11, నవంబర్ 2019, సోమవారం

Ganapavaram Temples

                           సూర్యుడు కొలిచే సువర్ణేశ్వరుడు 






ఆలయ దర్శనం అనగానే అందరి దృష్టి తమిళనాడు లేదా కేరళ వైపుకు మళ్లుతుంది. కానీ తెలియనిదల్లా మన రాష్ట్రంలో కూడా అనేకానేక పురాతన చారిత్రక ఆలయాలు నెలకొని ఉన్నాయి అని. 
మన రాష్ట్రాన్ని క్రీస్తు పూర్వం నుండి ఎన్నో రాజ వంశాలు పాలించాయి. అందరూ మన సంస్కృతి సంప్రాదాయాల, భాష మరియు ఆరాధనా విధానాల అభివృద్ధికి విశేష కృషిచేశారని లభించిన శాసనాల ఆధారంగా అవగతమౌతుంది. రాయలసీమ జిల్లాల తరువాత ఉభయ గోదావరి జిల్లాలు వీటికి ప్రసిద్ధి. కాకపోతే దురదృష్టవశాత్తు తగినంత ప్రచారం లేకపోవడం లేదా కొన్ని చిన్నచిన్ని గ్రామాలలో, మారుమూల ప్రాంతాలలో ఉండటం వలన వీటికి రావలసిన గుర్తింపు, దక్కవలసిన గౌరవం దక్కలేదని భావించవలసి వస్తుంది.  
ఆంధ్రప్రదేశ్ జీవనాడి జీవనది అయిన గోదావరి. నిరంతరం గలగలా ప్రవహించే ఈ నదీ తీరాలు  పచ్చని పంట పొలాలకు , సుందర ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. సంవత్సరమంతా నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉండే ఈ ప్రాంతాలలో ఎన్నో గొప్ప క్షేత్రాలు నెలకొని ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒక విశేష క్షేత్రం "పద్మినీ పురం". 
ఈ పేరు చెబితే చాలామందికి అర్ధం కాదు. తెలియదు కూడా ! అదే "గణపవరం" అని చెబితే ఠక్కున గుర్తిస్తారు. పురాణాలలో, పురాతన గ్రంధాలలో, శాసనాలలో కొలను పురం, సరసీ పురం, కురాల సరస్సు, పద్మినీ పురంగా పేర్కొనబడిన ఈ ప్రాంతం కాకతీయుల కాలం నుండి గణపవరంగా పిలవబడుతోంది. రాణీ రుద్రమదేవి ఈ ప్రాంతాన్ని సందర్శించి తన తండ్రి గణపతి దేవుని పేరు మీద గ్రామాన్ని పునఃనిర్మించినది. శ్రీ దుర్గంబిక సమేత శ్రీ సువర్ణేశ్వర స్వామి వారి ఆలయాన్నికూడా పునః నిర్మించినట్లుగా తెలియవస్తోంది. ఈ కారణంగా ఈ గ్రామాన్నిఆయన పేరుతో పిలవబడసాగింది.











ఆలయ పౌరాణిక గాధ 

లోకాలకు వెలుగును పంచెడివాడు శ్రీ సూర్యనారాయణ మూర్తి. ఆయన భార్యలలో ఒకరైన ఉషా దేవి కైలాసనాధుని దర్శనాన్ని ఆపేక్షిస్తూ ఇక్కడి సువర్ణ (కురాల) సరోవర తీరాన నియమంగా దీక్షతో తపస్సు చేసినదట. ఆమె భక్తికి సంతసించిన భక్తసులభుడు దర్శనాన్నిప్రసాదించారట. ఆమె ఆర్తితో లోకాలను కాపాడేందుకు ఇక్కడే కొలువు తీరమని కోరగా సమ్మతించి స్వయం భూలింగ రూపంలో వెలిశారని స్థల పురాణం తెలుపుతోంది. 
తరువాత ద్వాపర యుగంలో పాండవుల మనుమడైన పరీక్షిత్తు మహారాజును " తక్షకుని కాటుతో నీకు మరణం ప్రాప్టించుకాక!" అని శపించాడు ఒక మహర్షి కుమారుడు. ఈ కధ అందరికీ తెలిసినదే !
కానీ తనకు తానుగా కాకుండా ముని వాక్కు మేరకు రాజుని కాటువేసినా సంక్రమించిన దోషం తొలగించుకోడానికి నాగరాజు తక్షకుడు ఈ కురాల సరోవరాన్నే ఎంచుకున్నాడట. నియమంగా శ్రీ సువర్ణేశ్వర స్వామిని సేవించుకొని దోషాన్ని తొలగించుకొన్నాడట. ఈ కారణంగా శ్రీ సువర్ణేశ్వర స్వామి వారు కొలువైన గణపవరం సర్పదోష పరిహార క్షేత్రంగా గుర్తింపబడింది.








ఆలయ చరిత్ర 

నేటి పశ్చిమ గోదావరి జిల్లా లోని పెదవేగి ఒక చిన్న పల్లె. కానీ క్రీస్తుశకం రెండో శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం వరకూ ఎన్నో రాజవంశాలకు రాజధానిగా వెలుగొందినది. అప్పట్లో "వేంగి" అని పిలిచేవారు. తూర్పుచాళుక్యులు, ఢిల్లీ సుల్తానులు, హొయసల, యాదవ, శాతవాహన, కళింగ, పల్లవులు, శాలంకాయనులు, బృహత్సలాయకులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు వేంగి మీద ఆధిపత్యం చేసి పదిహేడవ శతాబ్దం వరకు పాలించారు. 
సుల్తానుల మరియు నవాబుల కాలంలో గణపవరం ప్రాంతం మరియు ఆలయం కూడా రెండు పర్యాయాలు ధ్వసం చేయబడినాయి. మొదటిసారి శాతవాహనలు, రెండో సారి విజయనగర రాజులు గ్రామాన్ని మరియు దేవాలయాన్ని పునః నిర్మించారు. మిగిలిన రాజ వంశాల పాలకులు ఆలయాభివృద్దికి విశేష కృషి చేశారని ఆలయంలో ఉన్న శాసనాలు తెలుపుతున్నాయి. 
గోల్కొండ నవాబుల తరువాత ఈ ప్రాంతం నూజివీడు జమీందారుల అధికారం లోనికి వచ్చింది. వారు ఆలయ మరియుప్రాంతీయాభివృద్దికి తమ వంతు కృషి చేశారు అని తెలుస్తోంది. ఆలయ నిర్వహణ నిమిత్తం భూమిని ఇచ్చారు. ఉత్సవాల సమయంలో  తమ వంతు కైంకర్యాలతో శ్రీ దుర్గంబిక సమేత శ్రీ సువర్ణేశ్వర స్వామి పట్ల తమ భక్తిని ప్రకటించుకొనేవారు.ఆంధ్ర రాష్ట్ర పురావస్తు శాఖ వారు రాతితో నిర్మించిన శ్రీ సువర్ణేశ్వర స్వామి ఆలయాన్ని పురాతన నిర్మాణంగా నిర్ధాకరించి గుర్తించారు. కొల్లలుగా ఏరులు సంగమించే కొల్లేరు సరస్సుకు దగ్గరలో ఉన్న గణపవరంలో శ్రీ సువర్ణేశ్వర స్వామి కొల్లేరు కోట పెద్దింటమ్మ ఒకరికొకరు అభిముఖంగా ఉండటం చెప్పుకోదగిన విషయం. 

ఆలయ విశేషాలు 

సువిశాల ప్రాంతంలో పడమర ముఖంగా ఉండే ప్రధాన ద్వారం పైన మూడు అంతస్థుల రాజ గోపురాన్ని నూతనంగా నిర్మించారు. వర్ణమయ శిల్పాలతో రమణీయంగా దర్శనమిస్తుంది. 
ప్రాంగణంలో శ్రీ గణేశ, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి (విశేషమేమిటంటే ఈ మూడు విగ్రహాలు ఏక రాతి మీద మలచినవి కావడం), సప్తమాతృకలు, ద్వాదశ జ్యోతిర్లింగాల వివరాలను తెలిపే ఫలకం ఉంటాయి. 
రాతితో నిర్మించబడిన పడమర దిశగా ఉండే గర్భాలయాలలో శ్రీ గణేశ, శ్రీ దుర్గంబిక ఇరుపక్కల ఉండగా మధ్యలో శ్రీ సువర్ణేశ్వర స్వామి ప్రధాన గర్భాలయంలో విభూది, చందన కుంకుమ లేపనాలతో, వర్ణమయ పుష్పాలంకరణలో నేత్రపర్వంగా  దర్శనం ప్రసాదిస్తారు. 
నాటి శిల్పుల నిర్మాణ చాతుర్యాన్ని తెలిపి ఒక అద్భుతం వైశాఖ మాస పౌర్ణమి నుండి ఆలయంలో ఆవిష్కారమౌతుంది. నాటి నుండి ఒక నెల పాటు ప్రతి నిత్యం సాయం సంధ్యా సమయంలో పడమర దిక్కు అస్తమించబోయే ముందు ఆదిత్యుడు తన కిరణాలతో  నేరుగా లింగానికి ప్రదోషకాల అభిషేకం చేస్తాడు. అత్యంత అరుదైన నిర్మాణ విశేషమిది. చూడటానికి ఎంతో దూరాలనుండి కూడా భక్తులు వస్తుంటారు. ఆలయంలో ప్రతి నిత్యం నాలుగు పూజలను నియమంగా జరిపిస్తారు.














అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుపుతారు. కార్తీక మాసం, వినాయక  చవితి, దేవీ నవరాత్రులు, శివరాత్రి వైభవంగా నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో షష్టి నాడు శ్రీ వల్లీ దేవసేన  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణం, వైశాఖ మాస పౌర్ణమి నాడు  ఆదిదంపతులైన శ్రీ దుర్గంబిక,  శ్రీ సువర్ణేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుపుతారు. వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఆయా పర్వదినాలప్పుడు గంగరాజు అన్నదానసమితి, శ్రీ సాగిరాజు సుబ్బరాజు గార్లు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్నారు. 
శివ పరివారం కొలువైన శ్రీ దుర్గంబిక సమేత శ్రీ సువర్ణేశ్వర స్వామి వార్ల దేవస్థానం కాకుండా గ్రామంలో పురాతనమైన రామాలయం, శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, గ్రామదేవతలైన శ్రీమారెమ్మ మరియు శ్రీకప్పాలమ్మ సన్నిధితో పాటు నూతనంగా నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎన్నో పురాతన ఆలయాలు నెలకొని ఉన్నాయి. 

మార్గం 

 విశేష పౌరాణిక, చారిత్రిక ఆలయాలకు నిలయమైన "గణపవరం" గ్రామం తాడేపల్లి గూడెం లేదా భీమవరం పట్టణాలకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ రెండు పట్టణాలకు రాష్ట్రం లోని అన్ని పట్టణాల నుండి రైలు సౌకర్యం కలదు.అక్కడ నుండి బస్సులు లేదా ఆటోలలో సులభంగా చేరుకోవచ్చును. 
ఆలయ కమిటీ వారు భక్తులకు భోజన మరియు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు.












నమః శివాయ !!!!!





   

1 కామెంట్‌:

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...