6, డిసెంబర్ 2017, బుధవారం

HAMPI

                                హంపి - విజయనగరం 

సుమారు రెండున్నర  శతాబ్దాలపాటు భారత దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా బలమైన సామ్రాజ్యంగా పేరొందినది విజయనగరం.
1336 వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ సామ్రాజ్యం దక్షిణ భారత దేశంలో అత్యధిక ప్రాంతాలను తమ యేలుబడిలో ఉంచుకొన్నారు విజయనగరాన్ని పాలించిన వివిధ వంశాలకు చెందిన పాలకులు.
విజయనగరం (విద్యానగరం) రాజధానిగా చేసుకొని నాలుగు రాజ వంశాలు పాలించాయి.
అవి సంగమ,సాళువ, తుళువ మరియు ఆరవీటి వంశం.
సంగమ వంశానికి చెందిన హరిహర మరియు బుక్క రాయలు , శ్రీ విద్యారణ్యేశ్వర స్వామి వారి బోధనలతో ఈ హిందూ సామ్రాజ్యం స్థాపించారు.
క్రమంగా ఎదుగుతూ వచ్చిన విజయనగర సామ్రాజ్యం తుళువ వంశానికి చెందిన శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో అత్యున్నత స్థానానికి చేరుకొన్నది.
1565 వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయల అల్లుడైన ఆళీయ రామారాయల నేతృత్వం లోని విజయనగర సైన్యం తళ్లికోట యుద్ధంలో సుల్తానుల సమిష్టి సేనల చేతిలో ఓడి పోవడంతో పతనం ప్రారంభం అయ్యింది.
తదనంతరం రామ రాయల వారసులైన ఆరవీటి వంశం వారు శ్రీరంగపట్టణం, పెనుగొండ, చంద్రగిరి రాజధానులుగా చేసుకొని పాలించినా  గతం తాలూకు ఘనతను తిరిగి పొందలేక పోయారు.శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామి (హంపీ పీఠాధిపతులు)హరిహర మరియు బుక్కరాయలు శ్రీ విద్యారణ్య స్వామి వారి ప్రోద్బలంతో రాజధానిని తుంగభద్రా నదికి ఆవలి ఒడ్డున ఉన్న ఆనెగొంది నుండి హంపికి మార్చారు.
పురాణాలలో పంపా క్షేత్రంగా పేర్కొనబడిన హంపి ప్రస్థాపన రామాయణ మరియు మహాభారతాలలో ఉన్నది.
వాలి మరియు సుగ్రీవుని పాలనలో ఉండిన వానర నగరం కిష్కింద నేటి ఆనెగొంది. శ్రీ ఆంజనేయుడు తన ప్రభువు శ్రీ రామచంద్రుని తొలిసారిగా కలిసిన ఋష్యమూక పర్వతం ఇక్కడే ఉన్నది.
మహాభారతంలో కురుక్షేత్ర సమరం తరువాత ఈ ప్రాంతానికి వచ్చిన సహదేవునికి  రాజులు అందరూ ధర్మరాజ పాలనకు అంగీకరించి కానుకలను సమర్పించినట్లుగా పేర్కొనబడినది.
చరిత్రలో చూస్తే హంపీ మరియు ఆనెగొంది ప్రాంతాలలో పదివేల సంవత్సరాల క్రిందటే నాగరికత వర్ధిల్లినట్లుగా తెలుస్తోంది.  అనేక మట్టి పత్రాలు, పనిముట్లు, సమాధులు త్రవ్వకాలలో లభించాయి. అనేక గుహలలో వేళా సంవత్సరాల క్రిందట చిత్రించిన చిత్రాలు కనపడతాయి.
క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో ఈ ప్రాంతం మౌర్య చక్రవర్తి అశోకుని పాలనలో ఉన్నట్లుగా తెలిపే శాసనాలు బళ్లారి దగ్గర లభించాయి.
శ్రీ విరూపాక్ష ఆలయం  
మాతంగ పర్వతం 

హంపి బజార్ హంపిలో కొన్ని వేల నిర్మాణాలుండేవి. యుద్ధంలో గెలిచిన తరువాత సుల్తానుల సైన్యం ఆరు నెలల పాటు హంపి నగరాన్ని విధ్వంసం చేశాయి. ఎన్నో అద్భుత నిర్మాణాలు వారి పగ ప్రతీకారాలకు  నేలమట్టమై పోయాయి. ఇప్పటికీ ఎన్నో శిధిల నిర్మాణాలు ఉన్నాయి. వీటిల్లో  ప్రస్తుతం ఎనభై పై చిలుకు నిర్మాణాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఇవన్నీ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద క్రింద గుర్తించబడి, పరిరక్షింపబడుతున్నాయి.
వీటిల్లో పెద్దగా  చెక్కుచెదరని నిర్మాణం మరియు ముఖ్యమైనది శ్రీ విరూపాక్ష స్వామి ఆలయం.
గర్భాలయం వారు ఏడు నుండి తొమ్మిది శతాబ్దాల మధ్యకాలం నాటికి చెందినదిగా శాసనాలు తెలుపుతున్నాయి. మిగిలిన నిర్మాణాలు విజయనగర రాజుల కాలంలో నిర్మించబడినాయి.
శ్రీ విరూపాక్ష స్వామి లింగ రూపంలో గర్భాలయంలో పూజలందుకొంటారు. అమ్మవార్లు శ్రీ పార్వతీ దేవి మరియు శ్రీ పంపా దేవి విడిగా కొలువుతీరి ఉంటారు. చక్కని శిల్పకళ కనపడుతుంది. అన్నింటి లోనికి గొప్ప శిల్ప విన్యాసం రాజగోపురం తాలూకు నీడ లోపల గోడ మీద తల్ల క్రిందులుగా కనపడేలా నిర్మించడం. తొమ్మిది అంతస్థుల గోపుర నీడ చూడటం ఒక చక్కని అనుభూతి.
శ్రీ విరూపాక్ష ఆలయానికి ఎదురుగానే ఉన్న రహదారికి ఇరువైపులా ఎన్నో దుకాణాలు ఉండేవిట. నేడు లేకున్నా హంపి బజార్ అనే పిలుస్తారు.
హేమకూట పర్వతం 

శ్రీ విరూపాక్ష ఆలయం లోపల 


ఆలయం పక్కనే ఉన్న హేమకూట పర్వతం తొమ్మిదో  శతాబ్దం కాలం నాటి నిర్మాణాలకు ప్రసిద్ధి. త్రినేత్రుడు మన్మధుని తన మూడో నేత్రంతో భస్మం చేసినది ఇక్కడే పౌరాణిక గాధలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా ఇక్కడి ఆలయాలు కైలాసనాధునివే ! ఎక్కువగా ద్వికూట, త్రికూట ఆలయాలు కనపడతాయి. నిర్మాణ శైలిని బట్టి ఇవి కల్యాణీ చాళుక్యుల కాలం నాటివిగా
భావించవచ్చును. మొత్తం ముప్పై అయిదు ఆలయాలు ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనది శ్రీ మూల విరూపాక్ష ఆలయం. పక్కనే కోనేరు ఉంటుంది. మిగిలిన చాలా మటుకు నిర్మాణాలు శిధిలావస్థలో కనిపిస్తాయి. 
పర్వత శిఖరానికి సులభంగా చేరుకోవచ్చును. పైనుండి హంపీ ని చూడటం చక్కని అనుభూతి. ఇక్కడ నుండి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం వీక్షించడం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందరో దేశ విదేశ పర్యాటకులు ఆ సమయాలలో ఇక్కడికి చేరుతుంటారు. శశివేకాలు గణపతి 

హంపి నగరం లోనికి ప్రవేశించేటప్పుడు ఎడమ పక్కన రెండు పెద్ద వినాయక ఆలయాలు వస్తాయి.  ఒకటి శశి వేకాలు గణపతి ఆలయం మండపంలో ఎనిమిది అడుగుల విగ్రహ రూపంలో ఉపస్థితులై ఉంటారు విఘ్ననాయకుడు.
పక్కనే ఉన్న హేమకూట పర్వత పాదాల దగ్గర చక్కగా నిర్మించిన ఆలయంలో పదిహేను అడుగుల ఏక రాతి మీద మలచిన  కడలేకాలు గణపతిగా  ఉంటాడు. లంబోదరుని పొట్ట శనగ గింజ ను పోలి ఉండటంతో ఈ పేరు వచ్చినది. కన్నడంలో  శనగ గింజ ను కడలేకాలు అంటారు.
హంపి యాత్ర ప్రారంభిచేముందు ఇద్దరు గణపతులకు మొక్కి బయలుదేరడం యాత్రీకుల అలవాటు. వాహనాలు కూడా ఇక్కడే ఆగుతాయి.


