పక్కిల్ శ్రీ ధర్మ శాస్త ఆలయం
శ్రీ ధర్మశాస్త సంప్రదాయము, ఆరాధనకు కేంద్రమైన కేరళలోని వివిధ ప్రాంతాలలో మొత్తం నూట ఎనిమిది శాస్త ఆలయాలు నెలకొల్పబడినాయి. అన్నింటినీ శ్రీ పరశురాముడు ప్రతిష్టించినట్లుగా పురాణ గాధలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా ఈ క్షేత్రాలన్నీ ఎంతో పౌరాణిక చారిత్రక ప్రాధాన్యత కలిగినవి. వీటిల్లో కొన్ని చోట్ల స్వామి తన యోగముద్ర భంగిమలో కాకుండా ఇతర భంగిమలలో కొలువై ఉంటారు.
అసలు దేవతల స్వస్థలంగా పిలవబడే కేరళను సృష్టించిన పరశురాముడు స్వయంగా ప్రతిష్టించి స్థాపించిన శ్రీ ధర్మశాస్త ఆలయాలు ఎనిమిది మాత్రమే అని కొందరు అంటారు. ఆ ఎనిమిది క్షేత్రాలలో కొట్టాయం కు చేరువలో ఉన్న పక్కిల్ గ్రామంలో ఉన్న ఆలయం ఒకటిగా పేర్కొనబడినది. శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన శ్రీ పరశురాముడు శ్రీ ధర్మశాస్తాను క్షేత్ర రక్షకునిగా నియమించారట.
అందుకనే కేరళ లోని అన్ని ఆలయాలలో శ్రీ ధర్మశాస్త ఉపాలయంలో దర్శనమిస్తారు. మహిళలు ఈ ఉపాలయాలలోని స్వామిని దర్శించుకొనవచ్చును. కానీ ముఖ్యమైన క్షేత్రాలైన
శబరిమల, అరియంగావు, అచ్ఛంకోవిల్, కులత్తపుల, శాస్తంకొట్ట లలో పది నుండి యాభై సంవత్సరాల మహిళలకు ప్రవేశం లభించదు.
కానీ పక్కిల్ ఆలయం లోనికి స్త్రీలను ఎలాంటి అభ్యంతరం లేకుండా అనుమతిస్తారు.
అందుకనే సుందర ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికత సంపూర్ణంగా నింపుకొన్న ఈ ఆలయం ఆడవారి శబరి మల గా కీర్తించబడుతోంది.
సువిశాల ప్రాంగణంలో రహదారి నుండి కొద్దిగా దిగువకు ఉండే ఆలయ సముదాయం కొంత ప్రత్యేకంగా ఉంటుంది.
స్థానిక నిర్మాణ శైలిలో నిర్మించబడిన ప్రధాన గోపురం దాటి ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఎత్తైన మండపం కనపడుతుంది.అక్కడే ద్వజస్థంభం మరియు బలి పీఠం ఉంటాయి. ప్రదక్షిణా పథంలో గణపతి మరియు భగవతి సన్నిదులుంటాయి.ప్రతి ఉపాలయం వద్ద దర్శించుకొనే దీక్షా దారులు కొబ్బరి కాయలు కొట్టడానికి ఏర్పాట్లు చేయబడినాయి
.
గర్భాలయంలో శ్రీ ధర్మ శాస్త సుందర స్వర్ణ పుష్పాలంక్రుతులై మనోహరంగా దర్శనమిస్తారు.
మిగిలిన శాస్త ఆలయాలకు పక్కిల్ లో ఆలయానికి ప్రధాన తేడా ఏమిటంటే శబరి మలలో మాదిరి ఇక్కడ కూడా ప్రాంగణంలోని ఈశాన్యంలో శ్రీ మాలికా పురత్తమ్మ సన్నిధి ఉండటం.
నూతనము గా నిర్మించబడిన ఆలయాలలో తప్ప పురాతన ఆలయాలలో మరెక్కడా ఇలా అమ్మవారు కొలువై ఉండటం కనిపించదు.మహిళలు భక్తి శ్రద్దలతో అమ్మవారిని కొలుస్తుంటారు.
సౌభాగ్యాన్నిప్రసాదించే దేవతగా భావించి పసుపు కుంకుమలతో అర్చిస్తారు. ముఖ్యంగా మండల సమయంలో మరియు మకర సంక్రాంతి రోజులలో అశేష సంఖ్యలో మహిళా భక్తులు వస్తుంటారు. స్వామికి , అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకొంటారు .
ఉదయం నాలుగు గంటల ముప్పై నిముషాల నుండి పదకొండు వరకు అయిదు గంటల నుండి
రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో నిత్యం అభిషేకాలు, అర్చనలు, అలంకారాలు చేస్తారు.శబరి మలలో మాదిరి వివిధ ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. శబరిమల వెళ్లలేని వారు ఇక్కడ ఎరుముడి సమర్పించుకొంటారు . నెయ్యాభిషేకం జరిపించుకొంటారు .
శ్రీ ధర్మశాస్త ఆలయం కాకుండా మరో ప్రత్యేకత పక్కిల్ కలిగి ఉన్నది.
ప్రస్తుత ఆలయాన్ని పరయి పెట్ట పంతిరుకులం అనే వర్తక కుటుంబానికి చెందిన "పక్కనార్" అనే ఆయన నిర్మించారట . వారి కుటుంబం స్థానికంగా గృహోపకరణాల వ్యాపారం నిర్వహిస్తుండేదట . ప్రజల సౌకర్యార్ధం వారాంతపు సంతను ఏర్పాటు చేసేవారట. అదే కాలక్రమంలో పెద్ద సంతగా పేరొందినది .
సంవత్సరమంతా అనేకానేక గ్రామాల మాదిరి సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే పక్కిల్ జూన్ జూలై మధ్య కాలంలో (మళయాళ మిధునం మాసం ) పండగ వాతావరణం సంతరించుకొంటుంది.
ఈ నెలలో కేరళలోనే అతి పెద్దదైన సంత పక్కిల్ లో జరుగుతుంది. ఆ సంతలో దొరకని వస్తువంటూ ఉండదు అంటారు . అన్ని రకాల గృహోపకరణాలు లభిస్తాయి.చాటలు, బుట్టలు దగ్గర నుండి జాతి చెక్కతో చేసిన అనేక విధములైన బల్లలు, కుర్చీలు, మంచాలు ఇలా ఎన్నో విధములైన సామాన్లు లభిస్తాయి.నెల రోజుల పాటు జరిగే ఈ సంతలో రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొంటారు.
"సంక్రాంతి వానిభ్యం" ( సంక్రాంతి వాణిజ్యం) గా పిలిచే పక్కిల్ సంత సుమారు వెయ్యి సంవత్సరాలుగా నిర్వహించబడుతోందనితెలుస్తోంది.
ఇంతటి విశేషత విశిష్టత కలిగిన పక్కిల్, శబరిమలకు దారితీసే ఉత్తమమైన దారుల్లో ఉత్తమమైన మజిలీలలో ఒకటిగా పేరొందిన కొట్టాయం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చేరడానికి బస్సులు మరియు ఆటోలు లభిస్తాయి. కొట్టాయం నగరం లోనూ చుట్టుపక్కల ఎన్నో విశేష ఆలయాలు నెలకొని ఉన్నాయి. అన్నీ దర్శనీయమైనవే !
స్వామియే శరణం అయ్యప్పా !!!!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి