21, డిసెంబర్ 2014, ఆదివారం

Sri Lakshmi Narasimha Swamy Temple, Nakarikallu

                      శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయం, నకరికల్లు 

శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్ధం ధరించిన అనేక అవతారాలలో నారసింహ అవతారం ప్రత్యేకమైనది. 
నర శరీరం సింహ శిరస్సుతో స్వామి ఆర్త రక్షకునిగానే కాకుండా సులభ ప్రసన్నునిగా అప మృత్యు భయాన్ని తొలిగించే వానిగా ప్రసిద్ది. 
నరసింహుని ఆలయాలు చాలా వరకు దక్షిణ ముఖంగా ఉంటాయి. దక్షిణ దిక్కు యమ స్థానం. 
తన భక్తులను యమ భాద పడకుండా కాపాడటానికే అన్నది భక్తుల నమ్మకం. 
మరో ముఖ్య విశేషం స్వామి ఆలయాలన్నీ కొండల మీద సహజ సిద్దంగా ఏర్పడిన గుహలలో ఉంటాయి. 
రూపం కూడా స్వయం ప్రకటిత రూపం. 
తదనంతర కాలంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగినది. మిగిలిన ఆలయ భాగాల నిర్మాణం జరిగినట్లుగా చరిత్ర తెలుపుతుంది. 
అదే విధంగా నారసింహ ఆలయాలలో సుదర్శన చక్రానికి, శ్రీ ఆంజనేయునికి అధిక ప్రాధాన్యత లభిస్తుంది.
దగ్గరలో శివాలయం కూడా ఉండటం మరో ప్రత్యేకత.
నారసింహ ఆరాధన ఎక్కువగా మన రాష్ట్రంతో సహా తమిళనాడు, కర్నాటక మరియు తెలంగాణా రాష్ట్రాలలో కనపడుతుంది.
ఆంధ్రా మరియు తెలంగాణా లలో ఎన్నో పురాతన నారసింహ ఆలయాలు ఉన్నాయి.
ప్రముఖమైనవి కాకుండా మారుమూల గ్రామాలలో కూడా చరిత్ర ప్రసిద్ది చెందిన నారసింహ ఆలయాలు కనపడతాయి.

అలాంటి వాటిల్లో గుంటూరు జిల్లా నకరికల్లు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయం సుమారు ఆరువందల సంవత్సరాలకు పూర్వం నుండే నెలకొని ఉన్నదని తెలుస్తోంది.
ఊరికి చివర చిన్న కొండ మీద ఉండే ఈ ఆలయ చరిత్ర సంపూర్ణంగా అందుబాటులో లేకపోవడం విచారకరం.


ఇక్కడ స్వామి వారే కాదు శ్రీ చెంచు లక్ష్మి అమ్మవారు, శ్రీ మహా లక్ష్మి కూడా స్వయం ప్రకటిత మూర్తులుగా తెలుస్తోంది.
గర్భాలయంలో శ్రీ నారసింహ స్వామి కొలువు తీరివుండగా, ఇరువైపులా దేవేరులు వెలసి ఉంటారు.
చెంచు లక్ష్మి అమ్మవారు రూప రహితంగా శిలాకారంలో ఉండటం ఇక్కడి మరో అంశం.



గుట్ట మీదకు మెట్ల మార్గంలో వెళితే మొదట శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయం దర్శనమిస్తుంది.
చిన్న గద్దె మీద శ్రీ గణపతి ఉపస్థితులై ఉంటారు.
శిధిల నంది, ద్వార పాలకులు అన్నీ కలిసి ఆలయం ఎంత పురాతనమైనదో తెలుపుతాయి.
ధ్వజస్తంభం వద్ద నిలబెట్టిన శిల ఒక శాసనం. దురదృష్ట వశాత్తు సున్నం వేయడం వలన అది పూర్తిగా కనుమరుగైనది.
శ్రీ\త్రిపురాంతక స్వామిని దర్శించుకొని ఇంకొంచెం ముందుకు వెళితే శ్రీ నారసింహ స్వామి ఆలయం కనపడుతుంది.
పునః నిర్మించిన ఆలయంలో పెద్దగా నిర్మాణ విశేషాలు లేకున్నా ఉత్తర ద్వారం ఉన్నది.
ధ్వజస్తంభం వద్ద ఒక శిలాశాసనం కొబ్బరి కాయలు కొట్టడానికి ఉపయోగిస్తున్నారు.
మరొకటి మాత్రం నిలబెట్ట బడినది.



అట్టహాసంగా ఆలయాలను పునఃనిర్మిస్తున్న వారు ఆలయ చరిత్రను తెలిపే అంశాల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఆలయానికి దక్షిణాన స్థానిక అవసరాల నిమిత్తం త్రవ్విన మంచి నీటి సరస్సు, చుట్టూ పచ్చని పొలాలు కళ్ళకు చక్కని ప్రకృతి విందు.









వంశపారంపర్యంగా అర్చకత్వం నిర్వహిస్తున్న శ్రీ రంగాచార్యులు గారు గ్రామ పంచాయితీ కార్యాలయ సమీపంలో నివసిస్తుంటారు.  


శ్రీ నారసింహ జయంతి, శ్రీ కృష్ణాష్టమి, శ్రీ రామ నవమి, ధనుర్మాస పూజలు, వైకుంఠ ఏకాదశి, భోగి నాడు గోదా కల్యాణం,శివరాత్రీ, నవ రాత్రులు వైభవంగా జరుపుతారు.
చారిత్రక విశేషాలు కలిగి వెలుగు లోనికి రాణి ఇలాంటి ఆలయాల అభివృద్దికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 
నమో నారసింహాయ నమః !!!!! 













































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...