16, డిసెంబర్ 2013, సోమవారం

Narasimha Theertham, Tirupati

          చరిత్ర ప్రసిద్ది కలిగిన శ్రీ గోవింద రాజ స్వామి విగ్రహం, తిరుపతి

                     చిదంబర గోవిందుడు తిరుపతిలో 


కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు. ఏడుకొండల మీద కొలువైన కొండల రాయని దర్శనార్ధం దేశ విదేశాల నుండి ప్రతి నిత్యం లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. తిరుమల కానీ, తిరుపతి కానీ నిత్యం భక్త బృందాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకొని కనిపిస్తుంటాయి.  
కలియుగ వైకుంఠము తిరుమల. కొండ క్రింద  తిరుపతి.  పట్టణంలో చుట్టు పక్కలా ఎన్నో పౌరాణిక, చారిత్రిక ప్రసిద్ది చెందిన ఆలయాలు, నిర్మాణాలు, తీర్థాలు ఉన్నాయి. 
సప్తగిరుల పైన శ్రీవారు కొలువు తీరి ఉండగా, పర్వత పాదాల వద్ద ఆయన సోదరుడు శ్రీ గోవింద రాజ స్వామి వెలసి ఉంటారు. శ్రీవారు స్థానక భంగిమలో దర్శనమిస్తారు. వారి సోదరులు శ్రీ గోవింద రాజులు తల క్రింద మానిక ఉంచుకొని శయనావస్థలో ఉంటారు. 
దీనిని గురించి ఒక కధ ప్రచారంలో ఉన్నది. 
శ్రీహరి తన కళ్యాణం కొరకు కుబేరుని వద్ద చేసిన అప్పు తీర్చడానికి వడ్డికాసులవాడు అయ్యారు కదా ! భక్తులు భక్తిశ్రద్దలతో సమర్పించుకొని ధన, కనక రాశులను కొలిచి కొలిచి అలసిపోయి మానిక శిరస్సు క్రింద ఉంచుకొని నిద్రపోయారట శ్రీ గోవింద రాజుల స్వామి. అందువలననే ఈ భంగిమలో దర్శనమిస్తారు అని అంటారు.  
పౌరాణిక నేపధ్యం గల  కథను పక్కన పెట్టి ఒక సారి చరిత్ర లోనికి తొంగి చూస్తే శివుడు తప్ప అన్య దైవం లేడు అన్న ఒక రకమైన భ్రమలో ఉన్మాదానికి లోనైన చోళ రాజు కుళోత్తుంగ చోళుడు  చిదంబరంలో కొలువై ఉన్న శ్రీ గోవింద రాజ స్వామి విగ్రహాన్ని తొలిగించాడు అని తెలుస్తుంది. అనేక మంది విష్ణు భక్తులు చిత్రహింసల పాలయ్యారు. ప్రాణాలను కోల్పోయారు చోళుని క్రూరత్వం కారణంగా !  
కుళోత్తుంగుని చేష్టలకు చోళ రాజ్యం వీడి నేటి కర్నాటక రాష్ట్రంలోని "మెల్కోటే" లో నివసిస్తున్నశ్రీ వైష్ణవ గురువు, లోకానికి విశిష్టాద్త్వైతన్నిఅందించిన శ్రీ రామానుజాచార్యులు, చోళ రాజు చేసిన దుశ్చర్య గురించి తెలుసుకొన్నారు. ఆయన తన శిష్యుల చేత శ్రీ గోవింద రాజ స్వామి విగ్రహాన్నితిరుపతికి తెప్పించారు. ఆ సుందర ఉత్సవ విగ్రహాన్ని చూడగానే ఆయనకు స్వామి వారికొక ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలన్న తలంపు కలిగింది. 
స్థానిక పాలకుడైన యాదవ రాజు గురు దేవుల అభిమతం తెలుసుకొని ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. అలా నేటి తిరుపతి లోని శ్రీ గోవింద రాజ స్వామి ఆలయాన్ని 1130 వ సంవత్సరంలో నిర్మించారు. యాదవ రాజు మూల విరాట్టును మలచే పనిని కొందరు నిష్ణాతులైన శిల్పులకు అప్పగించారు. కాని ఎలా జరిగిందో తెలియదు కాని విగ్రహంలో చిన్న లోపం ఉండటం వలన ప్రతిష్టాపన అర్హతను పొందలేక పోయింది. 
గురు దేవులు దేశ యాత్రకు బయలుదేరాల్సిన సమయం ఆసన్నమవడంతో మరో విగ్రహాన్ని చెక్కించే అవకాశం లేక సుద్దతో మూర్తిని చేసి ప్రతిష్టించారు. అందుకే ఇక్కడ స్వామికి అభిషేకాలు ఉండవు. అన్నీచిదంబరం నుండి వచ్చిన ఉత్సవ మూర్తికే ! 
తదనంతర కాలంలో ఎన్నో రాజ వంశాలు స్వామిని సేవించుకొన్నారు.  విజయనగర రాజులు అందరికన్నా అధికంగా ఆలయాభివ్రుద్దికి తమ వంతు కైంకర్యాలను  అందించారని శాసనాధారాలు తెలియజేస్తున్నాయి. 







నల్లరాతి మీద సుందరంగా శయన భంగిమలో మలచిన మూర్తి లోని లోపమేమిటో చూడంగానే  సామాన్యులమైన మనకు అర్దం కాదు.అది శిల్ప శాస్త్రం, ఆగమ శాస్త్రం చదివిన వారికే అవగతమవుతుంది. కానీ విగ్రహాన్ని చూడగానే ప్రతి ఒక్కరి మనస్సులలో భక్తి భావం కలుగుతుంది.

  






ఈ ప్రత్యేక మూర్తి ఎక్కడ ఉన్నదా ! అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. 
తిరుపతి నగరంలో నేడు మంచి నీళ్ల కుంట గా పిలవబడుతున్న ఒకప్పటి నరసింహ తీర్ధం   ఒక  ఒడ్డున ఒక వట వృక్ష ఛాయలో ఉంచారు.  
పాలకడలిలో,శేషశయ్యపైన పవళించే పన్నగ శయనుడు ఇక్కడ ఒక చెట్టు క్రింద ఒక రాతి దిమ్మ మీద ఉండటం కంట నీరు తెప్పిస్తుంది.ఎలాంటి అలంకరణలు, అర్చనలు, ఆరగింపులు జరపరు ఈ స్వామికి. భిన్నమవడం కారణంగా ఎంతో నిరాదరణకు గురైన స్థితిలో కనపడుతుంది శ్రీ వరదరాజ స్వామి రాతి  విగ్రహం. చిన్న పొరబాటు వలన ఆలయంలో నిత్య పూజలందుకోవలసిన మూర్తి ఇలా ఎండకు ఎండి, వానకు తడిసిపోతూ ఉండటం చూపరులకు బాధను కలిగిస్తుంది.   
వెయ్యి సంవత్సరాల చరిత్రకు మౌన సాక్షిఅయిన ఈ మూర్తి గురించి చాలా మంది స్థానికులకు కూడా తెలియదు అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ ఉదంతం గురించి, ఈ మూర్తి ప్రత్యేకత గురించి ఎలాంటి సూచన కనపడదు ఎక్కడా ! తీర్ధం చుట్టూ నివాస గృహాలు. నలువైపులా రహదారులు. కానీ తీర్థం లోనికి వెళ్ళడానికి అవకాశం మాత్రం లేదు. చుట్టూ కట్టిన ప్రహరీ గోడకు ఉన్న రంద్రాల నుండే వీక్షించే అవకాశం లభిస్తుంది. 
తొలినాటి తిరుపతి చరిత్రను తెలిపే ఈ అపురూప విగ్రహాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక చారిత్రక సత్యానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామి విగ్రహం గురించి నలుగురూ తెలుసుకొనే అవకాశం కలిగించడం ఎంతైనా ఆవశ్యకం.    
కుంట వెనక పురాతన మండపాలు కనపడతాయి. 
తిరుపతి నగరంలో ఉన్న అనేక సందర్శనీయ ప్రదేశాల జాబితాలో శ్రీ నరసింహ తీర్ధాన్ని కూడా చేరిస్తే విశేష సంఖ్యలో భక్తులు సందర్శించేకొంటారు అన్న విషయంలో సందేహం లేదు. 







తిరుపతి రైల్వే స్టేషన్ నుండి సుమారు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న మంచి నీళ్ళ కుంటకు సులభంగా ఆటోలో చేరుకోవచ్చును. 
జై శ్రీమన్నారాయణ !!!!

1 కామెంట్‌:

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...