4, అక్టోబర్ 2020, ఆదివారం

Kachabeshwara Temple, Thirukachur

                    మహాకూర్మం కొలిచిన మహేశ్వరుడు 


మన దేశంలో గ్రామగ్రామాన, పట్టణ నగరాలలో ఎన్నో ఆలయాలు నెలకొని ఉన్నాయి. అన్నింటిలోనూ చరాచర సృష్టికి మూలాధారమైన ఈశ్వరుడే వివిధ నామాలతో రూపాలలో కొలువై ఉన్నారన్నది పెద్దల మాట, వీటిల్లో కొన్ని చోట్ల స్వయంభూ గా, మరికొన్ని చోట్ల స్వయంవ్యక్త గా మిగిలిన క్షేత్రాలలో ప్రతిష్ఠిత మూర్తిగా సర్వేశ్వరుడు ప్రజల పూజలు అందుకొంటున్నారు. పరమాత్మకు చేసే వివిధ పూజలు, సేవల సమయంలో పఠించే వేదం మంత్రాల కారణంగా దేవాలయ ప్రాంగణంలో ఇది అని చెప్పలేని గొప్ప అనుకూల శక్తి నెలకొని ఉంటుంది. అనిర్వచనమైన ఆ శక్తి దైవ దర్శనానికి విచ్చేసే భక్తుల మదిలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించి స్థిరపరుస్తుంది. అంతులేని శాంతిని ప్రసాదిస్తుంది. అద్భుతమైన ఆనందాన్ని అందిస్తుంది. కానీ అదే శక్తి కారణ జన్ముల హృదయ అంతరాంతరాలలో పూర్వ జన్మ పుణ్య ఫలాన అంతర్యామి పట్ల  ఏర్పడిన అనుభూతులను,భావాలను,భక్తిని అసంకల్పితంగా వెల్లడించేలా చేస్తుంది. 
అలా జన్మించిన మహానుభావులకు యుగయుగాలుగా భారత దేశం పేరొందినది. వారు లోకరక్షకుని పట్ల తమకు గల అచంచల భక్తిని వివిధ మార్గాల్లో వెలిబుచ్చారు. అలాంటి వాటిల్లో ఒకటి కీర్తన గానం. 







కేశవుడు కీర్తనా ప్రియుడు కదా ! భక్తులు తమ మదిలో అక్కడి మూలవిరాట్టును చూసిన ఆ క్షణంలో స్ఫురించిన లలిత లలిత పదాలను కూర్చి పాడిన పాటలు  అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొన్న పరమేశ్వరుని ప్రేరణనే అని విశ్వసిస్తారు. దాని వలన ఆయా క్షేత్రాలు  ఈశ్వర స్థిరనివాసాలుగా పేరొందాయి. 
కీర్తనలను పాడిన వారిని "నయనారులు" అని కీర్తనలను "పాటికాలు " అని పాడిన ప్రదేశాలను "పడాల్ పెట్ర స్థలాలు" అని పిలవ సాగారు. నిరంతర శివ నామస్మరణ చేస్తూ ఆలయ సందర్శనలో కాలం గడిపిన నయనారులు మానవాళికి అందించిన ఆలయాలు రెండువందల డెబ్భై అయిదు. వారు ఒక క్షేత్రంలో గానం చేస్తూ ఆ కీర్తనలో ఉదహరించిన మరో క్షేత్రాన్ని "తేవర వైప్పు స్థలాలు" గా ప్రసిద్ధి చెందాయి. ఇవి రెండువందల తొంభై ఒకటి. 









పడాల్ పెట్ర స్థలాలు తమిళ నాడులో అధికంగా ఉన్నా మిగిలిన రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాలైన శ్రీ లంక మరియు నేపాల్ లలో ఉన్నాయి. కానీ తేవర వైప్పు స్థలాలు మాత్రం ఒక్క తమిళనాడులోనే ఉండటం విశేషం. 
పురాణాల ప్రకారం నయనారులు సుమారు మూడు వేల సంవత్సరాలకు చెందిన వారు అన్న నమ్మకం ఉన్నది. కానీ శాస్త్రీయ పరిశోధనలు వీరు క్రీస్తు శకం ఆరు నుండి ఎనిమిది శతాబ్దాల మధ్య కాలానికి చెందిన వారుగా నిర్ధారించాయి. ఈ మహనీయులు సంచరించి ప్రేరణ పొందిన కాల నిర్ణయమే స్థిరం కానప్పుడు వీరు సందర్శించి కీర్తించిన నిరాకారుడు కొలువైన ఆలయాల నిర్మాణం ఏనాటిది ? స్వామి ఎప్పటి నుండి అక్కడ పూజలందుకొంటున్నారు ?
ఈ ప్రశ్నలకు సమాధానం ఆయా క్షేత్రాల పౌరాణిక గాధలు ఇస్తున్నాయి. ఈ క్షేత్రాల ప్రస్థాపన అనేకానేక పురాణాలలో మరియు పురాతన తమిళ గ్రంధాలలో ఉన్నట్లుగా తెలుస్తోంది.  నయనారుల పాటికాల ద్వారా పదుగురికి తెలిసిన మహోన్నత ఆలయాలను మనం ఈ నాడు సందర్శించుకోగలుగుతున్నాము.   
ఈ ఆలయాలు చిన్నవా లేక పెద్దవా అన్న విషయాన్ని పక్కన పెట్టి వాటి గాధలను పరిశీలిస్తే ప్రతి ఒక్క ప్రదేశం ఒక విశేషాన్ని కలిగి ఉంటాయి. 
అలాంటి విశేషము కలిగిన రెండు ఆలయాలను మనం సందర్శించుకొందాము. ఈ రెండు కూడా ఒకే ఊరిలో ఉండటం మరో విశేషం. 







