19, మార్చి 2018, సోమవారం

Sri Trivikrama Swamy Temple, Cherukuru

               


                 శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయం, చెరుకూరు 


                                                                                                   




లోకసంరక్షణార్ధం శ్రీ మహావిష్ణువు దశావతారాలను ధరించారని మనందరికీ తెలుసు.  తెలియని విషయం ఏమిటంటే ఆ దశావతారాల ఆలయాలు కలిగిన ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరే రాష్ట్రానికి ఆ గౌరవం దక్కలేదంటే అతిశయోక్తి కాదు. కొందరు కేరళలో కూడా దశావతార ఆలయాలు ఉన్నాయి అని అంటారు. కానీ అది సరి కాదు. అక్కడ శ్రీ కల్కి అవతార ఆలయం లేదు. (ఆ పది ఆలయాల వివరాల కొరకు  ఈ బ్లాగ్లో Rare Temples of Andhrapradesh చూడగలరు). 
సహజంగా మనం రామ, కృష్ణ లేక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను ఎక్కువగా చూస్తుంటాము. కొంత వరకు అనంతశయన లేక శ్రీ రంగనాయక స్వామి ఆలయాలు కూడా కనపడతాయి మనరాష్ట్రంలో ! కానీ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, పరశురామ ఆదిగాగల అవతార ఆలయాలు మన రాష్ట్రం లోని వివిధ జిల్లాలలో ఉన్నాయి. అదే విధంగా అత్యంత అరుదైన వామన లేదా త్రివిక్రమ ఆలయం ఒకటి మన రాష్ట్రంలోని బాపట్ల దగ్గర లోని చెరుకూరు గ్రామంలో కలదు.
తమిళనాడులోని కంచి మరియు తిరుక్కోవిలూరు లలో కూడా శ్రీ త్రివిక్రమ ఆలయాలున్నాయి. ఆ రెండు ఆలయాలలో స్వామివారు పాతిక అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో కొలువై  ఉంటారు.  కేరళలో కూడా వామన మరియు త్రివిక్రమ ఆలయాలున్నాయి. కానీ అక్కడ చతుర్భుజ శ్రీ మహా విష్ణువు రూపంలో పూజలందు కొంటుంటారు. (ఈ ఆలయాల వివరాలు కూడా ఈ బ్లాగ్ లో కలవు)
కానీ చెరుకూరులో వెలసిన శ్రీ త్రివిక్రమస్వామి ఆలయం చాలా ప్రత్యేకతలు కలిగినది.




   


గతంలో చెరుకూరుని  "ఇక్షు పురి" అని పిలిచేవారు. ఇక్షు అంటే చెఱకు. అదే కాలక్రమంలో చెరుకూరుగా మారింది అని చెబుతారు. చోళులు, పల్లవులు, చాళుక్యులు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చారిత్రక మరియు శాసనాధారాలు తెలుపుతున్నాయి.
ద్వారసముద్రం (హళిబేడు)ని రాజదానిగా చేసుకొని పాలించిన హొయసల వంశ రాజులలో ప్రఖ్యాతుడు విష్ణువర్ధన్ మహారాజు. దక్షిణాదిన ఎన్నో ప్రాంతాలను తన అధీనం లోనికి తెచ్చుకొన్నాడు. దిగ్విజయ యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వెళుతూ ఇక్కడ బస చేశారు. 
అప్పుడు సరస్సు ఒడ్డున చెట్టు నీడన లేత గులాబీ వర్ణంలో  ఏకశిలా విగ్రహ రూపంలో శ్రీ త్రివిక్రమ స్వామి దర్శనమిచ్చారు. శ్రీ రామానుజాచార్యులు శిష్యుడైన విష్ణువర్ధనుడు భక్తితో ప్రణమిల్లి పూజాదులు నిర్వహించాడు.










అనంతరం తనతో ఉన్న శిల్పులను పిలిచి విగ్రహాన్ని కదిలించకుండా ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. కారణమేమిటంటే విగ్రహం భూమిలో యెంత లోతుగా ఉన్నదో తెలియకపోవడమే ! శిల్పులు తొలుత నాలుగు  దిశలా మండపాలను నిర్మించారు. తదనంతరం రామాయణ, భాగవత మరియు భారత గాధల శిల్పాలను రమణీయంగా చెక్కిన రాళ్లతో గర్భాలయాన్ని నిర్మించారు. రాజు ఆలయ నిర్వహణకు కొన్ని గ్రామాల ఆదాయాన్ని తన వంతు కైకర్యంగా సమర్పించుకున్నాడు.
















తదనంతర కాలంలో ఎన్నో రాజవంశాలు వారు శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసినట్లుగా ఆలయం లో లభించిన శాసనాలు తెలియజేస్తున్నాయి. అలా తరతరానికి అభివృద్ధి చెందిన ఆలయం నరసరావుపేట జమీందారు శ్రీ వేంకట నరసింహారావు బహద్దూర్ గారి కాలంలో శిఖరాగ్రానికి చేరుకొన్నది. ప్రస్తుతం కనపడుతున్న పెక్కు నిర్మాణాలు ఆయన కాలంలో నిర్మించబడినవి. 









ఆస్థాన మండపంలో ఉన్న గరుడ స్థంభం పైన చెక్కబడిన శాసనం ఆలయం గురించి పెక్కు సమాచారం అందిస్తోంది. ధ్వజస్థంభం పక్కనే అంజనాసుతుడు స్వామివారి సేవకు సిద్ధం అన్నట్లుగా ముకుళిత హస్తాలతో స్థానిక భంగిమలో కొలువై ఉంటారు. 
గర్భాలయంలో సుమారు తొమ్మిదిన్నర అడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల వెడల్పు గల లేత గులాబీ వర్ణ శిల మీద కుడి పాదం వద్ద ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, శుక్రాచార్యుడు
ఉండగా, ఆకాశాన్ని తాకుతున్న ఎడమ పాదాన్ని బ్రహ్మాది దేవతలు కడుగుతుండగా, పక్కనే నారద తుంబురాదులు ఆనంద గానం చేస్తుంటారు. స్వామి వారు దండం, కమండలం, ఛత్రం శంఖు చక్రాలను, పాదాలకు పావుకోళ్ళను ధరించి నయనమనోహర రూపములో దర్శనమిస్తారు.   
ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో ప్రతి నిత్యం వైఖానస ఆగమనం ప్రకారం పూజాదికాలు నిర్వహిస్తారు. వామన జయంతి, వైకుంఠ ఏకాదశి, శ్రీ రామనవమి, ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు.  చెరుకూరు లో శ్రీ అగస్త్య మహాముని తన దక్షిణ భారత దేశ పర్యటన సందర్బంగా కొంతకాలం భార్య లోపాముద్ర, శిష్యప్రశిష్య బృందంతో విడిది చేసినట్లుగా స్థల పురాణం తెలుపుతోంది. ఆ సమయంలో ఆయన భార్య కోరిక మేరకు పంచ శివలింగ ప్రతిష్టించినట్లుగా తెలుస్తోంది. అవి చెరుకూరు, ఉప్పుటూరు, కొమ్మూరు, మోటుపల్లి మరియు పంగులూరు. 
చెరుకూరులో ప్రతిష్టించిన శివాలయం తప్పక సందర్శించవలసినది. శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయ సమీపంలోనే ఉంటుంది. 
చెరుకూరు బాపట్ల పట్టణం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాపట్ల లోని పురాతన శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం దర్శించుకోవడం వాంఛనీయం !

జై శ్రీమన్నారాయణ !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...