12, డిసెంబర్ 2014, శుక్రవారం

Navaneetha Sri Balakrishna Temple-2, Changheez khan pet

                 నవనీత శ్రీ బాలకృష్ణ ఆలయం, చంఘీజ్ ఖాన్ పేట 

అపురూపమయిన ఈ ఆలయాన్ని సందర్శించినా ఆ రోజు పూర్తిగా ఆలయ సమాచారం తెలుసుకోలేక పోయాను. 
శ్రీ బాలకృష్ణునికి సుమారు ఆరు దశాబ్దాలకు పైగా సేవచేసిన అనువంశిక పూజారులు శ్రీ . పరుచూరి వెంకట నరసింహా చార్యులు గారిని గుంటూరులో కలిసే అవకాశం మూడు రోజుల తరువాత కలిగింది. 
శ్రీ ఆచార్యులు గారు అత్యంత అభిమానంతో శ్రీ నవనీతం బాలకృష్ణ గురించిన శాస్త్ర విషయాలను, పురాణ, చారిత్రక అంశాలన్నింటిని తెలపడమే కాకుండా తాము స్వయంగా సేకరించిన అంశాలతో రాసిన ఆలయ గాధ పుస్తకాన్ని, స్వామి వారి చిత్రాలను బహూకరించారు.
ఈ వ్యాసంలో వారి పుస్తకంలోని అంశాలనే ఎక్కువగా పేర్కొనడం జరిగింది.
వారికి కృతజ్ఞతలు.



ఆచార్యుల వారు తెలిపిన ఆసక్తికర అంశాలను అందరితో పంచుకొందామని ఈ వ్యాసం రాస్తున్నాను. 
ప్రపంచంలో మరెక్కడా లేని అపురూప అరుదైన స్వయంవ్యక్త స్వామి మన రాష్ట్రంలో ఉన్నందుకు ఆనందించి, అభివ్రుద్దిపరచాల్సిన భాద్యతతో పాటు సమగ్ర చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం మనందరిమీదా ఉన్నదని భావిస్తున్నాను.
ఇలాంటి రూపంతో బాల గోవిందుడు మరికొన్ని క్షేత్రాలలో కొలువై ఉన్నారు.
అవి బెంగళూరు దగ్గర లోని దొడ్డ మల్లూరు, కర్ణాటకలోని మెల్కోటే, తమిళనాడులోని తిరుప్పార్ కడల్.
సింగిసానిపేట లోని వెన్న దొంగ మిగిలిన వాటికి ఆకారంలోనూ చరిత్ర లోనూ పూర్తిగా ప్రత్యేకమైన వాడు. 
ఈ విగ్రహంతో ముడిపడి ఉన్నచారిత్రిక అంశాలు శ్రీ కృష్ణ దేవరాయల కాలానికి అంటే అయిదు వందల సంవత్సరాల క్రిందటివి. 
1.  ఒక నాడు అష్ట దిగ్గజాలతో ఇష్టా గోష్ట్టి చేస్తున్నప్పుడు ఒక కవి ఈ క్రింది పద్యం చెప్పారట.

"బాలయ నీలవపుషే నవ కింకిణీక                         "చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
జాలాభిరామ ! జఘనాయ దిగంబరాయ                    బంగారు మొలత్రాడు పట్టు దట్టీలు
శార్దూలదివ్యనఖ భూషణ ! భూషితాయ                     సందేట తాయెతులు సరిమువ్వ గజ్జెలు
నందాత్మజాయ నవనీతముషే నమస్తే !!"                  చిన్ని కృష్ణా నిన్ను జేరిగొలతు"

( సంస్కృత పద్యానికి సరిపోయే తెలుగు పద్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది)
ఈ పద్యం వినగానే చక్రవర్తి కనుల ముందు కదిలినదట. 
నాటి రాత్రి స్వామి స్వప్నంలో కనపడ్డారట. 
తెల్లవారిన తరువాత అప్పాజీ తదితరులను పిలిచి కలలో కనిపించిన కమనీయ రూపం వర్ణించి, అలాంటి దానిని తయారు చేయమని ఆదేశించారట. 
రాజాజ్ఞ ప్రకారం శిల్పులు తగిన శిల కోసం ఉదయగిరి కొండలలో అన్వేషిస్తుండగా రాయల వారి వర్ణనకు సరిపోయే శిల్పం ఆ కొండలలో లభించినదట. 
వారు ఆ స్వయంవ్యక్త రూపాన్ని హంపి తరలించారట. 
మరో మారు సంశయ వాతావరణం నెలకొన్నది. ఇలాంటి మూర్తి ఆలయంలో ప్రతిష్టించడానికి శాస్త్రం ఒప్పుతుందా ?
పండితులు గ్రంధాలను తిరగేసారు. 
భ్రుగు మహర్షి విరచిత " ప్రకీరనాదికారం" అనే గ్రంధం ప్రకారం అయిదు రకాల ఆలయాలు ఉన్నాయి. 
స్వయంవ్యక్త, దివ్య స్థలం, సిద్ద నిర్మితం, పురాణ ప్రసిద్ది గల క్షేత్రం, మానవ నిర్మితాలు. 
అన్నింటి లోనికి స్వయంవ్యక్త మూర్తిని ఆరాధించడం శుభకరం. 
అదే గ్రంధం ప్రకారం ఆలయాలలో ఉండాల్సిన శ్రీ బాలకృష్ణ మూర్తి రూపం ఎలా ఉండాలని వర్ణించబడినదో, లభించిన మూర్తి సరిగ్గా అలానే ఉండటంతో ప్రతిష్ట చేయవచ్చునని పండితులు తెలిపారట. 
తరువాత రాయలు తూర్పు ప్రాంతాలను జయించే క్రమంలో కొండవీడులో కొంత మేరకు ప్రతిఘటన ఎదుర్కొన్నారట. అప్పుడు మొక్కుకొన్న దాని ప్రకారం ఇక్కడికి తెచ్చి ప్రతిష్టించారట. 
2. అప్పట్లో కొండవీడుకు రాజ ప్రతినిధిగా ఉన్న "తిరుమల రాయలు" రాయల వారి ఆనతి మేరకు విజయనగర నిర్మాణ శైలిలో ఒక ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నాడు శ్రీ గోపి నాద ఆలయంగా పిలవబడి నేడు 
"కత్తుల బావి"గా పిలవబడుతోంది.






3. అనంతర కాలంలో కొండవీడును హస్తగతం చేసుకొన్న బహమనీ సుల్తానులు  హిందూ దేవాలయ విధ్వంసన 
ఆరంభించారట. అప్పుడు ఈ అపురూప విగ్రహాన్ని భూమిలో పాతి పెట్టారట.
తిరిగి ఆ విగ్రహం సుమారు రెండు వందల సంవత్సరాల క్రిందట త్రవ్వకాలలో బయల్పడినది.
4. స్వామి ఈ ప్రాంతాలలోనే ఉండాలని స్వప్న సందేశం ద్వారా తెలిసినందున అప్పట్లో గ్రామ అధికారులు పన్నుల వసూలు నిమిత్తం గ్రామస్తులను సమావేశపరచే మండపానికి నాలుగు పక్కలా గోడలు నిర్మించి ఆలయంగా మార్చారట.  చూస్తే అర్ధం అవుతుంది.




5. సహజంగా ఆలయాలలోని విగ్రహాలకు రాతి మీదే దుస్తులు ఉన్నట్లుగా మలుస్తారు. కానీ శ్రీ బాల కృష్ణ విగ్రహం దిగంబరంగా ఉండటం ముఖ్యమైన అంశం.
కుడి చేతిలో వెన్న ముద్ద, ఎడమ చేతిలో వెన్న చట్టి, కుడిపాదం కొద్దిగా ముందుకు సాచి ఎడమ పాదం వంచి కుంచిత పాదముతో దోగాడుతూ మెడలో పులిగోరు, ముత్యాల సరాలు, మొలకు గజ్జెల మ్రొలతాడు, చేతులకు కంకణాలు, పాదాలకు కడియాలు, ఒత్తైన పిరుదులు, పాలుగారు చెక్కిళ్ళు, చక్కని నాశిక, గుండ్రని కన్నులు, నుదుటన కస్తూరి నామం, ఉంగరాల జుట్టుతో మనోజ్ఞ రూపంతో ఉన్నముద్దుల బాల కృష్ణయ్యను అందరూ చేతులలోనికి తీసుకొని ముద్దులాడాలనుకొంటారు.
పండితులు నవనీత శ్రీ బాలకృష్ణను వటపత్ర శాయి తో సరి పోల్చారు.
కొలువుతీరి అయిదు వందల సంవత్సరాలైనా చిన్నికృష్ణుడు అవతరించినది ఎప్పుడో  ???
కాలానికే కాల నిర్ణయం చేయగలిగిన విశ్వ రూపుడు మన రాష్ట్రంలో గత అయిదు శతాబ్దాలుగా ఏడాది వయస్సు బాలునిగా ఉండటం ఇక ముందు ఉండబోవడం మనందరి సుకృతం.

కృష్ణం వందే జగద్గురుం !!!! 

(ఈ వ్యాసం లోని చిత్రాలు 2012 లో తీసినవి. వాటిని ఇచ్చిన సన్నిహిత మిత్రులు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్. జీ. యస్. సతీష్ కుమార్, గుంటూరు గారికి కృతజ్ఞతలు.)
( నేను సందర్శించిన అనేక అరుదయిన  ఆలయాలలో ఈ ఆలయానిది ప్రత్యేక స్థానం. మన రాష్ట్రంలో అందులో నేను పుట్టి పెరిగిన గుంటూరు జిల్లలో ఉండటం బహుశా ముఖ్య కారణం అయ్యుండవచ్చు ) 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...