16, జనవరి 2023, సోమవారం

Ananta Basubeva Temple, Bhubaneswar

                             శ్రీ అనంత వాసుదేవ ఆలయం 


జగన్నాథ భూమిగా ప్రసిద్ధి చెందినది ఉత్కళదేశం. అదే నేటి ఒడిశా. 
శ్రీమన్నారాయణుడు శ్రీ జగన్నాథునిగా సోదరుడు శ్రీ బలదేవ మరియు సోదరి శ్రీ సుభద్ర దేవి సమేతంగా కొలువు తీరిన ఏకైక క్షేత్రం పూరీ. స్వామి వారి రూపం, వారికి చేసే ఉత్సవాలు, ముఖ్యంగా శ్రీ జగన్నాథ రధోత్సవం ప్రవంచవ్యాప్తంగా గుర్తింపును పొందాయి. లక్షలాది మంది దేశ విదేశీయ యాత్రికులను పూరీ కి రప్పిస్తున్నాయి. 
సుందర సాగర తీరం పూరీకి గల అదనపు ఆకర్షణ. 
ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్. ఆలయాల నగరంగా పేరు. ఒకప్పుడు వెయ్యి ఆలయాలు ఉండేవని అంటారు. గతంలో ఏకామ్ర క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన భువనేశ్వర్ లో నేడు సుమారు ముప్పై దాకా శిధిల మరియు పూజాదికాలు నిర్వహించబడుతున్న ఆలయాలు  మాత్రమే కనిపిస్తున్నాయి. 
నిరంతరం జరుగుతున్న త్రవ్వకాలలో అనేక శిధిలాలు వెలుగు చూస్తున్నాయి. 
వీటిల్లో ముఖ్యమైనది శ్రీ లింగరాజ ఆలయం. మిగిలిన వాటిలో కూడా శివాలయాలు అధికం. వాటి మధ్యలో మరో ముఖ్యమైనది శ్రీ అనంత వాసుదేవ ఆలయం.  శ్రీ లింగరాజ్ మరియు శ్రీ అనంత వాసుదేవ ఆలయాలలో జరిగే నిత్యపూజలు, ఆరగింపులు, ఉత్సవాలు మరే ఆలయంలోనూ జరగవు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంతటి విశేష ఆలయాలు ఈ రెండు. 
నిర్మాణంలో కూడా ఈ రెండు ఆలయాలకు కొన్ని పోలికలు కనిపిస్తాయి. 
శ్రీ లింగరాజ్ ఆలయంలో అనేక ఉపాలయాలు కనిపిస్తాయి. దేవుల ఎత్తు కూడా ఎక్కువ. శ్రీ అనంత వాసుదేవ ఆలయంలో ఒకటి రెండు శిధిల ఉపాలయాలు మాత్రమే కనిపిస్తాయి. దేవుల ఎత్తు కూడా తక్కువ. కానీ విమాన నిర్మాణం ఒకే మాదిరిగా ఉండటం చెప్పుకోదగిన విషయం. 
ఈ ఆలయాలన్నీ కూడా బిందు సాగర పుష్కరణి చుట్టూ నెలకొని ఉండటం విశేషం. 


బిందు సాగర పుష్కరణి 

పదమూడు వందల పొడుగు, ఏడువందల అడుగుల వెడల్పు గల బిందు సాగర పుష్కరణి లోతెంతో తెలియదని అంటారు. 
వారణాసి నుండి ఇక్కడకు తరలి వచ్చారట ఆది దంపతులు. ప్రయాణ బడలికతో అలసి పోయిన పార్వతీ దేవి దాహాన్ని తీర్చడానికి పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఈ కోనేరును సృష్టించారని చెబుతారు. శ్రీ లింగరాజ మహాదేవ ఆలయ ఉత్సవాలన్నీ ఈ పుష్కరణి లోనే జరుగుతాయి. 
దీనిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. 

