28, సెప్టెంబర్ 2016, బుధవారం

Sri Kanaka Durga Devi Temple, Vijayawada


                   శ్రీ కనకదుర్గ ఆలయం, ఇంద్రకీలాద్రీ, విజయవాడ  

అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని సమస్త భక్తలోకం ఎలుగెత్తి కీర్తించే తల్లి ఇంద్రకీలాద్రి మీద కొలువైన శ్రీ కనక దుర్గమ్మ !
యుగాల క్రిందట భక్తుని కోరిక మేరకు, శిష్టరక్షణార్ధం, దుష్ట శిక్షణార్ధం దుర్గమ్మ వెలసిన విజయవాడ, పక్కన గలగలా పారే కృష్ణమ్మ ఎన్నో పురాణ గాధలను తెలుపుతాయి.  





కీలుడనే పర్వత రాజు అమ్మవారి భక్తుడు. జగన్మాత తన హృదయ కుహరంలో కొలువు తీరాలన్నఏకైక కోరికతో తపస్సు చేసాడు. సంతుష్టురాలైన జగదాంబ సాక్షాత్కారం ప్రసాదించి తొందరలోనే కలియుగాంతం వరకు ఇక్కడ నివాసముంటానని  వరము అనుగ్రహించింది.
అనంతర కాలంలో లోకకంటకుడైన దుర్గమాసురుని సంహరించిన దేవి ఈ పర్వతం మీద స్వయంవ్యక్తగా ప్రకటితమయ్యారు. అసురుని భాధ తొలగిన ఆనందంతో ఇంద్రుడు మిగిలిన దేవతలతో కలిసి పవిత్ర కృష్ణవేణిలో స్నానమాచరించి దుర్గంబను సేవించుకొన్నారు.





ఈ కారణంగాపర్వతకుని పేరు  ప్రధమ పూజ చేసిన ఇంద్రుని పేరు కలిసి  ఈ శిఖరం "ఇంద్ర కీలాద్రి "గా  జగత్ప్రసిద్దం అయ్యింది. దుర్గాదేవి ఇక్కడ శుంభ నిశుంభులను అంతంచేయడం వలన ఈ క్షేత్రానికి జయవాడ అన్న పేరు వచ్చినది. 







పాండవ మధ్యముడైన పార్ధుడు ఇదే ప్రదేశంలో పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రం పొందినందున "ఫల్గుణ క్షేత్రం" అని "విజయపురి" అన్న నామాలను కూడా పొందినది. కాలక్రమంలో బెజవాడ గా మారి చివరకు విజయాలకు నిలయమైన విజయవాడగా  స్థిరపడినది.
అర్జనునితో పోరాటం సల్పిన పరమేశ్వరుని దేవతలు అమ్మవారితో పాటు ఇక్కడే కొలువు తీరమని అభ్యర్ధించారు. వారి కోరిక మేరకు లింగరూపంలో వెలసిన స్వామిని మల్లెలతో పూజించడం వలన శ్రీ మల్లిఖార్జును నిగా కైలాసనాధుడు భక్తులను అనుగ్రహిస్తున్నారు.






నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వేలాది భక్తుల ప్రార్థనలతో, పూజలతో కళకళలాడే శ్రీ కనక దుర్గమ్మ నివాసమైన ఇంద్రకీలాద్రి వైభోగం నవరాత్రులలో అంబరాన్ని అంటుతుంది.
శుక్ల పాడ్యమి నాడు హిమగిరి సుత  పార్వతి ని శైలపుత్రిగా, విదియనాడు బ్రహ్మచారిణిగా, తృతీయ నాడు చంద్ర ఘంట గా, చతుర్థి నాడు కూష్మాండ, పంచమినాడు స్కంద మాత, షష్టి నాడు కాత్యాయనిగా, సప్తమి తిధిన కాళరాత్రి, అష్టమి నాడు మహా గౌరీ, నవమినాడు సిద్ది దుర్గగా కొలువుతీరి జగన్మాతను నవదుర్గలుగా ఆరాధిస్తారు.  








దసరాలలో మొదటి రోజున శ్రీదుర్గ గా అలరించిన అమ్మ మలి రోజున శ్రీ బాలాత్రిపుర  సుందరిగా,మూడో రోజున శ్రీ గాయత్రి దేవిగా, నాలుగో రోజున శ్రీ అన్నపూర్ణా దేవిగా, అయిదో నాడు శ్రీ లలితా త్రిపుర సుందరిగా, ఆరో నాడు చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవిగా దర్శనం ప్రసాదిస్తుంది.
సకల సంపదలను ప్రసాదించే కల్పవల్లి శ్రీ లక్ష్మీ దేవిగా ఏడో నాడు శ్రీ దుర్గాదేవిగా ఎనిమిదో రోజున, లోకకంటకులను దురుమాడిన శ్రీ మహిషాసుర మర్దినిగా తొమ్మిదో రోజున , చివరి రోజు  అయిన దశమి నాడు  భక్తుల కొంగు బంగారమైన "అపరాజిత" గా  "శ్రీ రాజ రాజేశ్వరీ దేవి" రూపంలో భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తుంది.
దశ విధ రూపాలలో లోకపావని దర్శనార్ధం దేశం నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు విజయవాడ తరలివస్తారు.






నిత్యం ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతరాయంగా భక్తుల సౌలభ్యం కొరకు ఆలయం తెరిచే ఉంటుంది.
ఎన్నో పూజలు, అలంకారాలు, అర్చనలు శాస్త్ర ప్రకారం శ్రీ కనక దుర్గా సమేత  శ్రీ మల్లిఖార్జున స్వామికి జరుపుతారు.  అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
విజయవాడ కనకదుర్గమ్మ సందర్శనార్ధం వచ్చే వారికి అదనపు అదృష్టం కృష్ణా నదిలో స్నానం. భూలోకంలో ప్రజలు తమ పాపాలను ప్రక్షాళన చేసుకోడానికి శ్రీ మహావిష్ణువు కృష్ణా నదిని సృష్టించారు. కానీ ఆ నదిని ఎక్కడ ఉంచాలని అన్న ప్రశ్న తలెత్తినది. పవిత్రమైన జలప్రవాహము ఉత్క్రుష్టమైన  స్థలం నుండి ఆవిర్భవించడం ఉచితమని భావించిన దేవతలు స్థలాన్వేషణ ప్రారంభించారు.






అప్పుడు వారికి పర్వత రూపంలో శ్రీ హరి సాక్షాత్కారం అపేక్షిస్తూ తపస్సు చేస్తున్న సహ్య మహా ముని కనిపించారు. అంతట వైకుంఠ వాసుడు ఆయనకు దర్శనం అనుగ్రహించి పుణ్యప్రదమైన కృష్ణను ఆ పర్వతం నుండి ఆవిర్భవించ దానికి అనుమతిని అడిగారు. ఆనందభరితుడైన మహాముని ఆజ్ఞను శిరసావహించాడు.
అంతట గదాధరుడు శ్వేత అశ్వద్ధ రూపం ధరించారు. మహర్షి కోరిక మేరకు గంగాధరుడు ఆమ్ల వృక్షం గా వెలిసారు.
శ్వేతాశ్వద్ధ నుండి కృష ప్రవాహం, ఉసిరి చెట్టు నుండి వేణి ప్రవాహం ఉద్భవించి  రెండూ కలిసి కృష్ణవేణిగా మారి లోక సంరక్షనిగా భూమండలాన్ని సస్యశ్యామలం చేస్తోంది.
హరిహరులు నుండి ఆవిర్భవించిన కృష్ణవేణిలో స్నానం సకల పాపహరణం, ఆరోగ్యదాయకం, పుణ్యప్రదం.
ఈ నదిలో స్నానమాచరించి ఇంద్రకీలాద్రి మీద కొలువుతీరిన శ్రీ మల్లిఖార్జున స్వామిని శ్రీ  దుర్గమ్మను సేవించుకొంటే  ఇహపర సుఖాలను పొందగలరు  అన్నది పురాణ వాక్యం.




సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే  

శరణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...