6, ఆగస్టు 2016, శనివారం

Ashta Dikpaalakas Lingam Temples, Tiruvannamalai


అష్ట దిక్పాలక లింగ ఆలయాలు - తిరువణ్ణామలై 

పరమేశ్వరుడే పర్వత రూపంలో వెలసిన మహాద్భుత క్షేత్రం తిరువణ్ణామలై. 
తిరువణ్ణామలై లో పర్వత పాదాల వద్ద ఆలయం నిర్మించినా భక్తులు గిరి ప్రదక్షిణం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. 
భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయంగా గిరి ప్రదక్షణం చేయడమే కాక ప్రదక్షిణా ఫలం గురించి సవివరంగా తన శిష్యులకు తెలిపారు. (గిరివలయం ఎలా చేయాలి, ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది అన్నది ఈ బ్లాగ్ లోని గిరివలయం శీర్షిక లో వివరించాను). అనేక పురాణాలలో అరుణాచల మహత్యం గురించి తెలుపబడినది. 
ప్రధాన ఆలయం నుండి ప్రారంభించే ఈ ప్రదక్షిణా పధంలో ఎన్నో పురాతన నూతన ఆలయాలు, మందిరాలు, మండపాలు ఎదురవుతాయి. 
వీలైనంత వరకూ అన్నింటినీ సందర్శించడం అభినందనీయం. అలా చేయలేని పక్షంలో అష్ట దిక్పాల లింగాలు ఎనిమిది మరియు లోకాలను వెలుగును ప్రసాదించే సూర్య ప్రతిష్ఠిత లింగం, నిరంతరం చంద్రశేఖరుని శిరస్సున ఉంటూ తన వెన్నెల వెలుగులతో ఆహ్లాదాన్ని పంచి ఇచ్చే  చంద్ర స్థాపిత లింగాన్నిదర్శించడం తప్పనిసరి.




గిరివలయంలో అష్ట దిక్పాలక లింగాలు నెలకొన్న విధానం 




ఈ లింగాల  అమరిక ఎంత శాస్త్ర బద్దంగా ఉంటుంది అంటే ఇంద్రలింగం తూర్పున, యమ లింగం దక్షిణంలో, వరుణ లింగం పడమరలో, కుబేర లింగం ఉత్తరంలో ఉండగా ఆగ్నేయంలో అగ్ని లింగం, నైరుతిలో నైరుతి లింగం, వాయువ్యంలో వాయు లింగం ఈశాన్యంలో ఈశాన లింగం ఉంటాయి. 
ఈ ఆలయాలన్నీ ఏనాడో నిర్మించబడినవిగా తెలుస్తోంది. 
కానీ కాల గమనంలో శిథిలావస్థకు చేరుకొని నిత్య పూజలు కూడా కరువై చాలాకాలం అలా ఉండిపోయాయి. 
1968 ప్రాంతాలలో తిరునెల్వేలి కి చెందిన "మూపనార్ స్వామి" తిరువణ్ణామలై వచ్చారు. ఆలయంలో ధ్యానం చేసుకుంటూ తన దగ్గరకు వచ్చిన వారికి ఆధ్యాత్మిక విషయాల గురించి చెబుతుండే వారు. 




ఇంద్ర లింగం లోపల 

అగ్ని లింగం 



క్రమం తప్పకుండా అరుణాచలానికి ప్రదక్షణం చేసే ఆయన మార్గంలో ఉన్న ఈ అష్ట దిక్పాల ఆలయాలు శిధిలావస్తలో ఎవరికీ పట్టకుండా ఉండటం గమనించారు. వాటి పురుద్ధరణ తాను  శివునికి చేసే సేవలలో ఒకటిగా భావించి స్థానిక భక్తుల, అణ్ణామలయ్యారు ఆలయ అధికారుల సహాయంతో ఆనతి కాలం లోనే పునః నిర్మించారు. 
అలా శ్రీ మూపనార్ స్వామి చేపట్టిన పురుద్ధరణ కార్యక్రమం వలన మనం ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాలను నేడు సందర్శించుకోగలుగుతున్నాము. ఈ అష్ట దిక్పాల ఆలయాలలో ఈయన చిత్రం ఉండటం చూడవచ్చును. ప్రాతస్మరణీయులు. 
గ్రహగమనాలు  మానవ జీవితాల మీద చూపే  ప్రభావాన్ని అంచనా వేసి, పరమేశ్వర రూపమైన అరుణగిరి ప్రదక్షణ చేసే సమయంలో వీటిని దర్శిస్తే మావవులకు చేకూరే ఇహలోక శాంతిని అంచనా వేసి  ఏనాడో పెద్దలు నిర్మించిన ఈ ఆలయాల సందర్శన అభిలషణీయం.  ఒక్కో  ఆలయ సందర్శన ఒక్క విధమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది అని తెలుస్తోంది. 
ఒక్కో లింగానికి ఒక్కో గ్రహం అధి దేవత గా ఉండి ఆ లింగ దర్శనం వలన భక్తులు ఉత్తమ ఫలితాలు పొందటం జరుగుతుంది అన్నది పెద్దల వాక్యం.   



