17, నవంబర్ 2015, మంగళవారం

Sri Vakrakali amman Temple, Thiruvakkarai

                       శ్రీ వక్ర కాళీ అమ్మన్ ఆలయం, తిరువక్కరై 

ఆలయ నిర్మాణానికి ఆగమ శాస్త్రం కొన్ని విదాయకాలను ఏనాడో నిర్దేశించినది. ఏ దేవాలయమైన ఆ నిర్ణయాల ప్రకారమే నిర్మిస్తారు. స్థల నిర్ణయం, ఆలయ ప్రధాన అర్చనా మూర్తి, ఉపాలయాలు, మండపాలు, గోపురాలు  ఇతర నిర్మాణాలన్నీ ఆ పద్దతిని అనుసరించి నిర్మిస్తారు.   


దీని వలన దేవీ దేవతల మూర్తులకు అపార శక్తి, భక్తుల మనోభీష్టాలు నెరవేరడం అంతిమంగా ఆలయాభివృద్ది. ముఖ్యంగా చోళులు, పల్లవులు మరియు విజయనగర రాజులు తమ నిర్మాణాలలో వాస్తు శాస్త్రానికి అమిత గౌరవం మరియు ప్రాధాన్యత ఇచ్చేవారు.  

అలాంటిది ఒక చోళ రాజు నిర్మించిన అమ్మవారి ఆలయంలో వాస్తు లేకపోవడమా ? అంటే "అవును" అనే సమాధానం వస్తుంది. కారణం తొమ్మిదో శతాబ్దంలో "ఆదిత్య చోళుడు" నిర్మించిన "శ్రీ వక్ర కాళీ అమ్మన్ ఆలయం" లో వాస్తును దాదాపుగా అనుసరించకపోవడమే !
విల్లుపురంకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న "తిరువక్కరై" అనేక విశేషాల నిలయం.


పేరుకి ఇది వక్ర కాళీ అమ్మన్ ఆలయంగా పిలవబడుతున్నా నిజానికిది మూడు ప్రధాన ఆలయాల సమాహారం.
శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి మరియు శ్రీ వరద రాజ పెరుమాళ్ కూడా అమ్మవారితో పాటు వేరువేరు సన్నిధులలొ కొలువై ఉంటారు. ఈ అరుదైన విశేషానికి సంబంధించి రెండు  పురాణ గాధలు చెబుతారు.

పురాణ కాలంలో "వక్రాసురుడు" అనే అసురుడు శివ లింగాన్ని గొంతులో వుంచుకొని తీవ్ర తపస్సు చేసి సర్వేశ్వర సాక్షాత్కారం పొందాడు. చావు లేకుండా వరం కోరిన అతనిని చావు ఎవరికైన తప్పదు అది తప్ప మరో వరం కోరుకోమన్నారు లయ కారుడు.
తన మరణం భగవంతుని మూలంగానే రావాలని, కాకపోతే స్వయంగా ఆయన ద్వారా కాకూడదు అనే ఒక చిత్రమైన వరం కోరి పొందాడు.
వర గర్వంతో ముల్లోకాలను అల్లకల్లోలం చేయసాగాడు.



పరమ శివుని తో సహా దేవతలు, మునులూ వైకుంఠ వాసుని వద్దకు వెళ్లి కాపాడమని వేడుకొన్నారు. సర్వాతర్యామి వరదరాజ స్వామి రూపంలో రాక్షసుని తన సుదర్శన చక్రం తో అంతం చేసారు. అందుకని శ్రీ వరదరాజ పెరుమాళ్ అర్చా మూర్తి చేతిలోని చక్రం "ప్రయోగ విధం"లో అంటే వదలడానికి సిద్దంగా కనపడుతుంది.మరెక్కడా ఇలాంటి భంగిమలో స్వామి కనపడరు.




కాకపోతే కధ ఇక్కడతో ముగియలేదు. వక్రాసురునికి "దున్ముఖి " అనే చెల్లెలు కలదు. అన్న మరణానికి కలత చెందిన ఆమె అనేక ఘోరాలకు పాల్పడసాగింది. శ్రీ మహావిష్ణువు పరమేశ్వర అర్ధాంగి తన సోదరి అయిన పార్వతీ దేవిని కోరారు. ఆమె దుష్ట రాక్షసిని దునుమాడటానికి వక్ర కాళి రూపం ధరించి యుద్దానికి తరలి వెళ్ళారు.
 కాకపోతే సమారా సమయానికి దున్ముఖి గర్భవతి. గర్భవతితో పోరు ధర్మ విరుద్దం.
అమ్మవారు ఆమె గర్భాన్ని చీల్చి పిండస్త శిశువును తన కర్ణాభరణంగా ధరించి దున్ముఖి ని అంతం చేసింది.
దేవతల కోరిక మీద ఇక్కడ అదే రూపంలో కొలువు తీరారు.





సుమారు పాతిక ఎకరాల స్థలంలో తూర్పున నిర్మించబడిన అయిదు అంతస్తుల రాజ గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే మొదట కనపడే శ్రీ వక్ర కాళీ అమ్మన్ ఆలయం ఉత్తర ముఖంగా ఉంటుంది.
గర్భాలయ వెలుపలి గోడల పైన శ్రీ వినాయకునితో పాటు అష్ట లక్ష్ముల మరియు వక్ర కాళీ అమ్మవారి రూపాలను నిలిపారు.


గర్భాలయం వెలుపల శిరోజాలు లేకుండా ఉన్న నలుగురు స్త్రీ మూర్తుల విగ్రహాలు కనపడతాయి.
వివరాల లోనికి వెళితే ఆ నలుగురూ గొల్ల స్త్రీలు. దురాశతో ప్రజలకు విక్రయించే పాలు, పెరుగు మరియు నెయ్యిని కల్తీ చేసారట. పట్టుబడటంతో రాజు ఆడవారు కాబట్టి గుండు గీయవలసిందిగా ఆదేశించారట. చేసిన తప్పుకు వగచి వారు అమ్మవారి పాదాల మీద పడ్డారట.
ఆమె వారిని క్షమించి తన ఆలయ ద్వారం వద్ద నియమించినది.




గర్భాలయంలో సుమారు పది అడుగుల ఎత్తు విగ్రహ రూపంలో శ్రీ వక్ర కాళీ అమ్మవారు చిత్రమైన భంగిమలో ఆయుధాలు ధరించి ఎడమ పాదం క్రింద దున్ముఖి ని అదిమి పట్టినట్లుగా ఉపస్థితురాలై దర్శనం ప్రసాదిస్తారు. మేడలో పుష్ప మాలలతో పాటు నిమ్మకాల దండ ధరించి ఉంటారు.
ఆరంభంలో ఉగ్రమూర్తి. ఆది శంకరులు ఈ ఆలయాన్ని సందర్శించి లోక సంరక్షణార్ధం అమ్మవారి ఎడమ పాదం క్రింద శ్రీ యంత్రాన్ని ప్రతిష్టించడంతో  శాంత మూర్తిగా కనపడుతున్నారు.
గర్భాలయంలో వలంపురి వినాయకుడు, లింగ రూపంలో శ్రీ యోగేశ్వర స్వామి కొలువై ఉంటారు.



ధ్వజస్తంభం, బలి పీఠాలు ఉండవు.
అమ్మవారి ఆలయానికి కుడి వైపున అదే మండపంలో పెద్ద లింగ రూపంలో శ్రీ వక్ర లింగేశ్వర స్వామి పడమర ముఖంగా ఉంటారు. ఈ లింగం ఎండాకాలంలో చల్లగా ఉంటుందిట.  వర్ష, శీతాకాలాలలో లింగం నుండి నీరు వెలుపలికి వస్తుందట. ఎంతైనా గంగాధరుడు కదా !
ఎదురుగా సగానికి పైగా భూమి లోనికి దిగబడినట్లుగా ఉన్న నందిని భక్తులు అత్యంత శక్తివంతమైన మాధ్యమంగా భావిస్తారు. అందుకే తమ కోరికలను నందీశ్వరుని చెవిలో చెబుతారు. అలా చేస్తే అది భక్త సులభునికి శీఘ్రంగా చేరి, నెరవేరుతుందని విశ్వసిస్తారు.


ఈ నంది మండపం వెనుక వంద స్తంభాల కళ్యాణ మండపం సుందర శిల్పాలను ప్రదర్శిస్తుంది.నిర్మాణం బలహీనంగా మారడంతో లోనికి ప్రవేశం నిషేదించారు.
 శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారు కొలువైన  రెండో ఆలయానికి దారి తీసే మండపంలో పెద్ద నంది మండపంలో ఉంటారు. శ్రీ గణపతి మరియు శ్రీ కుమార స్వామి ఇరువైపులా కొలువైన గోపురము గుండా రెండో ప్రాంగణం లోనికి వెళితే కుడి వైపున అమ్మవారు శ్రీ వడివాంబికై  సన్నిధి, ఎడమ వైపున సప్త మాతృకలు దర్శనమిస్తారు.






గోపుర పీఠం పైన చాలా తమిళ భాషా శాసనాలు కనపడతాయి. ఇక్కడ ఎన్నో చిత్రాలు కనపడతాయి.
ధ్వజస్తంభం, బలి పీఠం, నంది మరియు గర్భాలయం ఒక వరుసలో ఉండవు. శిధిలావస్థకు చేరిన పాత నిర్మాణాన్ని పునః నిర్మించిన ఆదిత్య చోళుడు ఎందుకు వాటిని సరి చేయలేదో తెలియరాలేదు.
కాక పోతే వక్ర శాంతి కొరకు ప్రాంగణంలో ఏడు వినాయక విగ్రహాలను, మూడు జతల ద్వారపాలకులను, మూడు నందులను, రెండు విష్ణు రూపాలను ఏర్పాటు చేసారు.





