14, ఫిబ్రవరి 2024, బుధవారం

Padavedu Temples

 పడవీడు - మరో పావన క్షేత్రం 

 

 

భారతదేశంలో ఎన్నో పవిత్ర పావన క్షేత్రాలు ఎన్నో యుగాల నుండి నెలకొనివున్నాయి. అవన్నీ కూడా గణనీయమైన పురాణ మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగివుండటం పేర్కొనవలసిన విషయం. ఇలాంటి క్షేత్రాలు మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో విశేష సంఖ్యలో కనిపిస్తాయి
జన వాక్యంగా ప్రచారం సాగి  క్షేత్రాల గొప్పదనం  ప్రజలలో స్థిరంగా నిలిచిపోయింది. వాటి ఆధారంగా మహర్షుల,గురుదేవుల,పండితుల సలహా మేరకు అనేక రాజ వంశాలవారు ఆయా ప్రదేశాలలో రమణీయ ఆలయాలను నిర్మించారు.అలా తరతరాలను అనుగ్రహించే దేవీదేవతల దర్శనం నేడు మనం పొందగలుగుతున్నాము






 కోవకు చెందినదే తమిళనాడు లోని ప్రఖ్యాత శైవ క్షేత్రం,పంచ భూత క్షేత్రాలలో అగ్ని క్షేత్రం  అయిన తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలూకా పరిధిలోని "పడవీడు". నేడు ఒక చిన్న గ్రామంగా కనిపిస్తున్నపడవీడు యుగాల క్రిందట ఒక గొప్ప ఋషివాటిక. అనంతర కాలంలో అనేక మంది రారాజులు ఇక్కడ నుండి పరిపాలన సాగించారు అని పురాతన గ్రంధాలు, లభించిన శాసనాల ద్వారా తెలియవస్తోంది
గతంలో కుండలీపురం,పడైవీడు,మరుదరసార్ పడైవీడుగా పిలవబడిన ప్రాంతం నేడు   పడవీడుగా పేరొందినది. పడైవీడు అనగా సైనిక శిబిరం లేక యుద్ధ ప్రదేశం గా చెప్పుకోవచ్చును
స్థానిక పురాణ గాథలు మరియు చరిత్ర తెలిపే సంగతులు  విషయాన్నీ నిర్ధారిస్తున్నాయి

