7, డిసెంబర్ 2013, శనివారం

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి దేవాలయము, ఓంకారం 


ఓంకార స్వరూపుడైన కైలాసనాధుడు కొలువు తీరిన అనేకానేక క్షేత్రాలలో ఓంకారం ఒకటి.యుగాల నాటి పౌరాణిక విశేషాలు , శతాబ్దాల చరిత్రకు, తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామా ఓంకారం.
శ్రీ గంగా ఉమా సమేతముగా శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రం ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం. ప్రశాంతతకు మారు పేరు. మైమరపించే ప్రకృతి సౌందర్యం ఓంకారం సొంతం. 
స్వచ్చమైన గాలి, పచ్చని పరిసరాలు, మొక్కిన వారిని దరి చేర్చుకొనే పరమేశ్వరుని సన్నిధితో సందర్శకులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచివేస్తుంది ఓంకారం, 
"ఆర్తులు అందరికి అన్నం" అన్న అవధూత శ్రీ కాశి నాయన మాటను నిజం చేస్తున్న ఆయన భక్త బృందం ఏర్పాటు చేసిన ఆశ్రమం మరియు అన్న వితరణ కేంద్రం , ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారం ఓంకారం.











పురాణ గాధ :

క్షేత్రానికి సంబంధించిన పురాణ గాధ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆవిర్భాలతో ముడిపడి ఉన్నది. అందరికీ  తెలిసినదే!
సృష్టి ఆరంభంలో సృష్టికర్త బ్రహ్మ దేవుడు, స్థితకారుడు శ్రీ మన్నారాయణుడు నేను గొప్పంటే నేను గొప్ప అన్న వివాదానికి దిగారు. ఎంతకీ తెగని ఆ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. 
అప్పుడు వారిరువురి మధ్యన దిక్కులు పిక్కటిల్లేలా  ఓంకార నాదంతో ఓక జ్వాలా లింగము  ఉద్భవించినది. "అది ఎవరా ?" అన్న ఆశ్చర్యానికి లోనైనా వారికి " మీ ఇరువురలో ఎవరైతే నా ఆది  అంతాలలో ఒక దానిని చూసి వస్తారో వారే గొప్ప " అన్న మాటలు వినిపించాయి. 
బ్రహ్మ హంస రూపంలో ఊర్ధ్వ దిశగా ఎగురుతూ వెళ్ళగా, మహా విష్ణువు భూ వరాహ రూపం దాల్చి భూమిని తొలుచుకుంటూ పాతాళం లోనికి వెళ్ళారు.ఎంతో దూరం వెళ్ళినా ఇరువురు ఆ లింగ ఆది అంతాలను కనుగొన లేక పోయారు.
శివ తత్త్వం భోధపడిన శ్రీ హరి తిరిగి వచ్చి  ఓటమిని ఒప్పుకున్నారు.
కానిఅహంభావానికి లొంగిపోయిన విధాత మాత్రం తాను లింగ అగ్ర భాగం చూశానని తెలిపి దానికి సాక్షిగా మొగలి పువ్వును సాక్ష్యంగా తీసుకొని వచ్చారు.
అసత్యం చెప్పిన చతుర్ముఖుని మీద ఆగ్రహించిన లింగ రాజు ఆయనకు భూలోకంలో ఎక్కడా ఆలయం ఉండదని, ప్రజలు ఆయనను పూజించరని, వంత  పాడిన మొగలి పువ్వు పూజకు అనర్హమైనదని శపించారు.
ఈ సంఘటన జరిగినది తొలిసారి ఓంకార నాదం ఉద్భవించినది ఇక్కడే కావడం వలన ఈ క్షేత్రానికి "ఓంకారం" అన్న పేరోచ్చినదని స్థానిక నమ్మకం.










ఆలయ విశేషాలు :