శ్రీ కృష్ణ దేవాలయం తరువాత మజిలీ శ్రీ కృష్ణ ఆలయం. శ్రీ కృష్ణ దేవరాయలు వైష్ణవ మతాన్ని అవలంభిచేవారు. తన జన్మ దినం సందర్బంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. మూలవిరాట్టు తొలగించ బడినది. గొప్ప శిల్ప సంపద దర్శనమిస్తుందీ ఆలయంలో !!
ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న శిధిల మండపాల వరుస ఒకప్పుడు కృష్ణ బజార్.  రత్నాలు రాసులు పోసి అమ్మిన దుకాణాల సముదాయాలలో ఒకటి. ఎన్నో శాసనాలు కనపడతాయి.
ఇక్కడ రహదారి మీద ఒక పెద్ద రాతి పెట్టె కనపడుతుంది. ఎందుకు దాని తయారు చేసారో తెలియరాలేదు.

 ముందుకు వెళితే అరటి తోటల మధ్య ఉంటాయి బాడవ లింగం మరియు లక్ష్మీ నారసింహ ఆలయం. వీటికన్నా ముందు రహదారికి ఒక పక్కన శ్రీ చెండికేశవ మరో పక్క శ్రీ వీరభద్రాలయం ఉంటాయి.
 ఏకశిల మీద చెక్కిన బాడవ లింగం తొమ్మిది అడుగుల ఎత్తుతో ఉంటుంది. పైన కప్పు లేని మండపం లాంటి నిర్మాణంలో క్రింది భాగం నిరంతరం నీటిలో ఉంటుంది. లింగం పైన మూడు నేత్రాలు చెక్కబడి కనపడతాయి.
బాడవ అంటే కన్నడంలో పేద అని అర్ధం. ఒక నిరుపేద మహిళా ప్రతిష్టించిన లింగంగా తెలుస్తోంది.
పక్కనే ఉంటుంది సందర్శకులను అమితంగా ఆకట్టుకొనే శ్రీ లక్ష్మీనారసింహ విగ్రహం. ఇరవైఒకటిన్నర అడుగుల ఎత్తు గల ఈ విగ్రహం శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ప్రతిష్టించబడినది. స్వామి వారి వామాంకం మీద శ్రీ లక్ష్మీ దేవి ఉపస్థితురాలై దర్శమిచ్చేదట. సుల్తానుల సేన చేసిన విధ్వంసంలో విగ్రహం లోని చాలా భాగం దెబ్బ తిన్నది.అయినా ఎంతగా ఆకర్షిస్తోందో చెప్పలేము. ముఖ్యంగా కళ్ళు గుండ్రంగా, ముందుకు పొడుచుకొచ్చినట్లుగా ఉండి ఇట్టే దృష్టిని ఆకట్టుకొంటాయి.
బాడవ లింగం 