శ్రీ కచ్చభేశ్వర స్వామి ఆలయం, తిరుకచూర్ 

తమిళనాట ప్రసిద్ధి చెందిన నృసింహ క్షేత్రాలలో ఒకటి సింగ పెరుమాళ్ కోయిల్. లోకకంటకుడైన హిరణ్యకశ్యపుని సంహరించిన హరి ఇక్కడ యోగ ముద్రలో త్రినేత్రునిగా దర్శనమిస్తారు. ఇలా స్వామి త్రినేత్రునిగా కనిపించే ఆలయం ఇదొక్కటే ! ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్ధం వస్తుంటారు. 
చెన్నై నుండి చెంగల్పట్టు వెళ్లే మార్గంలో ఉన్న సింగపెరుమాళ్ కోయిల్ కి సమీపంలోని చిన్న గ్రామం "తిరుకచూర్". గతంలో కచ్చపూర్, కచ్చోర్, కచూర్ గా పిలువబడి గౌరవ వాచకం "తిరు " చేరికతో తిరుకచూర్ గా నేడు పిలవబడుతున్న ఈ ఊరు "రుద్రగిరి " పాదాల వద్ద ఉన్నది. ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న రెండు విశేష ఆలయాల పౌరాణిక గాధ మరియు చరిత్ర ఒకదానితో మరొకటి  ముడిపడి ఉండటం తెలిసికోవలసిన అంశం. ఈ ఊరి గాధ తొలి యుగం నాటి క్షిరసాగర మధనంతో సంబంధం కలిగి ఉన్నది. ఆలయ ఉత్సవాలు కూడా కలిపే చేస్తారు. కారణం రెండు ఆలయాలు కలిసి ఒకే పడాల్ పెట్ర స్థలంగా గుర్తించడమే !
తిరుకచూర్ కి ఈ పేరు రావడానికి, సర్వేశ్వరుడు ఇక్కడ శ్రీ కచ్చభేశ్వర్ స్వామిగా కొలువు తీరడానికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది. 
దేవదానవులు సంకల్పించిన క్షీరసాగర మధనంలో మందర పర్వతం కడలిలో మునిగిపోకుండా సహాయం చేస్తానని వైకుంఠవాసుడు వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి తగినదిగా భావించిన కూర్మావతారాన్ని ధరించ నిర్ణయించుకొన్నారు శ్రీహరి. తలపెట్టిన పని సక్రమంగా పూర్తి అవ్వడానికి, వాగ్దానభంగ దోషం తగలకుండా ఉండటానికి రుద్రగిరికి వచ్చి కైలాసనాధుని ధ్యానించారట. లోకరక్షకుని ప్రార్ధనను మన్నించిన లయకారుడు ఆయన చేపట్టిన విజయం కలిగేలా, దాని వలన లోకకల్యాణం చేకూరేలా ఆశీర్వదించారు. అలా తాబేలు రూపంలో శ్రీమన్నారాయణుడు తపస్సు చేసి మహేశ్వరుని అనుగ్రహం పొందిన స్థలంగా "తిరుకచూర్"గా  పిలవబడుతోంది. 
ఆలయం వెలుపల కూర్మ పుష్కరణి ఒడ్డున ఉన్న మండప స్థంభం పైన సగం కూర్మ సగం మానవ రూపంలో లింగాన్ని అర్చిస్తున్న శ్రీ మహా విష్ణువు శిల్పాన్ని చూడవచ్చును. 
రెండు ఎకరాల విశాల ప్రాంగణంలో చోళ  రాజులు నిర్మించబడిన ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. రాజగోపురం లేకుండా ఉన్న తూర్పు ద్వారం గుండా ప్రవేశించగానే కనపడే శివలీలా విన్యాస శిల్పాలు ఆకట్టుకొంటాయి. అన్నింటి లోనికి అన్నపూర్ణేశ్వరుడు నయనారులలో ప్రముఖుడైన "సుందరార్" కి స్వయంగా భోజనం పెడుతున్న శిల్పం. 
అరవై మూడు మంది శివ భక్తులైన నయనారులలో తొలి వారిలో ఒకరైన సుందరార్ నిరంతరం శివనామ స్మరణ చూస్తూ ఆలయ దర్శనం చేస్తుండేవారట. అలా పర్యటిస్తూ ఒకనాడు మధ్యహాన్న సమయానికి ఇక్కడికి చేరుకొన్నారట. ఆకలి దప్పలు దహించసాగాయట. కనుచూపు మేరలో మనుష్య సంచారం కనపడలేదట. ఆలయం వద్ద కూర్చొని ఇష్టదైవ ప్రార్ధన చేయసాగరట. కొద్దిసేపటిలోనే ఆలయ పూజారి వెలుపలికి వచ్చి నయనార్ ని సాదరంగా ప్రసాదం స్వీకరించడానికి లోనికి రమ్మని ఆహ్వానించారట. గౌరవ మర్యాదలతో, ఆప్యాయంగా ఆహారాన్ని వడ్డించారట. ఆ క్రమంలో నయనార్ కి ఆయన స్వయం అఖిలప్రియ వల్లభుడన్న నిజం  అర్ధమైనదట. నిజ  భక్తులనే ఆదుకొనే ఆపన్నమూర్తిని కీర్తిస్తూ గానం చేశారట. సంతసించిన స్వామి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారట. అలా తిరుకచూర్ పడాల్ పెట్ర స్థలంలో శాశ్విత స్థానాన్ని పొందినది. 
మహా మండపం నుండి గర్భాలయానికి చేరుకొనే మార్గం కొంత భిన్నంగా ఉంటుంది. అన్ని ఆలయాలలో సహజంగా రాజద్వారానికి ఎదురుగా ప్రవేశ మార్గ కనపడదు. నిర్మాణానికి దక్షిణంలో ఉన్న మండపం గుండా లోనికి వెళితే ముఖ మండపంలో తొలుత దర్శనం ఇచ్చేది శ్రీ త్యాగరాజ స్వామి. చక్కని అలంకరణలో కనపడతారు ఉత్సవమూర్తి. పక్కనే పడమర ముఖంగా ఉన్న సన్నిధి అమ్మవారు శ్రీ సుందరాంబికై ది. దసరా నవరాత్రులలో అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. త్యాగరాజస్వామికి, అమ్మకి మొక్కి లోనికి వెళితే అక్కడి గోడలన్నీ వివిధ కాలాలకు చెందిన శాసనాలతో నిండి పోయి కనపడతాయి. ఇవన్నీ గతంలో ఈ ఆలయాన్ని పాలకులు విశేషంగా ఆదరించారు అన్న విషయాన్ని తెలుపుతాయి. ఒకటి రెండు తెలుగు శాసనాలు కూడా కనపడటం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ గోడల క్రింద క్షీరసాగర మధనాన్ని చిన్న చిన్న శిల్పాల రూపంలో మలచారు. 
గర్భాలయంలో శ్రీ కచ్చభేశ్వర స్వామి చెందన కుంకుమ అలంకరణంలో దర్శనమిస్తారు. ఉపాలయాలలో శ్రీ గణపతి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, నాగలింగం, శ్రీ కాశీవిశ్వనాధ లింగం, శ్రీ నటరాజ స్వామి మరియు తొలి నయనారులైన శ్రీ అప్పర్, సంబంధార్, సుందరార్ మరియు శ్రీ మాణిక్య వాచకర్ ఉపస్థితులై ఉంటారు. వీరి నలుగురిని కలిపి "నల్వర్" అని పిలుస్తారు.   
  
