2, జులై 2019, మంగళవారం

Elephant race at Guruvayur




  ఆహ్లాదం  మరియు  ఆధ్యాత్మికతల కలయిక అనేయోట్టం


                                                                                              



భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలోని ఆలయాలలో ఏనుగు ఉండటం ఒక తప్పనిసరి ఆనవాయితీ. అన్ని ప్రముఖ దేవాలయాలు నియమంగా  గజ సేవ నిర్వహించడం కూడా ఒక సంప్రదాయంగా నెలకొని ఉన్నది. ప్రత్యేకంగా తయారు చేసిన ఆభరణాలు ధరించి,పుష్పాలతో తీర్చిదిద్దిన   అంబారీతో సుందరంగా అలంకరించిన ఏనుగు మీద నయనమనోహరంగా ముస్తాబు చేసిన ఉత్సవ మూర్తులను ఉపస్థితులను చేసి మాడ  లేదా నగరవీధులలో ఊరేగించడం అనాదిగా వస్తున్న ఒక సేవ లేదా సాంప్రదాయం.
 గజాలు చాలా తెలివిగలిగిన జంతువులు. సూక్ష్మ గ్రాహులు. నేర్పించే వాటిని సులభంగా గ్రహించగలవు. వాటి పెద్ద శరీరం, తల, చెవులు, దంతాలు, తొండం మరియు చిన్న తోక అన్నింటికీ మించి వాటి నడక చూపరులను దృష్టి మరల్చుకోకుండా చేస్తాయి. ప్రజలకు ఏనుగుల పట్లగల ఆకర్షణ అంతులేనిది.  వాటి విన్యాసాలను చూడటానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఏనుగులు పర్యాటకకులకు ప్రధాన ఆకర్షణగా  నిలుస్తున్నాయి.
ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఏనుగుల పట్ల గల ఆదరాభిమానాలు ఎనలేనివి. వారి పర్వదినాలలో జరిగే ఉత్సవాలలో ఏనుగుకు  ఉన్న స్థానం ప్రత్యేకమైనది. కేరళీయులు అభిప్రాయంలో ఏనుగులు లేని ఉత్సవం ఉత్సవం కానే  కాదు. అందులోనూ ఊరిలోని ఆలయ ఉత్సవం అయితే  అస్సలు తగ్గే ప్రసక్తి లేదు. తమ గ్రామంలో ఏనుగు లేక పోతే లక్షల రూపాయల అద్దె పోసి తీసుకొని రావడానికి సిద్ధపడతారు. అక్టోబర్ నుండి ఏప్రిల్ మధ్యకాలంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల ఉత్సవాలు వరసగా జరుగుతాయి.ఆ సమయంలో ఏనుగుల పెంపకందారులు, ఏనుగులు కలిగిన ఆలయాల వారు వారి ఏనుగులు  క్షణం తీరిక లేకుండా ఉంటారు. మలయాళీలకు ఏనుగు పట్ల అంతటి వ్యామోహం.
అందువల్లనే తమ ఆరాద్య దైవాలకు ఏనుగులనే కానుకగా సమర్పించుకొంటుంటారు. ముఖ్యంగా  శ్రీ గురువాయూరప్పన్ కి అత్యధిక సంఖ్యలో ఏనుగులను బహుమతిగా రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు ఇచ్చారు . అలా వచ్చిన ఏనుగుల కొరకు "పునత్తూరు కోట" అనే ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. నేడు సుమారుగా అరవై కి పైగా ఏనుగులు గల గురువాయూర్ దేవస్థానం గతంలో  ఒక్క ఏనుగు లేని పరిస్థితిలో ఉన్నదంటే నమ్మగలమా ! కానీ అది చరిత్రలో లిఖించబడిన నిజం. ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లలో ఒక్క ఏనుగు కూడా లేని రోజుల గురించి గురువాయూర్ ఆలయ చరిత్రలో ఉదాహరించబడినట్లుగా తెలుస్తోంది. చుట్టుపక్కల ఆలయాల వారు స్వచ్చందంగా వచ్చి ఉత్సవాలలో పాల్గొనేవారట.

గత చరిత్ర  

ప్రశాంతంగా ఉన్న కేరళలో  వాస్కోడిగామా అడుగు పెట్టడంతో అలజడులు మొదలయ్యాయి. నాటి దాకా  కాలికట్ (కోళికోడ్) పాలకులైన జొమారిన్ రాజులకు, కొచ్చిన్ వంశ పాలకులకు మధ్య ఉన్న సత్సంబంధాలు పోర్చుగీసు వారి రాకతో విచ్చిన్నమయ్యాయి. 
పదిహేనో శతాబ్ద కాలంలో గురువాయూర్ జొమారిన్ రాజులు ఎక్కువగా ఆరాధించే శ్రీ కృష్ణుడు కొలువైన చిన్న ఆలయం మాత్రమే!  ఆలయానికి ప్రత్యేక గజం అంటూ లేదు. ఇవ్వడానికి రాజులకు గజసంపద లేదు. ఆలయ ఉత్సవాల కొరకు నేటి కొడంగళ్ళూరుకు సమీపంలోని "త్రిక్కనమతిలకం" ఊరి విష్ణు ఆలయ గజరాజును తీసుకొని వచ్చేవారు. ఈ ప్రాంతం కొచ్చిన్ రాజుల పాలనలో ఉండేది. పాలకుల మధ్య తలెత్తిన విభేదాలు ఆలయ నిర్వాహకులకు దాకా   వ్యాపించాయి. దానితో త్రిక్కనమతిలకం ఆలయం వారు గురువాయూర్ ఆలయ ఉత్సవాలకు ఏనుగును ఇవ్వడానికి నిరాకరించారు.
ఉత్సవ సమయం దగ్గర పడింది. ఏనుగు లేదు. అద్దెకు తెచ్చే ఆనవాయితీ లేదు. ఆలయ నిర్వాహకులకు ఏమి చేయాలో పాలుపోలేదు. అప్పుడొక చిత్రం జరిగింది. సరిగ్గా ఉత్సవాలు ఆరంభమయ్యే సమయానికి త్రిక్కనమతిలకం ఆలయానికి చెందిన ఏనుగు తనంతట తానుగా గురువాయూర్ చేరుకొన్నది. దాని పాదాలకు ఉన్న తెగిన గొలుసులను చూడగానే అది వాటిని తెంపుకొని వచ్చింది అని అర్ధమయ్యింది. గురువాయూర్ కి త్రిక్కనమతిలకం నూట ఇరవై కిలోమీటర్ల దూరం .
విషయం తెలుసుకొన్న త్రిక్కనమతిలకం ఆలయ నిర్వాహకులు ఆశ్చర్యం చెంది వచ్చి గురువాయూరప్పన్ ని దర్శించుకొని తమ తప్పిదనానికి క్షమాపణలు చెప్పుకొన్నారు.  ఉత్సవంలో పాలుపంచుకున్నారు. ఇక్కడ ప్రస్తావించవలసిన  విషయం ఏమిటంటే పోర్చుగీసు వారి తరువాత జొమారిన్ రాజులతో స్నేహం చేసిన డచ్చి వారు  ఆ రోజులలో ప్రముఖ క్షేత్రంగా పేరొందిన త్రిక్కనమతిలకం ఆలయాన్ని 1755వ సంవత్సరంలో పూర్తిగా నేలమట్టం చేయడం.

ఉత్సవాల ఆలయం  

కేరళ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి శ్రీ గురువాయూరప్పన్ కొలువైన గురువాయూర్ ఆలయం. విశేష పౌరాణిక చారిత్రక విశేషాలు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి. స్థానిక  హిందూ సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించే ఆలయాలలో ఒకటి. 
ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు రాష్ట్రం నుండి మరియు సుదూర ప్రాంతాల నుండి శ్రీ గురువాయూరప్పన్ దర్శనార్ధం తరలి వస్తుంటారు. నటన సూత్రధారి అయిన శ్రీ కృష్ణుడు కొలువైన క్షేత్రంలో రోజుకొక విశేష పూజ జరుగుతుంది. అష్టమి తిధి మరియు రోహిణి నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు జరుపుతారు. ప్రతి నెల ఒక ఉత్సవం రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 
అన్నింటి లోనికి మళయాళ పంచాంగం ప్రకారం కుంభం మాసంలో పది రోజుల పాటు జరిగే ఆలయ ఉత్సవాలు ముఖ్యమైనవి. కుంభం మాసం పుష్యమీ నక్షత్రం రోజున ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 
ఆ రోజు ఉదయం ధ్వజారోహణ, కలశ పూజ నిర్వహిస్తారు. తరువాత ఏనుగు మీద ఊరేగవలసిన వాసుదేవుని ఉత్సవిగ్రహాన్ని ప్రధాన పూజారి తన చేతులలో ఉంచుకొని మేళతాళాల మధ్య మాడ వీధులలో ఊరేగిస్తారు. ఆలయంలో ఏనుగు లేని రోజులకు గుర్తుగా నిర్వహించే దీనిని  "అనయిళ్ళ సీవేళి" అని అంటారు. ఆ రోజు సాయంత్రం "అనే యోట్టం" జరుగుతుంది. త్రిక్కనమతిలకం నుండి ఏనుగు తనంతట తానుగా ఆలయ ఉత్సవాల రోజున చేరుకొన్న సంఘటనకు గుర్తుగా  దీనిని నిర్వహిస్తున్నారు. 
ఈ పది రోజులు కథాకళి నాట్యాలు,  పౌరాణిక నాటకాలు, ఇతర నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో పేరొందిన నాట్యకారులు, సినీ నటులు వీటిల్లో పాల్గొంటారు. చివరి రోజున "ఆరట్టు"(పవిత్ర స్నానం) తో ఉత్సవాలు ముగుస్తాయి. శబరిమల భక్తుల సందడి సద్దుమణిగిన తరువాత ఆరంభమయ్యే ఈ ఉత్సవాలు గురువాయూర్ శోభను ఇనుమడిస్తాయి. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం భక్తులను అలరిస్తాయి. అన్నింటిలోకీ   అనే యోట్టం ప్రధానమైనది. 

అనెయోట్టం 

మలయాళంలో అనే అంటే ఏనుగు. అనె యోట్టం అనగా గజరాజుల పరుగు మరియు విందు  అని అర్ధం. దేవస్థానానికి ఉన్న గజాలలో బలమైన, ధృడమైన ఆరోగ్యవంతమైన కొన్ని గజాలను ఎంపిక చేస్తారు. వీటి సంఖ్య అయిదు నుండి ముప్పై దాకా ఉంటుంది. వీటి మధ్యనే  పరుగు పందెం ఉంటుంది. ఇవి పరుగు పందెంలో పాల్గొనడానికి తగిన ఆరోగ్యంతో ఉన్నాయని దేవస్థాన పశు వైద్యులు ధృవీకరించాలి. గతంలో దేవస్థానం వారు స్వతంత్రంగా వ్యవహరించేవారు. కానీ 1986 వ సంవత్సరం నుండి ఏనుగులను రక్షించవలసి జంతువుల జాబితాలో చేర్చడం వలన  అటవీ శాఖ వారు,జంతు సంరక్షణ సమితీ వారు ప్రస్తుతం ఈ కార్యక్రమానికి  పర్యవేక్షకులుగా వ్యహరిస్తున్నారు. పోలీసువారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు.  
మధ్యాహన్నం మూడు గంటలకు పందెం ఆరంభం అవుతుంది. పరుగెత్తాల్సిన దూరం అయిదు వందల మీటర్లు.  గురువాయూర్ ఊరిలోనికి ప్రవేశించే ముందు ఆలయ తూర్పు ద్వారానికి వెళ్లే దారి వద్ద  పెద్ద గరుడ పక్షి బొమ్మ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని "మంజులాల్" అంటారు.  గజాలు వాటి మావటీలు సరిగ్గా రెండు గంటల నలభై అయిదు నిమిషాలకు అక్కడికి చేరుకొంటారు. 
పందెం ఏమిటంటే మంజులాల్ నుండి పరుగు ప్రారంభించి నేరుగా ఆలయ తూర్పు ద్వారం గుండా లోనికి ప్రవేశించి గర్భాలయానికి ఏడు  ప్రదక్షణలు  చేసి తిరిగి వెలుపలికి రావాలి. అలా మొదటగా తూర్పు ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన  గజాన్ని విజేతగా నిర్ణయిస్తారు. ఎన్ని ఏనుగులు పందెంలో పాల్గొన్నా మొదటి  మూడు  గజాలనే ఆలయం లోనికి అనుమతిస్తారు. మిగిలినవి వెలుపలే నిలిచి పోతాయి. ఈ పందెంలో విజేత ఒక సంవత్సరం పాటు ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాలలో "తిరంబు"(ఉత్సవిగ్రహం) ను ఊరేగించే  అవకాశాన్ని దక్కించుకొంటుంది. గత మూడు సంవత్సరాలుగా " గోపి కన్నన్" విజేతగా నిలవడం విశేషం. పందెం ముగిసిన తరువాత దేవస్థానం వారు అన్ని గజాలకు ప్రత్యేక అనె యోట్టం(విందు) ఏర్పాటు చేస్తారు. 
ఏనుగుల పరుగు పందెం ఆద్యంతం ఉల్లాస మరియు ఉత్సాహభరిత  వాతావరణంలో జరుగుతుంది. స్థానికులు,దేశవిదేశాల పర్యాటకులు మరియు భక్తులు తరలివస్తారు. ఏనుగులు తరలి రావడంతో వారి ఆనందహేలలు మొదలవుతాయి. పందెం ఆరంభం కాగానే వారి ఉత్సాహం పూర్తిగా హద్దులు దాటుతుంది. తమ అభిమాన ఏనుగును ప్రోత్సహిస్తూ కేకలు పెడుతుంటారు. వాటితో పాటు పరుగులు పెడతారు. ఆ నాలుగు గంటల కాలం గురువాయూర్ సందర్శించే ప్రతి ఒక్కరూ ఆ సంబరంలో భాగం అయిపోతారు. మరపురాని అనుభవాన్ని సొంతం  చేసుకొంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

(అనె యోట్టం గురించిన పూర్తి సమాచారాన్నిచ్చిన మిత్రులు, గురువాయూర్ దేవస్వం పూజారి శ్రీ రాజేష్ నంబూద్రి కి కృతజ్ఞతలు )





    


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...