ప్రసన్న విరూపాక్ష ఆలయం లేదా భూగర్భ శివాలయం గా పిలిచే ఈ ఆలయం ప్రధాన రహదారి నుండి కొద్దిగా లోపలి ఉంటుంది. 1980వ సంవత్సరంలో బయల్పడినది. రహదారి నుండి ఆలయం కొద్దిగా దిగువకు  ఉంటుంది. మెట్ల మార్గం ఉంటుంది. లోపల ఎలాంటి దేవతా మూర్తులుండవు. విజయనగర నిర్మాణ శైలిని ప్రదర్శించే ఈ ఆలయంలో ఎల్లప్పుడూ నీరు ఉంటుంది. కారణం ఏమిటి అన్నది తెలియరాలేదు. 
ఈ భూగర్భ ఆలయానికి సమీపంలో కొన్ని శిధిలాలు కనపడతాయి. అవి అతిధి గృహాలని  చెబుతారు.వాటిని చూసుకొని తిరిగి ప్రధాన దారి లోకి వస్తే కుడిపక్కన నాణేల ముద్రణాలయం,  
వీర హరిహర మహల్, మహారాజ భవన శిధిలాలు కనపడతాయి. 
వీర హరిహర మహల్ సుమారు 1377 ప్రాంతాలలో నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఆఖరి విజయనగర పాలకుల దాకా ప్రతి ఒక్క పాలకుడు ఈ భవనాన్ని తమ నివాసంగా ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం పునాదులుగా మిగిలి పోయింది. 
అత్యంత విలాసవంతమైన భవనంగా చరిత్రకారులు ఊహిస్తున్నారు. పక్కనే మరి కొన్ని భవనాల శిధిలాలు కనపడతాయి.వీటిని సభా భవనంగా ఊహిస్తున్నారు. సగం కూలిన ప్రహరీ కూడా నేటికీ కొంత గంభీరంగాను ధృడంగా  నిలిచి ఉంటుంది. 

శిధిల భవనాలు 


లోటస్ లేదా కమల మహల్ 
లోటస్ లేదా కమల్ మహల్ మహారాణుల నివాస ప్రాంతంలో ఉంటుంది. అంతః పురం ప్రాంతం చుట్టూ ఎత్తైన గోడలు నేటికీ చేకూ చెదర లేదు.  నివాస గృహాలు పూర్తిగా నేలమట్టం చేశారు. క్రమబద్ధంగా పెంచిన పూల చెట్లు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
వికసించించిన పుష్పం మాదిరిగా ఉండే కమల్ లేదా చిత్రాంగి మహల్ ని దుండగులు ఏ కారణం చేతనో తాకలేదు. బహుశా కొంత మేర మహమ్మదీయ నిర్మాణ శైలిలో ఉండటమే దీనికి కారణం కావచ్చు.
కృష్ణ దేవరాయల కాలంలో ఇక్కడ మంత్రివర్గ సమావేశాలు జరిగేవట. మహారాణులు తమ ఇష్టసఖులతో పర్వదినాలలో పూజాదికాలు నిర్వహించేవారట. సరదాగా గడిపేవారని లభించిన ఆధారాల వలన తెలుస్తోంది.
కమల మహల్ చూడటానికి మనిషికి ముప్పై రూపాయలు చెల్లించాలి ప్రవేశ రుసుము క్రింద !
రాణీవాసం వెనకే ఉంటుంది చెక్కు చెదరని గజశాల.
కమల మహల్ 


విజయనగర రాజుల గజబలం అపారమని చరిత్ర పుస్తకాలు తెలుపుతున్నాయి. గజాలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చక్కని గాలీ వెలుతురు వచ్చేలా, విశాలంగా ఈ గజశాలను నిర్మించారు. మావటి వారు ఒక గది  నుండి మరో గది వెళ్ళడానికి మార్గాలు. వారు విశ్రాంతిగా కూర్చోడానికి వరండాల లాంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి.
ప్రతి ఏనుగును ఉంచే గది పైన ఒక్కో విధమైన గోపురాన్ని నిర్మించారు. దీనిని చూస్తే నాటి పాలకుల కళా దృష్టి, తమకు సేవచేసే జంతువుల పట్ల వారు చూపినప్రేమ, అభిమానం మరియు గౌరవం ప్రస్ఫుటంగా కనపడతాయి.
పక్కనే శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంటుంది.
గజశాల వెనుక అనేక శిధిల నిర్మాణాలు కనపడతాయి. అందులో కొన్ని జైన మతానికి చెందినవి.
గజశాల శ్రీ రంగనాథ ఆలయం 
శిధిల ఆలయాలు 

