1, అక్టోబర్ 2019, మంగళవారం

World Elephant Day

                           ప్రపంచ ఏనుగుల దినోత్సవం 

                                                 
                                                                                                     




మానవులుగా జన్మించిన మనందరికీ ఒక జన్మ దినోత్సవం ఉంటుంది. ప్రతి సంవత్సరం తాహతుకు తగ్గట్టుగా జరుపుకొంటాము. పుడమి మీద జన్మించిన ప్రతి జీవి ఏదో ఒక రకంగా సంఘానికి ఉపయుక్తంగా ఉంటారు. అది మంచి కానీ చేడు  కానీ ! మనతో పాటు అనేక జీవులు భూమి మీద బ్రతుకుతున్నాయి. వాటి మూలంగా ప్రకృతికి జరిగే మేలు ఎంతో ! మరి అలాంటి పరోపకారులను, అవి చేస్తున్న సేవని, వాటి  వలన ఒనగూడే లాభాలను మర్చిపోదామా ! ఈ మూగ జీవాల నిష్కల్మష సేవను గుర్తించి విదేశీయులు వాటికి కూడా సంవత్సరంలో ఒక రోజును కేటాయించారు. వీటిల్లో ఏనుగులు, సింహాలు, పెద్దపులులు లాంటి పెద్ద మృగాలతో పాటు చిన్న చిన్న పక్షుల వరకూ ఉన్నాయి. ఇలా కేటాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి.
తగ్గుతున్న జంతువుల మరియు పక్షుల సంతతిని, వాటి వలన జరిగే పర్యావరణ పరిరక్షణ, అడవుల అభివృద్ధి, శుద్ధమైన గాలి, సకాలంలో వర్షాలు ఆదిగా గల విషయాల పట్ల ప్రజలకు సరైన అవగాహన కలిగించడానికి ఇదో మార్గంగా వారు భావించి  నిర్ణయించారు.
ఉదాహరణకు పిన్నలను, పెద్దలను ఆకర్షించే గజరాజునే తీసుకోండి. ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉన్న అవి నేడు ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల లోపలే ఉన్నాయి. రోజుకు ఎన్ని జన్మిస్తున్నాయో తెలీదు గానీ వంద వరకు వేటగాళ్ల క్రూరత్వానికి బలి అవుతున్నాయి అంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చును. అందుకే వీటిని 1986 నుండి అంతరించి పోతున్న జంతువుల జాబితా అగ్రస్థానంలో ఉంచారు. ఏనుగు దంతాలు, చర్మం తో తయారయ్యే వస్తువుల అమ్మకాన్ని నిషేదించారు. అయినా ఫలితం లేకపోవడంతో వినియోగదారులైన ప్రజలకు పర్యావరణ పరిరక్షణకు ఏనుగుల అవసరాన్నిగురించి తెలియచెప్పి, వారికి దంతపు వస్తువుల పట్ల గల వ్యామోహాన్ని వదిలించడానికి అన్ని దేశాలలోని ఏనుగుల అభిమానులు, ప్రభుత్వాలు  అనేక మార్గాలను ఎంచుకొంటున్నారు.
భారత దేశంలో 1992 వ సంవత్సరంలో "ప్రాజెక్ట్ ఎలిఫెంట్" అన్న కార్యక్రమాన్ని ఆరంభించారు. ముప్పయి రెండు గజ సంరక్షణ కేంద్రాలను ఏనుగులు ఎక్కువగా తిరుగాడే  రాష్ట్రాలలో   నెలకొల్పారు. దీని వలన ఏనుగులు హంతకుల బారిన పడటం తగ్గింది కానీ సంఖ్యలో పెద్దగా అభివృద్ధి లేదనే లెక్కలు చెబుతున్నాయి. అటవీ భూముల విస్తీర్ణం తగ్గిపోవడం తో గ్రామాల మీద గజ దాడులు ఎక్కువ అయ్యాయి.






