వారణాశి
వారణాశి క్షేత్రం , కాశీ విశ్వనాధ సందర్శనం , గంగా స్నానం తలంపు లోనికి రాగానే ప్రతి ఒక్క హిందువు హృదయంలో అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతులు నెలకొంటాయి.
ఈ క్షేత్ర మహాత్యమది.
సాక్షాత్ కైలాసవాసుడే స్థాపించిన పురమని పురాణాలలో పేర్కొన్న కాశి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.
వరుణ మరియు అసి నదుల మధ్య నెలకొన్న ప్రదేశం కనుక వారణాశి గా పిలవబడుతోంది.
వరుణ మరియు అసి నదుల మధ్య నెలకొన్న ప్రదేశం కనుక వారణాశి గా పిలవబడుతోంది.
సర్వేశ్వరునితో పాటు సమస్త దేవతలు కొలువు తీరి ఉండే వారణాశిని త్రేతాయుగంలో శ్రీ రామ చంద్ర మూర్తి, ద్వాపరంలో శ్రీ కృష్ణుడు, తల్లి కుంతీ దేవితో కలిసి పంచ పాండవులు, కలియుగంలో శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు, శ్రీ రామ కృష్ణ పరమహంస, శ్రీ వివేకానందులు ఆదిగా గల మహనీయులు సందర్శించి సేవిన్చుకోన్నారని అందుబాటులో ఉన్న రచనలు తెలుపుతున్నాయి.
గంగాధరుని జటాజూటాల నుండి జాలువారిన గంగా నదీ తీరాన వెలసిన కాశీ పట్టణం సృష్టి ఆది నుండి హిందువులకు జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించవలసిన క్షేత్రం గా పేరొందినది.
శ్రీ విశ్వేశ్వరుడు ఇక్కడ కొలువు తీరడానికి సంబంధించిన పురాణ గాధ మిగిలిన జ్యోతిర్లింగ క్షేత్రాల మాదిరిదే !
తానూ గొప్ప అంటే తానూ గొప్ప అన్న ఆధిపత్య సంవాదం నెలకొన్నది బ్రహ్మ దేవినికి శ్రీ హారికి మధ్య !
వారివురి మధ్యన ఆద్యంతాలు లేని జ్యోతి రూపంలో సాక్షాత్కరించిన నిరాకారుడు తన పై భాగాన్ని గానీ అధో భాగాన్ని గాని సందర్శించిన వారు అధికులు అన్నారట.
విధాత హంస వాహనం మీద ఊర్ధ్వ దిశగా వెళ్ళడం, మహా విష్ణువు భూ వరాహ రూపంలో భూమి లోనికి వెళ్ళడం
ఇద్దరూ తమ ప్రయత్నంలో విఫలమవ్వడం అందరికీ తెలిసిన కధే !!
అలా కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుడు స్వయం భూ లింగ రూపంలో వెలిశారు.
ముక్కోటి దేవతలు కొలువైన ఈ గంగా తీర పట్టణం పరమ పవిత్రమైనది.తలచినంతనే సమస్త పాపాలు తొలగిపోతాయి. గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం శుభకరం.
కాశీలో మరణిస్తే స్వర్గ ప్రాప్తి అంటే పునర్జన్మ ఉండదు అన్నది హిందువుల విశ్వాసం.
స్కంద పురాణం, మహా భారత లాంటి గ్రంధాలలో ఈ దివ్య క్షేత్రం గురించి ఉదాహరించినా తొలి ఆలయం ఎప్పుడు నిర్మించారు అన్నది తెలియరావడం లేదు.
కాక పోతే తొలి ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల క్రిందట "మహమద్ ఘోరి" సైనికులు ధ్వంసం చేసారు.
తదనంతర కాలంలో ఎందరో మొహ్మదీయ పాలకులు ఈ ఆలయం మీద దాడులకు తెగబడ్డారు.
