కృష్ణాట్టం
భారత దేశం అనేకానేక నృత్య రీతులకు పుట్టినిల్లు.
భారత నాట్యం, కూచిపూడి, కధక్, ఒడిస్సీ, కధాకళి ఇలా ఎన్నో!!
ప్రాంతాల వారీగా స్థానిక సాంప్రదాయాల, జీవన విధానాలకు అనుగుణంగా ఈ నాట్య విదానాలన్నింటిని కొన్ని వందల సంవత్సరాల క్రిందట రూపొందించబడినాయి.
వీటన్నిటి ముఖ్యోద్దేశ్యం ఒక్కటే నటరాజ సేవ ! జాతరలలో ఉత్సవాలలో చేసే జానపద నృత్యాల పరామర్ధం కూడా ఇదే!
దాదాపుగా అన్ని విధానాలు అభినయనానికి పురాణ ఆధారిత గాధలనే ఎంచుకొంటాయి.
అధికంగా వాటినే ప్రదర్శిస్తాయి.
కాలగతిలో మారిన జీవన విధానాల కారణంగా ఇవి సామాన్య ప్రజలను అలరించే జనరంజకాలుగా మార్పుచెందినాయి.
కానీ వీటన్నింటికీ భిన్నంగా పుట్టిన నాటి నుండి నేటివరకు పరమాత్మ గుణగణ విశేషాలను కీర్తిస్తూ వాటినే అభినయిస్తూ ఉన్న ప్రక్రియ ఒకటి ఉన్నది.
అదే కృష్ణాట్టం !!!
ఈ కావ్యం పుట్టుకే ఒక అద్భుతం. దేవదేవుని సందర్శనతో సాధ్యపడినది.
పదిహేడో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన జోమారిన్ రాజు "రాజా మానదేవ" కృష్ణ భక్తుడు.
ఎక్కువ సమయం గురువాయూరప్పన్ సేవలో గడిపేవాడు.
ఈ కావ్యం పుట్టుకే ఒక అద్భుతం. దేవదేవుని సందర్శనతో సాధ్యపడినది.
పదిహేడో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన జోమారిన్ రాజు "రాజా మానదేవ" కృష్ణ భక్తుడు.
ఎక్కువ సమయం గురువాయూరప్పన్ సేవలో గడిపేవాడు.
ఒక నాడు ఆయన మదిలో కృష్ణ సాక్షాత్కారం పొందాలన్న తలంపు కలిగింది.
తన ఆధ్యాత్మిక గురువైన "బిళ్వ మంగళ స్వామి"కి తన ఆకాంక్ష తెలియచెప్పుకొన్నాడు.
గురుదేవులతో పరమాత్మ నిత్యం ఇష్టా గోష్టి సలుపుతుంటారు అని ప్రతీతి.
బిళ్వ మంగళుల వారు రాజుతో తెల్లవారు జామున ఆలయ ప్రాంగణంలో ఆడుకునే బాల కృష్ణుని చూడమని చెప్పారు.
కాకపొతే సమీపానికి వెళ్లరాదని, మాట్లాడరాదని, తాకడానికి ప్రయత్నించరాదనీ హెచ్చరించారు.
అలాగేనని వాగ్దానం చేసిన రాజు రాత్రికే ఆలయం లోనికి చేరి ఎదురు చూడసాగాడు.
తూర్పున సూర్యుడు ఉదయించడానికి ముందు "ఎలింజిల్ వృక్షం" ( పొగడ చెట్టు) క్రింద ఆడుకుంటూ దర్శనమిచ్చారు అంతర్యామి.
తన్మయత్వంతో ఇచ్చిన మాట మరచి ముద్దుల కృష్ణుని ఎత్తుకోబోయాడు.
మనోహరంగా నవ్వుతూ చేతిలోని నెమలి పించముతొ "కూడదు "అన్నట్లుగా తట్టి అదృశ్యమయ్యారట దేవదేవుడు.
రాజు చేతిలో ఆ సంఘటనకు గుర్తుగా నెమలి పించం ఉండిపోయింది.
సర్వాంతర్యామి సందర్శనంతో, స్పర్శతో పెల్లుబికిన భక్తి భావంతో రాజు ఆలయం లోనే ఉండి పోయి కృష్ణ లీలలను తెలిపే "కృష్ణ గీతి" రచించాడు.
ప్రతి సంవత్సరం నవంబర్ పదనాలుగో తారీఖును మానదేవ కృష్ణ గీతి రచన పూర్తిచేసిన రోజుగా భావిస్తూ ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు. ( 14. 11. 1653 న ఈ కావ్య రచన పూర్తి అయినట్లుగా పేర్కొంటారు).
రాజా మానదేవ విగ్రహాన్ని పాంచజన్యం గెస్ట్ హౌస్ దగ్గర చూడవచ్చును.
అప్పట్లో ఎలింజిల్ వృక్షం వున్నచోట నేడు "కూతంబలం " ( నాట్యశాల ) నిర్మించారు.
కృష్ణ గీతిలోని భాష, భావం,పదాల అమరిక గీత నాట్యాలకు అనుకూలంగా ఉండటంతో కొందరు తగిన నృత్య రీతులను సమకూర్చారు.
అలా మానదేవ రాజు లిఖించిన కావ్యం ఆధారంగా గురువాయూరప్పన్ సంతృప్తి చెందేలా సమకూర్చిన నృత్య విధానం "కృష్ణాట్టం "
శిక్షణ మరియు ప్రదర్శన రెండూ ఇక్కడే గత నాలుగు వందల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది. గతంలో ఒక్క గురువాయూరప్పన్ సమక్షంలోనే నిర్వహించేవారు.
గత కొంతకాలంగా ప్రదర్శననుభక్తుల కోరిక మేరకు గురువాయూరు వెలుపల కూడా చేపడుతున్నారు.
తొలినాళ్లలో దేవస్వం( దేవస్థానం) ఆధ్వర్యంలో ఒక సేవగా స్వామివారి ముందు ప్రదర్శించేవారు.రమ్యమైన గీతాల, చక్కని హావభావాల ప్రకటనల మేలు కలయిక అయిన కృష్ణాట్టం ఆనతి కాలంలోనే భక్తజనులలో ప్రాచుర్యం పొందింది.
దానితో మరిన్ని హంగులు సమకూర్చడానికి స్థానిక పాలకులు, ధనవంతులు, వ్యాపారులు ప్రదర్శనకు కావలసిన ధనాన్ని తమ తరుపున ఇవ్వసాగారు.
చిత్రంగా అలా దానం ఇచ్చిన వారి దీర్ఘకాలిక మనోభీష్టాలు చప్పున నెరవేరాయి.
పిల్లలు లేనివారికి సంతానం కలిగింది.దీర్ఘ వ్యాధులతో భాద పడుతున్నవారు స్వస్థులైనారు.
వివిధ కారణాల వలన ఎడమొగం పెడమొగం గా ఉన్న దంపతుల మధ్య సఖ్యత నెలకొంది.
శత్రు బాధ దూరం అయ్యింది. అవివాహితులకు అనుకూల సంబంధాలు లభించాయి.
ఇలా అన్నింటా జయం, శుభం.
దీనిని గమనించిన పండితులు పూర్తిగా అధ్యనం చేసారు. ఏ భాగాన్ని ప్రదర్శిస్తే ఏవిధమైన ఫలితం పొందారు అన్న విషయాన్ని తెలుసుకోగలిగారు.
ఈ లోగా కృష్ణాట్టం ప్రదర్శనతో ఇహపర సుఖాలు దక్కుతాయన్న మాట భక్త కోటిలో అతి వేగంగా చొచ్చుకు పోయింది.
ప్రదర్శన నిమిత్తం దానం సమర్పించేవారు ఎందరెందరో రాసాగారు.
భక్తులకు లభించిన శుభ పరిణామాలను, తమ పరిశీలనలో గమనించిన అంశాలను కలిపి దేవస్థానం వారు కొన్ని నియమ నిబంధనలతో కృష్ణాట్టాన్ని ఒక ఆర్జిత సేవగా రూపొందించారు.
నాటి నుండి ప్రజలు తమ మనోభీష్ట్టం నెరవేరడానికి తగిన అంశాన్ని ఎంచుకొని దాని ప్రదర్శనకు కావలిసిన ధనాన్ని దేవస్థానానికి చెల్లించాలి.
ప్రస్తుతం ఒక్క అంక ప్రదర్శనకు సుమారు అయిదు వేల రూపాయల దాకా చెల్లించాలి.
స్వర్గారోహణం అయితే మరో అయిదు వేలు అధికంగా కట్టాలి.
ఎక్కువగా భక్తులు "అవతారం" అంశాన్ని ప్రదర్శించడానికి సిద్దపడతారు.ఈ ప్రదర్శన వలన సుపుత్ర జననం కలుగుతుంది అన్న నమ్మకం. అపుత్రస్య గతిర్నాస్థి !!!! అని కదా పెద్దలు చెప్పారు. దీర్ఘ రోగాలతో అవస్థ పడుతున్నవారు కాళియ మర్ధనాన్ని సమర్పిస్తారు.
దంపతుల మధ్య ఏర్పడిన పొరపొచ్చాలు తొలిగి పోవడానికి రాస క్రీడ ను ఎంచుకొంటారు.
ఎక్కువగా రాజకీయ నాయకులు, ధనవంతులు ఎంపిక చేసుకొనేది కంస వధ. దీని వలన అంతః బాహ్య శత్రువులు తొలగిపోతారు అన్నది తరతరాల విశ్వాసం. స్వయంవరం ఘట్టాన్ని అవివాహితులు ఎక్కువగా ఎంచుకొంటారు. పరీక్షలలో, ఎన్నికలలో విజయం ఆకాంక్షిస్తూ బాణ యుద్ధం అంకాన్ని సమర్పిస్తారు. వ్యాపారంలో లాభాలు సిద్దించడానికి " వివిధ వాదా"న్ని ప్రదర్శించడానికి సిద్దపడతారు. అంత్యకాలంలో అనాయాసేన మరణంతో స్వర్గ ప్రాప్తి లభించాలని ఆశిస్తూ స్వర్గారోహణం ఎంచుకొంటారు.కాకపొతే ఇక్కడ ఒక షరతు ఎవరైతే స్వర్గారోహణం సమర్పిస్తారో వారు మరునాడు "అవతారం"ఘట్టాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలి. అందుకే దీనికి ఎక్కువ మొత్తం చెల్లించాలి.
"పునరపి మరణం పునరపి జననం " అని కదా పెద్దలు చెప్పారు.
కృష్ణాట్టం ప్రదర్శించడానికి అవసరమైన కళాకారులను దేవస్వం వారే ఎంపిక చేసుకొంటారు.
వీరి ఎంపిక విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఎనిమిది సంవత్సరాల మగ పిల్లలను ఎంపిక చేసుకొని వారికి నృత్యంతో పాటు శరీర ధారుడ్యానికి సంబంధించిన వ్యాయామాలను కూడా నేర్పుతారు.సుమారు పది గంటల పైగా జరికే ప్రదర్శనలో శారీరక దృడత్వానికి తగిన ప్రాధాన్యత ఉండాలి కదా!
కృష్ణాట్టం సంవత్సరంలో తొమ్మిది నెలలే ప్రదర్శించబడుతుంది.
సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయ్యి మే నెల దాకా వారానికి ఆరు రోజులు ఆలయం లోని దక్షిణ భాగంలో ఉన్న మండపంలో రాత్రి పది గంటల నుండి తెల్ల వారు ఝామున మూడు గంటల వరకూ కొనసాగుతుంది. ప్రతి మంగళ వారం శలవు.
జూన్ నెల పూర్తిగా కళాకారులకు విశ్రాంతి.
జూలై మరియు ఆగస్టు నెలలలో కొత్త సంవత్సర ప్రదర్శనలకు పూర్తి స్థాయిలో " కృష్ణాట్టం కాలరి " ( నాట్య శిక్షణా శాల ) లో పూర్తి ఏకాగ్రతతో సాధన చేస్తారు.
ఇది ఆ కళాకారులకు తమ కళ పట్ల, పరమాత్మ పట్ల గల ఆరాధనా భావాన్ని తెలియజేస్తుంది.
