18, ఏప్రిల్ 2018, బుధవారం

Sri Margabandheshwara Swamy Temple, Virinjipuram





       శ్రీ మార్గబంధేశ్వర స్వామి ఆలయం, విరింజిపురం 

                                                                                   

                                                                                                     



ఆలయాల రాష్ట్రం తమిళనాడు లోని మరో గొప్ప ఆలయం విరింజిపురం శ్రీ మార్గ బంధేశ్వర స్వామి వారు కొలువైనది. ఆలయ వివరాల లోనికి వెళ్లే ముందు భావితరాల వారికి ఆధ్యాత్మిక మార్గం చూపించడానికి, గత కాలపు చరిత్ర అధ్యనం చేయడానికి వీలుగా, అన్ని తరాల  ప్రజలు   భగవంతుని సమక్షంలో ప్రశాంతంగా సమయం గడపడానికి,వారికి  పురాణ విశేషాలను పరిచయం చేయడానికి,  ఇంత గొప్ప ఆలయాలను  నిర్మించిన పల్లవులు,పాండ్యులు, చోళులు,విజయనగర, నాయక మరియు స్థానిక పాలకుల కళాభిలాషకు ముందుగా జోహార్లు తెలుపుకోవాలి. పాలకుల అభిరుచికి తగినట్లుగా శిల్పులు తమ విద్యను శిల్పాల రూపంలో పూర్తిస్థాయిలో ప్రదర్శించారు.
పరిహార క్షేత్రంగా పేరొందిన శ్రీ మార్గబంధేశ్వర స్వామి ఆలయం కూడా చక్కని శిల్పాలను ప్రదర్శిస్తుంది. ఈ ఊరికి, స్వామివారికి ఈ పేర్లు రావడానికి సంబంధించి పెక్కు గాధలు స్థానికంగా వినిపిస్తాయి.



















శాపవశాత్తూ విరించి (బ్రహ్మ) ఆలయ పూజారి కుమారునిగా జన్మించారు. తల్లితండ్రులు అతనికి శివ శర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. దురదృష్టవశాత్తు శివశర్మ చిన్నతనం లోనే తండ్రి కాలం చేసారు. అప్పటికి అతనికి ఉపనయనం కూడా జరగలేదు. పూజారి అర్హతను పొంది  ఆలయానికి ఉన్న సుక్షేత్రాలైన భూమి మీద హక్కు పొందడానికి బంధువులకు అవకాశం లభించినది. వారు శివశర్మ తోనూ, అతని తల్లి తోనూ ఆలయ పూజాదికాలలో ఎలాంటి తప్పిదం జరగడానికి వీలులేదని, అలా జరిగితే పదవిని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉన్న ఒక్క జీవన ఆధారం నిలబెట్టమని ఆమె ఆ సర్వేశ్వరునికి మొరబెట్టుకొన్నది. పసివాడైన శివశర్మ  తల్లి చెప్పిన ప్రకారం కార్తీక మాసం ఆఖరి ఆదివారం నాటి బ్రహ్మి ముహూర్తంలో బ్రహ్మ తీర్థంలో స్నానమాచరించడానికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతనికి ఉపనయనం చేసి, గాయత్రి మంత్రంతో పాటు, పూజాదికాలు గురించి ఉపదేశించి అదృశ్యమయ్యారు.
అలా పరమేశ్వరుని అనుగ్రహం పొందిన శివశర్మ ఆలయానికి చేరుకొని అనుభవజ్ఞుడైన వానిలా పూజ నిర్వహించాడు. కానీ అభిషేక సమయంలో ద్రవ్వాలను లింగం మీద పోయలేక పోయాడు. భక్తవత్సలుడైన శివుడు శివశర్మ అభిషేకం నిర్వహించడానికి వీలుగా ఒక పక్కకి వరిగారు. నేటికీ ఈశాన్యం వైపుకి కొద్దిగా వంగి ఉండే లింగరాజును ఈ ఆలయంలో చూడవచ్చును. అలా విరించి  నివసించిన గ్రామంగా విరింజిపురం అని పిలవబడుతోంది.గతంలో గౌరీపురం అని  పిలవబడేదట.



















