ఆది అన్నామలై ఆలయం - తిరువణ్ణామలై
తిరువన్నామలై ఆధ్యాత్మిక వాదుల అంతిమ గమ్యం.
ఎందరో సామాన్యులను సాధకులనుగా మార్చిన మహోన్నత క్షేత్రం.
శ్రీ రమణ మహర్షి, శ్రీ శేషాద్రి స్వామి లాంటి మార్గదర్శకులు నడయాడిన దివ్య క్షేత్రం.
అరుణాచలం, అరుణ గిరి, అన్నామలై గా పిలవబడే పర్వత రాజమే పరమాత్మ.
సదాశివుని శిలా రూపమే ఈ శైలం.
ఈ పవిత్ర పర్వత పాదాల చుట్టూ ఎన్న ఆలయాలు, మఠాలు, ఆశ్రమాలు నెలకొల్పబడ్డాయి.
గిరికి తూర్పున ఉన్న ప్రధాన ఆలయంలో శ్రీ అన్నామలై స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు.
వివిధ రాజ వంశాల అధ్వర్యంలో క్రీస్తు శకం ఏడో శతాబ్దం నుండి పదిహేనో శతాబ్దం దాక ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి.
కానీ ఈ ఆలయం కన్నా పురాతనమైన ఆలయం మరొకటి ఇక్కడ ఉన్నది.
అదే "ఆది అన్నామలై ఆలయం"
అరుణ గిరికి వెనుక అంటే పడమర భాగంలో గిరి వలయంలో ఉన్న ఈ ఆలయం క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దానికి ముందే నిర్మించినట్లుగా తెలుస్తోంది.
ఆలయం ఉన్న గ్రామం పేరు కూడా ఆది ఆన్నామలై కావడం విశేషం.
అరుణాచలానికి ఎదురుగా తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం ప్రధాన ఆలయం తో పోలిస్తే చాలా చిన్నది.
సుమారు ఒక ఎకరా స్థలంలో ఉన్న ఈ ఆలయానికి తూర్పున మూడు అంతస్తుల రాజ గోపురం ఉంటుంది.
రాజ గోపురం పైన వర్ణమయ శివలీల శిల్పాలు సుందరంగా ఉంటాయి.
నలువైపులా ఎత్తైన ప్రహరీ గోడ నిర్మించారు.
ప్రాంగణంలో ప్రహరీ గోడకు మూడు వైపులా విశాల మండపాలు నిర్మించారు.
ముఖ మండపానికి ఇరుపక్కలా ఒక వైపు శ్రీ గణపతి, మరో వైపు శ్రీ కుమార స్వామి ఉపాలయాలలొ కొలువుతీరి ఉంటారు.
ముఖ మండప స్తంభాల అమరిక, వాటి మీద ఉన్న శిల్పాలు ఆకట్టుకొంటాయి.
కొంచెం ఎత్తులో ఉన్న గర్భాలయంలో లింగ రూపంలో శ్రీ ఆది అన్నామలై స్వామి రమణీయ పుష్పాలంకరణలో నేత్ర పర్వంగా దర్శనమిస్తారు.
తమిళనాడు లోని శివాలయాలలో పుష్పాలతో లింగ రాజుకి చేసే అలంకరణ అద్భుతంగా ఉంటుంది.
వివిధ వర్ణ పుష్పాలతో చేసే అలంకరణ భక్తుల మనస్సులలో చెరగని ఆధ్యాత్మిక భావాలను నెలకొల్పుతుంది.
శ్రీ ఆది అన్నామలై స్వామి స్వయంభూ గా ఇక్కడ వెలిసారని తెలిపే స్థల పురాణం యుగాల నాటిది.
దేవలోకంలో ఉన్న అప్సరసలలో ఒకరు తిలోత్తమ.
అపురూప సౌందర్య రాశి.
విధాత బ్రహ్మ దేవుడు ఒక బలహీన క్షణంలో తాను సృష్టించిన తిలోత్తమ అందానికి మోహితుడై పావురం రూపంలో ఆమెను వెంట పడ్డారట.
తనను సృష్టించిన వాడే వెంటపడే సరికి బెదరిన తిలోత్తమ పరమేశ్వరుని శరణు కోరిందట.