శాసనాలు 
 
శివాలయం 


హాజర రామాలయం 

హాజర రామాలయం రాజవంశీకుల కొరకు నిర్మించబడినది. అందుకే ఈ ఆలయం అంతః పుర భవనాల మధ్యలో నిర్మించబడినది. మొదట ఒక చిన్న ఆలయంగా రెండవ దేవరాయల కాలంలో కట్టించారు. తదనంతర ఆలయంలో అద్భుత నిర్మాణంగా రూపుదిద్దుకొన్నది.
ఆలయం చుట్టూ ఎత్తైన బలిష్టమైన ప్రహరీ గోడ ఉంటుంది. మండపాలకు , ఆలయ గోడలకు రామాయణ గాధను సుందర శిల్పకావ్యంగా మలచారు. లెక్క లేనన్ని శ్రీ రామ, శ్రీ కృష్ణ , శ్రీ మహావిష్ణువు శిల్పాలు రమణీయంగా రాతి మీద మలచబడ్డాయి. శ్రీ గణపతి, శ్రీ కుమార స్వామి, మరియు శివ పార్వతుల, శివ పరివార శిల్పాలు కూడా కనిపిస్తాయి.
శ్రీ రాముని శిల్పాలు ఎక్కువగా ఉండటం వలన హాజర (వెయ్యి)రామాలయంగా పేరు వచ్చి ఉండవచ్చు.పైన కనిపిస్తున్న బలమైన రాతి తలుపులు ఒకప్పుడు మహానవమి దిబ్బ లేదా గద్దె కు గల ప్రధాన ద్వారానివి.
మహానవమి గద్దె ఒక ఎత్తైన వేదిక. నవరాత్రులలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారు హంపిలో. పూజలు, అలంకరణలు, నృత్యగానాలు, నాటకాలు, చిత్రవిచిత్ర వేషాలు గొప్పగా ఉండేవి. ఈ ఉత్సవాలను వీక్షించడానికి రాజ్యమంతటి నుండి ప్రజలు తరలి వచ్చేవారు. వచ్చిన ప్రజలకు ఉండటానికి, ఆహార ఏర్పాట్లతో పాటు తుంగభద్రా నీటిని రాతి కాలువల ద్వారా పెద్ద పెద్ద కోనేరులకు తరలించడానికి చేసిన ఏర్పాటు నాటి నిర్మాణ నిపుణుల కౌశలానికి ప్రతీక.

   మహానవమి గద్దె 
మహారాజు ఈ గద్దె పై నుండి సైనిక విన్యాసాలను, గజ, అశ్వ దళాల కవాతులు పర్యవేక్షించేవారట. విదేశాలైన అరేబియా, పర్షియా, పోర్చుగీసులతో వివిధ వ్యాపారాలు జరిగేవని ఈ గద్దె మీద చెక్కిన శిల్పాల ఆధారంగా గ్రహించవచ్చును. గద్దె చుట్టూ వరుసలో గొలుసులతో సాగే గజ సేన శిల్పాలు, నాటి ప్రజల, పాలకుల జీవన శైలిని ప్రదర్శించే శిల్పాలు ఎన్నో కనపడతాయి. పై భాగానికి చేరుకోడానికి ముందు వైపు నుండి వెనుక పక్క నుండి సోపాన మార్గం ఉంటుంది. మహానవమి గద్దె పై నుండి అవశేష హంపిని చూస్తే కన్నుల నుండి అశ్రువులు వర్షించడం ఖాయం.


  
3 డి ఏనుగు శిల్పం మహానవమి గద్దె మహానవమి గద్దె పక్కనే ఉంటుంది నల్లరాతితో నిర్మించిన సుందర మెట్ల కోనేరు. దీని లోనికి కూడా రాతి కాలువల ద్వారా తుంగభద్రా నీరు తరలించడానికి ఏర్పాట్లు చేసారు. ఈ పుష్కరణిలోని నీటిని పూజల నిమిత్తం ఉపయోగించేవారని అంటారు. 

మహానవమి గద్దె నుండి కొంచెం ముందుకు వెళితే రాణి గారి స్నానాల గది వస్తుంది. రాణివాసపు స్త్రీలు ఇక్కడ జలక్రీడలలో వినోదించేవారని తెలుస్తోంది. 
నీరు రావడానికి, వాడిన నీరు బయటికి వెళ్ళడానికి చేసిన ఏర్పాట్లు అబ్బురపరచేవిగా ఉంటాయి.  
రాణీ గారి స్నానాల గది 


రాణీ గారి స్నానశాల తరువాత కొద్దిగా లోపలికి మట్టి దారిలో వెళితే సరస్వతీ ఆలయం దగ్గర ఉంటుంది అష్టభుజ కోనేరు. చక్కని సుందర నిర్మాణం. దగ్గరలోనే శిధిలమైన శ్రీ సరస్వతి ఆలయం మరియు శ్రీ చంద్రశేఖర ఆలయాలు ఉంటాయి.


అష్ట భుజ సరోవరం 


శ్రీ చంద్రశేఖర ఆలయం 

హంపిలో తప్పకుండా చూడవలసినది విజయ విఠలాలయం. తుంగభద్రా నదీ తీరంలో ఉంటుంది. అతి పెద్ద ప్రాంగణంలో పెద్ద ఆలయం. ఎన్నో మండపాలు ఉంటాయి. ఇక్కడికి మన వాహనాలను అనుమతించారు. బ్యాటరీ తో నడిచే వాహనంలో వెళ్ళాలి. వెళ్లి రావడానికి నలభై రూపాయలు. ఆలయ ప్రవేశానికి ముప్పై రూపాయలు మనిషికి చెల్లించాలి.
నడిచి కూడా వేళ్ళ వచ్చును. ఒకటిన్నర కిలోమీటరు ఉంటుంది.
అద్భుత శిల్పాలకు చిరునామా ఈ ఆలయం.
ఏకశిలా రధం ఇక్కడే ఉంటుంది. ఈ ఆలయాన్ని రెండవ దేవరాయలు నిర్మించాడు. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేశారు.
రంగ మండపంలో నెలకొల్పబడిన సంగీత స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను కూర్చేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మహామండపంలోని శిల్పాలు నాటి శిల్పుల నేర్పరితనాన్నిఈ నాటికీ చూపుతున్నాయి.
ఆలయం వెలుపల ఉన్న శిధిల మండపాలు ఒకప్పటి దుకాణాలుగా తెలుస్తోంది.
ప్రస్తుతం అన్నీ శిధిలాలు !


 


విఠల బజార్ 
సంగీత స్తంభాలు విజయ విఠల ఆలయం 

విజయ విఠల ఆలయం వెనుక శిధిలావస్థలో ఉన్న రెండు విష్ణు ఆలయాలు, తులాభారం ఉంటాయి. నదీ తీరాన పురంధరదాస  మండపం నిర్మించబడినది. 
kings balance గా పిలవబడే తులాభారం వెనక ఉన్న మట్టి దారిలో వెళితే అచ్యుతరాయ ఆలయంగా పిలవబడే శ్రీ కోదండరాముని ఆలయం, సుగ్రీవ గుహ వస్తాయి. ఈ గుహ లోనే సుగ్రీవుడు, సీతమ్మవారి నగలను దాచిపెట్టినది. 
ఈ మార్గం గుండా నడుచుకొంటూ ఎదురు బసవన్న మండపం మీదగా విరూపాక్ష బజార్ చేరుకోవచ్చును. 
తులాభారం (Kings balance)
విజయ విఠల ఆలయానికి తలారి గేటు దాటి వెళ్ళాలి. ఈ గేట్ ఒకప్పుడు సుంకం వసూలు కేంద్రం.  
హంపి లో ఇంకా ఎన్నో విశిష్ట నిర్మాణాలు ఉన్నాయి. కొన్ని నదికి ఆవలి పక్కన ఉన్న ఆనెగొంది లో ఉన్నాయి. 
ఉండటానికి తగిన వసతులు ఆవలి పక్క ఉన్న విరూప గద్దె లోనే దొరుకుతాయి. 
హంపికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న హొస్పెట్ రైల్వే స్టేషన్ కు దేశం లోని అన్ని ముఖ్య నగరాల నుండి రైళ్లు నడుస్తాయి. 
ప్రతి ఒక్కరు సందర్శించవలసిన స్థలం హంపి. వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Ganapavaram Temples

                            సూర్యుడు కొలిచే సువర్ణేశ్వరుడు   ఆలయ దర్శనం అనగానే అందరి దృష్టి తమిళనాడు లేదా కేరళ వైపుకు మళ్లుతుంది. ...