ధనపాలన్ అనే మిరియాల వ్యాపారి సరుకు తీసుకొని వెళుతుండగా దారి దొంగలు అతని వద్ద ఉన్న విలువైన సరుకునూ, నగలను, డబ్బునూ దోచుకొని వెళ్లారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్న ప్రకారం ధనపాలన్ శ్రీ మార్గబంధేశ్వరస్వామి కి మొరపెట్టుకున్నాడు. ఆపత్భాంధవుడైన స్వామి  ఆయుధాలను ధరించి అశ్వాన్ని అధిరోహించి దొంగలను వెంటాడి సొమ్మును తిరిగి అందించడమే కాక అతని గమ్యం వరకు తోడుగా వెళ్లారట. నాటి నుండి స్వామివారికి ఈ పేరొచ్చినది. అద్వైత సిద్ధాంతాన్ని అర్ధమయ్యే రీతిలో సరళీకరించిన పదహారో శతాబ్దానికి చెందిన శ్రీ అప్పయ్య దీక్షితార్ జన్మస్థలం విరింజిపురమే ! ఆయన రచించిన "మార్గబంధు" స్తోత్రాన్ని ఈ ప్రాంతవాసులు ప్రయాణ సమయాలలో పఠిస్తుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువగా విశ్వసిస్తుంటారు. అలా చేయడం వలన సర్వేశ్వరుని సహాయంతో   సురక్షిత ప్రయాణం చేయగలమని విశ్వసిస్తారు.

















విరింజిపురం భాస్కర క్షేత్రం. దినకరుడు స్వామివారిని సేవించారని చెబుతారు. దానికి ప్రమాణంగా ప్రతి ఫాల్గుణ మాసంలో సూర్య కిరణాలు మూడు రోజుల పాటు ఉషోదయ కాలంలో నేరుగా లింగరాజును అర్చించడం చూపుతారు.
ఈ గాధల ఆధారంగా ప్రజలు తమ పిల్లల అక్షరాభ్యాసం, ఉపనయనం ఇక్కడ చేస్తుంటారు. అవివాహితులు, సంతానం లేనివారు ఇక్కడి సింహ పుష్కరణిలో స్నామాచరించి తడి బట్టలతో రాత్రికి ఆలయంలో నిద్రిస్తారు. అలా చేయడం వలన వారి మనోభీష్టాలు నెరవేరతాయని నమ్ముతారు. జాతకరీత్యా గడ్డుకాలం ఎదుర్కొంటున్నవారు సింహ తీర్థంలో స్నానం చేసి స్వామి వారికి అభిషేకం జరిపించుకొంటే గ్రహ స్థితి అనుకూలంగా మారుతుందని అంటారు.
శివశర్మకు కైలాసనాధుడు సాక్షాత్కరించి ఉపనయనం చేసాడని తెలిపే కార్తీక మాస ఆఖరి ఆదివారం నాడు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు.
వెయ్యి సంవత్సరాల క్రిందట శిధిలావస్థలో ఉన్న గర్భాలయాన్ని ఒకటవ రాజరాజ చోళుడు పునః నిర్మించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. అనంతర కాలంలో పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర మరియు నాయక రాజులు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసినట్లుగా శాసనాధారాలు ఉన్నాయి.






















తూర్పు దిశగా ఉండే ఆలయానికి ఏడు అంతస్థుల రాజగోపురం మకుటాయమానంగా కనపడుతుంది. ప్రధమ ప్రాకారం చుట్టూ కోట గోడను పోలిన ఎత్తైన పటిష్టమైన ప్రహరీ నిర్మించబడినది. ప్రహరీ లోపల పక్కన మూడు దిక్కులా యాత్రీకుల సౌకర్యార్ధం మండపాలు నిర్మించబడినాయి.  కానీ ప్రస్తుతం చాలా మటుకు శిధిలావస్థలో ఉన్నాయి. రాజగోపురం ద్వారానికి ఇరుపక్కలా విఘ్న నాధుడు మరియు మయూర వాహనుడు కొలువు తీరి వుంటారు. ప్రాంగణం లోనికి ప్రవేశించగానే ఎదురుగా బలిపీఠాలు, నంది మరియు ధ్వజస్థంభం కనిపిస్తాయి. ఎడమ పక్కన సింహ పుష్కరణి, పదునాలుగు స్తంభాల మండపం ఉంటాయి. ప్రాంగణ నైరుతి మరియు వాయువ్య దిశలలో చక్కని శిల్పాలతో కూడిన కళ్యాణ మండపాలుంటాయి. వెలుపలి ప్రాకారంలో శక్తి మరియు వెయ్యి ఎనిమిది లింగేశ్వరుడు సన్నిధులు ఉంటాయి. పడమర పక్కన కూడా ఒక గోపురం నిర్మించారు. ఉత్తర దక్షిణాలలో ప్రహరీ గోడ మీద గోపురము మాదిరి నిర్మాణాన్ని చేశారు. ఉత్తరం పక్కన "కాలం కాటుమ్ కాల్" అని పిలిచే నీడ ఆధారంగా కాలాన్ని తెలిపే రాయి కనపడుతుంది. ప్రస్తుతం అది ఎలా పని చేస్తుందో ఎవరికీ తెలిసినట్లుగా లేదు. ఎందుకంటే దాని చుట్టూ ఎలాంటి గుర్తులూ లేవు.
























ఉత్తర గోడకు రెండు అంతస్థుల అలంకార మండపం నిర్మించబడినది. ఆస్థానమండపంలోని స్తంభాలకు చక్కని దేవతా శిల్పాలను చెక్కారు. నిలువెత్తు ద్వారపాలకులు దాటి రెండో ప్రాకారం లోనికి వెళితే అక్కడ ఆలయ వృక్షం అయిన తాడి చెట్టు, అమ్మవారు శ్రీ మరగదాంబిక సన్నిధి ఎన్నో లింగాలు, అరవై మూడు మంది నయమ్మారుల విగ్రహాలు ఉంటాయి. గజపృష్ఠ విమానం క్రింద ఉన్న గర్భాలయంలో కొద్దిగా పక్కకు వంగిన భంగిమలో పెద్ద లింగ రూపంలో దర్శనమిస్తారు శ్రీ మార్గ బంధేశ్వర స్వామి దర్శనమిస్తారు.
ప్రాంగణంలో కనిపించే మరో విశేషం ఏమిటంటే వివిధ ఆకారాలలో, పరిమాణాల్లో ఆకులు  మరియు కాయలు కలిగిన మారేడు వృక్షాలు అనేకం ఉండటం !
ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఏడు వరకు భక్తుల దర్శనార్ధం తెరిచి ఉండే ఆలయంలో నిర్ధేశించిన పూజలు నియమంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన పుష్కారణి అయిన  బ్రహ్మ తీర్థం ఆలయానికి వెలుపల కొద్ది దూరంలో ఉంటుంది.     






































ఈ విశిష్ట ఆలయం రాయవెల్లూరుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో చెన్నై బెంగళూరు ప్రధాన రహదారి మీద వచ్చే సేదు వాళై కి ఒక కిలోమీటర్ లోపలికి ఉంటుంది. వెల్లూరు బస్సు స్టాండ్ నుండి సేదు వాళై వరకు పావుగంటకు ఒక బస్సు లభిస్తుంది. అక్కడ నుండి ఆటోలో ఆలయం వద్దకు చేరుకోవచ్చును. మనిషికి పది రూపాయలు.
రాయ వెల్లూరు కి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చును. తెలుగు రాష్ట్రాలను తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాలతో  కలిపే ప్రధాన రైలు కూడలి "కాట్పాడి" వెల్లూరు రైల్వే స్టేషన్. అన్ని రైళ్లు ఇక్కడ ఆగుతాయి. చక్కని వసతి సౌకర్యాలు అందుబాటు ధరలలో లభిస్తాయి. వెల్లూరు చుట్టుపక్కల ఎన్నో చక్కని ఆలయాలు కలవు.

నమః శివాయ !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...