3, డిసెంబర్ 2014, బుధవారం

Sara Narayana Temple, Thiruvathigai

                         శ్రీ సార నారాయణ ఆలయం, తిరు వధిగై



  భారతదేశంలోని ప్రతి ఒక్క పురాతన ఆలయంతో ఎన్నో పౌరాణిక గాధలు లేక సంఘటనలు ముడిపడి ఉండటం చూస్తూ ఉంటాము. కారణం అవన్నీ శతాబ్దాల క్రిందట నిర్మించడమే !. 
అలా ఒకటి కన్నా ఎక్కువ సంఘటనలతో ముడిపడి ఉన్న  విశేష ఆలయం శ్రీ సార నారాయణ ఆలయం. బ్రహ్మాండ పురాణం లోని నాలుగవ భాగంలో శ్రీ సార నారాయణ మహత్యం గురించి సోదాహరంగా తెలుపబడిననట్లుగా చెబుతారు. బ్రహ్మ స్వయంగా క్షేత్ర మహత్యాన్ని నారదునికి తెలిపారట. ఈ క్షేత్రానికి ఉన్న పేరుకి ఇక్కడ స్వామి స్వయంభూగా కొలువు తీరడానికి సంబంధించిన క్షేత్ర పురాణ గాధ కృత యుగం నాటిది.





























లోక కంటకులైన త్రిపురాసులను సంహరించడానికి సిద్దమైన సదాశివునికి దేవతలందరూ తమతమ ఆయుధాలను సమర్పించారట. శ్రీ మహా విష్ణువు తన శక్తినంతటిని ఒక శరంలో నిక్షిప్తం చేసి  అందించారట. ఆ శరాన్ని మరింత శక్తివంతం చేసిందిట  అమ్మవారు. ఇలా అందరి సహకారంతో  రుద్రుడు  త్రిపురాసుర సంహారం  చేసిన స్థలం ఇదేనంటారు. శరంతో రాక్షస వధ జరిగిన స్థలంగా  క్షేత్రానికి  "తిరువధిగై" అని  స్వామికి "సార నారాయణ పెరుమాళ్" అన్న పేర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది.  అసుర సంహారానంతరం సమస్త దేవతలు మరియు సర్వేశ్వరుడు సార నారాయణ స్వామి ని ఆరాధించారట.వారి కోరిక మేరకు పెరుమాళ్ ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు.












స్వామి శ్రీదేవి సమేతులై కళ్యాణ అలంకరణలో దర్శనమిస్తారు. కారణం తదనంతర కాలం లో మార్కండేయ మహర్షి శ్రీ హరిని అల్లునిగా చేసుకోవాలన్న తలంపుతో తపస్సు చేసారట. ఆయన దీక్షకు సంతసించిన సారంగపాణి దర్శనమిచ్చి మహర్షి తనయను స్వీకరించారట. అమ్మవారు శ్రీ హేమంబుజవల్లి విడిగా ప్రత్యేక సన్నిధిలో కొలువుతీరి దర్శనమిస్తారు.  
















గర్భాలయంలో కళ్యాణ ముద్రలో స్థానక భంగిమలో శ్రీ దేవి సమేత సార నారాయణ పెరుమాళ్ నిలువెత్తు విగ్రహ రూపంలో పాదాల వద్ద మార్కండేయ మహర్షితో నేత్ర పర్వంగా దర్శనం ఇస్తారు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయాన్ని  నిర్మించినది కాంచీ పురాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన  పల్లవ రాజులు. 




















చోళ, పాండ్య, నాయక ఇతర స్థానిక రాజులు  ఆలయాభివృద్ధికి తమ వంతు కృషి చేసినట్లుగా తెలుస్తోంది. పెద్దది అంత చిన్నది గానీ ప్రాంగణంలో నిర్మించిన ఆలయం సాదా సీదాగా ఉంటుంది. ప్రాంగణంలో ఒక్క "హేమాంభుజ నాయకి"ఉపాలయంతో పాటు మరెక్కడా కనపడని ఒక ప్రత్యేక సన్నిధి కనపడుతుంది. అదే శ్రీ శయన నారసింహునిది. సహజంగా  శ్రీ మన్నారాయణుడు శ్రీ రంగనాదునిగా లేక శ్రీ  అనంత పద్మనాభునిగా శయన భంగిమలో కోవెలలో కొలువై దర్శనమిస్తారు. 
అంతే తప్ప దశావతారాలలో ఏ అవతారం కూడా  శయన భంగిమలో ఉన్నట్లు తెలియదు. కానీ ఇక్కడ కుడి చేతిని తల క్రింద  ఎడమ చేతిని తొడల మీద పెట్టుకొని పాదాల చెంత అమ్మవారితో ప్రశాంత చిత్తంతో నిదురిస్తూ శ్రీ నారసింహ స్వామి దక్షిణ ముఖునిగా దర్శనమివ్వడం ఒక అరుదైన దృశ్యం. సహజంగా ఉగ్ర లేదా యోగ లేక శ్రీ లక్ష్మీ నారసింహునిగా కొలువై ఉండే స్వామి ఇలా ప్రశాంతంగా శయనించి ఉండటం అత్యంత అరుదైన విషయం.













ఈ రూపం గురించి ప్రచారంలో ఉన్న గాధ ప్రకారం లోకకంటకుడైన  "వక్రాసురుడు" అనే రాక్షసుని భీకర యద్ధంలో సంహరించిన స్వామి అలసిపోయి ఇక్కడ శయనించారట.  
పన్నిద్దరు ఆళ్వారులలో ఒకరైన "ఆండాళ్ "(గోదా దేవి) తన కీర్తనల హారం "తిరుప్పావై"లోని ఇరవై  మూడో పాశురంలో శయన నారసింహుని వర్ణించినది. ఆలయ మండప పైభాగాలను సుందర వర్ణ చిత్రాలతో అలంకరించారు. 












ఉదయం ఆరు గంటల నుండి పదకొండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే కోవెలలో నియమంగా నిర్ణయించిన అన్ని అభిషేకాలు, అర్చనలు మరియు అలంకరణలు జరుపుతారు.
ప్రతి సంవత్సరము "మాసి నెల " (ఫిబ్రవరి - మార్చ్ )లో నెల  రోజుల పాటు జరిగే ఉత్సవాలలో సమీపం లోని దివ్యదేశం అయిన "తిరుక్కోవిలూర్ " లో కొలువైన "శ్రీ త్రివిక్రమ స్వామి" ఒక రోజు ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తారు.
ఆ నెల రోజులు ప్రతి నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.
















వైకుంఠ ఏకాదశి, కృష్ణాష్టమి, శ్రీ నృసింహ జయంతి ఇలా అన్ని హిందూ పర్వ దినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆలయానికి రాజ గోపుర నిర్మాణం జరుగుతోంది.
ఆలయానికి వెళ్ళే దారిలో సుందర హనుమంతుని మరియు శ్రీ మారియమ్మన్ ఆలయాలు తప్పక దర్శనం చేసుకోవలసినవి.













ఈ విశిష్ట క్షేత్రం తమిళనాడు లోని విల్లుపురంకు ముప్పై కిలో మీటర్ల దూరంలో ఉన్న పానృటి కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
విల్లుపురం నుండి పానృటికి అక్కడ నుండి తిరువధిగై చేరటానికి చక్కని బస్సు సౌకర్యం లభిస్తుంది. వసతి  సౌకర్యాలు మాత్రం  లభించవు. విల్లు పురం నుండి వెళ్లి రావడం ఉత్తమం.
జై శ్రీ మన్నారాయణ !!!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...