12, ఆగస్టు 2017, శనివారం

Sri Ekambareswara Swamy Temple, Kanchipuram

                   శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం, కాంచీపురం 

దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందిన పంచ భూత ఆలయాలలో కాంచీపురం లోని శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఒకటి. 
భూమి, నీరు, నిప్పు, ఆకాశం, వాయువు కి ప్రతి రూపాలుగా సర్వేశ్వరుడు చిదంబరం, తిరువణ్ణామలై, జంబుకేశ్వరం, శ్రీ కాళహస్తి మరియు కాంచీపురాలలో పూజలందుకొంటున్నారు. 
కంచి లోనిది పృద్వీ (భూమి)కి ప్రతిరూపం. సైకత లింగం. 
ఏంతో  విశేషమైన పురాణ గాధ మరియు చారిత్రక నేపథ్యం గలిగిన శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం శివ కంచి లో ప్రధాన ఆలయంగా పరిగణిస్తారు. క్రీస్తు శకం ఆరో శతాబ్దం నుండి భక్త జనుల పూజలు అందుకొంటున్న శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఇక్కడ కొలువుతీరడం వెనకున్న పురాణ గాధ  సత్య యుగం నాటిదిగా తెలుస్తోంది.
ఒకనాడు ఇష్టోక్తులు సలుపుతున్న సమయంలో పార్వతి దేవి సరదాగా సదాశివుని రెండు కళ్ళను తన చేతులతో మూసివేసినదట. లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యచంద్రులైన ఆ నేత్రాలను మూయడం వలన అంతటా అంధకారం అలముకొన్నదట. చిలిపిచేష్ట అయినా లోకాలకు హాని చేసేది కావడం వలన మహేశ్వరుడు ఆమెను చీకటి తో సమానమైన నల్లని శరీరవర్ణం ధరించి  భూలోకంలో శరీర ఛాయ  తిరిగి గత వర్ణం సంతరించుకొనేవరకూ తపము ఆచరించమని ఆదేశించారట.


అలా తాను తెలియక చేసిన పొరబాటు కారణంగా పరమాత్మకు దూరం అయిన లోకపావని తిరిగి కైలాసం తొందరగా చేరుకోవాలన్న ఆశయంతో వేగావతి నదీ తీరాన మామిడి వనంలో ఒక సైకత లింగాన్ని ఏర్పాటు చేసుకొని తదేక దీక్షతో తపస్సు చేయసాగినది.
ఆమె ఏకాగ్రతను భగ్నం చేసి ఆమె యొక్క భక్తిని పరీక్షించడానికి ప్రచండ జ్వాలలతో కూడిన అగ్నిని పంపారట పరమ శివుడు. ఈ ఆపద నుండి కాపాడమని సోదరుడైన శ్రీ మహా విష్ణువును ప్రార్ధించారట అమ్మవారు. అంతట శ్రీ హరి చంద్ర కిరణాలను ప్రసరింపచేసి అగ్ని భాధ నుండి సోదరిని రక్షించారు.
ఈ కారణం చేతనే ఈ ఆలయంలో వైకుంఠ వాసుడు "నీలతింగళ్ తూండం పెరుమాళ్"అన్న పేరుతొ పూజలందుకొంటుంటారు. ఇది ఒక శ్రీ వైష్ణవ దివ్యదేశం.
ఒక శివాలయంలో నెలకొన్న దివ్య దేశం ఇదొక్కటే ! 

మరోసారి అమ్మవారి భక్తిని పరీక్షించడానికి ఉదృతంగా ప్రవహించమని  ఆదేశించారట గంగాధరుడు.
అమిత వేగంతో వస్తున్న నీటి ప్రవాహంలో ఇసుకతో చేసిన లింగానికి ఏమి జరుగుతుందో అన్న ఆతుర్దాతో ఆలింగనం చేసుకొన్నా అమ్మవారు గంగా ప్రవాహంతో తామిద్దరూ అక్కచెల్లము కదా నా దీక్ష భగ్నం చేయడం తగునా అని ప్రశ్నించగా అక్క మీద అభిమానంతో తన ప్రవాహాన్ని తగ్గించుకొని మార్గం మరల్చుకొన్నాదట వేగావతి.
అంతట ఆమె భక్తికి సంతసించిన సర్వేశ్వరుడు ఆమెకు అర్ధ భాగాన్ని ఇచ్చి అర్ధాంగిని చేసుకున్నారట.
ఇలా అమ్మవారి కౌగిలిలో ఉన్న స్వామి కనుక "తళువ కుళైన్తార్ "అని కూడా పిలుస్తారు.
మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామిగా ఏకాంబరేశ్వరుడు అన్న పేరుతొ పిలవబడుతున్నారు.


 సుమారు నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ సముదాయం భారత దేశం లోని అతి పెద్ద ఆలయ సముదాయాలలో ఒకటిగా పేరొందినది.
క్రీస్తుపూర్వం ఆరో శతాబ్ద కాలంలో పల్లవ రాజులు శిధిలమైన ఆలయ స్థానంలో మరో గర్భాలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. తదనంతర కాలంలో చోళ, పాండ్య, విజయనగర, నాయక రాజులు మిగిలిన నిర్మాణాలను నిర్మించి తమ వంతు కైంకర్యాలను సమర్పించుకొని శ్రీ ఏకాంబరేశ్వరుని కృపకు పాత్రులైనట్లుగా శాసనాలు తెలియచేస్తున్నాయి.
ఆలయ దక్షిణ దిశలో ఉన్న రాజగోపురం తమిళనాడు లోని అతి ఎత్తైన రాజా గోపురాలతో ఒకటిగా పేరొందినది.  దీనిని విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించారు.
అదే విధంగా రమణీయ శిల్పాలతో నిండిన వెయ్యి కాళ్ళ మండపము కూడా ఆయన కాలంలోనే నిర్మించారు.
విజయనగర శిల్ప శైలిని ప్రదర్శించే స్తంభాలు కడు  రమణీయంగా ఉంటాయి.


ఆలయ వృక్షం మామిడి చెట్టు. ఆలయ వెనుక భాగంలో ఉంటుంది. అమ్మవారి ఇక్కడే తపమాచరించినట్లుగా చెబుతారు. ఈ వృక్షం వయస్సు 3500 సంవత్సరాల పైచిలుకని, ఒక్కో దిక్కు కు ఉన్న ఒక్క శాఖా ఒకో రకమైన ఫలాన్ని కాస్తాయని చెబుతారు.
ప్రతినిత్యం ఆరు  పూజలు జరిగే ఈ ఆలయం ఉదయ ఐదు గంటల నుండి పన్నెండున్నర వరకు తిరిగి  సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు భక్తుల దర్శనార్ధం తెరిచి వుంటుంది. గాయక శివ భక్తులైన అరవై మూడు మంది నయమ్మారులలో ప్రముఖులైన సంబంధార్, అప్పార్, సుందరార్, తమ తేవారాలలో శ్రీ ఏకాబరేశ్వరుని కీర్తించారు.
ఈ కారణం చేత ఈ ఆలయం రెండువందల డెబ్బై ఆరు పాదాల పెట్ర స్థలాల్లో ప్రముఖమైనదిగా పేరొందినది.
శ్రీ ఏకాంబరేశ్వర ఆలయంలో ప్రతినిత్యం ఒక పర్వదినమే !
ప్రతి మాసంలో విశేష పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయి.
సైకత లింగం కావడాన ప్రధాన లింగానికి అభిషేకాలు జరిపారు. మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో పుష్ప పత్రార్చన చేస్తారు.
మరో విశేషం ఏమిటంటే ఇక్కడ అమ్మవారి ఆలయం ఉండదు.
ఎన్నో ఉపాలయాలతో నిండి ఉన్న శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పేర్కొనబడిన కాంచీపురం లోని శివ కంచి లో ప్రధాన ఆలయం.
చెన్నై నుండి విస్తారమైన రవాణా సౌకర్యం కలదు. మన రాష్ట్రం లోని తిరుపతి నుండి నేరుగా బస్సు, రైలు మార్గాలలో కంచి చేరుకోవచ్చును.
ఉండటానికి అందుబాటు ధరలలో లాడ్జీలు లభిస్తాయి.
చక్కని భోజన సదుపాయాలూ లభిస్తాయి.
కంచి పట్టు చీరలకు ప్రసిద్ధి. దేశం నలుమూలల నుండి వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారు. శివ విష్ణు కంచి లను కలిపే ప్రధాన రహదారిలో ఎన్నో వస్త్ర దుకాణాలు ఉంటాయి యాత్రీకులను ఆకర్షిస్తాయి.

నమః శివాయ!!!!

Sri Nataraja Swamy Temple, Chidambaram

                      శ్రీ నటరాజ ఆలయం, చిదంబరం  శైవ సాంప్రదాయం లో శ్రీ నటరాజ స్వామి కొలువైన చిదంబర కనక సభను "కోవెల" అని ...