద్వైత ప్రభోధకులు అయిన శ్రీ రామానుజాచార్యులు ఆండాళ్ళును సోదరిగా భావించేవారు. ఆయన మార్గదర్శకాల మేరకు ధనుర్మాసంలో అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై గానం నియమంగా చేస్తారు. తిరుమలలో కూడా ధనుర్మాసంలో సుప్రభాత గానం కు బదులుగా తిరుప్పావై గానంతో కలియుగ దైవానికి మేలుకొలుపు పాడుతారు. అలానే దక్షిణాన అన్ని ఆలయాలలో భోగి పండుగనాడు గోదాకల్యాణం కూడా నియమంగా జరుపుతారు.












శ్రీవిల్లి పుత్తూరు ప్రస్థాపన బ్రహ్మవైవత్తర పురాణం మరియు వరాహ పురాణంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సత్య యుగంలో భృగు మరియు మార్కండేయ మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఉండేవారట. వారిని కాలనేమి అనే అసురుడు వారిని ఇబ్బందులకు గురి చేసేవాడట.  వారు శ్రీమన్నారాయణుని ప్రార్ధించారట. ఆయన రాక్షస సంహారం చేసి మహర్షుల కోరిక మేరకు శ్రీ వటపత్ర సాయిగా కొలువు తీరారు.
విశాల ప్రాంగణంలో రెండు ఆలయాలు మరెన్నో ఉపాలయాలుంటాయి. రెండు అంతస్థుల    ప్రధాన ఆలయంలో  క్రింద శ్రీ నరసింహ స్వామి, పైన సప్త మహర్షుల, సమస్త దేవతల కైవారాలను స్వీకరిస్తూ అనంతశయన భంగిమలో పాదాల కిరిపక్కలా దేవేరులతో, నాభి నుండి ఉద్భవించిన కమలంలో విధాత తో విరాట్రూపంలో దర్శనమిస్తారు శ్రీ వటపత్ర సాయి. తల దగ్గర వటవృక్షం తాలూకు ఆకు ఉంటుంది.
దక్షిణ భారత దేశంలోని ఎత్తైన ఆలయ గోపురాలలో ఒకటి శ్రీవిల్లిపుత్తూరు ఆలయానిదే ! నూట తొంభై రెండు అడుగుల ఎత్తు గల ఈ గోపురాన్ని నాయక రాజులు నిర్మించారు. తమిళనాడు రాష్ట్ర అధికార చిహ్నం ఈ రాజ గోపురం !చోళ,పాండ్య, చేర, విజయనగర, నాయక, మరాఠా రాజులు ఆలయాభివృద్దికి విశేష కృషి చేశారు. 











ఒకప్పుడు మూలవిరాట్టును మూడు ద్వారాల గుండా తిరువనంతపురంలో మాదిరి చూడాల్సి ఉండేది. కానీ ఏ కారణంగానో మూడు ద్వారాల స్థానంలో ఒకే ద్వారాన్ని ఏర్పాటు చేశారు. 
ప్రదక్షిణా ప్రాంగణంలో గోడల పైన సహజ వర్ణాలతో చిత్రించిన నూట ఎనిమిది దివ్య దేశాల మూలవిరాట్టుల చిత్రాలు సుందరంగా ఉంటాయి. ఆస్థాన, ముఖ మండప పైభాగాన చెక్కల పైన చెక్కిన  సుందర చెక్కడాలు, పురాణ పురుషుల రూపాలు అద్భుతంగా ఉంటాయి. 
 రెండో ఆలయంలో రమణీయ శిల్పాలతో నిండిన కళ్యాణ మండపం విజయనగర శిల్ప విధానంలో నిర్మించబడినది. ఇక్కడి గర్భాలయంలో శ్రీ రంగమన్నారు, శ్రీ ఆండాళ్ మరియు గరుత్మంతుడు స్థానిక భంగిమలో దర్శనమిస్తారు. 
కుమార్తె వివాహం చేయలేక పోయాను అని భాధ పడుతున్న పెరియాళ్వారుకు శ్రీ రంగనాధుడు దర్శనమిచ్చి గోదాను శ్రీవిల్లిపుత్తూరు పంపుతాను. అక్కడ మా వివాహానికి ఏర్పాట్లు చేసుకో . నేను ముహూర్త సమయానికి చేరుకొంటాను అని తెలిపారు. తన కోరిక తీరబోతున్నందుకు సంతసించిన పెరియాళ్వార్ వివాహ ఏర్పాట్లు ఘనంగా చేశారట. ముహూర్త సమయం సమీపిస్తున్న శ్రీవారి జాడ లేదట. ఆందోళన చెందిన ఆండాళ్ళు స్వామిని సమయానికి తెమ్మని వినతాసుతుని ప్రార్ధించి, తనతో సమాన స్థానం ఇస్తానని ఆశ చూపిందట. ఈ కారణంగా వీరి ముగ్గురి మూర్తులు ఉంటాయి గర్భాలయంలో. గోదా దేవి ఎడమ చేతిలో ఒక చిలక బొమ్మ ఉంటుంది. అది రాతి చిలక కాదు. కూరగాయలతో తయారు చేసింది. ప్రతి నిత్యం మారుస్తారు. దీని తయారీ ఒక రహస్యం. ఒక కుటుంబం వారే చేస్తారు. ఈ రోజు చిలకను మరునాడు వేలం వేస్తారు. దీనిని గృహంలో ఉంచుకొంటే శుభాలు కలుగుతాయి విశ్వసిస్తారు.  
రెండు ఆలయాల నడుమ పెరియాళ్వారుకు గోదాదేవి లభించిన నందనవనం ఉంటుంది. 












రోజు స్థానిక దూర ప్రాంత భక్తులు తరలి వస్తుంటారు. ఈ విశేష ఆలయంలో నియమంగా ఆరు పూజలు జరుగుతాయి. పెరియాళ్వారుకు ఆండాళ్ లభించినది ఆషాడ మాసంలో. అందువలన ఆడి నెలలో పన్నెండు రోజుల పాటు ఆడి పూరం నిర్వహిస్తారు. ఆ సందర్భంలో గోదా సమేత శ్రీ రంగమన్నారు స్వామి అతి పెద్ద రధము అధిరోహించి పురవీధులలో విహరిస్తారు.
ధనుర్మాసంలో విశేష పూజలు నిర్వహిస్తారు.
దివ్య తిరుపతులలో ప్రత్యేక స్థానం కలిగిన శ్రీ విల్లిపుత్తూరు చెన్నై పట్టణానికి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నేరుగా చేరుకోడానికి బస్సు మరియు రైలు సౌకర్యాలు లభిస్తాయి. మధురై నుండి ప్రతి అర గంటకీ శ్రీవిల్లిపుత్తూరు చేరుకోడానికి బస్సులు కలవు. స్థానికంగా వసతి సౌరకార్యాలు లభిస్తాయి.

ఓం నమో నారాయణాయ !!!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...