చివరిసారిగా పదిహేడో శతాబ్దంలో మొఘలాయి చక్రవర్తి ఔరంగ జెబ్ ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేయడమే కాక అక్కడ ఒక మస్జీద్ ను నిర్మించాడు. దానిని నేటికీ ఆలయం పక్కనే చూడవచ్చును.
ఆలయాన్ని ఎన్నో సార్లు నిర్మించినా లింగం మాత్రం అదే ! ఆక్రమణ జరిగిన ప్రతి సారీ పూజారులు లింగాన్ని "జ్ఞాన వాపి" అని పిలవబడే బావిలో దాచేవారట.
ప్రస్తుత ఆలయాన్ని ఇండోర్ ని పాలించిన మాల్వా వంశానికి చెందిన "అహల్యా బాయి" నిర్మించారు. ఉత్తర భారత దేశంలోని అనేక శిదిల ఆలయాలను ఈమె పునః నిర్మించారు . వాటిల్లో ప్రఖ్యాత విష్ణు పాద గయ ఆలయం ఒకటి.
1859వ సంవత్సరంలో మహారాజా రంజిత్ సింగ్ ఆలయ విమానాలకు స్వర్ణ తాపడం చేయించారు.
కొన్ని వందల దుకాణాలు నెలకొన్న సన్నని సందులతో కూడిన పరిసరాలతో నిండి ఉంటుంది. వాటిల్లో విశ్వనాధ గల్లీ గుండా వెళితే మొదట "డూండీ గణపతి" దర్శనం లభిస్తుంది. ఇక్కడ నుండి అంచెలంచెలుగా పోలీసు వారి పహారా ప్రారంభం అవుతుంది. కనీసం కలం కూడా లోపలి తీసుకొని వెళ్ళడానికి వీలులేదు.
ప్రధాన ఆలయానికి ముందు శ్రీ అన్నపూర్ణా ఆలయం కుడి పక్కన వస్తుంది. భక్తుల ఆకలి తీర్చే తల్లి రమణీయ పుష్పాలంకరణలో దర్శనం ప్రసాదిస్తారు.
శ్రీ ఆంజనేయ, శ్రీ సూర్యనారాయణ ఉపాలయాలు కూడా ఉంటాయిక్కడ. అమ్మవారి ప్రసాదంగా ఇచ్చే బియ్యాన్ని ఇంట్లో ఉంచుకొంటే అన్నపానీయలకు లోటు ఉండదు అన్నది భక్తుల విశ్వాసం.
ఎదురుగా ఉన్న మందిరంలో శ్రీ ఆంజనేయ, శ్రీ రామ,శ్రీ సదాశివ, శ్రీ ద్రౌపదీ ఆదిత్య కొలువై ఉంటారు.
ప్రధాన ఆలయ ప్రాంగణంలో గణపతి, అన్నపూర్ణ దేవి, దండాయుధ పాణి, కాలభైరవ ఇత్యాది దేవీదేవతల ఉపాలయాల మధ్య బంగారు దేవాలయంలో శ్రీ విశ్వనాధ స్వామి లింగ రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటారు.
అభిషేకాలు, అర్చన భక్తులు నేరుగా చేసుకొనే భాగ్యం లభిస్తుంది.
ప్రతి నిత్యం వేలాది భక్తులు దర్శించుకొనే ఈ ఆలయం ఉదయం మూడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకూ తెరిచి ఉంటుంది.
ఆలయాన్ని పూర్తిగా చుట్టూ ముట్టినట్లుగా ఉండే దుకాణాలలో వస్త్రాలు, బొమ్మలు, పూజా సామాగ్రీ, ఇత్తడి సామానులు, తినుబండారాలు ఇలా ఇక్కడ లభించనిది లేదు.
కాశీలో విశ్వనాధ ఆలయం తరువాత సందర్శించవలసినవి గంగా తీరంలో నిర్మించిన ఘాట్లు. దక్షిణాన అసి ఘాట్ తో మొదలయ్యి ఉత్తరాన రాజ్ ఘాట్ వరకూ ఉన్న ఎనభై ఏడు ఘాట్లు చాలా మటుకు పద్దెనిమిదో శతాబ్దం నుండి పంతొమ్మిదో శతాబ్దం మధ్య కాలంలో నిర్మించబడినవి.
