22, నవంబర్ 2014, శనివారం

Sri Talpagiri Ranganatha Swamy Temple, Nellore



                    తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు 

లోక రక్షకుడైన శ్రీ హరి స్వయం భూ గా కొలువుతీరిన అనేక క్షేత్రాలలో నెల్లూరు పట్టణం లో పెన్నానది తీరంలో ఉన్న తల్పగిరి ఉత్తర శ్రీ రంగం గా ప్రసిద్ది చెందినది.
ఆది శేషువు శ్రీ మహా విష్ణువు ఆనతి మేరకు భూలోకంలో పవిత్ర పెన్నా నదీ తీరంలో గిరిగా నిలవగా స్వామి విశ్రాంతి తీసుకొంటున్నారు అన్న కారణం గా "తల్ప గిరి " అన్న పేరు వచ్చినట్లుగా స్థానిక గాధల ఆధారంగా తెలుస్తోంది. 
లభించిన ఆధారాల ప్రకారం ఏడో శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవ రాజులు తొలి ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 
పన్నెండవ శతాబ్దంలో చోళులు తమ అధీనం లోనికి తెచ్చుకొని  పాత నిర్మాణాలు పునః నిర్మించి,  నూతన నిర్మాణాలు జరిపి  అబివృద్ది  చేసినట్లుగా స్థానిక చరిత్రలో అభివర్ణించబడినది. 
అరుదైన ప్రత్యేకతలు గల క్షెత్రమిది. 


రెండువందల సంవత్సరాల క్రిందట స్థానిక భక్తులు తూర్పు దిశలో నిర్మించిన ఏడు అంతస్థుల రాజ గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ప్రవేశ ద్వారం పైన నారద తుంబుర గానం వింటూ శేష తల్పం పైన సేద తీరుతున్న శ్రీ శేష శయనుడు ఉంటారు. 
ఆలయ రెండో ప్రకార గోడల పైన శంకు చక్ర తిరునామాలు పైన సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామ చంద్ర మరియు రుక్మిణి సత్య సమేత శ్రీ కృష్ణ రూపాలను చక్కగా మలచారు. 










ప్రధాన ఆలయం పడమర దిశగా ఉండగా లోపలి దక్షిణ ద్వారం గుండా వెళ్ళాలి.
ఈ ద్వారానికి ఇరువైపులా జయ విజయులు, పైన శ్రీ దేవి భూ దేవి సహిత శ్రీ మన్నారాయణ విగ్రహాలను సుందరంగా చెక్కారు.


ఇక్కడే శ్రీ రంగ నాయకీ అమ్మవారి ఆలయం తూర్పు దిశగా ఉంటుంది.

గర్భాలయంలో శ్రీ రంగనాథ స్వామి శయన భంగిమలో సర్వాంగ సుందర అలంకరణతో నయన మనోహరంగా దర్శనమిస్తారు.
ఇక్కడ ఒక ప్రత్యేకత గమనించాలి.
తూర్పు దిశగా చూస్తూ  కుడి చేతి మీద ఉత్తర దిశగా తల పెట్టుకొని కనపడే స్వామి ఇక్కడ ఎడమ చేతి మీద ఉత్తర దిశగా తల పెట్టుకొని పడమర దిశను చూస్తుంటారు.
ఇలాంటి  ప్రత్యేకత కంచి లోని "యదోత్కారి పెరుమాళ్ "( విన్నసైద పెరుమాళ్ ) ఆలయంలో కనపడుతుంది.

స్వామి దర్శనం తరువాత పడమర లో ద్వజస్థంభం బాలి పీఠంతో పాటు శ్రీ గణపతి ఉంటారు.
చిన్న పురాతన గోపురం నది వైపుకు దారి తీస్తుంది.
నదీ తీరంలో మహా భారతాన్నితెలుగులో రచించిన  కవిత్రయంలో ఒకరైన తిక్కన సోమయాజి విగ్రహం ఉంటుంది.





దక్షిణాన నూతనంగా నిర్మించ బడిన ఆలయం లో కలియుగ వరదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మనోహరంగా'దర్శనమిస్తారు.


ఉత్తరాన వైకుంఠ ద్వారం, శ్రీ ఆండాళ్ సన్నిధి ఉంటాయి.




నిత్యం ఎన్నో పూజలతో సంపూర్ణ విశ్వాసంతో తరలి వచ్చే భక్తులతో నిత్య తోరణం పచ్చ కళ్యాణంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుకొని ఉంటుంది తల్పగిరి ఆలయం.
మార్చి -ఏప్రిల్ ( చైత్ర మాసం )మధ్య కాలంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు.



అనేక తెలుగు మరియు పురాతన శాసనాలలో పేర్కొనబడిన తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయం నెల్లూరు పట్టణంలో రైల్వే స్టేషన్ కు మరియు బస్సు స్టాండ్ కు సమదూరంలో ఉండి దేశం నలుమూలల నుండి దశాబ్దాలుగా భక్తులను ఆకర్షిస్తోంది.
ఆంద్ర ప్రదేశ్ లో తప్పని సరిగా సందర్శించవలసిన ఆలయాలలో ఇదొకటి.
జై శ్రీ మన్నారాయణ !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...