29, ఏప్రిల్ 2018, ఆదివారం

Sri Tilai Kali Amman Temple, Chidambaram


 శ్రీ తిలై కాళీ అమ్మన్ ఆలయం, చిదంబరం 



             

వెయ్యి సంవత్సరాల క్రిందట నిర్మించబడిన ఆలయం స్థానికంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా విశేష ఆదరణ కలిగినది. చతుర్ముఖాలతో మరియు ఉగ్రరూపంతో కొలువైన శ్రీ తిలై అమ్మన్ మరియు శ్రీ తిలై కాళీ అమ్మన్ కృపాకటాక్షాల కొరకు మరియు జన్మ నక్షత్రవశాత్తు  సంగ్రమించే ఇబ్బందులులను భక్తులు ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు. 












పడమర దిశగా ఉండే శ్రీ తిలై కాళీ అమ్మన్ ఆలయం ఎన్నో ప్రత్యేకతల సమాహారం. ఆది దంపతుల మధ్య నెలకొన్న వివాదం త్రీవ్ర రూపం దాల్చినది. ఇద్దరిలో ఎవరు అధికం అన్న సమస్య తేలడానికి నృత్యాన్ని మాధ్యమంగా ఎంచుకొన్నారు. పోటీ హోరాహోరీగా సాగింది. నటరాజ ఓటమి తప్పదా అన్న శంక వీక్షకులలో తలెత్తినది. ఆ సమయంలో అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తూ స్వామి ఊర్ధ్య తాండవ నృత్యం చేయసాగారు. స్త్రీ అయినందున ఆ భంగిమ పెట్టలేక పరాజయాన్ని అంగీకరించింది. కానీ స్త్రీ సహజమైన ఉక్రోషంతో అలిగి భీకరమైన కాళీ రూపం దాల్చినది.












విధాత ఆమెను ఓదార్చి శాంతింపచేశారు. శాంతించినా చతుర్ముఖాలు ధరించి చిదంబర ఆలయానికి దూరంగా వెళ్లి పోయి అక్కడ కొలువు తీరింది. 
కొప్పెరంచింగ అనే చోళరాజుల సేనాధిపతి అమ్మవారి పట్ల అమిత భక్తి విశ్వాసాలు కలిగి ఉండేవాడు. అమ్మవారి దయ వలననే తాను పాలితుని నుండి పాలకునిగా ఎదిగానన్న నమ్మకంతో ప్రస్తుత ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. 
తదనంతర కాలంలో అనేక మంది పాలకులు, ప్రముఖులు మరియు భక్తులు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేశారు. 















ప్రధాన ద్వారంనికి ముందు మండపాన్ని నిర్మించారు. ఇందులో పెద్ద బలి పీఠం ఉంటుంది. దీని పైన భక్తులు భక్తి ప్రపత్తులతో పసుపు కుంకుమలు జల్లి, నేతి దీపాలను వెలిగిస్తారు.  సహజంగా కనిపించే ధ్వజస్థంభం కనపడదు. ఈ మండపంలో అమ్మవారి లీలల చిత్రపటాలను ఉంచారు. గోపుర ద్వారం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఒక పక్కన విఘ్ననాయకుడు మరో పక్క మయూర వాహనుడు ప్రత్యేక సన్నిధులలో కొలువై దర్శనమిస్తారు. వారికి మొక్కి లోనికి వెళితే ఎదురుగా గర్భాలయంలో స్వర్ణమయ ఆభరణాలను,పుష్పాలను ధరించి ఉపస్థిత భంగిమలో శ్రీ చతుర్ముఖ తిలై అమ్మన్ ప్రశాంత వదనంతో దర్శనం అనుగ్రహిస్తారు. భక్తులు అమ్మవారికి కుంకుమార్చన, పుష్పఅలంకరణ జరిపించుకొంటారు.
















పక్కనే ఉన్న మరో సన్నిధిలో శ్రీ తిలై కాళీ అమ్మన్ ఉగ్రరూపంలో ఎటువంటి అలంకరణ లేకుండా ఉంటారు. తైల అభిషేకం, కుంకుమ అర్చనల ప్రభావంతో మరింత గంభీరంగా కనిపిస్తారు. గ్రహ రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఆదివారాలు రాహుకాలంలో, పౌర్ణమి లేదా అమావాస్య నాడు కాళీ అమ్మన్ కి తైలాభిషేకం మరియు కుంకుమార్చన జరిపించుకొని, వస్త్రం సమర్పించుకొంటారు. దీనివలన గ్రహ అననుకూలత తొలగిపోతుందని విశ్వసిస్తారు. 
ముఖ్యంగా మఖ నక్షత్రంలో జన్మించిన వారు జన్మదినం, ఆదివారం సాయంత్రం రాహుకాలంలో తిలై కాళీ అమ్మన్ కి తైలాభిషేకం మరియు కుంకుమార్చన జరిపించుకొంటే భావిజీవితం సంతోషమయం అవుతుందని చెబుతారు. ఆలయంలో మఖ నక్షత్ర జన్ములు చేయించుకోవాల్సిన పూజా వివరాలు చెబుతారు.     














గర్భాలయం పైన ఉన్న గజపృష్ఠ విమానానికి ప్రదక్షణ చేసే క్రమంలో గర్భాలయ వెలుపలి గోడలో ఉత్తర ముఖంగా శ్రీ బ్రహ్మ స్వరూపిణి గా పూజలందుకొంటుంటారు. భక్తులు దీర్ఘ సుమంగళత్వాన్ని కోరుకొంటూ నేతి దీపాలు వెలిగిస్తారు. పక్కనే శ్రీ చెండికేశ్వరి సన్నిధి ఉంటుంది. ఈమెకు మొక్కి గోత్రనామాలను చెప్పుకొంటే మనస్సులోని కోరికలు నెరవేరతాయి అని నమ్ముతారు.తూర్పు ముఖంగా శ్రీ నాగవేదస్వరూపిణి కొలువై ఉంటారు. దక్షిణ ముఖంగా 
శ్రీ కదంబవన దాక్షిణారూపిణి గా శ్రీ దక్షిణామూర్తి స్త్రీ వేషధారణలో కనిపిస్తారు. ఇక్కడొక్కచోటే జ్ఞాన ప్రసాద స్వామి ఇలా స్త్రీ రూపంలో కనపడేది. భక్తులు గురువారాలు ప్రత్యేక పూజలు జరిపించుకొని విద్యాజ్ఞానం కొరకు ప్రార్ధిస్తారు. 
పక్కనే సకల విద్యలకు అధిదేవత శ్రీ సరస్వతీ దేవి విద్యాఅంబికగా వీణాపాణిగా కొలువై ఉంటారు. తమ పిల్లలకు చక్కని విద్యాబుద్ధులు ప్రాప్తించాలని అమ్మవారి సమక్షంలో   అక్షరాబ్యాసాలు నిర్వహించుకొంటుంటారు. 























ఈ క్షేత్ర కావలి దేవత భైరవుడు. కానీ భక్తులు నేరుగా భైరవుని దర్శించుకోలేరు. శ్రీ సరస్వతీ దేవి సన్నిధికి ఎదురుగా ఒక కిటికీ ఉంటుంది. దానికున్న రంధ్రాల గుండా భైరవుని వీక్షించాలి. ఇలా ఎందుకు చేయాలో అన్నదాని మీద సరైన సమాచారం లేదు. 
ఆలయ గోడల మీద ఎన్నో తమిళ శాసనాలు కనపడతాయి. అవన్నీ ఆలయ అభివృద్ధికి అనేక మంది రాజులు, భక్తులు సమర్పించుకున్న కైంకర్యాల వివరాలను తెలిపేవిగా తెలుస్తోంది. 
గురువారాలు, అమావాస్య, పౌర్ణమి రోజులలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నవరాత్రులలో ఎక్కడెక్కడి నుండో భక్తులు తరలి వస్తారు.    
ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల దర్శనార్ధం తెరచి ఉంటుంది. ఈ విశేష ఆలయం చిదంబర నటరాజ స్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
చిదంబరం దర్శించుకొని వారు తప్పని సరిగా శ్రీ తిలైకాళీఅమ్మన్ ఆలయ సందర్శించుకోవడం అభిలషణీయం !  










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...