వీటిల్లో దశాశ్వమేద ఘాట్ ముఖ్యమైనది. ప్రతి నిత్యం సాయం సంధ్యా సమయంలో గంగా హరతికి వేదిక ఈ ఘాట్ !
దీనికి అటుపక్క ఇటుపక్క ఉన్న మణికర్ణికా మరియు హరిశ్చంద్ర ఘాట్ లలో ఇరవై నాలుగు గంటలూ అస్తమించిన వారి దేహాలను దహనం చేస్తుంటారు.
సప్త ముక్తి క్షేత్రాలలో కాశీ ఒకటి.
ఉదయాస్థమాన సమయాలలో పడవలో గంగా నదిలో విహరిస్తూ ఒడ్డున ఉన్న ఘాట్లను వీక్షించడం ఒక అద్భుత అనుభవం.
గంగ ఒడ్డున ఉన్న నేపాలీ మందిరం చక్కని అనుభూతులను అందించే రమణీయ నల్ల చెక్క నిర్మితం.
దశాశ్వమేద ఘాట్లో ప్రతి నిత్యం సాయం సమయంలో గంగా హారతి నిర్వహిస్తారు. భక్తి పారవశ్యంలో ముంచి తేల్చే కార్యక్రమం అది.
సుమారు నలభై అది నిముషాల పాటు జరిగే ఈ హారతి సందర్శకుల హృదయాలను ఆధ్యాత్మిక భావాలతో నింపుతుంది.
అడుగడుగున గుడి ఉంది అన్న సామెత కాశీకి సరిగ్గా సరిపోతుంది.
యాభైకి పైగా గణేశ, నూట ఎనిమిది ఈశ్వరాలయాలు, విష్ణు, దేవీ, కాలభైరవ, శ్రీ సూర్య, శ్రీ హనుమాన్ ఆలయాలు ఎన్నో ప్రతి సందులో కనపడతాయి. ప్రతి ఒక్కటి ఎంతో కొంత పురాణ మరియు చారిత్రిక నేపద్యం కలిగినవి కావడం ప్రస్తావించవలసిన అంశం.
ద్వాదశ సూర్యాలయాలు, శ్రీ కాలభైరవ, శ్రీ మంగళ గౌరీ ఆలయం తప్పక సందర్శించ వలసినవి.
శ్రీ కాశీ విశా లాక్షి ఆలయం, పాక్కనే ఉన్న ఆది పార్వతీ, శ్రీ అన్న పూర్ణ, శ్రీ ధర్మరాజ ప్రతిష్టిత శివలింగం కూడా తప్పనిసరిగా సేవించుకో వలసిన మందిరాలే!!!!
పెరిగిన నగరం, పర్యాటకుల మూలంగా గంగ నీరు సంపూర్ణంగా కలుషితమైనది అని ఎన్నో పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
అధికారులు, ప్రభుత్వం అనేకానేక నివారణ చర్యలను చేపడుతున్నారు. దానికి భక్తులు కూడా తమ వంతు సహకారం అందిస్తే త్వరితగతిన నిర్మల గంగను చూసి స్నానమాడే అదృష్టం మనం అందరం దక్కించుకో గలము.
దేశం నలుమూలల నుండి వారణాశి చేరుకోడానికి రైళ్ళు, విమాన సౌకర్యం కలదు.
ఉండటానికి అనేక హోటళ్ళు, మఠాలు, సత్రాలు లభిస్తాయి.
ఆంధ్రా భవనం, తెలుగు వాళ్ళ సత్రాలు చాలానే ఉంటాయి.
కాశీలో హిందీతో పాటు తెలుగు కూడా ఎక్కువగానే వినిపిస్తుంది.
ప్రతి ఒక్క హిందువూ తమ జీవితంలో తప్పక చేయవలసినది కాశీ యాత్ర.