ప్రేమకు రూపం ఈ నిర్మాణం
ప్రేమ అన్నది ఒక అనిర్వచనీయమైన భావన.
ఎవరి మీదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కలుగుతుంది.
కన్నా వారి వాత్సల్యం, తోడబుట్టిన వారి ఆప్యాయత, కట్టుకొన్న వారి అనురాగం, స్నేహితుల అభిమానం, నమ్మిన వారిచ్చే గౌరవం అన్నీ ప్రేమలే !
కాకపోతే అన్నింటి లోనికీ స్త్రీ పురుషుల మధ్య నెలకొనే ప్రేమకే ఎక్కువ గుర్తింపు వచ్చింది.
ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ప్రేమ అన్న పదం వినపడగానే మాట్లాడేది అమర ప్రేమికుల గాధల గురించే !రోమియో జూలియట్, సలీం అనార్ఖలి, లైలా మజ్నూ ఇలా ఎందరో !
మొగలాయీ చక్రవర్తి షాజహాన్ తన భార్య "ముంతాజ్ బేగం "( అసలు పేరు అర్జుమంద్ భాను ) జ్ఞాపకార్ధం ఆగ్రాలో యమునాతీరాన పాలరాతితో "తాజ్ మహల్" నిర్మించారు.
ఇది పలు దేశాలలో ఇలాంటి నిర్మాణాలకు సూర్తిగా నిలిచింది.
అలాంటి వాటిల్లో మన రాష్ట్రంలోని సాగర తీర సుందర నగరం విశాఖ పట్టణంలో ఒకటి ఉన్నది.
విశాఖ తాజ్ మహల్ గా పేరొందిన ఈ నిర్మాణాన్నికురపాం రాజు " వైరిచర్ల వీరభద్ర రాజ బహద్దూర్ " 1904 - 1905 మధ్య కాలంలో ఆరంభించి ఆరు సంవత్సరాలలో నిర్మించారు.
రాజా వారు శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారిని 1895లో వివాహమాడారు.
ఆమె అంటే ఆయనకు అమిత ప్రేమానురాగాలు.
వారి ప్రేమకు రూపంగా ఆయన దీనిని నిర్మించారు.
ప్రేమకు ఎల్లలు లేవు అన్నదానికి సజీవ రూపం ఈ నిర్మాణం.
ఆంధ్ర, రాజస్తాన్, బెంగాల్, ఒడిషా మరియూ మొఘల్ నిర్మాణ శైలులను ప్రదర్శిస్తుంది.
సాగర తీరాన రెండు భాగాలుగా ఉండే దీనికి నలు వైపులా శ్రీ మహా విష్ణు దశావతార రూపాలను సుందరంగా మలచారు.
నిర్మాణంలో చెక్కిన అనేక సంప్రదాయ కళా కృతులు ఆకర్షిస్తాయి.
సూక్ష్మ చెక్కడాలు, నగిషీలు వంద సంవత్సరాల తరువాత కూడా తమ లోని ఆకర్షణను బహిర్గతం చేస్తుంటాయి.
శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారు జీవించి ఉండగానే ఆరంభించిన ఈ అపురూప కట్టడం 1908లో ఆమె మరణించిన తరువాత " ప్రేమ నివేదన రూపం" అని పేరు పెట్టబడినది.
ఇంతటి అపురూప నిర్మాణం ఎన్నో ప్రకృతి ప్రకంపనలకు తట్టుకొని నిలబడినా మానవ నిర్లక్ష్యానికి గురై శిధిలావస్థకు చేరుకొన్నది.
అధికారులు, ఇతరులూ చేపట్టిన పరిరక్షణ, పునః నిర్మాణ పనులు ఆసాంతం పూర్తి కాక పోవడంతో ఎవరినైనా యిట్టె ఆకట్టుకొనే ఈ ఆంధ్ర ( విశాఖ )తాజమహల్ ఒక సాధారణ శిధిల నిర్మాణంగా మిగిలి పోవడం విచారకరం.
ఆర్కే బీచ్, పెద వాల్తేర్ మరియు ఎమ్వీపీ కాలనీల నుండి సులభంగా చేరుకోగల ఈ రమణీయ ప్రేమ సౌధాన్ని పరిరక్షించి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దితే విశాఖ నగర పర్యాట విభాగానికి మకుటాయమాన ఆకర్షణగా నిలుస్తుంది అన్నదానిలో ఎలాటి అనుమానం లేదు.
రాష్ట్ర విభజన తరువాత స్మార్ట్ సిటీ గా విశాఖ పట్టణాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయాలు తీసుకొంటున్న ఈ సమయంలో ఈ అపురూప సౌధాన్ని కూడా చేరిస్తే బాగుంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి