27, జూన్ 2015, శనివారం

Thrikakkara Vamana Murthy Temple

                          శ్రీ వామన మూర్తి ఆలయం, త్రికక్కర 

చరా చర సృష్టిలోని జీవులను కాపాడటానికి వైకుంఠ వాసుడు ఎన్నో అవతారాలు ఎత్తారని మన పురాణాలు తెలుపుతున్నాయి.
నేడు మనందరం అత్యంత భక్తి భావాలతో ఆరాధించే రూపాలు శ్రీ రామ, శ్రీ కృష్ణ, శ్రీ నారసింహ, శ్రీ వెంకటేశ్వర మాత్రమే!
మిగిలిన అవతారాలకు అక్కడ ఆలయాలు ఉన్నాయి.
కానీ కేరళ వాసులు వామనావతారం పట్ల విశేష ఆదరణ భక్తి భావం చూపిస్తారు.
కారణం ఏమిటంటే వారి జాతీయ పర్వమైన "ఓనం " వామన మూర్తితో ముడిపడి ఉండటమే !
రాష్ట్రం నలుమూలలా ఎన్నో వామనావతార ఆలయాలు నెలకొల్పబడి ఉన్నాయి.
ఇక్కడొక విషయం ప్రస్థావించాలి. తమిళనాడులోని కంచి, తిరుక్కోవిలూర్ లాంటి దివ్య దేశాలలో కూడా వామన మూర్తి ఆలయాలున్నాయి.  కానీ అక్కడ కొలువైనది తన మూడు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించిన త్రివిక్రమ స్వామి.
మన రాష్ట్రంలో కూడా బాపట్ల సమీపంలోని "చెరుకూరు" గ్రామంలో కూడా ఒక పురాతన త్రివిక్రమ ఆలయం ఉన్నది.
వివరాలు ఈ బ్లాగ్ లో చూడవచ్చును.
కేరళ లోని ఆలయాలలో స్వామి చతుర్భుజాలతో స్థానక భంగిమలో దర్శనమిస్తారు.
వామన మూర్తి ఆలయాలలో "త్రి కక్కర" లో ఉన్నది విశేష పౌరాణిక మరియు చారిత్రిక నేపద్యం కలదిగా పెర్కొనబడుతున్నది.
శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా కూడా కీర్తించబడే త్రికక్కరకు సంబంధించిన పురాణ గాధ  కృత యుగానికి చెందినది.




విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని మనుమడైన "మహా బలి" ప్రజలను కన్నబిడ్డలా మాదిరి పాలిస్తూ సర్వధర్మాలను పాటిస్తూ రాజ్యమేలేవాడు.
తొంభై తొమ్మిది అశ్వ మేధ యాగాలు చేసిన చక్రవర్తి తన నూరో యాగం చేయ సంకల్పించాడు. 
ఈ నిర్ణయం ఇంద్రాది దేవతలను భయకంపితులను చేసింది. 
ఎందుకంటె శత అశ్వమేధ యాగాలు చేస్తే దేవేంద్ర పదవికి అర్హత లభిస్తుంది. 
జన్మతః అసురుడై నందున  బలి ఎంతటి ధార్మికుడైన, ప్రజా రంజకుడైన ఇంద్ర పదవి పొందానికి అనర్హుడు. 
దేవతలంతా కలిసి శ్రీ మహా విష్ణువును శరణు కోరారు. 
అభయమిచ్చిన ఆర్తత్రాణపరాయణుడు అదితి, కశ్యప దంపతులకు కుమారునిగా జన్మించారు.






ఉపనయాది వైదిక కార్యక్రమాలు పూర్తి చేసుకొని తీర్థ యాత్రలకు అంటూ బయలు దేరారు. 
అది ఒక సాకు మాత్రమే ! నేరుగా బలి చక్రవర్తి యాగం తలపెట్టిన స్థలానికి చేరుకొన్నారు. రాక్షస రాజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బ్రాహ్మణులు ఒక పక్కన వేచి ఉన్నారు. 





