8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

Palamuthircolai sri Subrahmanya Temple

                పలమదురై చోళై - శ్రీ సుబ్రమణ్య ఆలయం 


తమిళనాడులో ఎన్నో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయి. కానీ ఒక ఆరు ఆలయాలు మాత్రం ప్రత్యేకమైనవి.  అవే "ఆరుపాడై వీడు" గా పిలవబడే "పళని, తిరుత్తణి, స్వామిమలై, తిరుప్పఱైకుండ్రం,పలమదురై చోళై మరియు తిరుచెందూర్. 
ఈ విషయాన్నీ ప్రసిద్ధ తమిళ కవులు మరియు మురుగన్ భక్తులైన "నక్కీరర్ మరియు అరుణగిరినాథర్" తమ ప్రసిద్ధ కావ్యాలలో పేర్కొన్నారు. 
తమిళ పురాణాలలో పేర్కొన్న మరో  ముఖ్య  విషయం ఏమిటంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొండల దేవుడు. ఈ కారణంగా పార్వతీ నందనుని ఆలయాలు ఎక్కువగా పర్వతాల మీదనే ఉంటాయి. 










ఈ ఆరుపాడై వీడు ఆలయాలలో మొదటిది పళని లోని దండాయుధపాణి ది కాగా చివరిది మధురైకి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పలమదురై చోళై లో ఉన్న మురుగన్ ఆలయం. ఈ స్వామి గురించి పురాతన తమిళ గ్రంధాలైన "శిల్పాధికారం" లాంటివి వివరించాయి అని తెలుస్తోంది.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం సూరపద్ముని మరణానికే !
గతంలో సూరుడు మరియు పద్ముడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. వారు మహేశ్వరుని గురించి తపస్సు చేసి వారిద్దరూ ఒక శరీరంతో ఉండేట్లుగాను, వారికి శివ అయోనిజ సంతానం చేతిలో తప్ప మరణం లేకుండా వరం పొందారు.












ఆ వర గర్వంతో సూరపద్ముడు సమస్త లోకాలను తన పాలన లోనికి తెచ్చుకొని ప్రజలను అష్టకష్టాల పాలు  చేయసాగాడు. దేవతలు, మునులూ ఇతని బాధలను తట్టుకోలేక వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుకు తమ ఇబ్బందులను చెప్పుకొన్నారు.
దానికి ఆయన వారికి సర్వేశ్వరుని తపస్సుని భగ్నం చేయడం వలన ఆయన పార్వతీ దేవి వంక ఆకర్షితుడవుతాడని తద్వారా జన్మించే కుమారుని వలన సురాపద్ముని భాధ తొలగిపోతుందని సలహా ఇచ్చారు.
దాని ప్రకారం దేవతలు మన్మధుని ప్రగించారు. అతని బాణాలకు తపోభంగం కలిగి శివుడు ఆగ్రహంతో మూడో నేత్రం తో మన్మధుని భస్మం చేశారు.
అదే సమయంలో ఆయనను శాంతింపచేసిన పార్వతి పట్ల ఆకర్షణ చెంది తన తేజస్సుని విడిచారు.
దాని వేడిని వాయుదేవుడు మరియు అగ్ని దేవుడు తట్టుకోలేక గంగా తీరంలోని రెల్లుగడ్డి పొదలలో వదిలారు. ఈ క్రమంలో ఆ దివ్య తేజస్సు ఆరు భాగాలుగా విడిపోయి ఆరుగురు ముద్దు లొలికే బాలురుగా మారింది.
సంధ్యా సమయంలో కనిపించే "కృత్తికా నక్షత్రా"లు ఆ బాలురను శాఖ సాగారు.
విషయం తెలుసుకొన్న పార్వతీ దేవి గంగ తీరానికి వచ్చి ఆరుగు బాలాకులను ఒకేసారి కౌగలించుకొని "స్కందా " అని పిలిచింది. అంటే వారంతా ఆరు ముఖాలు పన్నెండు చేతులుగల ఒక బాలునిగా మారి పోయారు.
అతనే షణ్ముఖుడు, శరవణుడు, కుమారస్వామి, కార్తికేయుడు.
శ్రీ హరి ఇతర దేవత సహకారంతో కుమారుడు సురాపద్ముని అసహాయుడి చేశారు. చివరకు అసురుని ప్రార్థనలను మన్నించి అతనిని తన నెమలి వాహనం గా చేసుకొన్నారు.
ఈ ఆరు పాడి వీడులలో స్కందుడు కొలువుతీరడానికి వెనుక ఒక్కో క్షేత్రానికి ఒక్కో పురాణ గాధ ఉన్నది.
ఇక్కడ కుమార స్వామి తన భక్తురాలైన "అవ్వయ్యార్"భక్తిని పరీక్షించి తన దర్శనభాగ్యం ప్రసాదించారని పురాణ గాధ.








ఈమె సంగం శకం (క్రీస్తు శకం ఒకటి లేదా రెండో శతాబ్ద కాలం )కు చెందినదిగా తెలుస్తోంది. తన నిరంతర ప్రయాణంలో ఒక నాడు అలసి పోయిన ఆమె ఒక చెట్టు క్రింద కూర్చుండిపోయింది.
అప్పుడు ఒక కోయ బాలుడు ఆమె వద్దకు వచ్చి తినడానికి ఏమన్నా కావాలా అని అడిగాడట.
ఇవ్వమన్న అవ్వయ్యార్ తో ఆ బాలుడు వేడి పండు కావాలా లేక చల్ల పండు కావాలా అని అడిగాడట. అర్ధం కానీ ఆమె చూస్తుండగానే చెట్టు పైకెక్కి ఒక పండు ను క్రిందపడేసాడట.
అవ్వయ్యార్ దానికి తీసుకొని అంటిన మట్టిని నోటితో ఊది పోగొట్టడానికి ప్రయత్నిస్తుండగా పకపకా నవ్వుతూ బాలకుడు ఇప్పుడు అర్ధమైనదా వేడి పండు అంటే ఏమిటో ? అని ప్రశ్నించాడట.
అతడు సామాన్య బాలకుడు కాదు అని అర్ధం చేసుకొన్నఅవ్వయ్యార్ చేతులు జోడించి నిజ స్వరూపం చూపించమని అర్ధించినదట.
అలా ఆమె కోరిక మేరకు తన నిజస్వరూపదర్శనాన్ని బాల సుబ్రహ్మణ్యం ప్రసాదించింది ఇక్కడే నట !!






ఎత్తైన కొండల నడుమ, అత్యంత ఔషధ గుణాలు కలిగిన వృక్ష సముదాయం మధ్యలో ఉంటుంది ఈ ఆలయం.
గత పది సంవత్సరాలలో అభివృద్ధిచెందిన ఈ ఆలయం చిన్న రాజ గోపురం,విశాలమైన ముఖమండపం మూడు గర్భాలయాలతో ఉంటుంది.
దక్షిణ పక్క ఆలయంలో విఘ్న నాయకుడు,ఉత్తరం పక్క దానిలో శ్రీ లింగ రాజు,మధ్యలో ఉన్న దానిలో శ్రీ వల్లీ దేవసేనా సమేత మురుగన్ కొలువు తీరివుంటారు.
గతంలో ప్రధాన అర్చనా మూర్తుల బదులు ఒక రాతి వెల్ మాత్రమే ఉండేది.
తదనంతర కాలం లో ఈ విగ్రహాలను ప్రతిష్టించారు.
ఆరుపాడైవీడు దేవాలయాలలో ఇక్కడొక్క చోటే శరవనుడు తన ధర్మపత్నులతో దర్శనమిచ్చేది.
ఆలయ వృక్షం నేరేడు చెట్టు. సహజంగా నేరేడు చెట్లు జూన్ ఆగష్టు ఆమధ్య కాలంలో కాపుకు వస్తాయి. కానీ ఇక్కడి వృక్షం మాత్రం స్కంద షష్టి ఉత్సవం జరిగే అక్టోబర్ మరియు నవంబర్ మధ్యకాలంలో కాయలను కాస్తాయి. భక్తులు తమ ఇష్టదైవం యొక్క ప్రసాదంగా భావిస్తారు.








ఆలయం దాటి ఇంకా పైకి వెళితే అక్కడ "నూపుర గంగ"అనే జలప్రవాహం ఉంటుంది.  ఆరోగ్యప్రదాయనిగా భావించే ఈ ప్రవాహంలో భక్తులు స్నానం చేసి తమ ఆరాధ్య దైవం దర్శనము కొరకు వెళతారు.
ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలదాకా నిరంతరాయంగా భక్తుల కొరకు తెరిచి ఉండే ఆలయంలో ప్రతి నిత్యం ఎన్నో అభిషేకాలు,అర్చనలు, అలంకారాలు మరియు ఆరగింపులు చేస్తారు.
మంగళవారాలు, అమావాస్య,పౌర్ణమి రోజులలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. వైశాఖ కార్తీక మాసాలలో విశేష పూజలు, స్కంద షష్టి నాడు ఘనంగా ఉత్సవం నిర్వహిస్తారు.
ఆలయానికి చేరుకోడానికి రహదారి మార్గం మరియు చిక్కని అడవి గుండా సాగే నడక మార్గం ఉన్నాయి.



 అళగర్ పెరుమాళ్ కోవెల రాజ గోపురం 




కొండ క్రింద నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఒకటైన 'అళగర్ పెరుమాళ్ "ఆలయం ఉంటుంది.
ఎన్నో విశేషాల సమాహారం ఈ ఆలయం. ఆ వివరాలు త్వరలోనే !!!

హరోం హర !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...