పౌరాణిక గాథ 

 కృత యుగంలో  ప్రాంతం సప్తఋషులలో ఒకరైన శ్రీ జమదగ్ని మహర్షి ఆశ్రమంగా ప్రసిద్దికెక్కినది. మహర్షి మహేశ్వర అంశగా పురాణాలు కీర్తించాయి. లోకపావని చాముండేశ్వరి దేవి అంశతో శ్రీ రేణుకాదేవి విదర్భ దేశ రాజకుమారిగా జన్మించినది. యుక్త్వయస్సు వచ్చిన కుమార్తె కు   వివాహం చేయ నిశ్చయించారట తలితండ్రులు. కానీ తన వరుని తానే  ఎంచుకోవాలన్నఆకాంక్షతో తల్లితండ్రుల అనుమతితో లోకసంచారానికి బయలుదేరినదట రేణుకాదేవి. ఆమెకు రక్షగా వేలాది మంది సైనికులను పంపారట మహారాజు
అనేక ప్రాంతాలు తిరిగి ఆమె ససైన్యంగా కుండలీ పురం చేరుకొన్నారట. మహర్షి తపస్సు చేసుకొంటున్నారట. రేణుకాదేవి సైన్యం అక్కడ విడిది చేయడం వలన ఆయన తపస్సుకు భంగం వాటిల్లుతుందని మహర్షి శిష్యులు ఆమెకు చెప్పారట.
వాదన పెరిగి చివరికి ఇరువర్గాల మధ్య కలహానికి దారి తీసిందట. యుద్ధం తీవ్ర రూపం దాల్చినదట. ఆగ్రహించిన రేణుకాదేవి ఒక పెద్ద అగ్ని గోళాన్ని సృష్టించి మహర్షి శిష్యుల మెడకు ప్రయోగించిందట. మహర్షి లోకాలలో ఉన్న సమస్త నదుల నీటిని తన కమండలం లోనికి ఆవాహనచేసి కమండలాన్ని వంపారట. ఒక్కసారిగా నీరు వెల్లువలా ప్రవహించి అగ్ని గోళాన్ని చల్లార్చినదట
మహర్షి శివాంశ అన్న విషయాన్నీ గ్రహించిన రేణుకాదేవి తన ఓటమిని అంగీకరించి ఆయనను వివాహమాడిందట.  దంపతులకు శ్రీ మహావిష్ణు ఆరో అవతారమైన శ్రీ పరశురాముడు జన్మించారు. ఆయన కాకుండా రోమన్య, వాసు, సుహోత్ర, విశ్వావసు అనే  నలుగురు కుమారులు కూడా మహర్షి దంపతులకు కలిగారు.  
అలా ఇది ఆది దంపతుల నివాసంగా  మరియు వైకుంఠవాసుని అవతార స్థలంగా ప్రసిద్దికెక్కినది
జమదగ్ని మహర్షి కమండలం నుండి ఉద్భవించిన నీటిని కమండల నదిగా పిలుస్తారు. నేటికీ ఒక చిన్న పాయగా కనిపిస్తుంది
శ్రీ రేణుకాదేవి ప్రతి నిత్యం పతిదేవుని యజ్ఞానికి కావలసిన నీటిని అప్పటికప్పుడు తయారు చేసిన కుండతో నది నుండి తీసుకొని వచ్చేదట. ఒకనాడు ఆమె నదికి వెళ్లగా అక్కడ తన భార్యలతో ఆకాశ మార్గాన వెళుతున్న ఒక గంధర్వుడు కనిపించారట. వారిని చూస్తూ ఒక తెలియని మాయలో పడిన రేణుకాదేవి ఆలస్యంగా ఆశ్రమానికి చేరుకొన్నదట. దివ్యదృష్టితో విషయాన్ని గ్రహించిన జమదగ్ని మహర్షి మానసికంగా తప్పు చేసిన తల్లిని విధించామని పుత్రులను ఆదేశించారట. ఒక్క పరశురాముడు తప్ప మిగిలినవారు తండ్రి ఆదేశాన్ని తలదాల్చలేదట. ఆగ్రహంతో మహర్షి పరశురాముని అందరినీ విధించామని ఆఙ్ఞాపించారట. అవతార పురుషుడు ఆజ్ఞను శిరసావహించడంతో సంతసించిన జమదగ్ని వరం కోరుకోమన్నారట. తల్లిని అన్నదమ్ములను బ్రతికించమని కోరారట. అతనికి తల్లి, తోడబుట్టిన వారిపట్ల గల ప్రేమాభిమానాలకు మరింతగా ఆనందించిన జమదగ్ని వారిని సజీవులను చేసిన సంఘటనలు జరిగింది ఇక్కడేనని స్థల పురాణం తెలుపుతోంది
అనంతర కాలంలో కార్తవీర్యార్జున రాజు వేటకు వచ్చి జమదగ్ని మహర్షి వద్ద ఉన్న కామధేనువును చూసి తనకు ఇవ్వమని కోరారట. నిరాకరించిన మహర్షిని వధించి కామధేనువును తీసుకొని పోయారట. అనంతరం శుక్రుడు తన మృతసంజీవనీ మంత్రంతో జమదగ్ని మహర్షిని జీవితాలను చేశారట.   ఆశ్రమానికి తిరిగి వచ్చిన పరశురాముడు జరిగినది తెలుసుకొని తీవ్ర ఆగ్రహంతో ఇరవై ఒక్కమార్లు దండయాత్ర చేసి పాలకుడు అన్నవాడు లేకుండా సంహరించడం వేరే కథ
బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఇక్కడికి వచ్చి పరశురాముని శాంతించమని కోరి ఇక్కడ ఆయన కోరిక మేరకు శ్రీ రేణుకాదేవిని క్షేత్రపాలకురాలిగా నియమించారని అంటారు. నేటికీ ప్రాంగణంలో త్రిమూర్తులు అదృశ్య రూపంలో సంచరిస్తారన్నది స్థానిక విశ్వాసం
 అలా కృత యుగంలో వెలిసిన శ్రీ రేణుకాదేవి నేటికీ పూజలందుకునే ప్రముఖ దేవాలయం శ్రీ   రేణుకా అంబాల్ పడ వీడు. అమ్మవారు ఎన్నో కుటుంబాలవారికి వారి కులదేవత



