ఆయన వేటగాడి రూపంలో బ్రహ్మ దేవుని అడ్డగించి, మోహవిముక్తిని చేసారట.
తను చేసిన అనుచిత చర్యకు భాద పడిన పద్మ సంభవుడు ఆ పాపానికి నివృత్తిగా అక్కడ ఒక లింగాన్ని స్థాపించారట. అదే ఆది ఆన్నామలై స్వామి.
అన్నామలై గా రుద్రుడు సాక్షాత్కరించడానికి ముందే ఈ సంఘటన జరిగినట్లుగా చెబుతారు.
అందుకే స్వామికి ఆది అన్నామలై అన్న పెరోచ్చినది.
పక్కనే ఉన్న మరో ఉపాలయంలో శ్రీ ఉన్నామలై అమ్మవారు కొలువుతీరి భక్తుల సేవలను స్వీకరిస్తుంటారు. ప్రతినిత్యం గిరి వలయం చేసే భక్తులతో ఆలయం కళ కళలాడుతుంటుంది.
నిత్యం విశేష అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు కొలువైన అందరు దేవీ దేవతలకు జరుపుతారు.
మాస శివ రాత్రికి, త్రయోదశి నాడు జరిగే ప్రదోష పూజలలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు .
కార్తీక మాసంలో, మహా శివరాత్రికి ఉత్సవాలు, స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు.
తన గిరి ప్రదక్షిణ సమయంలో ఎన్నో రోజులు ఇక్కడ విడిది చేసిన శ్రీ రమణ మహర్షి ఈ ఆలయం గురించి రెండు అద్భుత విషయాలు తెలిపారు.
1918 వ సంవత్సరంలో ఆలయ మరమత్తులు చేస్తున్న సమయంలో ప్రాంగణ తూర్పు భాగంలో పెద్ద గుహ ఒకటి బయల్పడినది. మరో సారి అంటే 1949లో గర్భాలయంలో మరో గుహ వెలుగు చూసింది.
ఆలయ నిర్వాహకులు ఈ విషయం గురించి రమణులను సంప్రదించగా "ఈ గుహా మార్గము గుండా మునులు, యోగులు, సిద్దులు రాత్రి సమయంలో వచ్చి శ్రీ ఆది అన్నామలై స్వామిని సేవించు కొంటారు. కనుక వాటిని మూసి వేయవలసినది " అని మహర్షి తెలిపారు.
గిరి ప్రదక్షిణలో అరుణాచలం ఒక్కో చోట ఒక్కో విధంగా దర్శనమిస్తుంది. ఈ విషయం గిరి వలయం చేసే భక్తులకు అనుభవమే !
ఆది అన్నామలై ఆలయం నుండి లభించే దర్శనం "శివ యోగ ముఖ దర్శనం".
తొలిసారిగా ఈ దర్శనాన్ని పొందిన వారు "తిరుమూలర్" అనే సిద్ద యోగి.
ఈ ఆలయాన్ని సందర్శించి, అరుణ గిరికి మొక్కితే ఈ సిద్దుని ఆశీస్సులతో ఇహపర సుఖాలను పొందవచ్చునని శ్రీ రమణులు తెలిపినట్లుగా తెలుస్తోంది.
గిరి వలయం చేసే ప్రతి వక్కరూ తప్పక సందర్శించవలసినది శ్రీ ఆది అన్నామలై స్వామి ఆలయం.
ముఖ మండప స్తంభాల అమరిక, వాటి మీద ఉన్న శిల్పాలు ఆకట్టుకొంటాయి.
అన్నామలై గా రుద్రుడు సాక్షాత్కరించడానికి ముందే ఈ సంఘటన జరిగినట్లుగా చెబుతారు.
తన గిరి ప్రదక్షిణ సమయంలో ఎన్నో రోజులు ఇక్కడ విడిది చేసిన శ్రీ రమణ మహర్షి ఈ ఆలయం గురించి రెండు అద్భుత విషయాలు తెలిపారు.
గిరి ప్రదక్షిణలో అరుణాచలం ఒక్కో చోట ఒక్కో విధంగా దర్శనమిస్తుంది. ఈ విషయం గిరి వలయం చేసే భక్తులకు అనుభవమే !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి