Yogi Rama Surath Kumar Ashram, Tiruvannamalai

                     యోగి శ్రీ రామ సూరత్ కుమార్, తిరువన్నామలై 


తిరువణ్ణామలై  తలిచినంతనే సమస్త పాపాలను తొలగించే క్షేత్రం.
తిరువణ్ణామలై  కారణ జన్ములలో చిన్న మొలకలుగా ఉన్న ఆధ్యాత్మిక భావాలను ఎదిగి పదిమందికి నీడ నిచ్చే వటవృక్షాలుగా మార్చేదివ్య క్షేత్రం.
మొన్న నిన్న నేడు ఇంకా ముందు ముందు ఎందరికో అద్భుత ఆధ్యాత్మిక పరిపక్వత అందించే మహోన్నత క్షేత్రం.
అందుకే  తిరువణ్ణామలై దేశం నలుమూలల నుండి ఆధ్యాత్మిక వాదులను ఆకర్షిస్తోంది.







అలా సరి అయిన క్షేత్రం కోసం అన్వేషణ చేస్తూ చివరికి  తిరువణ్ణామలై చేరిన వారే యోగి రామ సూరత్ కుమార్ స్వామి. 
పవిత్ర గంగా నదీ తీరం. 
భూలోక కైలాసం కాశి. 
ఈ రెండింటికీ సమీపంలోని చిన్న గ్రామం "నరదారా" యోగి జన్మస్థలం. ( 01. 12. 1918 )







చిన్నతనం నుండే గంగా తీరంలో నివసించే సాదు సంతుల సన్నిధిలో ఎక్కువ గడుపుతుండేవారు.
"కపాడియా బాబా" ఆయనను ఎక్కువగా ప్రభావితం చేసిన వారు.
ఆ రోజులలోనే అలహాబాద్ విశ్వ విద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు.
ఉపాధ్యాయ వృత్తి చేస్తూ, గృహస్థు అయిన ఆయనలో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఉన్న ఆసక్తి పెరిగిందే కానీ తరగ లేదు.
జీవితంలో జరిగిన ఒక సంఘటన యోగిని అన్నీ వదిలి గురు అన్వేషణకు బయలుదేరేలా చేసింది.కపాడియా బాబా సలహా మేరకు పాండిచ్చేరి లోని అరవింద ఆశ్రమం చేరారు. కొంత కాలం తరువాత తిరువణ్ణామలై లోని శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి చేరారు.









చాలా కాలం ఈ రెండు ప్రాంతాల మధ్య తిరుగుతుండే వారు.
శ్రీ అరబిందో మరియు శ్రీ రమణ మహర్షి మహా నిర్వాణం తరువాత కేరళ రాష్ట్ర  కాసరగోడ్ జిల్లా "కన్హన్ గడ్" లోని
"పాపా రామదాస్" ని ఆశ్రయించారు.
ఆయన శ్రీ రామ మంత్రం ఉపదేశించారు.
నిరంతర తారక మంత్ర ధ్యానం చేస్తుండే వారు.
ఆత్మ పరిపక్వత, భగవత్ సాక్షాత్కారం లభించిన పిదప సుమారు ఏడు సంవత్సరాలు కాలి నడకన దేశమంతటా తిరిగి తిరువణ్ణామలై చేరుకొన్నారు.







తొలినాళ్ళలో ఆయనకు ఒక స్థిరవాసం ఉండేది కాదు.
శ్రీ అరుణాచల ఆలయ పరిసరాలలో ఉండేవారు.
ఆయనలో ప్రస్పుటంగా కనిపిస్తున్న యోగ లక్షణాలకు ఆకర్షితులైన కొందరు సన్నిధి వీధిలో చిన్న ఇల్లు కొని అక్కడ ఆయనను బలవంతంగా ఉంచారు.
భక్తుల కోర్కెను ఆమోదించారు.
తరువాత సుధామ గృహం లో కొంత కాలం ఉన్నారు.
అక్కడనుంచి సిద్ది పొందే ( February 20, 2001)వరకు ప్రస్తుత ఆశ్రమం లోనే ఉన్నారు.











ఆయన సూక్తులు, బోధనలు ప్రత్యేకంగా ఉంటాయి.
ఆశ్రమ నలుదిశల కనపడతాయి.
తన భౌతిక దేహం ఉన్న ఆశ్రమం చుట్టూ తిరిగినా అరుణాచల గిరివలయం చేసిన ఫలితం దక్కుతుందని అంటారు.
దీని కోసం ప్రత్యేక మార్గం ఆశ్రమం లో ఉన్నది.








సువిశాల ప్రాంగణంలో ఉన్న ఆశ్రమం శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా ఉన్న వీధిలో ఉంటుంది. 
ప్రతి నిత్యం ఎందరో శిష్యులు ఇక్కడికి వస్తుంటారు. నామ కోటి రాయడం, సంకీర్తనా గానం, సత్సంగాలు జరుగుతుంటాయి. 
భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహాన్నం భోజనం ఉచితంగా అందిస్తారు. 




















యోగి రామ సూరత్ కుమార్ తన ఆధ్యాత్మిక మార్గానికి సహాయ పడిన ముగ్గురి గురించి ఇలా చెప్పారు. 
శ్రీ అరొబిందో జ్ఞానం ప్రసాదిస్తే, శ్రీ రమణులు తపః శక్తిని పెంచుకొనే మార్గం భోదించగా, శ్రీ పాపా రామదాసు భక్తి మార్గం లోని  మాధుర్యాన్ని చవిచూపారు.  





ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగి  రామ సూరత్ కుమార్ శిష్యులు ఆయన చూపిన మార్గాన్ని అందరికీ పరిచయం చేయడం, వివిధ సహాయ కార్యక్రమాలలో మరియు ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటుంటారు.
 తిరువణ్ణామలై లో దర్శించవలసిన వాటిల్లో యోగి రామ సూరత్ కుమార్ ఆశ్రమం ఒకటి.

అరుణాచలేశ్వరాయ నమః !!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore