28, నవంబర్ 2017, మంగళవారం

Sri Bhavannarayana Swamy Temple, Bapatla

శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం 

ఆంధ్రప్రదేశ్ లోని పురాతన ఆలయాలలో ఒకటి బాపట్ల లో ఉన్న శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం. 
శ్రీ మహావిష్ణు అవతారాలైన శ్రీ భావన్నారాయణ మరియు చెన్నకేశవ స్వామి ఆలయాలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కనిపిస్తాయి. 
బాపట్ల, పొన్నూరు, పెద్ద  గంజాం (ప్రకాశం జిల్లా ), భావదేవరపల్లి (కృష్ణాజిల్లా. అవనిగడ్డ నుంచి 15కిలోమీటర్లు), సర్పవరం (కాకినాడ దగ్గర) ఈ అయిదు చోట్ల పురాతన శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయాలు కలవు. 
నైమిశారణ్యంలో అగస్థ్య మహర్షి మునులకు శ్రీ భావన్నారాయణ తత్వం గురించి విశిదీకరించారని బ్రహ్మ వైవర్తన పురాణం పేర్కొంటోంది. స్వామి భక్త రక్షకుడు. నిత్య జీవితంలో అనుకోకుండా ఆపదలలో లేదా అపవాదాలు ఎదుర్కొనే వారిని కాపాడేవాడు. దీనికి ప్రమాణం పొన్నూరు సాక్షి భావన్నారాయణ స్వామి. 
స్వామివారి పేరు మీదగా భావపురి గా పిలువబడి, కాలక్రమంలో బాపట్లగా మారిన ఈ ఊరిలో స్వామి కొలువు తీరడం వెనక ఉన్న పురాణ గాధ ఇదుమిద్దంగా తెలియరాలేదు. 












కానీ ప్రస్తుత ఆలయం చోళ రాజుల నిర్మితంగా శాసనాల ఆధారంగా తెలుస్తోంది. చోళ సామ్రాజ్యం పదమూడో శతాబ్దం నాటికి పూర్తిగా క్షీణించి పోయింది. ఒకటవ, రెండవ కుళో త్తుంగ చోళ రాజుల కాలంలోనే చోళ సామ్రాజ్యం నేటి ఒడిషా మరియు ఛత్తీస్ ఘడ్ వరకు విస్తరించినది అని చరిత్ర పుస్తకాలలో ఉన్నది. ఒకటవ కుళోత్తుంగుడు  శివ మతాభిమాని.
కనుక రెండవ కుళోత్తుంగుని కాలంలోనే బాపట్ల భావన్నారాయణ ఆలయ నిర్మాణం జరిగి ఉండాలి.








పంతొమ్మిదో శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ఆలయాన్ని అభివృద్ధి చేసారని శాసనాధారాలు తెలుపుతున్నాయి.  
శ్రీమన్నారాయణుడు క్షీర  భావన్నారాయణ స్వామిగా పూజలందుకునే ఈ ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి తాయారు, శ్రీ ఆండాళ్, శ్రీ కేశవ స్వామి, శ్రీ రంగనాయక, శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ రామ ఆదిగా గల దేవతల సన్నిధులతో పాటు వైఖానస, గరుడాళ్వార్, పన్నిద్దరు ఆళ్వారుల సన్నిధులు కూడా కలవు.
ఇవన్నీ గర్భాలయం చుట్టూ, ప్రదక్షిణా ప్రాంగణంలోనే నెలకొని ఉండటం విశేషం.


 





పూర్తిగా రాతి నిర్మిత ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. చోళ నిర్మాణమైన ఎక్కడా వారు నిర్మించిన అనేక ఆలయాలలో మాదిరి  శిల్పకళ కనపడదు. కానీ వెలుపలి గోడలపైన ఎన్నో తమిళ మరియు తెలుగు శాసనాలు చదవ గలిగే స్థితిలో కనపడతాయి.
శనివారాలలో విశేష పూజలు జరుగుతాయి. తొలి  ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ముఖ్యమైన పండుగలు.  శ్రీ రామనవమికి, కృష్ణ జన్మాష్టమి ఇతర శ్రీ వైష్ణవ పర్వదినాలను  కూడా వైభవంగా జరుపుతారు.








ధనుర్మాసంలో తిరుప్పావై గానం చేస్తారు. భోగి నాడు శ్రీ గోదా కళ్యాణం రంగరంగ వైభవంగా జరుపుతారు.
పాత  రాజ గోపురం 2011వ సంవత్సరంలో కుప్పకూలిపోయింది. ప్రస్తుతం నూతన గోపుర నిర్మాణం జరుగుతోంది.
ఆలయం ఉదయం ఆరు నుండి పదకొండున్నర వరకు, తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఏడున్నర వరకు తెరచి ఉంటుంది.










బాపట్ల విజయవాడ చెన్నై ప్రధాన రైలు మార్గంలో ఉన్నది. పెక్కు రైళ్లు ఇక్కడ ఆగుతాయి. 
అదే విధంగా గుంటూరు, విజయవాడల నుండి అపరిమిత బస్సు సౌకర్యం లభిస్తుంది. 
ఒంగోలు లేదా చీరాల నుండి కూడా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చును. 
వసతి సౌకర్యాలు లభిస్తాయి. 
సమీపంలోని సూర్య లంక సముద్ర తీరం సందర్శించవలసిన ప్రదేశం. 

 ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది.  

జై శ్రీ మన్నారాయణ !!!! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...