పడ వీడు చరిత్ర 

చరిత్రకారులు లభించిన ఆధారాల ఆధారంగా పడైవీడు పదమూడవ శతాబ్దం నుండి పదహారవ   శతాబ్దం వరకు విద్య,వాణిజ్య,వ్యాపారాలలో,వ్యవసాయంతో పాటు ఇతర కళల్లో కూడా అగ్రస్థానంలో ఉండేదని తెలుపుతున్నారు.   
గతంలో పడైవీడు సంబువరాయ వంశస్థుల రాజధాని. వీరు పాండ్య రాజుల సామంతులు. నేటికీ వీరి కాలంలో నిర్మించిన పెద్ద కోట, చిన్న కోట శిధిలాలను పడవీడులో చూడవచ్చును. వీరి తరువాత విజయనగర రాజులు ఇక్కడి ఆలయాలకు తమ వంతు కైంకర్యాలు మరియు ఇతర నిర్మాణాలు చేశారని శాసనాల ఆధారంగా తెలుస్తోంది
పడ వీడు చుట్టుపక్కల సుమారు పదిహేడు గ్రామాలు, జవదు పర్వతశ్రేణి మరియు ఎన్నో నీటి ప్రవాహాలు కనిపిస్తాయి. ఒకప్పడు  ప్రాంతంలో వెయ్యి ఎనిమిది శివాలయాలు, నూటఎనిమిది విష్ణాలయాలు ఉండేవని చెబుతారు
ప్రస్తుతం పదహారు ఆలయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వీటి అన్నిటిలోకి శ్రీ రేణుకాదేవి ఆలయం అగ్రస్థానంలో ఉన్నది. వీటిలో కూడా చాలావరకు శిధిలావస్థలో ఉండేవి. టి వి యస్ సంస్థ వారు  గ్రామాన్ని, ఇక్కడి నిర్మాణాలను దత్తత తీసుకొని ప్రస్తుత రూపంలో మన ముందు నిలిపారు. ఆలయం అంటే ఇంత చక్కగా, శుభ్రంగా, ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా పూర్తి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉండాలి అన్న విషయం పడవీడు చూస్తే అర్ధం అవుతుంది. మిగిలిన ఆలయాల అధికారులు మరియు మనలాంటి వారు తప్పనిసరిగా ఎలా ఆలయాలను నిర్వహించాలి, ఎలా ఆలయాలలో ప్రవర్తించాలి అని  తెలుసుకోవలసిన విషయం ఇక్కడ ఉన్నది
మేము సమయాభావం వలన కేవలం ఆరు ఆలయాలను మాత్రమే సందర్శించగలిగాము. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అర్చకులు శ్రీ  వేణుగోపాల భట్టార్ మరియు  తెలుగు తెలిసిన ఆయన మిత్రులు మాకు పడ వీడు ప్రాముఖ్యత గురించి, ఆలయాల గురించి చాలా విలువైన సమాచారాన్ని తెలిపారు. వారికీ మనందరి తరుఫున కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీ వేణుగోపాల్ భట్టర్ అందించిన వివరాల ప్రకారం చూడవలసిన ఆలయాలు మొత్తంగా పదహారు
శ్రీ కైలాస వినాయక ఆలయం, శ్రీ కైలాస నాథర్ ఆలయం, వేల్ ఆలయం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, శ్రీ వేల్ మురుగన్ ఆలయం( రెండు ఎత్తైన పర్వతాల మీద ఉంటాయి), పెరియ (పెద్ద) కోట శ్రీ వరద రాజ పెరుమాళ్ ఆలయం, చిన్న కోట శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం.  ఆలయం సుమారు అయిదు కిలోమీటర్ల దూరంలో చిన్న పర్వతం మీద ఉంటుందట. పైకి చేరుకోడానికి రహదారి మార్గం ఉన్నది. కానీ ఒక్క శనివారం మాత్రమే  ఆలయాన్ని తెరుస్తారట
మేము చూసిన ఆలయాలు వరుసగా శ్రీ రేణుక అంబాల్ ఆలయం, శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయం, శ్రీ యోగరామచంద్ర స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం, శ్రీ అమ్మయప్పార్ ఈశ్వర కోవెల, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం



















శ్రీ రేణుక అంబాల్ ఆలయం 

శ్రీ చాముండేశ్వరి అవతారంగా భక్తులు ఆరాధించే శ్రీ రేణుక అంబాల్ ఆలయం పడవీడు గ్రామంలో మొదట కనిపించేది మరియు ప్రధాన ఆలయం
శివాంశతో జన్మించిన శ్రీ జమదగ్ని మహర్షి భార్య, అవతార పురుషుడు అయిన శ్రీ పరశురాముని తల్లి శ్రీ రేణుక అంబాల్ కొలువైన ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. నాలుగు అంతస్థుల ఎత్తైన రాజగోపురం దానికి   అనుసంధానంగా కోట గోడల మాదిరి ప్రహరీ గోడ నలుదిక్కులా నిర్మించారు
సువిశాలమైన ప్రాంగణంలో శ్రీ గణపతి, శ్రీ కుమారస్వామి ఉపాలయాలు కనిపిస్తాయి. సుందర శిల్పాలతో నిండియున్న శ్రీ రేణుక అంబాల్ కొలువైన ఆలయానికి దక్షిణం పక్క నుండి ప్రవేశ ద్వారం ఉంటుంది. తూర్పు వైపున ధ్వజస్థంభం, బలి పీఠాలు కనపడతాయి
ముఖ మండపంలో ఆలయ  పౌరాణిక గాథను తెలిపే వర్ణ చిత్రాలను రమణీయంగా చిత్రించి ఉంచారు. గర్భాలయానికి ఇరుపక్కలా నిలువెత్తు విగ్రహ రూపంలో  ద్వారపాలకురాళ్లు. సహజంగా శ్రీ రేణుకా దేవి ఆలయాలలో అమ్మవారు  శిరస్సు రూపంలోనే కనపడతారు. అన్ని పూజలు శిరస్సుకే చేస్తారు. ఇక్కడ గర్భాలయంలో శ్రీ  రేణుక అంబాల్ శిరస్సు వెనుక అమ్మవారి నిలువెత్తు రూపం దర్శనమిస్తాయి. అమ్మవారి రూపాన్ని అత్తి (మేడి) చెట్టు కాండంతో మలిచారని తెలుస్తోంది. రమణీయమైన అలంకరణలో లోకపావని నేత్రపర్వంగా దర్శనమిస్తారు. జగద్గురు శ్రీ ఆది శంకరులు  క్షేత్రంలో బాణలింగ మరియు నానాకర్షణ యంత్రం ప్రతిష్ట చేశారని చెబుతారు.  
తమిళనాడులో అమ్మవారి ఆలయాలలో కుంకుమ ప్రసాదంగా ఇస్తారు. కానీ ఇక్కడ విభూతి ఇస్తారు.  విభూతి శ్రీ జమదగ్ని మహర్షి నిత్య యజ్ఞం చేసిన హోమగుండం నుండి సంవత్సరానికి ఒకసారి జేష్ఠ మాసంలో (తమిళ ఆణి నెల, జూన్ - జులై)) సేకరించి భక్తులకు ఇస్తారని చెబుతారు.  హోమగుండం కమండల నదీ తీరంలో ఉన్నదని తెలుస్తోంది
తొండై మండల శక్తి పీఠంగా ప్రసిద్ధికెక్కిన  ఆలయంలో  ప్రతినిత్యం నియమంగా నాలుగు పూజలు, అమావాస్యకి, పౌర్ణమికి విశేష పూజలు జరుగుతాయి. శ్రీ గణేష చతుర్థి, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి , మహాశివరాత్రి, దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు
ప్రతి శనివారం మరియు ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కోరిన కోర్కెలు నెరవేరినవారు పొంగలి తయారు చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. అమ్మవారికి మొక్కుకున్న తరువాత పెళ్లి అయినవారు తన జీవిత భాగస్వామితో, పిల్లలు కలిగిన వారు తమ సంతానంతో బంధు మిత్రులతో పెద్ద సంఖ్యలో తరలి రావడం ప్రతి రోజు కనపడుతుంది
అమ్మవారి ఆలయ శిల్పకళ మరో ప్రధాన ఆకర్షణగా పేర్కొనాలి
అమ్మవారి ఆలయం నుండి చూస్తే పర్వత శిఖరం పైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కనిపిస్తుంది