సాధన తరువాత కళాకారులు తమ అభినయ కౌశల్యాన్ని అతున్నత స్థాయిలో ప్రదర్శించడం విశేషం.ప్రస్తుతం గురువాయూరు దేవస్వం అధ్వర్యంలో సుమారు డెబ్భై మంది కృష్ణాట్టం కళాకారులున్నారు.
రూపు దిద్దుకోవడం దగ్గర నుంచి అన్నింటా ప్రత్యేకత కలిగిన కృష్ణాట్టం విధివిధానాలలొ, వస్త్ర అలంకరణ విషయంలో, అభినయంలో, సంగీతంలో కేరళ లోని అన్ని నృత్య రీతులను, కలగలిపి అవిష్కరించబడినది.
1654వ సంవత్సరంలో రాజా మానదేవ కృష్ణ గీతి రచించాడని మనకు తెలిసిందే !
దీనికి నిపుణులు పండితులు నాట్యకారులు 1694వ సంవత్సరంలో నాట్య రూపాన్ని తీర్చి దిద్దారు.
సహజంగా కేరళ లోని అనేక ఆలయాలలో సాయం సంధ్యా సమయంలో ఒక పురాణ గాధను నాట్య రూపకంగా ప్రదర్శించడం ఒక సాంప్రదాయం.
కృష్ణాట్టం మాత్రం స్థానికంగా ప్రసిద్ది పొందిన కధాకళి, మోహినీ అట్టం, తెయ్యం లాంటి వాటి సంగమం. కధాకళి నుండి హావభావాలను, కూడియాట్టం నుండి హస్త ముద్రలు, కాలరీ పట్టు ( ఒక విధమైన స్థానిక యుద్ద విద్య ) విధానంలో పోరాట సన్నివేశాలను రూపొందించారు.
పాత్ర దారుల వేష ధారణ ఉత్తర కేరళలో ప్రసిద్ది చెందిన "తిరు యాట్టం" మరియు "తెయ్యం" విధానాలలో ఉంటుంది.
కేరళలో అన్ని నాట్య విధానాలలో ప్రతి నాయకునికి ఆకట్టుకొనే వస్త్ర ధారణ మరియు అలంకరణ కనిపించదు. కానీ కృష్ణాట్టంలో మాత్రం కంసుడు, బాణుడు లాంటి దుష్ట పాత్రలు కూడా అందంగా కనిపించడం విశేషం.
నృత్యానికి ప్రాణం అధిక సొగసులు అద్దేది సంగీతం.కృష్ణాట్టం గీతాలు మరియు సంభాషణలు సంస్కృతంలో ఉంటాయి. ఆహ్లాదకరమైన నేపధ్య సంగీతములో పంచ వాద్యాలను ఉపయోగించక పోవడం మరో ప్రత్యేకత.
శంఖం, గోంగ్ ( ఒక రకమైన ఘటం లాంటి వాద్యం), తోప్పే మండలం ( మృదంగం ), ఎడక్కా ( ధమరుకం లాంటిది). ఉపయోగించి మృదుమధురమైన వీనుల విందైన సంగీతాన్ని సన్నివేశాలకు అనుగుణంగా అందిస్తారు.
భాష అర్ధం కాక పోయినా భావం, సంగీతం వీక్షకులను కూర్చోపెడతాయి.
ప్రముఖ కృష్ణ క్షేత్రం అయిన గురువాయూరును సందర్శించడం, కృష్ణాట్టం నుండి ఒక ఘట్టమైన వీక్షించడం జీవిత కాలము మదిలో నిలిచిపోయే మధురానుభూతి.
(ఈ వ్యాసం లోని ముఖ్య విశేషాలను వివరాలను అందించిన నా మిత్రుడు గురువాయుర్ దేవస్థానం పూజారి శ్రీ రాజేష్ నంబూద్రికి కృతజ్ఞతలు.
వీరి తండ్రి ప్రముఖ కృష్ణాట్టం కళాకారులు అయిన శ్రీ నారాయణ నంబూద్రి.
పైన చిత్రాలలో ఉన్నది వారే ! నా నమస్కారాలు )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి