23, జనవరి 2014, గురువారం

Sri Soumya Narayana Perumal Temple, Thirukoshtiyur


 శ్రీ సౌమ్య నారాయణ పెరుమాళ్ ఆలయం. తిరుకోష్టియుర్ 



వైకుంఠ వాసునికి భూలోకంలో ఉన్న అనేకానేక ఆలయాలలో ఆళ్వారుల గానంతో దివ్య దేశాలుగా ప్రసిద్దికెక్కిన నూట ఎనిమిది దివ్య క్షేత్రాలలో ఒకటి తిరుకోష్టియుర్. తొలి యుగం నాటి పౌరాణిక గాధకు, కలియుగంలో ప్రసిద్దికెక్కిన వైష్ణవ గురువు శ్రీ శ్రీ శ్రీ రామానుజా చార్యుల జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ముడిపడి ఉన్న పవిత్ర క్షేత్రం తిరుకోష్టియూర్. 









ఆలయ విశేషాలు :

ఆలయ నిర్మాణమే ఒక విశేషంగా చెప్పాలి. ఆలయాన్ని ప్రస్తుత రూపంలో  తీర్చిదిద్దినది పది హేనవ శతాబ్దానికి చెందిన నాయక రాజులు అని శాసనాలు తెలుపుతున్నాయి. తూర్పు ముఖం గా ఉన్న రాజ గోపురం దాటి ప్రాంగణం లోనికి అడుగు పెడితే ఎన్నో ఉపాలయాలు కనపడతాయి. ఎడమ వైపునకు తిరిగి ప్రదక్షిణ ఆరంభించగానే ఎదురయ్యే తొలి సన్నిధి శ్రీ శ్రీ శ్రీ రామానుజా చార్యులవారిది. పక్కనే ఉన్న మరో సన్నిధి ఆయనకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించిన గురు దేవులు శ్రీ తిరుకోష్టియూర్ నంబి. చిన్నదైన ఇందులో అర్థ మంటపం,మున్మండపం,గర్భ గృహం. మున్మండపంలోనే  అద్దాల అరలో నమ్బిగల్ ఉత్సవ మూర్తి, పక్కనే ఆయన పూజించిన ఆంజనేయ, సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుల విగ్రహాలు ఉంటాయి. దర్శనం  తరువాత ముందుకు వెళితే ఏకాదశి మండపం,బలి పీఠం,ధ్వజస్తంభం తరువాత కళ్యాణమండపం వస్తాయి. చక్కని శిల్పాలను మలచారు కళ్యాణ మండపంలో.అక్కడే లింగ రూపంలో కైలస నాధుడు కొలువు తీరివుంటారు. ఈ కారణంగా తిరుకోష్టియూర్ ఆలయం శివ కేశవ నిలయం గా పేర్కొన వచ్చును. ఈ కళ్యాణ మండపంలో ఒక పక్కన శ్రీ నారసింహ సన్నిధి మరో పక్క శ్రీ రామ సన్నిధి ఉంటాయి.  

అరుదైన అష్టాంగ విమానం 

ప్రధాన ద్వారం గుండా గర్భాలయం వైపునకు కదిలితే మధ్యలో ఆళ్వార్ సన్నిధిని సందర్శించు కోవచ్చును. తిరుకోష్టియూర్ ఆలయ విమానగోపురం అరుదైన అష్టాంగ విమానం. ఇది మూడు అంతస్తులుగా ఉంటుంది.  









మొదటి అంతస్తును  భూలోకంగాను, రెండో అంతస్తును పాల కడలిగాను, పై అంతస్తును శ్రీ వైకుంఠముగా పేర్కొంటారు. ఇలాంటివి నూట ఎనిమిది దివ్యదేశాలలో మొత్తం మూడు ఉన్నాయి. ఈ ఆలయంతో పాటు మదురై నగరంలో ఉన్న కూడళ్ పెరుమాళ్ ఆలయం రెండవది కాగా మూడవది కాంచీపురంలోని శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయం. ఆళ్వారుల వర్ణన ప్రకారం క్రింది భాగంలో నర్తన మూర్తి, మధ్య భాగంలో శయన మూర్తి, పైభాగంలో స్థానిక మూర్తి ఉంటారు అష్టాంగ విమాన క్షేత్రంలో ! ఇక్కడ కూడా అడుగు భాగంలో శ్రీ రుక్మిణి సత్య భామా సమేత నర్తన కృష్ణ ఉంటారు. 






తొలి దర్శనం  నేత్ర పర్వంగా శయన భంగిమలో ఉన్నశ్రీ అనంతశయనునిదే. స్వామి పాదాల వద్ద శ్రీ దేవి, భూదేవి, శిరస్సు వద్ద కదంబ మహర్షి, ఎదురుగా బ్రహ్మ,ఇంద్రుడు,సూర్యచంద్రులు ఇంకా అనేక దేవతా మూర్తులు ఉంటాయి.మూలవిరాట్టును  శ్రీ ఉరగ మేళ్ళ నయన్ పెరుమాళ్ లేక శ్రీ పన్నగ సాయి అని పిలుస్తారు. శ్రీ సౌమ్య నారాయణ పెరుమాళ్ అని ఉత్సవమూర్తిని పిలుస్తారు. ఈ స్వామి పేరుతోనే ఈ క్షేత్రం ప్రసిద్ధి.  





శంఖు చక్రాలను వెనక హస్తాలలో ధరించి, ముందరి కుడి చేతిని ధ్యాన ముద్రలోను, ఎడమ చేతిని కటి హస్త ముద్రలోను ఉండే సుందర రూప స్వామిని ఇంద్రాది దేవతలు ఆరాధించేవారు. తరువాత ఇంద్రుడు కదంబ మునికి ఇచ్చారని తెలుస్తోంది. ఈ కారణంగా ఇక్కడ ఇంతమంది విగ్రహాలు 
ఉంటాయి. స్వామిని సేవించుకొని తిరిగి మెట్ల మార్గంలో రెండో  అంతస్తుకు చేరుకొంటే అక్కడ శ్రీ ఉపేంద్ర నారాయణ స్థానక భంగిమలో శ్రీ దేవి, భూదేవి సమేతులై దర్శనమిస్తారు. ఈ భాగంలోని గోడలకు సహజ వర్ణాలతో చిత్రించిన భాగవత ఘట్టాలుంటాయి. మరో పక్కన శ్రీదేవి భూదేవి సమేత పరవాసుదేవుడు కొలువై ఉంటారు. 








దర్శనానంతరం  క్రిందకు వస్తే అక్కడ తిరుమంగై తాయారు,శ్రీ భూ దేవి సమేత  చతుర్భుజ శ్రీ నృసింహ, సుదర్శన, శ్రీనివాస, శ్రీ వరద రాజ, శ్రీ రామ, యోగ నారసింహ, శ్రీ చక్రత్తి ఆళ్వార్, శ్రీ ఆండాళ్ సన్నిదులుంటాయి. ఆలయ ఉత్తర భాగంలో వెలుపల ఉంచిన రెండు నారసింహ, ఒక చక్రత్తి ఆళ్వార్ విగ్రహాలుంటాయి. ఒకప్పుడు ఈ విగ్రహాలు లోపలి భాగంలోనే ఉండేవిట. కానీ ప్రస్ఫుటంగా కనిపించే భీకర రూపం,ఆ రూపం కళ్ళలో కనిపించే రౌద్రానికి భక్తులు భయపడే వారట. దానితో వీటిని వెలుపల ఉంచారు. 






పేరులోని అంతరార్ధం 

సత్య యుగంలో ఈ ప్రదేశంలో అమిత విష్ణు భక్తుడైన కదంబ మహర్షి ఆశ్రమం నెలకొల్పుకొని విద్యార్థులకు విద్య ఉపదేశించేవారట. ఎందరెందరో మహర్షులు, మహాత్ములు తరచుగా ఈ ఆశ్రమానికి విచ్చేసి వేదాంత విషయాల గురించి చర్చించేవారట. అలా కదంబ మహర్షి ఆశ్రమం ముల్లోకాలలో పేరు గాంచిందట. 
అంతర్యామి వరాహావతారం ధరించి అసురుడైన హిరణ్యాక్షుని సంహరించారు. సోదరుని మరణంతో కుపితుడైన హిరణ్యకశ్యపుడు బ్రహ్మ దేవుని నుండి అనేక వరాలు పొంది లోక కంటకునిగా మారాడు. అతని బారి నుండి ముల్లోకాలను ఎలా రక్షించుకోవాలి ? అన్న దాని గురించి విధాత, పరమేశ్వరుడు ఇంద్రాది దేవతలు, సప్త మహర్షులు తదితరులు ఈ క్షేత్రములో సమావేశమయ్యారట. అలా అందరూ సమిష్టిగా "గోష్టి" చేసిన స్థలంగా "తిరుగోష్ఠియూర్" గా పిలువబడి క్రమంగా "తిరుకోష్ఠియూర్"గా పిలవబడుతోంది అంటారు. 



శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య :

అపర ఆదిశేష అవతారం గా పేర్కొనే  విశిష్ట అద్వైత సిద్దాంత రూపకర్త, నిరంతర విష్ణు సేవా తత్పరులు అయిన శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులు నేటి చెన్నై నగర సమీపంలోని శ్రీ పెరంబుదూర్ లో జన్మించారు. గురువు శ్రీ తిరుకంచి నంబి వారి ఆదేశానుసారం తిరుకోష్టియూర్ చేరుకొని శ్రీ తిరు కోష్టియూర్ నంబి వద్ద ఉపదేశం పొందదలచారు. కాని ఆయనలో ఉన్న నేను అన్న అహం తొలిగే వరకూ శ్రీ నంబి ఆయనకు దర్శనం కూడా ఇవ్వలేదు. ఏడు సార్లు తిప్పిపంపారట. తనను తాను పూర్తిగా అర్ధం చేసుకొని అహం తొలగించుకొని ఎనిమిదో సారి వచ్చిన రామానుజుని ఆప్యాయంగా ఆహ్వానించి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించారట. భక్తిశ్రద్దలతో జపిస్తే శ్రీ మన్నారాయణ దర్శన ప్రాప్తి కలుగుతుందని, ఎవరికైనా తెలిపితే  నరకప్రాప్తి తప్పదని హెచ్చరించారట. 
ఉపదేశానంతరం రామానుజులు,శ్రీ సౌమ్య నారాయణ ఆలయం పైకి ఎక్కి పెద్ద స్వరంతో "ఓం నమో నారాయణాయ !" అంటూ గ్రామస్తులందరికీ వినిపించేలా పలికారట. ఆగ్రహించిన గురువుతో " పవిత్ర మంత్ర జపంతో నేను ఒక్కడిని శ్రీ హరి దర్శనం పొందటం కన్నాఅందరికి ఆ మార్గం చూపించి నేను నరకానికి పోవడం మంచిదే కదా!" అని సమాధానమిచ్చారు. ఆయన పరోపకారతత్వానికి, పెరుమాళ్ మీద ఉన్న భక్తి శ్రద్దలకు సంతసించిన గురువు మనస్పూర్తిగా ఆశీర్వదించారు శిష్యుని. 
ఈ సంఘటనకు గుర్తుగా, రామానుజులు ఎక్కడ నుంచి అష్టాక్షరీ మంత్రాన్నిఎలుగెత్తి ఉచ్చరించారో ఆ గోపురం వద్ద  ఆయన మూర్తిని ఉంచారు. అలా తిరుకోష్టియూర్ తో  శ్రీ రామానుజా చార్యులవారికి  విడదీయరాని అనుబంధం ఏర్పడినది.



 

దివ్య దేశం :

పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ఆరుగురు తిరు కోష్ఠియూర్ మీద మొత్తం నలభై ఎనిమిది పాశురాలు గానం చేసి శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా నిలిచిపోయే శాశ్విత స్థానం గుర్తింపు కలిగేలా చేశారు. 

పూజలు - ఉత్సవాలు :

ఉదయం ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల కొరకు తెరచి ఉండే శ్రీ  సౌమ్య నారాయణ  పెరుమాళ్ ఆలయంలో ఎన్నో నిత్య పూజలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు, నృసింహ జయంతి, శ్రీ రామ నవమి ఇలా ప్రతి రోజు పండగ వాతావరణం ఇక్కడ నెలకొని ఉంటుంది. భక్తుల విరాళాలతో ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. 
ఇంతటి ప్రముఖ పుణ్య క్షేత్రం సందర్శించుకోడానికి మదురై నుండి సులభంగా బస్సులో చేరుకొనవచ్చును. 
జై శ్రీ మన్నారాయణ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...