మూడుపక్కలా పర్వతాలు, దట్టమైన అడవి, ప్రశాంత ప్రకృతితో కూడిన ప్రదేశంలో ఉంటుంది శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి ఆలయం. ఆలయం చిన్నగా, విశేష నిర్మాణాలు లేకుండా తూర్పు ముఖంగా ఉంటుంది.  ఆలయాన్నితొలుత ఎవరు నిర్మించారు ? అన్న విషయం ఇదుమిద్దంగా తెలియకున్నా ఎన్నో రాజ వంశాల రాజులు ఈ క్షేత్రాన్ని సందర్శించి తమ వంతు కైంకర్యాలను సమర్పించుకొన్నట్లుగా  తెలుస్తోంది.
నంద్యాల ప్రాంతాన్ని పాలించిన నంద వంశ రాజులు ఆలయాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని, వారి కాలంలోనే ప్రస్తుత నిర్మాణాలు నిర్మించబడినాయని అంటారు. కానీ ధృవీకరించే శిలాశాసనాలు ప్రాంగణంలో కనిపించవు. 
విజయనగర సామ్రాజ్యాదీశుడు  అయిన శ్రీ కృష్ణ దేవరాయల వారి గురువైన శ్రీ వ్యాస రాయల వారు ఓంకార క్షేత్రం సందర్శించారని, ఇక్కడి వాతావరణానికి ముగ్ధులై కొంత కాలమిక్కడే తపమాచరించారని  తెలుస్తోంది. వాయుపుత్రుని ఆరాధించే వారు తమ ఆరాధ్యదైవాన్నినిత్యము
పూజించుకోడానికి ఒక హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించుకొన్నారని చెబుతారు.దీనికి నిదర్శనంగా కోనేరు ఒడ్డున వట వృక్షం క్రింద ఉన్న శ్రీ హనుమంతుని విగ్రహాన్ని చూపుతారు.  నేడు నంద్యాల పరిసర  ప్రాంతాలలో పేరొందిన హనుమంతుని ఆలయాలలోని ప్రధాన అర్చనామూర్తి విగ్రహాలు చాలా వరకు వీరి ప్రతిస్టే అని ఆధారాల ద్వారా అవగతమవుతోంది.  










అదే వృక్షం క్రింద విఘ్న నాయకుని విగ్రహం, ఎన్నో నాగ ప్రతిష్టలు కనపడతాయి. వివాహ యోగానికి, సత్సంతానానికి  ఇక్కడ నాగ ప్రతిష్టలు చేయడం ద్వారా తమ కోర్కెలు నెరవేరతాయని  భక్తులు విశ్వసిస్తారు. 
మూడు కొండల నడుమ సుందర ప్రకృతిలో సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన ఆలయం లోనికి వెళ్ళడానికి తూర్పున, దక్షిణాన ద్వారాలున్నాయి. రాజగోపురం ఉండదు. రాతి మండపా లను దాటిన తరువాత ప్రధాన ఆలయానికి ఉత్తరాన నవగ్రహ మండపం కనిపిస్తుంది. ఈశాన్యంలో పుష్కరణి ఉంటుంది. గర్భాలయంలో చందన, విభూతి కుంకుమ లెపనాలతొ ఓంకార సిద్దేశ్వర స్వామి లింగ రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటారు. 
ప్రక్కనే ఉమాదేవి అమ్మవారి సన్నిధి ఉంటుంది. మంగళ, శుక్రవారాలలో దేవదేవికి విశేష పూజలు చేస్తారు. దసరా నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. 
ప్రతినిత్యం ఎన్నో అబిషేకాలు, అర్చనలు, పూజలు, అలంకరణలు ప్రధాన అర్చనా మూర్తులకు జరుగుతాయి. వినాయక చవితి, శివరాత్రి, దేవి నవరాత్రులు, కార్తీక మాస పూజలు విశేషంగా నిర్వహిస్తారు. 
ఆలయానికి సమీపంలోనే అవధూత శ్రీ కాశి నాయన ఆశ్రమం ఉన్నది. ఓంకార క్షేత్ర సందర్శనార్ధం వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం లభిస్తుంది ఈ ఆశ్రమంలో ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి పది గంటల వరకు.  
ఆలయానికి వెనుక నూతనంగా శ్రీ జగద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ శనేశ్వర స్వామీ తపో వనాన్ని నిర్మించారు. ఇందులో పెద్ద నవగ్రహా మూర్తులను ఉంచారు.




















కార్తీక మాసంలో నంద్యాల ప్రాంత వాసులు వన సమారాధనకు ఎంచుకొనే ప్రాంతాలలో ఓంకారానిదే అగ్రస్థానం అంటే అతిశయోక్తి లేదు. కారణం ఏమిటంటే ఆధ్యాత్మికతతో పాటు ఆకర్షించి ఆహ్లాదపరచే పరిసరాలు ఓంకారం సొంతం.  
ప్రతినిత్యం ఎందరో భక్తులు ఓంకార క్షేత్రాన్ని సందర్శించి సేవించుకొని శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి కృపా కటాక్షాలను పొందుతుంటారు.
ఈ పురాణ ప్రసిద్ద స్థలం కర్నూలు  జిల్లా నంద్యాల పట్టణానికి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలంలో ఉన్నది. నంద్యాల నుండి బస్సు సౌకర్యం లభిస్తుంది. ఆహరం శ్రీ కాశి నాయన ఆశ్రమంలో లభిస్తుంది. కానీ ఎలాంటి వసతి సౌకర్యాలు లేవు. నంద్యాల నుండి వెళ్లి రావడం మంచిది. 
నంద్యాల చుట్టుప్రక్కల ఉన్న నవ నంది క్షేత్రాలతో పాటు తప్పక దర్శించవలసిన క్షేత్రం ఓంకారం.
నమః శివాయ !

















1 కామెంట్‌:

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...