బాలకుడు తాను కూడా వెళ్లి వారితో పాటు నిలుచున్నాడు. కొంతసేపటి తరువాత వారి వద్దకు వచ్చిన చక్రవర్తి ఎవరు కోరిన దానిని వారికి దానమివ్వసాగాడు. చివరగా బాలుని వంతు వచ్చినది. యీమి కావాలో కోరుకోమన్న రాజుతో ముగ్ధమనోహరంగా నవ్వుతూ బాలకుడు "మూడు అడుగుల నెల!" అని బదులిచ్చాడు. 

ముద్దిలోలికే బ్రాహ్మణ వటువును చూసి ఆకర్షితుడైన బలి "నాయనా! మూడుఅడుగుల నేలతో ఏమి సాధిస్తావు !
కోరుకోవడం కూడా తెలియని చిన్నవాడవు ఈ ధనాన్ని తీసుకో !" అని పలికాడు. 
"నాకు మూడు అడుగుల నెల తప్ప మరేమీ వలదు. ఇవ్వలేకపోతే చెప్పు రాజా! తిరిగి వెల్లిపోతా!" మొండిగా తెలిపాడు బాలుడు. 
వేరే దారి లేక అతని కోరికకు సమ్మతించిన రాజు దానానికి తగిన ఏర్పాట్లు చేయమని చెప్పాడు. 
ఈ లోపల బాలుడు సామాన్యుడు కాదని అర్ధం చేసుకొన్నరాక్షస గురువు శుక్రాచార్యుడు దాననిమితం అర్ఘ్యం వదిలే కమండలం లోనికి సూక్ష్మ రూపంలో ప్రవేశించి జలదారకు అడ్డం పడ్డాడు. 
వామనుడు దర్భ పుల్లతో చిన్నగా పొడవగా ఒక కంటి దృష్టిని కోల్పోయాడు శుక్రాచార్యుడు. 





బలి నుండి దానం స్వీకరించిన వామనుడు వటుడు ఇంతింతై అన్నట్లుగా పెరిగిపోయి ఒక పాదంతో భూగోళాన్ని, మరో పాదంతో గగన భాగాన్ని ఆక్రమించుకొన్నారు. తన లోకాన్ని తాకిన పాదాన్ని బ్రహ్మ కడుగగా దేవతలు పుష్ప వర్షం కురిపించారు. 

ముల్లోకాలు ఆక్రమించి, మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడిగిన విశ్యవ్యాప రూపుడు ఎవరో గ్రహించిన మహా బలి చేతులెత్తి నమస్కరిస్తూ వినమ్రంగా తన తల చూపాడు. 
మూడో అడుగును అతని తల మీద ఉంచి పాతాళానికి పంపారు. 




ఈ సంఘటన జరిగింది త్రికక్కర లోనే అని  స్థల పురాణం తెలుపుతోంది. సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను చూసేందుకు అనుమతి కోరిన చక్రవర్తి అనుగ్రహించి, దేవతల, మునుల కోరిక మేరకు ఇక్కడే స్థిర నివాసము ఏర్పరచుకొన్నారు . 

తానూ కోరుకొన్న కోరిక ప్రకారం మహా బలి భూలోకానికి వచ్చే సమయంలో కేరళీయులు తమ రాజుకు ఆనందం కలిగించాలని రాగావల్లులతో, వివిధ ఆట పాటలతో, పూజలతో పది రోజుల పాటు జరుపుకోనేదే "ఓనం". 
ఓనం పుట్టుకకు కారణమైన త్రికక్కరలోనే గతంలో సంబరాలు జరిగేవి. 
గతంలో స్థానిక పాలకులంతా కోచిన్ చక్రవర్తి ఆధ్వర్యంలో తమ ప్రజలతో సహా తరలి వచ్చిపదిరోజులు ఇక్కడే వుండి ఓనం జరుపుకొనే వారట. 
కానీ పంటలు, ఇల్లు అన్నింటినీ వదులుకొని రావడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్ధం చేసుకొన్న రాజు ఎక్కడి వారు అక్కడే తమ తమ గ్రామాలలో పండుగ జరుపుకోవచ్చునని ప్రకటించారు. 
అప్పటి నుండి ఓనం సంబరాలు రాష్ట్రమంతటా వేల్లివిరవసాగాయి. 
ఆ పది రోజులూ కేరళ సౌందర్యానికి కొత్త సొబగులు అడ్డుతాయి. 
గతంలో మాదిరి ఓనం సంబరాలు జరగక పోయినా త్రికక్కర ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు.   
నేటికీ అదే ప్రాముఖ్యత కలిగి వుంది. 





