23, మే 2016, సోమవారం

Sri Jagannatha Mandir, Ranchi

                                   శ్రీ జగన్నాథ మందిరం, రాంచీ 

తలచిన వారి ఇంటి తలపు వద్దకు  తనే తరలి వెళ్లి పిలిచే దైవం  జగన్నాధుడు. 
స్వయంగా కదలి వచ్చే రేడు శ్రీ జగన్నాధుడు. 
 స్వామి సోదరసోదరీ సమేతుడై కొలువు తీరిన అనేకానేక మందిరాలు  ప్రపంచ వ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. 
పూర్తిగా కాకపోయినా కొన్ని విషయాలలో శ్రీ క్షేత్రం పూరితో పోల్చగల పురాతన మందిరాలు మరో రెండు మన దేశంలో ఉన్నాయి.    






వాటిల్లో ఒకటి ఝార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ పట్టణంలో బర్కా పూర్ జగన్నాధపూర్ రాజు శ్రీ ఠాకూర్ అనినాథ్ షా దేవ్ 1692వ సంవత్సరంలో కట్టించినది.
రాజా షా దేవ్ శ్రీ జగన్నాధ్ మహా ప్రభువు పట్ల అత్యంత భక్తి కలిగినవాడు. భగవంతుని ప్రేరణతో ఆయన రాంచీ పట్టణానికి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న నీలాంచల్ లేదా నీలాద్రిగా పిలవబడే పర్వతం మీద నిర్మించారు.
మందిర నిర్మాణ సమయంలో రాజు అనేక పర్యాయాలు పూరి యాత్ర చేశారట. అక్కడి ఆలయ నిర్మాణ విధానాన్ని,నిత్య పూజలు,ప్రధాన యాత్రలైన రధ, చందన, స్నాన యాత్రల గురించిన  వివరాలను, నివేదనల,స్వామివారి అలంకారాల గురించి పూర్తి సమాచారాన్నిప్రధాన సేవాయత్ ల నుండి సేకరించి వాటిని రాంచి ఆలయంలో కూడా అమలు చేశారు. వాటి నిర్వహణకు కావలసిన ధనాన్ని కూడా సమర్పించారు. 









శిఖర పై భాగానికి చేరుకోడానికి మెట్ల మార్గం మరియు రహదారి ఉన్నాయి. ప్రశాంత ప్రకృతి ఒడిలో ఉన్న ఈ క్షేత్రం మూడు శతాబ్దాలకు పైగా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతులను ప్రసాదిస్తోంది. కానీ కాలక్రమంలో నిర్వహణా లోపాలతో, తగిన ఆర్ధిక సహకారం లేక పోవడంతో ఆదరణ కోల్పోయింది. 
చివరికి ఈ చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ మందిరం 1990వ సంవత్సరంలో శిధిలావస్థకు చేరుకొన్నది.
అప్పటి బీహారు ప్రభుత్వము మరియు నగర ప్రముఖులు కలిసి 1992వ సంవత్సరం నాటికి పునః నిర్మించారు.












కొండ పై భాగాన పటిష్టమైన కోట గోడ లాంటి ప్రహరీ మధ్యలో అచ్చం పూరీ ఆలయ నమూనాలో నిర్మించబడినది.
పరిమాణంలో చిన్నదైన ముఖ మండపం, ఆష్టాన మండపం, నమస్కార మండపం మరియు గర్భాలయం అన్నీ ప్రధాన జగన్నాధ మందిరాన్ని పోలి ఉండటం విశేషం.
గర్భాలయంలో రత్న వేదిక  జగన్నాథుడు సోదరుడు శ్రీ బలరామ దేవ మరియు సోదరి శ్రీ సుభద్ర లతో కలిసి రమణీయ  పుష్ప రత్నాభరణ శోభితులై దర్శనం ప్రసాదిస్తారు.
చిన్నవైనా అత్యంత సుందర విగ్రహాలు భక్తులను ఇట్టే ఆకర్షిస్తాయి.













పెద్దగా ఆకట్టుకొనే శిల్పాలు కనపడవు. విమాన గోపురం పైన వివిధ ముద్రలు చూపుతున్న నాట్యగత్తెల మరియు గణేష రూపాలను నిలిపారు. ఇక్కడే ఉన్న రెండు ఉపాలయాలలొ  ఒక దానిలో శ్రీ నారశింహ స్వామి ఉపస్థితులై ఉంటారు.మరో దానిలో శ్రీ త్రివిక్రమ స్వామి కొలువై కనిపిస్తారు. స్వామి పాదం క్రింద బలి చక్రవర్తి, పక్కనే వామన రూపాన్నిచక్కగా మలచారు. ప్రతి రోజు వేలాదిగా  భక్తులు తరలి వచ్చే ఈ ఆలయంలో నిత్య పూజలు పూరిలో  మాదిరిగానే నిర్వహిస్తారు. 













ఎన్నో యాత్రలకు, ప్రత్యేక సంబరాలకు నిలయమైన పూరి క్షేత్రంలో  వాటిని ఎలా నిర్వహిస్తారో అలానే ఇక్కడ కూడా జరుపుతారు.
అన్నింటి లోనికీ మకుటాయమానమైన రధయాత్ర వారం రోజుల పాటు రంగ రంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ జగన్నాధ, శ్రీ బలభద్ర మరియు శ్రీ సుభద్ర రథయాత్ర సందర్బంగా పర్వత దిగువన నిర్మించిన మౌసీమా మందిరానికి చేరుకొని అక్కడ కొలువు తీరుతారు. ఈ రథయాత్ర సందర్బంగా రాంచీ పట్టణం పండుగ వాతావరణం నెలకొంటుంది. 
రాష్ట్రం నలుమూలల నుండే కాక బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తారు.












రాంచీ పట్టణం నూతన కాంతులు సంతరించుకొంటుంది ఆ వారం రోజులు.విశేష పూజలు,వినోద కార్యక్రమాలు, అన్నదానం, ఇలా ఎన్నో జరుగుతాయి.రాత్రీ పగలు తేడా లేకుండా భక్తులు పురుషోత్తముని నగర విహార సంబరాల్లో భక్తి భావంతో మునిగి తేలుతారు.











పచ్చని స్వచ్చమైన వాతావరణం నెలకొన్న ఆలయ పరిసర ప్రాంతాలు ఆహ్లాద కర వాతావరణాన్ని పెంచుతాయి.
శిఖర భాగం నుండి సుదూరానికి కనిపించే నగరాన్ని, పొలాలను, రహదారులను వీక్షించడం  చక్కని అనుభూతి.










ఆధ్యాత్మిక అనుభూతులకు మరో చిరునామా అయిన రాంచీ  జగన్నాధ మందిరాన్ని రాంచి రైల్వే  స్టేషన్ నుండి సులభంగా ఆటలలో చేరుకోవచ్చును. 

జై జగన్నాథ !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...