శ్రీ ఉమామహేశ్వరి సమేత శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయం 

శ్రీ రేణుక అంబాల్ ఆలయానికి పక్కనే ఉంటుందీ ఆలయం. గర్భాలయంలో శ్రీ సోమనాథేశ్వర స్వామి లింగ రూపంలో చందాన, విభూతి కుంకుమ లేపనాలతో, చక్కని పుష్పఅలంకారంలో దర్శనమిస్తారు. అమ్మవారు శ్రీ ఉమామహేశ్వరి దక్షిణ ముఖంగా ఉపస్థిత భంగిమలో వరద అభయ ముద్రలలో కొలువై ఉంటారు. ఉపాలయాలలో ఆది దంపతుల కుమారులు విడివిడిగా దర్శనమిస్తారు
శిధిల పురాతన ఆలయ స్థానంలో  నూతన నిర్మాణం జరిగింది













 

శ్రీ యోగ రామచంద్ర స్వామి  ఆలయం 

భారతదేశంలో  రామాలయం చూసినా శ్రీరాముడు స్థానక భంగిమలో కోదండధారిగా సీతాలక్ష్మణ సమేతులుగా దర్శనమిస్తారు
కానీ పడ వీడు లోని  ఆలయంలో దశరధ నందనుడు ఉపస్థిత భంగిమలో చిన్ముద్రతో ధ్యానభంగిమలో దర్శనమివ్వడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. పక్కనే జానకీమాత కూడా ఉపస్థిత భంగిమలో ఉండటం మరో ప్రత్యేకత. లక్ష్మణస్వామి మాత్రం ధనుర్భాణాలతో అన్నగారికి రక్షణగా స్థానక భంగిమలో ఉంటారు . 
ఇలా శ్రీ రాముడు చిన్ముద్రలో ఉన్న మరో రెండు ఆలయాలు  ప్రాంతంలో ఉన్నాయని శ్రీ వేణుగోపాల్ తెలిపారు. అవి ఇక్కడికి సమీపంలోని నెడుంగుణం మరియు రఘునాథ సముద్రం అనే గ్రామాలు. నెడుంగుణం ఆలయం పల్లవుల కాలం నాటిదిగా తిరువణ్ణామలై జిల్లాలో అతి పెద్ద విష్ణు ఆలయంగా ప్రసిద్ధి చెందినదిగా తెలుస్తోంది
తూర్పు ముఖంగా ఉన్న  ఆలయానికి మూడంతస్థుల రాజగోపురం నలుదిక్కులా ఎత్తైన ప్రహరీ గోడ నిర్మించబడినది. రాజగోపురానికి ఎదురుగా పురాతన శ్రీ ఆంజనేయ సన్నిధి ఉంటుంది. ఆలయంలో కూడా మరో ఆంజనేయ ఉపాలయం ఉండటం విశేషం
చక్కని శిల్పాలు కనిపిస్తాయి  ఆలయంలో. విజయనగర రాజుల శైలి కనపడుతుందిఉపాలయాలలో  శ్రీ చంపకవల్లి తాయారు , శ్రీ విష్ణు దుర్గ కొలువై ఉంటారు
 ఆలయానికి దగ్గరలో కొండ మీద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం అయిన "వేల్" ఆలయం కనపడుతుంది.  




















శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం 

చిన్న కొండ మీద ఉత్తర ముఖంగా ఉన్న  ఆలయం ప్రశాంతతకు మరోపేరుగా చెప్పుకోవచ్చును.ఎలాంటి విశేష నిర్మాణాలు లేకుండా ముఖ మండపం మరియు గర్భాలయం తో పాటు శ్రీ విశ్వక్సేన సన్నిధి మాత్రమే ఉంటాయి. ప్రధాన అర్చనామూర్తి శ్రీ  పరశురామ ప్రతిష్ట
గర్భాలయంలో చిన్న పీఠం మీద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మూలవిరాట్టు రమణీయ పుష్ప   అలంకరణలో దర్శనమిస్తారు.విశేషం ఏమిటంటే శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయాలలో అమ్మవారు స్వామివారి వామాంకం మీద   ఉపస్థితులై ఉంటారు. కానీ ఇక్కడ కుడి తొడ పైన కూర్చొని కనిపిస్తారు. ఇలాంటి మరో ఆలయం ఇక్కడికి సమీపంలోని "సింగిరి కోయిల్ " అనే ఊరిలో ఉన్నది. అక్కడ కూడా అమ్మవారు స్వామివారి కుడి తొడ మీద ఉపస్థితులై దర్శనం ఇస్తారు
స్వామివారు చతుర్భుజాలతో కుడి చేతిని అమ్మవారి చుట్టూ వేసి,ఎడమ చేతిని వరద ముద్రగా ఉంచి వెనుక ఉన్న చేతులలో శంఖు చక్రాలను ధరించి ఉంటారు
సహజంగా శ్రీ నరసింహ ఆలయాలలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నాడు విశేష పూజలు   నిర్వహిస్తారు. కానీ ఇక్కడ శివాలయాలలో మాదిరి ప్రదోష పూజ జరుపుతారు. నరసింహుడు హిరణ్యకశ్యపుని సంహరించింది సాయం సంధ్యా సమయంలోనే కదా ! ముఖ్యంగా శనిప్రదోషం చాలా ప్రత్యేకం  ఆలయంలో
ఆలయ పూజలు,అభిషేకాల నిమిత్తం శ్రీ పరశురాముడు ఆలయ పడమర దిక్కున కొండరాతి  నుండి తన పరశు తో ఒక జలను రప్పించారట.ఇందులో నేటికీ నిరంతరం జల ఊట కనిపిస్తుంది. ఆలయ కార్యక్రమాలకు  నీటినే ఉపయోగిస్తారు.































ఆలయానికి వెలుపల ఉన్న శ్రీమారుతీ నందనుని ఆలయం పునఃనిర్మించబడినది
పక్కనే ఉన్న కొండ మీద మరో శివాలయం ఉన్నది

శ్రీ అమ్మయప్ప ఈశ్వర ఆలయం 

పూర్తిగా శిధిలమైన ఆలయ పునర్నిర్మాణం జరిగింది. శ్రీ అమ్మయప్ప ఈశ్వర స్వామి ఒక సన్నిధిలో,అమ్మవారు శ్రీ అపర్ణామ్బికై మరో సన్నిధిలో కొలువై ఉంటారు. ఉపాలయాలలో శ్రీ భైరవ, శ్రీ వీరభద్ర, శ్రీ కాళీ శ్రీ వినాయక స్వామి దర్శనమిస్తారు. పక్కపక్కనే ఉంటాయిశుభ్రతకు మరో పేరు  రెండు ఆలయాలు
















నవగ్రహ మండపం 

శివాలయాలలో, శక్తి క్షేత్రాలలో నవగ్రహ మండపం విధిగా కనపడుతుంది. కానీ పడవీడు లోని  ఆలయంలోనూ నవగ్రహ మండపం కనపడదు
స్థానికంగా వినిపించే సంగతి ఏమిటంటే నవగ్రహాల పైన ఆధిపత్యం సాధించిన వాయు నందనుడు, శ్రీ సూర్య భగవానుని శిష్యుడు మరియు రామ దూతగా కీర్తించబడే శ్రీ ఆంజనేయుని అర్చించడం మరియు ఆయన వాలానికి ప్రత్యేక పూజ చేయడం నవగ్రహ పూజలకన్నా శక్తివంతమైనవి
 నమ్మకానికి తగినట్లుగా పడ వీడు లో అనేక హనుమంతుని ఆలయాలు కనపడతాయి. వీటిలో ముఖ్యంగా ఎనిమిది ఆలయాలు ప్రముఖమైనవిగా శ్రీ భట్టర్ తెలిపారు
అరుణాచలంలో ఎలాగైతే అష్టదిక్పాల లింగాలు ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా వివిధ దిశలలో ఎనిమిది అంజనాసుతుని ఆలయాలు ఉంటాయి





















అవి పెద్ద లేక ప్రధాన ఆంజనేయ ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం వద్ద, దేవనాంకుల, వేట పాళ్యం, శ్రీ కైలాస వినాయక ఆలయం వద్ద, శ్రీ కైలాస పురం శ్రీ ఆంజనేయ ఆలయం, శ్రీ అర్జునా పురం శ్రీ ఆంజనేయ మరియు శ్రీ రేణుక అంబాల్ శ్రీ ఆంజనేయ. ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే  ఎనిమిది ఆలయాలు వివిధ దిక్కులలో ఉండటమే కాకుండా వివిధ దిక్కులకు అభిముఖంగా ఉండటం
శ్రీ ప్రధాన ఆంజనేయ స్వామి ఆలయం శ్రీ యోగ రామ చంద్ర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో వస్తుంది . 
ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో శ్రీ వీరాంజనేయుడు దర్శనమిస్తారు. మంగళవారాలు, శని మరియు ఆదివారాలలో భక్తులు పెద్ద సంఖ్యలో   ఆలయాల సందర్శన చేస్తుంటారు. జాతకరీత్యా ఎదురైనా ఇబ్బందులకు పూజలు చేయించుకొంటుంటారు
ఇంతటి విశేషమైన పడ వీడు క్షేత్ర సందర్శన అదే విధంగా మిగిలిన ఆలయాల సందర్శన భాగ్యం కలిగించమని శ్రీ సంజీవరాయని కోరుకొని తిరుగు ప్రయాణం అయ్యాము





పడ వీడు వెల్లూరు నుండి 35 కిలోమీటర్ల, తిరువణ్ణామలై నుండి యాభై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తగుమాత్రపు వసతి సౌకర్యాలు శ్రీ రేణుక దేవి ఆలయ నిర్వహణలో ఉన్నాయి. చక్కని భోజనం లభిస్తుంది. కానీ వెల్లూరు లేదా తిరువణ్ణామలై ఎక్కడ నుండి అయినా స్వంత లేదా అద్దె వాహనంలో వెళితేనే ఒక రోజులో అన్ని ఆలయాలను దర్శించుకునే అవకాశం లభిస్తుంది

 ఓం నమో నారాయణాయ !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...