 కొచ్చిన్ పట్టణానికి పడమర పక్కన ఉన్న శివారు ప్రాంతమైన "త్రి పునిత్తూర" ఒకప్పుడు కొచ్చిన్ రాజుల రాజధాని. అక్కడ వారి రాజ భవనం ఉన్నది. ఓనం తొలిరోజున ఇక్కడి శ్రీ పూర్ణ త్రేయేశ స్వామి కి ప్రత్యేక పూజలు చేసి సంబరాలను ఆరంభిస్తారు. 

"ఆత చమయం" గా పిలిచే ఈ ఉత్సవ సంబరాలు నృత్య గానడులతో, గజ తురగ సముదాయంతో రంగ రంగ వైభవంగా సాగి త్రికక్కర చేరుతుంది. శ్రీ వామన మూర్తికి విశేష పూజలు జరిగిన తరువాత ఓనం సంబరాలు అధికారికంగా ఆరంభం అవుతాయి. 
సువిశాల ప్రాంగణంలో స్థానిక నిర్మాణ శైలిలో ఉండే ఈ ఆలయంలో సుందర శిల్పాలు విరాట్ నిర్మాణాలు కనిపించవు. తూర్పున స్వాగత ద్వారం గుండా లోనికి ప్రవేశిస్తే ఎత్తైన మండపం పక్కనే చిన్న ఉపాలయం కనిపిస్తాయి. 





ఒక ఉప ఆలయంలో ఉండేది "బ్రహ్మ రాక్షస ". దీని వెనుక ఒక నిరపరాధి హృదయ వేదన తెలిపే గాధ ఉన్నది. చాలా సంవత్సరాల క్రిందట ఇక్కడ నివసించే రైతు ఒకరు తన పొలంలో నాటిన అరటి తోట అధిక ఫల సాయం ఇస్తే స్వామికి బంగారు అరటిపళ్ళ గెల సమర్పించుకొంటానని మొక్కుకోన్నాడు. 

దేవదేవుని ఆశీర్వాదంతో పంట విపారీతంగా పండటమే కాక అధిక ధనం కూడా లభించినది రైతుకు. 

మొక్కుకొన్న ప్రకారం సువర్ణ ఫల గెల తెచ్చి పూజారికి అప్పగించాడు రైతు.
బయటికి వెళ్ళే హడావుడిలో పూజారి గెలను తీసుకొని వెళ్ళిపోయాడు. 
తిరిగి వచ్చిన తరువాత ఆలోచిస్తే గెల ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ పెట్టినదీ గుర్తుకు రాలేదు. 
రైతు గెల ఇచ్చిన సమయంలో ఒక సాధువు తప్ప మరెవరో లేరు. 
అంతే సాధువె దొంగ అని నిర్ణయించుకొని రాజుకు ఫిర్యాదు చేసాడు. 
ఆధారాల ఆధారంగా రాజు సాధువుని శిక్షించాడు. 
మరునాటి ఉదయం స్వామికి అభిషేకం జరిగిన తరువాత జలం బయటికి పోకపోవడంతో పూజారి గోముఖిలో ఏమన్నా అడ్డుపడినది ఏమో అని చెయ్యే పెట్టగ పోయింది అనుకొన్న కనకపు  కదళీ ఫల గెల. 
తన తప్పుకు చింతించిన పూజారి పరుగు పరుగున రాజభవనానికి చేరుకొని రాజుకు సంగతి తెలియపరచాడు. 
 అప్పటికే జరగవలసిన ఘోరం జరిగిపోయింది. 
సాధువు   అన్యాయంగా తనకు విధించిన శిక్షకు వగచి ఆ అవమానంతో త్రికక్కర పూర్తిగా నాశనం అయిపోవాలని శపించి ఆత్మహత్య చేసుకొన్నాడు. 
ఆయువు తీరకుండా మరనిన్చినందున అతడు బ్రహ్మ రాక్షసునిగా మారి ప్రాంత వాసులను భయభ్రాంతులకు గురిచేయసాగాడు. 
క్రమంగా త్రికక్కర తన మునుపటి ప్రాభవాన్ని కోల్పోసాగింది. 
కలవరపడిన రాజు జోతిష్కులను సంప్రదించి బ్రహ్మ రాక్షసునికి ఈ ఆలయం నిర్మించారు. 
నేటికీ ప్రతినిత్యం మూలవిరాట్టుకు సమర్పించిన తరువాత ఆ నైవేద్యాన్ని బ్రహ్మ రాక్షసునికి సమర్పించడం ఆనవాయితి.






 


ప్రధాన ఆలయం లోనికి వెళితే వర్తులాకార శ్రీ కోవెలలో స్థానక భంగిమలో చతుర్భుజాలతో త్రికక్కరప్పన్ గా భక్తులు ప్రేమగా పిలుచుకొనే  శ్రీ వామన మూర్తి చందన పుష్ప స్వర్నాభారణ అలంకరణలో నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. 

గర్భాలయానికి నలుమూలలా ఉన్న ఉపాలయాలలొ శ్రీ ధర్మశాస్త , శ్రీ కృష్ణ, శ్రీ భగవతి, శ్రీ నాగరాజు కోలువైవుంటారు. 
ఉదయం నాలుగున్నర నుండి పదకొండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో నిత్యం నియమంగా అయిదు పూజలు, అభిషేకాలు, అలంకరణలు జరుపుతారు. 
ప్రాంగణంలోనే ఉన్న కపిల తీర్ధం నీటినే అన్ని కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. 
పన్నెండు మంది శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ప్రముఖుడైన నమ్మాళ్వార్ శ్రీ వామన మూర్తి గురించి రమ్యమైన పాశురాలు గానం చేసారు.కేరళలో ఉన్న పదకొండు శ్రీ వైశానవ దివ్య దేశాలలో త్రికక్కర ఒకటి. 
ఓనం రోజులలో త్రికక్కర నూతన శోభను సంతరించుకొంటుంది. 







ప్రధాన ఆలయం లోనికి వెళితే వర్తులాకార శ్రీ కోవెలలో స్థానక భంగిమలో చతుర్భుజాలతో త్రికక్కరప్పన్ గా భక్తులు ప్రేమగా పిలుచుకొనే  శ్రీ వామన మూర్తి చందన పుష్ప స్వర్నాభారణ అలంకరణలో నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. 

గర్భాలయానికి నలుమూలలా ఉన్న ఉపాలయాలలొ శ్రీ ధర్మశాస్త , శ్రీ కృష్ణ, శ్రీ భగవతి, శ్రీ నాగరాజు కోలువైవుంటారు. 
ఉదయం నాలుగున్నర నుండి పదకొండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో నిత్యం నియమంగా అయిదు పూజలు, అభిషేకాలు, అలంకరణలు జరుపుతారు. 
ప్రాంగణంలోనే ఉన్న కపిల తీర్ధం నీటినే అన్ని కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. 
పన్నెండు మంది శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ప్రముఖుడైన నమ్మాళ్వార్ శ్రీ వామన మూర్తి గురించి రమ్యమైన పాశురాలు గానం చేసారు.కేరళలో ఉన్న పదకొండు శ్రీ వైశానవ దివ్య దేశాలలో త్రికక్కర ఒకటి. 


ఓనం రోజులలో త్రికక్కర నూతన శోభను సంతరించుకొంటుంది. 








శివ కేశవ క్షేత్రమైన త్రికక్కరలో అన్ని హిందూ పర్వదినాలలో భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ఉత్సవాలలోభక్తి శ్రద్దలతో పాల్గొంటారు.  శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ నమ్మాళ్వార్ శ్రీ త్రికక్కరప్పను కీర్తిస్తూ పాశురాలను గానం చేయడం వలన ఈ క్షేత్రం శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్యదేశాలలో శాశ్విత స్థానం సముపార్జించుకొన్నది.  

వామనావతారానికి ఉన్న అతి తక్కువ ఆలయాలలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ విశేష క్షేత్రం కొచ్చి నగరానికి చేరువలో ఉన్న ఎడపల్లి కి దగ్గరలో ఉన్నది ఎర్నాకుళం  జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి టౌన్ (నార్త్) స్టేషన్ నుండి "లులు మాల్"దాకా సిటీ బస్సులో వెళ్లి అక్కడ నుండి సులభంగా ఆలయానికి చేరుకోవచ్చును. 

జై శ్రీమన్నారాయణ !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...