భారతదేశం తరువాత పెంపుడు ఏనుగులు ఎక్కువగా ఉన్న థాయిలాండ్ దేశంలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది అని అక్కడి అధికారుల రూపొందించిన పత్రాలు తెలుపుతున్నాయి.
శతాబ్దం క్రిందట లక్షకు పైగా తిరుగాడిన ఏనుగుల సంఖ్య నేడు నాలుగు వేలకు దిగజారి పోయింది. అందులో మూడువేలకు పైగా పెంపుడు ఏనుగులే ! వన్యప్రాణి సంరక్షకుల లెక్క ప్రకారం థాయిలాండ్లో సంవత్సరానికి మూడున్నర శాతం చొప్పున ఏనుగులు తగ్గిపోతున్నాయి. . ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు దశాబ్దాల తరువాత ఆ దేశంలో ఏనుగులన్నవి కనపడని తేల్చి చెప్పారు. దీనిని అరికట్టడానికి థాయిలాండ్ మహారాణి "సిరి కీత్" స్వయంగా నడుం బిగించారు.
రెండువేల రెండో సంవత్సరంలో "ఎలిఫెంట్ రీ ఇంట్రడక్షన్ ఫౌండేషన్" ను స్థాపించారు. ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం పెంపకందారుల  దగ్గర వెట్టి చాకిరీ చేస్తున్న ఏనుగులను ఉచితంగా కానీ, ఖరీదు చేసి కానీ తీసుకొని, వాటికి అవసరమైన వైద్య సేవలను అందిస్తారు. పూర్తి స్వస్థత చేకూరిన తరువాత వాటిని అడవిలో వదులుతారు. దీని కోసం థాయిలాండ్ ప్రభుత్వం మూడు   అభయారణ్యాలను, ఇరవై ఎనిమిది మంది సుశిక్షితులైన సిబ్బందిని నియమించినది. ఒక్కోప్రాంతం రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రభుత్వం దీని కొరకు ప్రత్యేక నిధులను కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా గజాభిమానుల నుండి విరాళాలను సేకరించారు.
అలాంటి సమయంలో కెనడాకు చెందిన ప్రముఖ సినీ దర్శకురాలు " పాట్రికా సిమ్స్" నటుడు  "విలియం షాట్నర్" జత కలిశారు. వీరిరువురూ గజాల పట్ల మక్కువ, ప్రేమ, అభిమానం కలిగిన వారు. ఏనుగు పెంపక దారులలో చైతన్యం కలిగించడానికి ఎలిఫెంట్ రీ ఇంట్రడక్షన్ ఫౌండేషన్ స్థాపించిన దశాబ్ద కాలం పూర్తి అయిన సందర్బంగా "రిటర్న్ టు ది ఫారెస్ట్" అన్న అరగంట నిడివి గల డాక్యూమెంటరీ నిర్మించారు. ఎంతో హృద్యంగా నిర్మించిన ఈ చిత్రానికి వ్యాఖ్యాత నటుడు విలియం షాట్నర్. ఆయన తన నవరసాలు పలికే గొంతుతో గొప్పగా చిత్రములోని అసలు ఉద్దేశ్యాన్ని హృదయాలను కదిలించేలా చెప్పారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం విడుదల సమయానికి ఈ సంస్థ వారు వంద ఏనుగులను పెంపకందారులు నుండి తీసుకొని అరణ్యాలలో వదిలారు. ఈ విజయానికి గుర్తుగా సిమ్స్ 12.08.2012ని "ప్రపంచ ఏనుగుల దినోత్సవం"గా ప్రకటించారు.నాటి నుండి ఆగస్టు పన్నెండవ తేదీని ఏనుగుల దినోత్సవంగా పరిగణిస్తున్నారు.







విడుదలై వనాలలో విహరిస్తూ స్వతంత్రాన్ని అనుభవిస్తున్న గజరాజులు, రాణులకు  ఇరవై అయిదు మంది సంతానం కలిగారు. అన్ని కుటుంబాలు సుఖంగా ఉన్నాయని సంబంధిత వర్గాల వారు తెలియచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో ఎందరో ప్రముఖులు,వన్యప్రాణి       ప్రేమికులు, స్వచ్చంద సేవా సంస్థల వారు కలిశారు. ఎందరో ఏనుగుల అభిమానులు, ప్రకృతికి మానవాళికి వాటి అవసరాన్ని గుర్తించిన వారు కూడా విరాళాలుఇస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.
 ఏనుగుల సంతతి వృద్ధి చెందడానికి దర్శకురాలు సిమ్స్ తమ తరుఫున నుండి చేస్తున్న కృషిని మరింత ముందుకు కొసాగిస్తూ 2015వ సంవత్సరంలో "వెన్ ఎలెఫెంట్స్ వర్ యంగ్" అన్న రెండో డాక్యూమెంటరీ నిర్మించారు. వాయువ్య థాయిలాండ్ ప్రాంతంలోని ఒక కుగ్రామం లో నివసిస్తున్న ముఫై అయిదు మంది ఏనుగుల పెంపకం దారులలో ఒకడైన ఇరవై అయిదు సంవత్సరాల "ఓక్" మరియు అతని "నోంగ్ మయి" అనే పెంపుడు ఏనుగు గురించిన కధ. ఎంతో వ్యయప్రయాసలకోర్చినిర్మించిన ఈ చిత్రం అనేక చిత్రోత్సవాలలో ప్రశంసలు మరియు బహుమతులు అందుకొన్నాది. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కూడా విలియం షాట్నర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం ! రెండు చిత్రాలు కూడా థాయిలాండ్ నేపథ్యంలోనే నిర్మించడం మరో విశేషం !
ఈ సంస్థ వారు పెరిగిపోతున్నజల, వాయు, భూమి  కాలుష్యంగురించి దానికి విరుగుడుగా చెట్ల పెంపకం ఎంతగా దోహదపడుతుందో అన్న విషయాన్నీ సవివరంగా తెలుపుతారు.రోజుకు పాతిక కిలోమీటర్లు ఆహారం కోసం తిరిగే ఏనుగులు తమ మలం ద్వారా విత్తనాలను విసర్జించి అడవుల అభివృద్ధికి ఎలా  తోడ్పడతాయో అన్న విషయాల గురించి సదస్సులను నిర్వహించి, ప్రజలకు   ఏనుగుల గురించి అవగాహన కలిగిస్తున్నారు. వాటి వలన పర్యావరణానికి జరిగే మేలు గురించి వివరిస్తారు.








దర్శకురాలు సిమ్స్ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ వర్గాల వారిని కలుస్తూ తమ సంస్థ గురించి వివరిస్తుంటారు. ఆమే కాదు సంస్థలోని సభ్యులందరూ ఏనుగులను కాపాడుకోవడం గురించి ప్రజలకు తెలుపుతుంటారు. ఒక్క ఏనుగే కాదు ప్రతి ఒక్క జీవి ప్రకృతి మరియు పర్యావరణానికి సహకరిస్తాయి. అందుకని మనం కూడా వారితో జత కలుద్దాం. ఎందుకంటే మనం కూడా ఈ భూమి మీద జీవిస్తున్నాము. మనకీ స్వచ్ఛమైన పరిసరాలు, ఆహారం, నీరు, గాలి కావాలి కదా మరి !
(12.08. 2018 ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్బంగా )



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...