యమ లింగం 




అష్ట దిక్పాల ఆలయాలలో మొదటిది ఇంద్ర ప్రతిష్ఠిత ఇంద్ర లింగం. ఈ ఆలయం ప్రధాన ఆలయానికి చేరువలో రధం వీధిలో ఉంటుంది. గిరివలయంలో వచ్చే అష్ట దిక్పాలక లింగ ఆలయాలలో తొలి ఆలయం. అమరావతికి, స్వర్గానికి,దేవతలకు అధిపతి. ఈ లింగాన్ని సేవించడం వలన అజ్ఞానం తొలగి జ్ఞాన మార్గం లభిస్తుంది. ఈ క్షేత్రానికి శుక్రుడు మరియు సూర్యుడు అధిదేవతలు. వీరు భక్తులకు ఉద్యోగపరంగా అత్యున్నత స్థానాన్ని మరియు దీర్గాయువును అనుగ్రహిస్తారు.
రెండవది అగ్నిలింగం. ఈ ఆలయం చింగమ్ రోడ్డులో శ్రీ శేషాద్రి స్వామి ఆలయానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడొక గమనించదగిన అంశం ఏమిటంటే ఈ ఆలయం తప్ప మిగిలిన దిక్పాలక ఆలయాలు దారికి ఎడమ పక్కన ఉండగా ఇదొక్కటే కుడి వైపున నెలకొని ఉంటుంది.
అగ్నిని ఆరాధించడం యుగాల నుండి వస్తున్న ఆచారం. మానవ జీవితాలలో అగ్ని కి ప్రాధాన్యత ఇంత అని చెప్పలేము. చంద్రుడు ఈ క్షేత్రానికి అధిపతి. అగ్ని లింగాన్ని ఆరాధించడం వలన పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అంతే కాకుండా ఆపత్సమయాలలో సరి అయిన మార్గనిర్ధేశికం లభించి ఆ ప్రమాదం నుండి కాపాడుతుంది.




నైరుతి లింగం 





మూడవది అయిన  యమ లింగం గిరివలయం లోనికి ప్రవేశించడానికి కొద్దిగా ముందు స్మశానానికి దగ్గరలో వస్తుంది.  ఆయువు తీరిన జీవుల పాపపుణ్యాల లెక్కలు తేల్చే యమధర్మ రాజ ప్రతిష్ట. కుజుడు అధిపతి.
యమ లింగాన్ని ఆరాధించడం వలన ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చును. అంటే వాహన ప్రమాదాలు లాంటివి. (ముఖ్యంగా పదే  పదే ప్రమాదాల కారణంగా ఎముకలు విరక్కొట్టుకునే వారు దర్శిస్తే మంచి ఫలితం ఉంటుంది ). అంతే కాకుండా మంగళుడు ఆర్ధిక బాధల నుండి గట్టెక్కిస్తాడు. ఋణ భాధలు ఎదుర్కొంటున్నవారు ఇక్కడ "అంగారక ఋణ విమోచన స్త్రోత్రం" పఠిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.
నైరుతి లింగం నాలుగవది. రాక్షస రాజైన నైరుతి ప్రతిష్టించిన ఈ లింగ క్షేత్రానికి అధిపతి రాహువు.
భక్తులు ఆలయం పక్కన ఉన్న నైరుతి పుష్కరణిలో(నీరు అపరిశుభ్రంగా ఉంటుంది) కనీసం పాదాలైన కడుక్కొని పూజిస్తే అన్ని జన్మల కర్మఫలం తొలగి పోతుంది. రాక్షస, పిశాచ, దుష్ట గ్రహ పీడలనుండి విముక్తి కలిగి ఇహపరాలలో అమిత కీర్తి ప్రతిష్టలను పొందుతారు.
నైరుతి లింగం పిదప వచ్చే కూడలిలో తిరునెరు శ్రీ అణ్ణామలై, శ్రీ ఉన్నామలై అమ్మన్, శ్రీ గాయత్రి దేవి ఆలయాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదునాల్గున సూర్య కిరణాలు నేరుగా లింగాన్ని తాకుతాయి. సహజంగా ఆ రోజున తమిళ ఉగాది పర్వదినం వస్తుంటుంది. ఎందరో భక్తులు ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించడానికి ఉదయాన్నే వస్తారు.


