1, మే 2015, శుక్రవారం

Arasavalli

                    శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, అరసవల్లి 

ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం శ్రీకాకుళం పట్టణానికి అత్యంత చేరువలోని అరసవల్లి గ్రామంలో కలదు. 
మన రాష్ట్రంలో ఉన్న నాలుగు పురాతన సూర్య దేవాలయాలలో అత్యంత పురాతనమైనది అరసవల్లి ఆలయమే !
నందికొట్కూరు మరియు బుదగవి ఆలయాల సమాచారం ఈ బ్లాగ్ లో ఉన్నది. 
గొల్లల మామిడాడ లోని ఆలయ విశేషాలు సేకరించాల్సివున్నది. 


శ్రీ సూర్యనారాయణ స్వామి ఇక్కడ కొలువుతీరడం వెనక ఉన్నగాధ వేదకాలం నాటిది. 
ఒక నాడు  దేవేంద్రుడు సర్వేశ్వర దర్శనార్ధం కైలాసం వచ్చారట. ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారట. ఇంద్రుణ్ణి అన్న అహంతో లోనికి ప్రవేశించబోగా నందీశ్వరుడు అడ్డగించారట. 
అప్పుడు జరిగిన తోపులాటలో నంది మహేంద్రుని చాతీ మీద బలంగా మొదారట. 
ఆ దెబ్బకు స్పృహ కోల్పోయి చాలా సేపటికి మేల్కొన్న శచీ పతి శరీర భాధలకు నివారణ శ్రీ సూర్య ఆరాధనే తరుణోపాయం అన్న విషయం గ్రహించి విగ్రహాన్ని ప్రతిష్టించి, పుష్కరణి తవ్వించారట.  అందులో స్నానం ఆచరించి స్వామిని కొలిచి శరీర భాదల నుండి విముక్తి పొందారట. 
ఈ కారణంగా కోనేరును "ఇంద్ర పుష్కరణి " అని పిలుస్తారు.   
దీనిలో శుచిగా తయారయ్యి స్వామిని ఆరాధిస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుంది అన్నది భక్తుల నమ్మకం. 
ముఖ్యంగా నేత్ర సంబంధిత వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. 
ఆరోగ్యం సిద్దించిన భక్తులు స్వామి వారికి కృతజ్ఞతా పూర్వకంగా వెండి లేదా బంగారం తో చేసిన రూపులను సమర్పించుకొంటారు. అలా నాడు దేవేంద్రుడు ప్రతిష్టించిన స్వామికి నేటి ఒడిషా రాష్ట్రాన్ని పదునాలుగు వందల సంవత్సరాల క్రిందట పాలించిన కళింగ రాజులు కట్టించినట్లుగా లభించిన శాసనాల ఆధారంగా తెలుస్తోంది. ఇక్కడ లభించిన పాళీ భాషా శాసనాలు నాలుగు నుండి పదునాలుగో శతాబ్దాల కాలానికి చెందినవిగా చరిత్ర కారులు నిర్ధారించారు. 
కళింగ రాజులు నిర్మించి పోషించిన ఆలయం పదిహేడో శతాబ్దం వరకూ ఉచ్చ స్థితిలో ఉండేది. 
తరువాత ఈ ప్రాంతం నైజాం నవాబు పాలన లోనికి వెళ్ళడంతో ఆలయ ప్రాబల్యం క్షీణించడం ప్రారంభం అయ్యింది. 
నైజాం నవాబు సుబేదారుగా ఉండిన షేర్ మహ్మద్ ఖాన్ అనేక హిందూ ఆలయాలను ధ్వంసం చేసాడని అతని పర్షియన్ భాష శాసనం ద్వారా అవగతమవుతుంది.  


అతడు అరసవల్లి ఆలయాన్ని నాశనం చేయాలని బయలుదేరాడన్న సమాచారంతో స్థానికులు మూల విరాట్టును బావిలో దాచిపెట్టారట. 
చరిత్రను పరిశోధించిన భక్తులు నూట యాభై సంవత్సరాల క్రిందట నూతిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి మూర్తిని వెలికి తీసి, పాడుబడిన ఆలయానికి మర్మత్తులు చేసారని తెలుస్తోంది. 


అలా తిరిగి ఆలయంలో కొలువు తీరిన శ్రీ సూర్యనారాయణ స్వామి భక్తుల సేవలందుకొంటున్నారు. 
గత రెండు దశాబ్దాలలో ఆలయం ఎంతో అభివృద్ధి చెందినది. 
పంచాయతన విధానంలో ఉండే ఈ ఆలయంలో గార్భాలయానికి నలుదిక్కులా శ్రీ గణేశ, శ్రీ పార్వతి, శివ మరియూ విష్ణు మూర్తి ఉపాలయాలుంటాయి. 

మరో విశేషమేమిటంటే సంవత్సరంలో రెండు సార్లు (ఉత్తరాయణం మరియు దక్షిణాయనంలో) అంటే మార్చి మరియు సెప్టెంబర్ నెలల లోని తొమ్మిదో తారీకు నుండి పన్నెండో తారీకు వరకూ మూడు రోజుల పాటు ఉదయం ఆరు గంటల నుండి ఇరవై నిముషాల పాటు సూర్య కిరణాలు నేరుగా మూల విరాట్టును తాకుతాయి. తన బంగారు కాంతులతో తన రూపాన్ని దేదీప్యమానంగా ప్రకాశింప చేసి భక్తులకు అద్భుత దర్శనాన్ని ప్రసాదిస్తారు ప్రత్యక్ష నారాయణుడు.  గర్భాలయంలో ఏకశిల మీద రెండు చేతులతో పద్మాలను ధరించిన దివాకరునికి పక్కన భార్య లైన ఉష, చాయ, పద్మిని తో పాటు క్రింద ద్వార పాలకులైన మథర మరియు పింగళ ఉంటారు. 
పైన ఛత్రాలు పట్టుకొని మహర్షులైన సనక సనందనులుంటారు. 
పీఠ భాగాన గాయత్రీ, బృహతి, ఉష్ణిక్, జగతి, ద్రుశ్తుప్, అనుష్తుప్ మరియు భక్తి అనే సప్తాశ్వాలు పూన్చిన రధానికి "అనూపుడు : సారధిగా ఉంటారు. 
చక్కని పుష్ప స్వర్ణ ఆభరణాల అలంకరణలో స్వామి నయనమనోహరంగా కనిపిస్తారు.  

క్షేత్ర పాలకుడు శ్రీ సర్వేశ్వరుడు. 
పక్కనే ఉన్న మరో ఆలయంలో పెద్ద లింగరూపంలో కైలాసనాధుదు భక్తుల అభిషేకాలు స్వీకరిస్తారు. 
చక్కని నవగ్రహ మండపం ఏర్పాటు చేయబడినది. 
ఆలయం వెలుపల లభించిన శిలా శాసనాలను చక్కగా అమర్చారు,
అన్నప్రసాద మండపం, సూర్య నమస్కార మండపం ఆలయానికి ఎదురుగా ఏర్పాటు చేసారు.
పుష్కరాని ఒడ్డున కేశ ఖండన శాల, గోశాల ఉంటాయి.అన్ని హిందూ పర్వదినాలు సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు.
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది వరకూ తెరిచి ఉండే ఆలయంలో ఎన్నో పూజలు, అభిషేకాలు అలంకరనలూ నియమంగా జరుపుతారు.  

అరసవల్లి ఆలయంలో అత్యంత ముఖ్యమైన పర్వదినం "రధ సప్తమి".
ఆరోజున విశేష అభిషేకాలు, పూజలు, అలంకరణలు స్వామికి చేస్తారు.
ఆ ఒక్క రోజున భక్తులకు స్వామి నిజ రూప సందర్శనా భాగ్యం లభిస్తుంది.
లక్షలాదిగా భక్తులు మన రాష్ట్రం నుండే కాకుండా పక్కన ఉన్న ఒడిష, పక్షిమ బెంగాల్ మరియు ఛత్తీస్ ఘర్ ల నుండి తరలి వస్తారు.
శ్రీకాకుళం పట్టణంలో అందుబాటు ధరలలో అన్ని సౌకర్యాలు లభిస్తాయి. 

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం

తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం !!!!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Ganapavaram Temples

                            సూర్యుడు కొలిచే సువర్ణేశ్వరుడు   ఆలయ దర్శనం అనగానే అందరి దృష్టి తమిళనాడు లేదా కేరళ వైపుకు మళ్లుతుంది. ...