29, జనవరి 2023, ఆదివారం

Navagraha Mandapam

                                      నవగ్రహ మండపం 



                                                                                                     

ప్రతి శివాలయంలో ఈశాన్యంలో కనపడుతుంది నవగ్రహ మండపం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితాలను ప్రభావితం చేసే నవగ్రహాలైన సూర్య, చంద్ర, అంగారక, బుధ, గురు, శుక్ర, శని, రాహువు మరియు కేతువులు కొలువై ఉండే స్థలం.
పుట్టిన దగ్గర నుండి మరణించే దాకా మానవ జీవితాలో సంభవించే ఉద్దానపతనాలకు ఈ గ్రహాలే కారణం  అంటుంది జ్యోతిష్యశాస్త్రం. ఆ ఎత్తుపల్లాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది మన జాతక చక్రంలో గ్రహాలు ఉన్న స్థానాల  ఆధారంగా ఒక అంచనాకు వస్తారు జ్యోతిష్కులు. ఏయే గ్రహాలు అననుకూలంగా ఉన్నాయో చూసి వాటి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడానికి నిర్ణయించిన శాంతులు, అభిషేకాలు, దానాలు, ప్రదక్షణాలను తెలుపుతారు.
సహజంగా నవగ్రహ మండపంలో ప్రధాన దైవం ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ  సూర్య నారాయణ మూర్తి.  ఆయన వెనుక పడమరలో పుత్రుడైన శని భగవానుడు ఉంటారు. ఈశాన్యం లో కేతువు, ఆగ్నేయంలో శుక్రుడు, ఉత్తరంలో బుధుడు, దక్షిణంలో కుజుడు, వాయువ్యంలో చంద్రుడు, నైరుతిలో రాహువు కొలువై ఉంటారు. 
ఆదిత్యుడు సప్తాశ్వ రధారూరుడై కనపడతారు. చంద్రుడు పది తెల్లని అశ్వాల కలిగిన రథంలో ఉంటారు.  దక్షిణంలో ఉండే అంగారకుడు ఒకరకమైన గొఱ్ఱె వాహనం కలిగి ఉంటారు. బుధుడు సింహవాహనుడు. గురువు లేదా బృహస్పతి పద్మ వాసనుడు. శుక్రుడు అష్ట అశ్వ వాహనుడు. శని భగవానుడు కాకి వాహనుడు. వీరు మన జీవితాలలో ఒక్కో సమయంలో ఒక్కో విధమైన ప్రభావాన్ని చూపిస్తారు. 
మనందరం జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక కారణంగా నవగ్రహాలకు ప్రదక్షణలు చేసిన వాళ్ళమే.ప్రదక్షణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను పరీక్షగా చూసి ఉన్నామా ? తొమ్మిది గ్రహాలూ ఏ విధంగా ఉన్నాయి,  ఏయే దిక్కులను చూస్తున్నాయి, వారి వాహనాలు ఆయుధాలు ఏమిటి అన్న విషయాలను గమనించామా ?
ఇప్పటి దాకా చూడక పోతే ఇక ముందు చూడండి. ఎన్నో అరుదైన విషయాలు తెలుస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం చుట్టుపక్కల మరియు చెన్నై చుట్టుపక్కల నవగ్రహ ఆలయాలు నెలకొని ఉన్నాయి. ఆ ఆలయాలలో పరమశివుడే లింగ రూపంలో  ఆయా గ్రహాల తరుఫున  పూజలు అందుకొంటారు. కానీ నవగ్రహ మండపంలో తొమ్మిది గ్రహాలే ఉండి భక్తుల అభిషేకాలు,పూజలు స్వీకరిస్తుంటారు. దాని వలన మన జీవితాలలో గ్రహ సంబంధిత సమస్యలు దూరం అవుతాయని భావిస్తాము .  
నేను స్వయంగా సందర్శించిన కొన్ని ఆలయాలలో ఉన్న నవగ్రహ మండప విశేషాలను అందరితో పంచుకొందామన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాస్తున్నాను.

తిరువారూరు : తమిళనాడులోని అతి పెద్ద ఆలయాలలో ఒకటి. సంగీత త్రిమూర్తులుగా కీర్తించే శ్రీ త్యాగరాజు, శ్రీ ముత్తుస్వామి దీక్షితార్, శ్రీ శ్యామశాస్త్రి ల జన్మస్థలం. శ్రీ త్యాగరాజ స్వామి   ఆలయంలో ఉన్నన్ని పరివార దేవతల సన్నిధులు వేరెక్కడా కనపడవు. ఒక్క వినాయక విగ్రహాలే వంద దాకా ఉంటాయి. ప్రతి నిత్యం ప్రదోష పూజలు జరుగుతాయి.
ఆలయానికున్న మూడు ప్రాకారాలలో మొదటి ప్రాకారంలో ఉంటుంది నవగ్రహ మండపం.
సహజంగా సూర్యుడు, శుక్రుడు తూర్పు, చంద్ర, శని పడమర, బుధ, గురు ఉత్తరం, అంగారక, రాహు కేతువులు దక్షిణ దిశలను చూస్తుంటారు. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ ఒక వరుసలో పడమర దిశను   అంటే   గర్భాలయం లోని శ్రీ త్యాగరాజస్వామి ని చూస్తుంటాయి.హస్త, చిత్త నక్షత్ర జన్ములకు పరిహార క్షేత్రం తిరువారూరు.
తిరువారూరు కు తంజావూరు, కుంభకోణం, చిదంబరం,చెన్నై నుండి నేరుగా చేరుకోడానికి బస్సు రైలు సౌకర్యం లభిస్తుంది. తప్పక సందర్శించవలసిన ఆలయాలలో ఒకటి.
మైలాడుతురై  (మాయవరం) :   పట్టణంలోని శ్రీ మయూరనాథ స్వామి కోవెల కారణంగా  ఈ పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. నెమలి రూపంలో పార్వతీదేవి సర్వేశ్వరుని గురించి తపస్సు చేసి సాక్షత్కారం పొందినట్లుగా ఆలయ గాధ చెబుతోంది. విశేష ఆలయం. ఈ క్షేత్రంలోని నవగ్రహ మండపంలో శనీశ్వరుడు తల మీద అగ్ని శిఖలతో దర్శనమిస్తారు. జ్వాలాశని గా పిలిచే ఈయనకు అభిషేకాలు జరిపిస్తే ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది అని చెబుతారు.
ఇలాంటి శని రూపం మరో ఆలయంలో కనపడదు.
మైలాడుతురై కి చెన్నై, మధురై, తంజావూరు, కుంభకోణం, చిదంబరం నుండి నేరుగా రైలు, బస్సు మార్గాలలో సులభంగా చేరుకోవచ్చును.
తిరుక్కొల్లిక్కాడు   : తిరువారూరు కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుక్కొల్లిక్కాడు శ్రీ అగ్నీశ్వర స్వామి ఆలయం ఒక విశేష నిర్మాణం.  శని భగవాన్ ప్రత్యేక సన్నిధిలో అనుగ్రహ మూర్తిగా దర్శనమిస్తారు. శనివారాలు ఉమ్మెత్త పూలతో అర్చన చేయడం వలన ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చును అంటారు.
గ్రహ సంబంధిత అభిషేకాలు, అర్చనలు గర్భాలయంలో కొలువైన శ్రీ అగ్నీశ్వర స్వామికే చేస్తారు. నవగ్రహ మండపంలోని నవగ్రహాలు అసహజ పద్దతిలో ఒకదానికి ఒకటి ఎదురు బొదురుగా కొలువై ఉంటాయి. శ్రీ అగ్నీశ్వరస్వామే భక్తులకు వాటి తరుపున ఉపశమనం కలిగించడం వలన పనిలేక నవగ్రహాలు కబుర్లు చెప్పుకొంటున్నాయి అని హాస్యమాడుతుంటారు స్థానికులు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించినవారి పరిహార క్షేత్రం.
విలంకుళం : తంజావూరు కు డెబ్భై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న విలంకుళం శ్రీ అక్షయపురీశ్వర స్వామి వారు కొలువైన దివ్య క్షేత్రం. సోదరుడు యమునితో జరిగిన ఒక వివాద సందర్బంగా శనీశ్వరుని కాలు విరిగిందట. ఈ క్షేత్రంలో పరమేశ్వరుని అనుగ్రహంతో సరైనదట. ఈ కారణంగా విలంకుళం శని పరిహార క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. భార్యలైన మందాదేవి మరియు జ్యేష్టాదేవి లతో కలిసి కళ్యాణ శనీశ్వరునిగా కొలువైన ఈయనకు నువ్వుల నూనెతో ఎనిమిది పర్యాయాలు అభిషేకం జరిపితే అర్ధాష్టమ, ఏలినాటి, జన్మ శని ప్రభావం తొలగిపోతుంది అన్నది స్థానిక విశ్వాసం. శనివారాలు పెద్ద సంఖ్యలో భక్తులు అభిషేకాలు జరిపించుకోడానికి వస్తుంటారు. సూర్యభగవానుడు మరో ఉపాలయంలో దర్శనమిస్తారు. 
అన్ని కోర్కెలను నెరవేర్చే శ్రీ అక్షయ పురీశ్వర స్వామి, కళ్యాణ శని మరియు ఆదిత్యుడు కొలువైనందున వేరుగా నవగ్రహ మండపం ఉండదు. నవగ్రహ మండపం లేని అతి తక్కువ ఆలయాలలో ఇదొకటి.
దేవీ పట్టిణం : రామేశ్వరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సాగర తీర క్షేత్ర గాధ  రామాయణంతో ముడిపడి ఉండటం విశేషం. సీతాదేవిని రావణాసురుని చెర నుండి విడిపించడానికి లంకను చేరటానికి వారధి నిర్మించడానికి ముందు శ్రీ రాముడు వానర సేనతో ఇక్కడకి వచ్చారట. సముద్రం తీరాన తొమ్మిది శిలలను నవగ్రహ రూపాలుగా ప్రతిష్టించి పూజలు జరిపించారట. శ్రీ సౌందర్య నాయకీ సమెత శ్రీ తిలకేశ్వర స్వామి, శ్రీ అష్టభుజ దుర్గాదేవి ఆలయంలో కొలువై ఉంటారు. సముద్రంలో ఉన్న నవగ్రహ శిలలకు, అష్టభుజ దుర్గాదేవికి అర్చనలు జరిపించుకొంటే అన్ని గ్రహబాధలు తొలగిపోతాయి అని విశ్వసిస్తారు.
దేవీ పట్టిణం పితృకార్యాలకు ప్రసిద్ధి. ఇలా సముద్రం కొలువైన  రూపు లేని శిలలుగా నవ గ్రహాలు  పూజలు అందుకొనే క్షేత్రం దేవీ పట్టిణం ఒక్కటే !
తెందురి పెరై : పావన తమిరబారాణి నదీతీరంలో నెలకొన్న తెందురిపెరై శైవులకు దర్శనీయమైన నవ కైలాసాలలోను, వైష్ణవులకు పూజ్యనీయమైన నవ తిరుపతులలోనూ స్థానం పొందిన స్థలం. పెరుమాళ్ కోవెల వైష్ణవ సంప్రదాయం ప్రకారం సూర్య క్షేత్రం. దగ్గరలోనే ఉన్న శ్రీ శివగామీ సమేత  శ్రీ కైలాస నాథర్ కొలువైన ఆలయం బుధ పరిహార క్షేత్రం. ఇక్కడి నవగ్రహ మండపంలో సూర్యుడు ఏడు, చంద్రుడు పది, శుక్రుడు మరియు గురువు ఎనిమిది అశ్వాలు పూంచిన రధాలలో ఉపస్థితులై దర్శనం ఇవ్వడం అరుదైన విషయం. ఇలా మరెక్కడా కనపడదు.
తిరువణ్ణామలై  : స్మరిస్తే చాలు ఇహపర సుఖాలను అనుగ్రహించే పవిత్ర నామం అరుణాచలేశ్వర. ఈ దివ్య క్షేత్రంలో అయ్యన్ కుళం పుష్కరణి దగ్గర ఉన్న శ్రీ అరుణగిరినాథర్ లింగం శ్రీ మహావిష్ణు ప్రతిష్టగా చెబుతారు. ఈ ఆలయంలోని నవగ్రహ మండపంలో నవగ్రహాలు తమ భార్యలతో సహా తమతమ వాహనాల మీద కూర్చొని దర్శనమివ్వడం అత్యంత అరుదైనది  పేర్కొనవచ్చును.  వివాహం కానివారు, సంతానం లేనివారు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ నవగ్రహ పూజలు జరిపించుకొంటుంటారు.
తిరుకుళందై (పెరుంకుళం)  : తమిరబారాణి నదీ తీరంలో నెలకొన్న శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో మరియు నవ తిరుపతులలో శని క్షేత్రంగా పెరుంకుళం ప్రసిద్ధి. శ్రీదేవి మరియు శ్రీ వెంకట వాసన్ పెరుమాళ్ స్థానిక భంగిమలో దర్శనమిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఇది శని పరిహార క్షేత్రం. ఒక వైష్ణవ ఆలయంలో నవగ్రహ మండపం నెలకొని ఉండటం అరుదైన విషయం.  నవగ్రహలతో పాటు ప్రత్యేక సన్నిధిలో కొలువైన శ్రీ శని భగవానుకు జాతకరీత్యా శని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నవారు ప్రత్యేక పూజలు జరిపించుకొంటుంటారు. పెరుంకులం తెందురిపెరై కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
మధురై : శ్రీ మీనాక్షీ సమేత సోమసుందరేశ్వర స్వామి కొలువైన మధురై ఎన్నో విశేష ఆలయాలకు పుట్టినిల్లు. వాటిల్లో ఒకటి శ్రీ కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెల ఒకటి. శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి. శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ అళగర్ పెరుమాళ్ గర్భాలయంలో ఉపస్థిత భంగిమలో నిలువెత్తు రూపంలో నయనమనోహరంగా దర్శనమిస్తారు.  మధురై రైల్వే స్టేషన్ కి సమీపంలో ఉన్న ఆలయంలో కూడా నవగ్రహ మండపం కనిపించడం ఒక ప్రత్యేకత. నియమంగా నవగ్రహ పూజలు నిర్వహిస్తారు. వైష్ణవ ఆలయంలో నవగ్రహ మండపం కనపడటం  అరుదైన విషయంగా పేర్కొనాలి. ఇలా నవగ్రహ మండపం కనపడే మరో విష్ణు ఆలయం శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయం, పెరుంకుళం. ఈ ఆలయం శ్రీ వైష్ణవ నవగ్రహ దేవాలయాలలో ఒకటి. ఈ రెండు ఆలయాలు ఆళ్వార్లు పాశురాలు గానం చేసిన  శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో భాగంగా ఉండటం మరో విషయంగా పేర్కొనాలి.  
ఇలా ఎన్నో ప్రత్యేక విశేష రూపాలలో  నవగ్రహలు కొలువైన మండపాలను తమిళనాడులోని పెక్కు పురాతన చారిత్రక ఆలయాల్లో దర్శించుకోవచ్చును.


ఆదిత్యాయ సోమాయ మంగళాయ భుధాయచ!గురు శుక్ర శనిభేష్య రాహవే కేతవే నమః!









Sri Lakshmana Perumal Temple, Thirumuzhilikkulam

 

                   తిరుమూళిక్కుళం లక్ష్మణ పెరుమాళ్ 



ఆళ్వారుల కాలంలో నేటి కేరళ ప్రాంతాన్ని"మలై నాడు" అని పిలిచేవారు. ఈ ప్రాంతంలో మొత్తంగా పదమూడు శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఉన్నాయి. స్వతంత్ర భారత  రాష్ట్రాల విభజన సమయంలో రెండు దివ్యదేశాలు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో భాగమయ్యాయి. అయినా వీటిని నేటికీ మలైనాడు దివ్యదేశాలుగానే పరిగణిస్తున్నారు. 
ఈ పదమూడు దివ్యదేశాలలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, తిరువనంతపురం ఒకటి .
వీటిల్లో అయిదు ఆలయాలు పంచ పాండవుల నిర్మితాలు. మిగిలినవి కూడా విశేష పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగినవి కావడం పేర్కోవలసిన అంశం. 
కేరళలో ఎప్పటి నుండో రామాయణానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. కేరళీయులు వారి పంచాంగం అయిన "కొళ్ల వర్షం"  ప్రకారం వచ్చే "కర్కాటక మాసం (జులై-ఆగష్టు)లో "నలంబలం"(నాలుగు ఆలయాలు)పేరిట  రామాయణ యాత్ర చేపడతారు. 
నలంబలంలో  వారు దశరధ తనయులైన శ్రీరామ, భరత, లక్ష్మణ మరియు శతృఘ్నులు కొలువు తీరిన నాలుగు ఆలయాలను ఒక  సందర్శిస్తారు. 
మనదేశంలో గ్రామ గ్రామాన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర మూర్తి ఆలయాలు కనపడతాయి. కానీ ఎక్కడా లక్ష్మణ, భరత మరియు శత్రుఘ్న ఆలయాలు కేరళలో తప్ప మరెక్కడా కనపడవు. 
ప్రత్యేక ఆలయాల రాష్ట్రంగా గుర్తింపు పొందిన కేరళలోని నాలుగు  జిల్లాలలో శ్రీరామ, లక్ష్మణ,  ,శత్రుఘ్నుల ఆలయాలు ఉన్నాయి. అవి  కొట్టాయం,మలప్పురం, కన్నూరు మరియు ఎర్నాకుళం.  ఎర్నాకుళం లో ఉన్న ఆలయాలు బాగా ప్రసిద్ధి. 
త్రిప్రయార్ శ్రీ రామ చంద్ర మూర్తి, తిరుమూళి కుళం  శ్రీ లక్ష్మణ పెరుమాళ్, కూడల్ మాణిక్యం శ్రీ భారత, పయ్యమ్మాళ్ శ్రీ శత్రుఘ్న స్వామి ఆలయాలను కేరళీయులు కర్కాటక  అధికంగా సందర్శిస్తారు. ఆ నెలలో వారు నిత్యం రామాయణ పారాయణం చేస్తారు. ఒక రోజున నలంబల యాత్ర చేస్తారు. 
స్థానిక విశ్వాసం ప్రకారం ఈ నాలుగు విగ్రహాలు శ్రీ కృష్ణుని చేత పూజింప బడినాయని.  నాలుగు ఆలయాల యాత్ర {నలంబలం}లో దర్శించుకునే అన్ని చోట్ల చతుర్భుజాలతో శ్రీమన్నారాయణుడు మాత్రమే దర్శనమిస్తారు. 
శ్రీరాముడు కొలువైన త్రిప్రయార్ ఆరువాత తిరుమూళి కుళం  శ్రీ లక్ష్మణ పెరుమాళ్ ఆలయాలుఅధికంగా భక్తాదరణ కలిగినవి. శ్రీ లక్ష్మణ పెరుమాళ్ క్షేత్రం నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. 

క్షేత్ర  గాధ 

మూల విరాట్టు ప్రతిష్ట కలియుగంలో జరిగినా క్షేత్రం అత్యంత పుణ్యప్రదమైనదిగా  గత యుగాల లోనే గుర్తింపు పొందినట్లుగా తెలుస్తోంది. 
యుగాల ముందు హరిత మహర్షి ఇక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనాన్ని అపేక్షించి తపస్సు చేశారట. స్వామి దర్శనమిచ్చి మహర్షికి వానప్రస్థం గురించి ఉన్న సందేహాలను తీర్చారట. 
అనంతర కాలంలో వనవాస సమయంలో తమ వద్దకు వస్తున్న భరతుని ఉద్దేశం గురించి తప్పుగా భావించారట  లక్ష్మణుడు. ఆయన  పొరబాటును గురించి తెలుపుతూ శ్రీరాముడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అంటూ దాని వలన   కలిగే నష్టాలను గురించి హితోక్తులు పలికారట. 
మూళి క్కుళం అంటే హితోపదేశం చేసిన ప్రదేశం అని అర్ధం. దానికి గౌరవ వాచకం తిరు (శ్రీ) కలిపి తిరు మూళి క్కుళం అని పిలవసాగారు. 

ఆలయ విశేషాలు 

ఈ ఆలయం సువిశాల ప్రాంగణంలో కేరళ శైలిలో నిర్మించబడినది. పెద్ద పెద్ద గోపురాలు, ఆకర్షించే శిల్పాలు కనరావు. అయినా ప్రాంగణం చాలా ఆహ్లాదంగా, ఆధ్యాత్మిక వాతావరణం నిండి ఉంటుంది. ఎత్తైన ముఖమండపం సందర్శకులను ఆకర్షిస్తుంది. దాని వెనుక ధ్వజస్థంభం,బలి పీఠం ఉంటాయి.  ప్రాంగణంలో కూతంబళంగా పిలిచే నాట్య మండపం ఉంటుంది. ఇక్కడ నియమంగా ప్రతి నిత్యం  కేరళలో ప్రసిద్ధి చెంది, ప్రపంచంలో అతంత పురాతన నాట్య విధానాలలో ఒకటిగా గుర్తింపు పొందిన "కుట్టియాట్టం" ప్రదర్శిస్తారు. 
నలుచదరంగా పెంకులతో నిర్మించిన నల్లంబళం మధ్యలో ఉన్న  ద్వారం నుండి లోనికి వెళితే నమస్కార మండపం దాని వెనుక వర్తులాకార శ్రీ కోవెల (గర్భాలయం)కనిపిస్తాయి. 
గర్భాలయంలో స్థానిక భంగిమలో చతుర్భుజులై శ్రీ లక్ష్మణ స్వామి సుందర, పుష్ప అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. 
ఉపాలయాలలో శ్రీ కృష్ణ, శ్రీ కైలాసనాథుడు, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ ధర్మశాస్త మరియు శ్రీ భగవతి కొలువై ఉంటారు. 
చేర, పాండ్య, పందాళ, కొచ్చిన్, ట్రావెంకూర్ మరియు స్థానిక పాలకులు ఆలయాభివృద్దికి తమ వంతు కైకార్యాలను సమర్పించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆలయం ట్రావెంకూర్ దేవస్వం అధీనంలో ఉన్నది. 

పూజలు మరియు ఉత్సవాలు 

ఉదయం నాలుగు గంటల నుండి పది గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉండే ఆలయంలో నియమంగా నాలుగు పూజలు జరుగుతాయి. 
శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ రామనవమి, శ్రీ నృసింహ, శ్రీ కూర్మ, శ్రీ వరాహ, శ్రీ పరశురామ, శ్రీ బలదేవ  జయంతులను వేడుకగా జరుపుతారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా చేస్తారు. 
స్థానిక పండుగలైన విషు, ఓనం రోజులలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. 
మళయాళ నెల "మేడం"(చైత్ర మాసం)లో ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా పది రోజుల పాటు నిర్వహిస్తారు. 

దివ్యదేశం 

పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ప్రముఖుడైన నమ్మాళ్వార్ శ్రీ లక్ష్మణ స్వామిని కీర్తిస్తూ పదకొండు పాశురాలను గానం చేశారు. తిరుమంగై  ఆళ్వార్ కూడా కూడా మూడు పాశురాలను గానం చేశారని "నళయర దివ్య ప్రబంధం" తెలుపుతోంది. ఈ కారణంగా తిరుమూళి క్కుళం నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. 
ఈ దివ్యదేశానికి త్రిసూర్ లేదా ఎర్నాకుళం నుండి సులభంగా చేరుకోవచ్చును. 
జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరుల జన్మస్థలమైన కాలడి నుండి కూడా ఇక్కడికి మార్గం ఉన్నది. వసతి సౌకర్యాలు త్రిసూర్ లేదా ఎర్నాకుళంలో బాగుంటాయి. 

ఓం నమో నారాయణాయ !!!!  . 


17, జనవరి 2023, మంగళవారం

Sri Kapotheshwara swamy Tempe, Chejarla

 

                    శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం, చేజెర్ల 

                                                        (దక్షిణ కాశి క్షేత్రం) 



తెలుగునాట ఎన్నో విశిష్ట క్షేత్రాలు తగిన గుర్తింపుకు నోచుకోక మారుమూల గ్రామాలలో సాధారణ ఆలయాల మాదిరిగా ఉండిపోతున్నాయి. 
అలాంటి వాటిలో శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం ఒకటి. 
ఒకప్పటి గుంటూరు జిల్లా నేటి పల్నాడు జిల్లాలో ఉన్న ఈ ఆలయ చరిత్ర సుమారు నాలుగవ శతాబ్ది నాటిదని చరిత్రకారులు నిర్ధారించారు. ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయం ఎన్నో విశేషాలకు నిలయం. 








ఆలయ పురాణ గాథ 

పూర్వం "కందర పురం", చేరంజెర్ల మరియు  చేంజెఱువు" అని పిలవబడిన చేజెర్ల గ్రామంలో శ్రీ కపోతేశ్వర స్వామి కొలువు తీరడం వెనుక ఉన్న గాథ మహా భారతంలో ఉన్నట్లుగా చెప్పబడుచున్నది. 
చంద్రవంశానికి చెందిన "శిబి చక్రవర్తి" ప్రజారంజకుడైన పాలకునిగా పేరొందారు. ఈయన గొప్ప దానశీలిగా ప్రసిద్ధి చెందారు. లోకోపకార నిమిత్తం నూరు యజ్ఞాలను చేయ సంకల్పించుకొని తొంభైతొమ్మిది పూర్తిచేసి నూరవ యజ్ఞం చేయడానికి సిద్దపడుతున్నారు శిబి. ఆ సమయంలో 
శిబి దాన గుణాన్ని పరీక్షించడానికి నిర్ణయించుకున్నారట దేవతలు. 
దేవేంద్రుడు డేగగా, అగ్ని దేవుడు పావుర రూపం ధరించారట. డేగ కపోతాన్ని వెంబడించగా అది ప్రాణభయంతో యజ్ఞానికి సిద్ధపడుతున్న శిబి ని చేరి శరణు కోరిందట. తన ఆహారాన్ని తనకు ఇమ్మని డేగ రాజుతో వాదనకు దిగిందట. ఆటవిక న్యాయాన్ని వివరిస్తూ తర్కం చేసిందట. అభయమిచ్చిన తానూ మాట తప్పలేనని, డేగ ఆకలి తీరడానికి తన శరీరం నుండి మాంసాన్ని ఇస్తానన్నాడట  చక్రవర్త. డేగ అందుకు అంగీకరించడంతో ప్రజలు, పరివారం, కుటుంబం ఎదుట తన శరీరం కోయడానికి సిద్దపడ్డాడట.   










త్రాసులో ఒక పక్క కపోతాన్ని ఉంచి రెండవ పక్క తన తొడ కండరాన్ని కోసి ఉంచారట శిబి. పావురమే బరువుగా ఉండినది. మరికొంత, మరికొంతగా తన శరీరంలోని మాంసాన్ని త్రాసులో ఉంచినా చిత్రంగా పావురం బరువుకు సరిపోలేదట. చివరకు తనే త్రాసులో కూర్చున్నాడట. అప్పుడు సరిపోవడమే కాదు దేవేంద్రుడు, అగ్ని దేవునితో సహా మిగిలిన  దేవతలు, త్రిమూర్తులు అక్కడ సాక్షాత్కరించారట.
వారు శిబి యొక్క సత్యసంధతకు, దానగుణాన్ని అభినందించారట. ఆయన కోరిక మేరకు సర్వేశ్వరుని తో సహా అందరూ కొలువు తీరారట. అదే నేటి చేజర్ల. 
స్థూలంగా ముందరకు తెలిసిన కధ ఇది. 

వివాదం 

కానీ దీనికి మరికొన్ని ఉపకథలను జోడించి చెప్పడం జరుగుతోంది. అన్నిటికన్నా ఎక్కువగా ప్రచారంలో ఉన్న విషయం ఈ ఆలయం ఒకప్పుడు బౌద్ధ ఆరామం అని చెప్పడం. 
ఆలయంలోని కొన్ని నిర్మాణాలు బౌద్ధ స్థూపాలను ఇతర నిర్మాణాలను పోలిఉండటమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చును. 
బౌద్ధ జాతక కధలలో కూడా శిబి ఉదంతం ఉండటం మరో కారణం. 
ఈ రెండు తప్ప మరో ఖచ్చితంగా నిర్ధారించే ఆధారం ఇక్కడి నిర్మాణాలలో గాని, శాసనాలలో కానీ కనపడదు. జాతక కథల కన్నా ఎంతో ముందు కాలానికి చెందినది మహా పురాణమైన "మహా భారతం". వ్యాస భగవానుడు రాసినదానికన్నా ప్రమాణం ఇంకేముంటుంది ?
ఒకప్పుడు గుంటూరు సీమ బౌద్దాన్ని ఆదరించడం వలన కొంతకాలం బౌద్ధ భిక్షువులు ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఉండవచ్చును. బౌద్దానికి ఆదరణ తగ్గడంతో వారు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయి ఉంటారు. కానీ వారు చేసిన మార్పులు శాశ్వితంగా ఉండిపోయి కొంత వివాదానికి తావు నిస్తున్నాయి. 
   










ఆలయ విశేషాలు 

విశాల ప్రాంగణంలో ఉన్న శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయానికి రెండు ప్రాకారాలు ఉన్నాయి. మొదటి ప్రాకారానికి ఇరువైపులా రెండు పురాతన మండపాలు ఉంటాయి. పక్కనే నూతనంగా నిర్మించిన నవగ్రహ మండపం కనిపిస్తాయి. 
రెండవ ప్రాకారానికి చిన్న గోపురంతో కూడిన ప్రధాన ప్రవేశ ద్వారం ప్రాంగణం లోనికి దారి తీస్తుంది. గోపురానికున్న మండప స్థంభాలపైనా శివ పుత్రులైన శ్రీ గణపతి, శ్రీ కుమారస్వామి రూపాలు చెక్కి ఉండటం గమనించవచ్చును. 
ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలు, శాసనాలు, శివ లింగాలు కనిపిస్తాయి. 
ఈశాన్య భాగంలో స్వామివారి కళ్యాణ మండపం ఉంటుంది. 
నేరుగా వెళితే నంది మండపం దాటినా తరువాత కొద్దిగా లోపలికి ఒక గుహ మాదిరిగా కనిపించే గర్భాలయంలో శ్రీ కపోతేశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు. పక్కనే శ్రీ భ్రమరాంబ మరియు శ్రీ పార్వతీ దేవి విగ్రహాలు కూడా పూజలందుకొంటూ ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. 

శ్రీ కపోతేశ్వర స్వామి 

గర్భాలయంలో శ్రీ కపోతేశ్వర స్వామి లింగం మిగిలిన ఆలయాలలో కనిపించే లింగాలకు భిన్నంగా ఉంటుంది.  భూమికి సమానంగా ఉన్న చతురస్రాకారపు పానువట్టం మధ్యలో గుంటలతో నిండిన లింగ రూపంలో దర్శనమిస్తారు. 
లింగ పైభాగాన రెండు పెద్ద గుంతలు, మరి కొన్ని చిన్న గుంతలు కనిపిస్తాయి. ఒక పెద్ద రంధ్రములో కొంచెము నీరు పోసిన నిండిపోతుందట. రెండవ దానిలో ఎన్ని బిందెల నీరు పోసినా ఆనవాలు కనపడకుండా పోతాయని చెబుతారు. నిండిన రంధ్రంలోని నీటిని భక్తులకు తీర్థంగా ఇస్తారు. 
మేళ్లచెరువు, వాడపల్లి లాంటి ప్రదేశాలలో కొలువైన శివ లింగాలకు కూడా పై భాగాన ఒక  రంధ్రం ఉండటం తెలిసిన విషయమే ! కానీ ఇన్ని రంధ్రాలున్న లింగాన్ని చేజర్లలోనే చూడగలం. 
అమ్మవార్లు ప్రత్యేక సన్నిధులలో కాకుండా ఒకేచోట కొలువై ఉండటం కూడా ఇక్కడే కనపడుతుంది.   
 











శాసనాధారాల ద్వారా తొలి ఆలయాన్ని స్థానిక పాలకులైన ఆనంద గోత్రీకులైన రాజులు నిర్మించినట్లుగా తెలియవస్తోంది. 
తదనంతర కాలంలో పల్లవ, తూర్పు చాళుక్యులు, చోళులు, విజయనగర రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అనేక కైంకర్యాలను సమర్పించుకొన్నట్లుగా తెలుస్తోంది. 
తమిళనాడులో చాలా ఆలయాలలో కనిపించే "గజపృష్ఠ విమానం" ఇక్కడ గర్భాలయం పైన కనిపించడం చాలా అరుదైన విషయం. 
ప్రాంగణంలో అనేక ఉపాలయాలు కనిపిస్తాయి. 

ఉపాలయాలు 

తమిళనాడులోని తిరువారూరు లోని శ్రీ త్యాగరాజస్వామి ఆలయంలో అధిక సంఖ్యలో ఉపాలయాలు ఉన్నాయని అంటారు. అది ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయం. కేవలం రెండు ఎకరాల వైశాల్యంలో ఉన్న శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలు ఎన్నో ! శాసనాల ప్రకారం ఒకప్పుడు ఎనభైదాకా ఉపాలయాలు, ముప్పై నందులు, లక్ష ఒక్క లింగాలు ఉండేవట. ప్రస్తుతం ముప్పై దాకా ఉపాలయాలు కనిపిస్తాయి. లింగాలు చెక్కిన అనేక ఫలకాలు కూడా ప్రాంగణమంతా చెదురుమదురుగా కనిపిస్తాయి. మరెన్నో శిధిల విగ్రహాలు, లింగాలు కూడా ఉంటాయి. 
నిత్యపూజలు అందుకొంటున్న ఉపాలయ దేవీ దేవతలు శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రుడు, శ్రీ దత్తాత్రేయ, శ్రీ నగరేశ్వర, శ్రీ కోటేశ్వర, శ్రీ చిదంబరేశ్వర, శ్రీ మార్కండేయ, శ్రీ కాళేశ్వర, శ్రీ శంభు లింగేశ్వర, శ్రీ సర్వేశ్వర, శ్రీ భృంగేశ్వర, శ్రీ త్రికోటేశ్వర, శ్రీ అగస్థేశ్వర, ఇలా ఎన్నో. 
కళ్యాణ మండపం వద్ద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ మాధవాంజనేయ ఉపాలయాలు కనపడతాయి. సప్తమాతృక శిల్పాలు ఎలాంటి నిర్మాణం లేకుండా ఉంటాయి. 
ఇక్కడే ఎత్తైన గద్దె మీద సహస్రలింగం ఉంటుంది. ధ్వజస్థంభం వద్ద ప్రత్యేక మండపంలో దీప వృక్షం గా పిలిచే దీపస్థంభం కలదు. స్వామివారి అనుగ్రహాన్ని ఆపేక్షించేవారు కార్తీక, మాఘ మాసాల్లో అన్నిదినాలు సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. 
గమనించదగిన అంశం ఏమిటంటే ప్రాంగణంలో కనిపించే చిన్న పెద్ద లింగాలన్నీ బ్రహ్మసూత్రం కలిగి ఉండటం. ఒకే చోట ఇన్ని బ్రహ్మ సూత్ర లింగాలు ఉండటం గొప్ప విషయంగా పేర్కొనాలి. దీనివెనుక ఉన్న అసలు విశేషం ఏమిటన్నది తెలియదు. 


















శాసనాలు 

ఆలయంలో మొత్తంగా తొమ్మిది శాసనాలు కనిపిస్తాయి. ఇవి సంస్కృత, నాగర, తెలుగు భాషలలో ఉంటాయి. అన్నింటి లోనికి పురాతన దాన శాసనం పల్లవ రాజు మహేంద్రవర్మ ఆరవ శతాబ్దంలో వేయించినది గా చెబుతారు. మరొకటి తూర్పు చాళుక్య రాజు విష్ణువర్ధనుడు ఏడవ శతాబ్దంలో వేయించింది. మిగిలినవి పది, పదకొండు, పన్నెండవ శతాబ్దాలకు చెందినవిగా తెలుస్తోంది. 
వీటిల్లో ఆలయ విశేషాలు, దానాల వివరాలు ఉన్నాయి. 
 
























శ్రీ సుబ్రహ్మణ్య(కుమార) పర్వతం 

ఆలయానికి ఉత్తరాన చిన్న కొండ ఉంటుంది. పైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఉండటం వలన అలా పిలుస్తున్నారు. కుజ, సర్ప దోషం గలవారు నియమంగా స్వామిని సేవించుకొంటే దోషం తొలగిపోతుంది అని విశ్వసిస్తారు. పైకి చేరుకోడానికి సోపాన మార్గం కలదు. 
ఈ పర్వతం  సంజీవని సమానమన్నది స్థానిక నమ్మకం. 
"హిరణ్య బాహవే తుభ్యం , సేనానం పతయే నమః" అన్న మంత్రాన్ని భక్తిశ్రద్దలతో పఠిస్తూ కొండ చుట్టూ నియమంగా ప్రదక్షిణ చేస్తే దీర్ఘ రోగాల నుండి స్వాంతన లభిస్తుంది అని నమ్ముతారు. 
 

















ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్నది. 
ప్రతి నిత్యం నియమంగా అభిషేకాలు, అర్చనలు, అలంకారాలు, ఆరగింపులు నిర్వహిస్తారు. శుక్రవారాలు అమ్మవార్లకు కుంకుమార్చన జరుపుతారు. 
మాస శివరాత్రి, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. గణేష చతుర్థి, జన్మాష్టమి, హనుమజ్జయంతి, శ్రీరామ నవమి, దేవీనవరాత్రులు విశేషంగా చేస్తారు. 
శివరాత్రికి చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. 
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుండి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న చేజర్ల చేరుకోడానికి స్వంత లేదా ప్రవేటు వాహనాల మీద ఆధారపడవలసినదే !
వసతి మరియు భోజనానికి నరసరావుపేట మీద ఆధారపడాలి. 
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల నుండి నరసరావుపేట చేరుకోడానికి రైలు మరియు బస్సు సౌకర్యం లభిస్తుంది. 
పౌరాణిక మరియు చారిత్రక ప్రాశస్త్యం గల విశేష క్షేత్రాన్ని సందర్శించాము అన్న సంతృప్తిని అందించే పురాతన ఆలయం శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం, చేజెర్ల. 

నమః శివాయ !!!!



Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...