 


తిరునెరు శ్రీ అన్నామలై స్వామి ఆలయం 
అరుణాచలం 
సూర్య లింగం 


గిరివలయంలో వచ్చే తరువాతి ఆలయం ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణుడు ప్రతిష్టించినది. 
ఇక్కడ చేసే ఆదిత్య స్తోత్ర పఠన సంపూర్ణ ఫలితాలను'ఇస్తుంది. సూర్య నామస్మరణ చేస్తూ చేసే ప్రదక్షణ ఆరోగ్యకరం. 
సూర్యలింగం దాటిన వెంటనే ఉంటుంది వరుణలింగం. జీవులకు ప్రాణాధారమైన జలానికి అధిపతి.   
శని అధి దేవత. ఈ లింగానికి చేసే అభిషేక జలాన్ని స్వీకరిస్తే ఉబ్బసం లాంటి శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ లభించే ప్రదోష పూజ తాలూకు విభూది ధారణ సర్వ పాపాలను తొలగిస్తుంది అని అంటారు. 
వరుణ లింగం దాటిన తరువాత వచ్చే ఆది అన్నామలై గ్రామం లోనికి వెళితే అక్కడ "శ్రీ అణ్ణామలై స్వామి ఆలయం" ఉంటుంది. సృష్టి కర్త బ్రహ్మ డెవ్వఁడు ప్రతిష్టించిన ఈ లింగ దర్శనం శుభకరం. చక్కని శిల్పకళ ఈ ఆలయ సొంతం. 
గిరివలయంలో దర్శించవలసిన అష్ట దిక్పాలక ఆలయాలలో వరుణ లింగం అనంతరం వాయు లింగం. 
పంచ భూతాలలో జీవుల మనుగడకు అత్యవసరమైనది గాలి. (నా అనుభవం లేదా అనుభూతి చెప్పదలిచాను.  గిరివలయం చేసిన ప్రతిసారీ కొద్దిసేపు ఈ ఆలయం వద్ద కూర్చుంటాను. ఎంతటి చల్లని గాలి వీస్తుందో చెప్పలేను. ఎంత ఎండ ఉండి వాతావరణం ఉక్కబోతగా ఉన్నా సరే ఇక్కడ మాత్రం మందగమనంతో వాయుదేవుడు చరిస్తాడు). 
ఈ క్షేత్రానికి అది దేవత కేతువు. ఈ లింగ దర్శనము వలన ఉదార కోశ, శ్వాశ కోశ మరియు హృదయ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. 



వరుణ లింగం 
వాయు లింగం 

శ్రీ ఆది అన్నామలై స్వామీ ఆలయం 




వాయు లింగం అనంతరం వచ్చేది చంద్ర లింగం. చంద్రుడు మహేశ్వరుని శిరస్సు నందు స్థిర నివాసమేర్పరచుకొన్న గ్రహం. ఈ కారణంగా స్వామిని సోమశేఖరుడు లేదా చంద్రశేఖరుడు అని పిలుస్తారు. 
చంద్రుడు ప్రతిష్టించిన ఈ లింగాన్ని ఆరాధించడం వలన జీవితంలో ఎదుర్కొనే కష్టనష్టాల కారణంగా ఏర్పడే మానసిక వేదన నుండి ఉపశమనం లభిస్తుంది. అస్థిర పరిస్థితులు తొలగిపోతాయి. మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది. ముఖ్యంగా సోమవారం సందర్శిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చును. 
చంద్ర లింగం తరువాత వచ్చేది కుబేర లింగం. క్షేత్ర అధిదేవత బృహస్పతి (గురువు). విద్యా కారకుడు. అదే విధంగా కుబేరుడు ప్రత్యేకంగా ధనాన్ని సృష్టించాడు.  తన సంపదలను భక్తులకు పంచుతాడని ప్రతీతి. 
ఈ క్షేత్రంలో జరిపించే పూజలు భోగభాగ్యాలను ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం. 





చంద్ర లింగం 

కుబేర లింగం 


అరుణాచలం 


అష్ట దిక్పాలక లింగాలలో ఆఖరిది ఈశాన్య లింగం. బుధుడు అధి దేవత. ఈశ్యాన్యుడు సప్త రుద్రులలో ఒకడు. 
భూత గణాలకు అధిపతి, దుష్ట గ్రహ ప్రభావాలను తొలగించి శాంతిని ప్రసాదిస్తారు. 
ముఖ్యంగా సంసారంలో, వ్యాపార ఉద్యోగ రీత్యా సమస్యలు ఏర్పడుతున్న తరుణంలో ఈ ఆలయంలో అభిషేకాలు జరిపిస్తే పరిస్థితులు  సవ్యంగా సజావుగా మారుతాయి అని అంటారు. 



ఈశాన లింగం 

శ్రీ అణ్ణామలై స్వామి ఆలయం 
అరుణగిరి నుండి ఆలయ సంపూర్ణ దృశ్యం 
పద్నాలుగు కిలోమీటర్ల గిరివలయం లో నెలకొని ఉన్న అష్ట దిక్పాలక లింగాలను సందర్శించుకొన్న తరువాత దర్శనం శ్రీ అరుణాచలేశ్వరునిదే !!
(గిరివలయం గురించిన వివరణ ఈ బ్లాగ్లో వివరించబడినది)

నమః శివాయ !!!



























కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...