శ్రీ చంద్ర మౌలీశ్వర స్వామి త్రి ముఖాలతో కూడిన లింగ రూపంలో దర్శనమిస్తారు. భారత దేశం మొత్తం మీద త్రిముఖ లింగం శ్రీ చంద్ర మౌలీశ్వర స్వామే!
ఈ మూడు ముఖాలను త్రిమూర్తులకు ప్రతి రూపాలుగా పేర్కొంటారు. ప్రదక్షణా పదంలో ఉగ్ర రూపంలో ఉన్న శ్రీ విష్ణు దుర్గ, శ్రీ కాలభైరవుడు, పెద్ద లింగాల తో పాటు సహజంగా కుడికాలి మీద నిలబడి, ఎడమ కాలిని ఎత్తి కనపడే శ్రీ నటరాజ స్వామి ఇక్కడ దానికి వ్యతిరేకంగా కుడికాలిని పైకి ఎత్తి ఉంటారు. మరో గమనించ వలసిన అంశం స్వామి వారి జటాజూటాలు ముడివేసి ఉంటాయి.










స్వామిని సేవించుకొని వెలుపలికి వస్తే పక్కనే ఉంటుంది శ్రీ కుండలినీ మహర్షి సమాధి. ఇదొక అరుదైన అంశం. సమాధి మీద పెద్ద శివలింగము ప్రతిష్టించారు. ఈ మహర్షి శివ సాక్షాత్కారం పొందిన వారు. ఈ సమాధి మందిరంలో ధ్యానం చేయడానికి కావలసిన ఏకాగ్రత పుష్కలంగా లభిస్తుందని అంటారు. ఎందరో ధ్యాన ముద్రలో కనిపిస్తారు.























ప్రదక్షణ చేస్తూ ప్రాంగణ ఉత్తర భాగానికి చేరుకొంటే శ్రీ వరదరాజ పెరుమాళ్ సన్నిదిని దర్శించు కొనవచ్చును.
ఆరు అడుగుల విగ్రహ రూపంలో స్వామి స్థానక భంగిమలో శంఖు, చక్ర అభయ వరద ముద్రలతో సుందర పుష్పాలంకరణలో నేత్రపర్వంగా దర్శనం ప్రసాదిస్తారు.
స్వామీ వారికి ఎదురుగా ఉన్న గోడ మీద చెక్కబడిన  శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి చేతిలో  ధనుర్భానాలు ధరించి ఉండటం మరో అరుదైన విషయం.





స్వామి ఆలయం వెనుక సహస్ర లింగం ఉంటుంది. ఆఖరి అరుదైన అంశం ఇక్కడి నవగ్రహ మండపంలో దర్శనమిస్తుంది. పరిశీలనగా చూస్తే సహజంగా శని భగవానునికి వెనుక కుడి పక్కన వాయసం తల కనపడుతుంది. కానీ ఇక్కడ స్వామి వారి వాహనం యొక్క శిరస్సు ఎడమ పక్కన ఉంటుంది.
ఈ వక్ర శని అర్దాష్టమ, ఏలినాటి శని దోషాలను తొలిగించే వానిగా ప్రసిద్ది.









ఈ విశేష ఆలయంలో అన్ని శైవ వైష్ణవ పర్వదినాలను వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో శ్రీ వక్ర కాళీ అమ్మన్ కు చందనాలంకరణ చేస్తారు. పౌర్ణమినాడు అర్ధరాత్రి పంనేడు గంటలకు, అమావాస్య నాడు మధ్యాహాన్నం పన్నెండు గంటలకు "జ్యోతి దర్శనం" ఏర్పాటు చేస్తారు. వేలాదిగా భక్తులు పాల్గొంటారు.







తిరువక్కరై శ్రీ వక్ర కాళీ అమ్మన్ ఆలయం  మానవ జాతకం లోని గ్రహ దోషాలను , గృహ వాస్తు దోషాలను తొలగించే పరిహార క్షేత్రం. మూడు పౌర్ణమి రోజులలో అమ్మవారిని,శని దేవుని సేవించుకొని జ్యోతిని సందర్శిస్తే అన్నిరకాల గ్రహ దోషాలు తొలగి పోయి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయన్న విశ్వాసంతో వేలాదిగా భక్తులు వస్తుంటారు.






తిరువక్కరై, తమిళనాడు లోని విల్లుపురం పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన రాష్ట్రం లోని ముఖ్య నగరాల నుండి విల్లుపురానికి నేరుగా చేరుకోడానికి రైలు సౌకర్యం కలదు.
విల్లుపురంలో వసతి భోజన సౌకర్యాలు లభిస్తాయి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...