 











గర్భాలయ వెలుపలి గోడలలో వినాయకుడు, లింగోద్భవ మూర్తి,  దుర్గ,బ్రహ్మ ఉంటారు. నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. ఈ ఆలయంలో చూడదగ్గ మరో విశేషం ఇరవై ఏడు స్తంభాలతో కూడిన నక్షత్ర మండపం. ఇందులోని ఒక్కో స్థంభం ఒక్కో జన్మనక్షత్రానికి ప్రతీక అని తెలుపుతారు. శ్రీ కూర్మనాధుడు కైలాసనాధుని పూజిస్తున్న శిల్పం మరియు అంజనా పుత్రుడు ఒక చేత్తో లింగాన్ని అర్చిస్తూ మరో చేత్తో  గంట కొడుతున్న అరుదైన శిల్పాలను ఈ మండప స్తంభాల పైన రమణీయంగా మలిచారు. 









ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఏడు గంటల వరకూ భక్తుల కొరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో రోజుకు నాలుగు పూజలు చేస్తారు. త్రయోదశి నాడు ప్రదోష పూజలు చేస్తారు. 
శివరాత్రికి, నవరాతులలో, గణేశ చతుర్థి, శ్రీ సుబ్రమణ్య షష్టి, తమిళ ఉగాది, దీపావళి, సంక్రాతి పర్వదినాలలో విశేష పూజలుజరుపుతారు . చైత్రమాసంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను, చైత్ర పౌర్ణమి నాడు రథయాత్ర ఘనంగా నిర్వహిస్తారు. 
సింగపెరుమాళ్ కోయిల్ రైల్వే స్టేషన్లో చెంగల్పట్టు వెళ్లే అన్ని లోకల్ సబర్బన్ రైళ్లు ఆగుతాయి. అక్కడ నుండి ఆటోలో తిరుకచూర్ చేరుకోవచ్చును. 

నమః శివాయ !!!!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...