శ్రీ అనంత వాసుదేవ ఆలయం 

బిందు సాగర పుష్కరణి పడమర ఒడ్డున నెలకొని ఉంటుంది అనేక విశేషాల శ్రీ అనంత వాసుదేవ ఆలయం. 
పూరీ లో మాదిరిగానే శ్రీవారు సోదర సోదరీ సమేతులై దర్శనమిస్తారు. కానీ ఈ క్షేత్రంలో కొలువు తీరడానికి సంబంధించిన పురాణ గాథ ఏదీ అందుబాటులో లేదు. 
లభించిన ఆధారాల ప్రకారం పురాతన ఆలయాన్ని తొలిసారి పదమూడవ శతాబ్దంలో ఒకసారి, మరోసారి పదిహేడవ శతాబ్దంలో పునః నిర్మించినట్లు తెలుస్తోంది. 
తూర్పు గంగ వంశానికి చెందిన మహారాణి చంద్రికాదేవి శ్రీకృష్ణ భక్తురాలు. ఆమె పదమూడవ శతాబ్దంలో శిధిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునః నిర్మించి, అప్పటికి అమలులో ఉన్న సంప్రదాయాలను తిరిగి ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అనగా అంతకు ముందు ఏనాటి నుండి ఈ ఆలయం ఉన్నది అన్నది తెలియని విషయం. 
నిరంతర యుద్దవాతావరణం, పరాయి పాలకుల దాడులలో ఆలయం తిరిగి క్షీణ దశకు చేరుకొన్నది. పదిహేడవ శతాబ్దంలో ఉత్కళ దాకా తమ సామ్రాజ్యాన్ని విస్తరించిన మరాఠా రాజులు అనంత వాసుదేవ ఆలయాన్ని మరో మారు నిర్మించి, సంప్రదాయాలను పునరుద్దరించారని శాసనాలు తెలియజేస్తున్నాయి. 
ఆలయ విశేషాలు 

అనేక విషయాలలో అనంత వాసుదేవ ఆలయానికి, పూరీ శ్రీ జగన్నాధ మందిరానికి  సామ్యాలు ఉండటం కనిపిస్తుంది. అక్కడ మాదిరిగానే ఇక్కడ కూడా జగన్మోహన, నట మండప, భోగ మండప, దేవుల(గర్భాలయం)ఇలా నాలుగు భాగాలుగా ఉంటుంది నిర్మాణం. జగన్మోహన మండపం అన్నిటికన్నా ఎత్తులో చిన్నదిగా ఉంటే, దేవుల అరవై అడుగుల ఎత్తులో ఉంటుంది.
దేవుల పైన వర్తులాకార శిఖరం ఆపైన చక్ర కలశం ఉంటాయి. ఈ ఆలయం త్రిరథ శైలి నిర్మాణంగా పేర్కొంటారు. పూరీ "శంఖ క్షేత్రం" అయితే ఇది "చక్ర క్షేత్రం"గా పేరొందినది. శాసనాలలో ఈ పేరే ఉపయోగించారని తెలుస్తోంది. 
భక్తులకు జగన్మోహన లేదా నట మండపం వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఉత్సవాల సమయంలో జగన్మోహన నుండే దర్శనం చేసుకోవలసి ఉంటుంది. ఉత్సవాలను నట మండపంలో నిర్వహిస్తారు. మూల మూర్తులకు నివేదనలు భోగ మండపంలో జరుపుతారు. 
సాదాసీదా ద్వారం నుండి ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే నేరుగా జగన్మోహన చేరుకోడానికి మార్గం ఉంటుంది. ప్రధాన ద్వారానికి రెండుపక్కల సింహాలను పోలిన పౌరాణిక మృగాలు కనపడతాయి. 
ఆలయ వెలుపలి గోడల పైన భాగవత గాధలను, శ్రీ కృష్ణ లీలలను జీవం ఉట్టిపడేలా మలచారు. అవే కాకుండా నర్తకీమణుల శిల్పాలను, నాగ, గజ, సింహ రూపాలను కూడా చక్కగా చెక్కారు. సూక్ష్మ చెక్కడాలైన లతలు, తీగలు, పుష్పాలను అత్యంత నేర్పరి తనంతో చెక్కిన శిల్పులు చిరస్మరణీయులు. వీటిని పెద్ద శిల్పాలకు అనుసంధానం చేసిన విధానం కూడా సహజసిద్ధంగా కనపడుతుంది. 

అంతర భాగంలో  గోడలపైన సహజ వర్ణాలతో శ్రీకృష్ణలీలల చిత్రాలను సుందరంగా చిత్రించారు. 
గర్భాలయంలో ఏడు తలల ఆదిశేషువు క్రింద శ్రీ అనంతుడు (బలదేవ), శంఖు, చక్ర, గద మరియు అభయ హస్తాలతో  శ్రీ వాసుదేవుడు (శ్రీ జగన్నాధుడు),  ఒక చేతిలో బంగారు నగల పాత్ర, మరో చేతిలో పుష్పాన్ని ధరించి శ్రీ సుభద్ర దేవి స్థానక భంగిమలో దర్శనమిస్తారు. 
పూరీలో మాదిరి కాకుండా ఇక్కడ నిండైన మూర్తులను వీక్షించే అవకాశం భక్తులకు లభిస్తుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే అనంత వాసుదేవ, సుభద్ర దేవి విగ్రహాలు దారు మూర్తులు కావు. నల్ల రాతితో చెక్కిన సుందర రూపాలు. 
ఇలాంటి సుందర అర్చనామూర్తులు ఒడిశా లోని మరే దేవాలయంలో కనపడవు అంటే ప్రత్యేకత అర్ధం అవుతుంది. 
పూజా విధానాలు పూరీలో మాదిరిగా నిర్వహిస్తారు. 

ఆలయ వంట శాల 

ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆలయ వంట శాల గురించి. 
ఒడిశాలో చాలా ఆలయాలలో మధ్యాన్నం భోజనం దొరుకుతుంది. కొంత పైకం తీసుకొని పూర్తి శాఖాహార భోజనాన్ని భక్తులకు, ప్రయాణీకులకు అందిస్తారు. కానీ పూరీ "ఆనంద బజార్ లో లభించే శ్రీ జగన్నాధ ప్రసాదాన్ని మించినది లేదంటారు. 
పూర్తిగా అదే పద్దతిలో ఇక్కడి "ఆబఢా"(వంటశాల)లో ఆహారాన్ని మట్టికుండలను ఒకదాని మీద ఒకటి పెట్టి కట్టెల పొయ్యిల మీద వండుతారు. సుమారు వందమంది ఇక్కడ పని చేస్తారు. స్వామికి నివేదన జరిపిన తరువాత ప్రసాదాన్ని పక్కనే ఉన్న విక్రయశాలలో భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ఉదయం నుండి సాయంత్రం వరకు విక్రయిస్తారు. 

ఆలయ ఉత్సవాలు 

ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల దర్శనార్ధం ఆలయం తెరచి ఉంటుంది. 
అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు ఉంటాయి. శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు.స్థానిక పర్వదినాలలో కూడా మూలమూర్తులకు విశేష అలంకారం చేస్తారు.
శ్రీ కుర్మ, శ్రీ నారసింహ, శ్రీ వామన, శ్రీ బలరామ, శ్రీ రామ, శ్రీ పరశురామ జయంతులను కూడా ఘనంగా జరుపుతారు.  
శ్రీ జగన్నాథ రథ యాత్ర జరిగే రోజునే ఇక్కడ కూడా వైభవంగా శ్రీ అనంత వాసుదేవ సుభద్ర దేవి రథ యాత్ర నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొంటారు. 
భువనేశ్వర్ లో "రుఖనా యాత్ర " పేరిట జరిగే శ్రీ లింగరాజ్ రథ యాత్ర తరువాత ఆ స్థాయిలో జరిగే రథ యాత్ర శ్రీ అనంత వాసుదేవ ఆలయానిది. 
ప్రతి నిత్యం వందలాది మంది భక్తులు సందర్శించే శ్రీ అనంత వాసుదేవ మందిరం భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ నుండి సులభంగా చేరుకోవచ్చును. 
భువనేశ్వర్ క్షేత్ర పాలకుడు అయిన శ్రీ లింగరాజ్ ఆలయం ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంటుంది. పురాతన ఆలయాలన్నీ ఈ చుట్టుపక్కలే ఉంటాయి. 
భువనేశ్వర్ లో ఉండటానికి చక్కని వసతి సౌకర్యం , భోజనం లభిస్తాయి. 

ఓం నమో నారాయణాయ !!!!

 
 
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Navagraha Mandapam

                                      నవగ్రహ మండపం                                                                                   ...