11, జులై 2018, బుధవారం

Sri Ganesh Temple, Nagarjuna Sagar


                        విఘ్నాల మధ్య విఘ్ననాయకుడు 


మానవ మేధస్సు ఎన్నో నూతన విషయాలను ఆవిష్కరిస్తోంది.విజ్ఞానం విశ్వాన్ని పరిపాలిస్తోంది. శాస్త్రం ఎంతో అభివృద్ధిని సాధిస్తోంది. అయితే చిత్రంగా అదే స్థాయిలో భగవంతుని పట్ల మనిషి యొక్క ఆరాధనా, విశ్వాసం పెరగడం ! 
దీనికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. పరీక్షలలో ఉతీర్ణత, వివాహం, సంతానం, ఆరోగ్యం లాంటి విషయాలలో అంతిమంగా అంతర్యామిని ఆశ్రయించడం, అనుగ్రహం పొందడం లేదా అంతరిక్షం లోని రహస్యాలను ఛేదించడానికి తమ శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేసి ప్రయోగించిన రాకెట్ ప్రయోగం విజయవంతం అయితే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొనే దాకా ఎన్నో !
దీనిని ఒక అద్భుతంగా పరిగణించాలి. తాను ఎంత అభివృద్ధిని సాధించినా కొన్నివిషయాలు  తన పరిధిలో లేవు అన్న సత్యాన్ని  మానవుడు గ్రహించడమే ముఖ్య కారణం. 
ఇలా తమ కోరిక నెరవేర్చిన సర్వేశ్వరునికి తమ తాహతుకు తగినట్లుగా పూజలు, అలంకారాలు, ఆభరణాలు, కైకర్యాలు సమర్పించుకోవడం కూడా తరతరాలుగా జరుగుతున్నదే !













విజ్ఞానం, మేధస్సు కూడా ఆ ఆదిదేవుని కృపాకటాక్షాలతో సముపార్జించుకొన్నవే అన్న విశ్వాసం తో, వీటన్నింటి కన్నా పైన కనపడని శక్తి ఒకటి ఉన్నదన్న సత్యాన్ని గ్రహించడం వలననే సర్వాంతర్యామిని శరణు కోరడం జరుగుతోంది.
రూపం ఏదన్నా కానియ్యండి కష్టాల, నష్టాల నుండి కాపాడమని, ఆపదలు దరి చేరకుండా దయ చూపమని, చేసే ప్రయత్నాలలో విజయం అనుగ్రహించమని నిరాకారుని ఆరాధించడం యుగ యుగాలుగా వస్తున్నదే !











ఈ ఉపోద్ఘాతము ఎందుకంటే "ఆధునిక దేవాలయాలు"గా మాజీ ప్రధాని కీర్తిశేషులు శ్రీ జవహర్ లాల్ నెహ్రూ అభివర్ణించిన ఆనకట్టలలో అగ్రగామిగా పేరొందిన నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణ సమయంలో చోటు చేసుకున్నఈ సంఘటన కారణం !
గుంటూరు మరియు నల్గొండ జిల్లా మధ్య పర్వతాల ఆధారంగా కృష్ణానది పైన నిర్మించబడినది ఈ ఆనకట్ట. దీని నిర్మాణం వలన  తెలంగాణా రాష్ట్రాలలో లక్షలాది ఎకరాలు  సస్యశ్యామలంగా మారిపోయాయి. రైతులకు లాభాలను, ప్రజలకు ఆహారాన్ని, తాగు నీటిని  ప్రతిష్టాత్మక ఆనకట్ట.
 ఈ ఆనకట్ట నిర్మాణం 1955వ సంవత్సరంలో ప్రారంభమయ్యి 1967వ సంవత్సరం నాటికి పూర్తి అయ్యింది. వేళా సంఖ్యలో కార్మీకులు రేయింబవళ్లు  పని చేశారు. వందలాదిగా ఇంజనీర్లు, అధికారులు పర్యవేక్షించారు. అవసరమైన సమీక్షలు  నిర్వహించారు. తగిన సలహాలు ఇచ్చారు.
ఆ సమయంలో ఒక ఆధ్యాత్మిక అంశం చోటు చేసుకొన్నది. నిర్మాణ పనులలో పాల్గొన్న కార్మీకులలో అధికులు తమిళనాడుకు చెందినవారు. తమిళులు శివారాధకులు. మీదు మిక్కిలి
"వినాయగర్" అంటే గొప్ప భక్తి విశ్వాసాలు కలవారు. తమిళనాడు లోని ఏ వీధి చూసినా కనీసం రెండన్న గణపతి ఆలయాలు చిన్నవో పెద్దవో కనిపిస్తాయి. ఇక ప్రముఖ ఆలయాలలో లెక్కలేనన్ని మూషికవాహనుని విగ్రహాలుంటాయి. వీరు పిళ్ళయార్ ను ప్రార్ధించకుండా ఏ పనీ ప్రారంభించరు.










నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణములో పాల్గొన్న వారి ముఖ్యమైన పని కొండలలో పేలుడు పదార్ధం ఉంచి పేల్చడం, ప్రాంతాన్ని నిర్మాణానికి అనువుగా మార్చడం అదే విధంగా నిర్మాణానికి కావలసిన రాళ్లను సేకరించడం. ఇప్పటి మాదిరి ఆధునిక సదుపాయాలు లేని ఆ రోజుల్లో ఇది ఇంకా ప్రమాదకరమైనది. ప్రాణాలను పణం గా పెట్టి చేయవలసినది.
భయపడే తోటి వారిలో ధైర్యం నింపడానికి దైవాన్ని ఆశ్రయించారు వారి నాయకుడు "ఆర్ముగం". 1961వ సంవత్సరంలో ఆయన ఒక గౌరీ పుత్రుని విగ్రహాన్ని నిర్మాణ స్థలానికి ఒక పక్కన, కార్మికుల నివాస స్థలాల దగ్గరలో ఒక చెట్టు క్రింద ప్రతిష్టించారు. ఈ ఆలోచన మంచి ఫలితాలను ఇచ్చింది. పని లోనికి వెళ్లే ముందు తిరిగి వచ్చేటప్పుడు తమ ఆరాధ్య దైవానికి మొక్కే వారు. ఇది వారిలో అవసరమైన ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించింది. అలా ఎలాంటి ఆపదలు చోటు చేసుకోకుండా ఆనకట్ట నిర్మాణం పూర్తి అయ్యింది. ఎవరి దోవన వారు వెళ్లి పోయారు.














వినాయకుడు మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. తిరిగి వెళ్లే సమయంలో ఆర్ముగం స్వామికి ఒక చిన్న గది  లాంటిది నిర్మించాడు.
కాలం ఎవరి కోసం ఆగదు కదా ! దశాబ్దాలు గడచి పోయాయి. సరైన పర్యవేక్షణ పోషణ లేక మందిరం శిధిలమైంది. పైకప్పుకు అమర్చిన రేకులను దొంగలు ఎత్తుకొని పోయారు. అంతా చిద్విలాసంగా చూస్తుండి పోయారు బొజ్జ గణపయ్య. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దగ్గరికి ఎవరొచ్చినా ఆశీర్వదిస్తుండే వారు.
కొందరు సమీప గ్రామాల భక్తులు మందిరాన్ని అభివృద్ధి చేయడానికి శ్రీ జగన్నాధ శర్మ ఆధ్వర్యంలో పూనుకొన్నారు. విరాళాలు సేకరించి కొంతమేర నిర్మాణాలను పూర్తి చేశారు. నిత్య దీప ధూప నైవేద్యాలను సమర్పించసాగారు.
శ్రీ శీలం గోవింద రెడ్డి అనే భక్తుడు గతించిన తన పెద్దల జ్ఞాపకార్ధం పైకప్పును నిర్మించారు. పెదబాబు అనే మరో భక్తుడు గోపుర నిర్మాణానికి కావలసిన ధనాన్ని అందించారు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా  నుండి తెలంగాణా లోని నల్గొండ జిల్లా లోనికి ప్రవేశించే మార్గంలో తొలి ఆలయం ఇదే !











చరిత్రతో శాశ్విత అనుబంధాన్ని కలిగి ఉన్న ఈ ఆలయానికి ఈ నాటికీ కష్టాలు తీరలేదు.  అటవీ శాఖ అధీనంలో ఉన్న భూమిలో ఈ ఆలయం  ఉండటం  అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఈ ప్రాంతం అంతరించిపోతున్న పెద్ద పులుల అభయారణ్యంలో భాగం కావడంతో నిబంధనలు కొంచెం కఠినంగా ఉంటాయి. ఎలాంటి ప్రెవేటు వ్యక్తుల శాశ్విత నిర్మాణాలను అనుమతించరు.
కొత్త నిర్మాణాలకి అనుమతులు ఇవ్వరు. అంతేనా నీరు,విద్యుత్  కూడా లేదు ఇక్కడ! అయినా స్థానిక భక్త బృందం వారు తమ శక్తి మేరకు ఆలయాభివృద్దికి కృషి చేస్తున్నారు.
ఒక చారిత్రాత్మిక సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన లంబోదరుని ఆశీస్సులు వారికి సదా లభించాలని మహేశ్వరుని ప్రార్ధిస్తున్నాను.
ఈ ఆలయం నాగార్జున సాగర్ కి పదకొండు కిలోమీటర్ల మరియు తెలంగాణా లోని బుద్ధవరం గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఆలయం దాకా వాహనాలు వెళ్లే అవకాశం ఉన్నది.
రాత్రి వేళల్లో  ప్రవేశం నిషేధం. క్రూరమృగాలు తిరుగుతుంటాయి.

నమః శివాయ !!!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...