రాజారాణి ఆలయం, భువనేశ్వర్
ఆలయాల నగరంగా ప్రసిద్ధి ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్. ఒకప్పుడు వెయ్యికి పైగా ఆలయాలు ఈ ఏకామ్ర క్షేత్రంలో ఉండేవని ప్రతీతి. గతంలో ఈ ప్రాంతం అనేక మామిడి వనాలతో నిండి ఉండేదట. అలా ఏకామ్ర క్షేత్రం గా పేరొందినది.
పరాయి పాలకుల దాడులలో అనేక ఆలయాలు కనుమరుగయ్యాయి. మరికొన్ని కాల గమనంలో శిధిలమయ్యాయి. ప్రస్తుతం చాలా కొద్ది నిర్మాణాలు మాత్రమే కనపడుతున్నాయి. వాటిల్లో నిత్య పూజలు జరుగుతున్నవి బహు కొద్ది.
మిగిలినవన్నీ మూలవిరాట్టులు లేకుండా కనపడతాయి. కానీ నేడు కనిపించే ప్రతి ఒక్క నిర్మాణం నాటి శిల్పుల నేర్పరితనాన్ని, వృత్తి పట్ల వారికి గల అచంచల భక్తిశ్రద్ధలను మనకు ఘనంగా చూపుతాయి.
అధికశాతం నిర్మాణాలు పది నుండి పన్నెండవ శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించబడ్డాయి. వీటిల్లో అనేక శృంగార శిల్పాలు కనపడటం నాటి శిల్పుల పైన ఖాజారాహో నిర్మాణాల ప్రభావం ఉన్నది అన్నది చరిత్రకారుల అభిప్రాయం.
ఈ నిర్మాణాలు అన్నీ స్థానికంగా లభించే ఒకరకమైన రాతితో నిర్మించబడినాయి. మూలవిరాట్టు లేకున్నాశాసనాల ఆధారంగా వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇవి అన్నీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ కారణంగా పురావస్తు శాఖ ప్రస్తుతం చేపట్టిన త్రవ్వకాలలో అనేక ఆలయ శిధిలాలు బయల్పడుతున్నాయి. ముఖ్యంగా ప్రసిద్ద లింగరాజ ఆలయ పరిసరాలలో అనేక శిధిల నిర్మాణాలు వెలుగు చూస్తున్నాయి.
ఈ పురాతన ఆలయాలు, నిర్మాణాలు పాత భువనేశ్వర్ లోని "బిందు సాగర్" సరోవరం చుట్టూ నెలకొని ఉంటాయి. ఇవన్నీ కూడా భువనేశ్వర్ ని పరిపాలించిన సోమవంశి, తూర్పు గంగ వంశ రాజులు పాలనాకాలంలో నిర్మించబడినవి.
అలాంటి నిర్మాణాలలో ముఖ్యమైనది"రాజారాణి మందిరం"సుమారు పదకొండవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం నేటికీ గొప్ప ఆకర్షణీయమైన నిర్మాణంగా పేరొందినది. లభించిన
శాసనాల, శిల్పాల ప్రకారం గతంలో ఒక శివాలయం. ఈ మందిరంలో పరమశివుడు "శ్రీ ఇంద్రేశ్వర్"గా పూజలు అందుకున్నారని అంటారు.
నిర్మాణం వెలుపల కనిపించే శ్రీ గణపతి,పార్వతి మరియు సర్ప శిల్పాలు దానిని ధ్రువీకరిస్తున్నాయి.
స్థానికంగా లభించే ఒక ప్రత్యేకమైన ఎఱుపు మరియు పసుపు రంగులలో ఉండే ఇసుక రాతితో నిర్మించడం వలన "రాజారాణి ఆలయం" అని పిలుస్తారు. ఒక రంగు రాజైతే, మరో రంగు రాణి. అలా రాజా రాణి గా పిలవబడుతోంది. నిర్మాణంలో కనిపించే శృంగార శిల్పాల కారణంగా "ప్రేమ మందిరం" అని కూడా పిలుస్తారు.
ప్రస్తుతం పురావస్తుశాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ మందిరాన్ని సందర్శించడానికి టికెట్ ఉన్నది. సాయంత్రం పూట లేక రాత్రి విద్యుత్కాంతులలో రాజారాణి మందిరాన్ని వీక్షించడం ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
రెండు అడుగుల ఎత్తైన పీఠం మీద ఈ మందిరం మొత్తం రెండు భాగాలుగా నిర్మించబడినది. ఒడిశా ఆలయాలలో ప్రధాన దైవం కొలువైన "దేవుల"(గర్భాలయం), భక్తులు స్వామిని వీక్షించే " జగన్మోహన" ( ముఖ, సభ లేక నాట్య మండపం). దేవుల జగన్మోహన కన్నా ఎత్తుగా ఉంటుంది. జగన్మోహన నలుచదరంగం గా లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది.
దేవులా పైన శిఖరం, గోపురం కలశం ఉంటాయి. జగన్మోహన పైన చిన్న గోపురాకార నిర్మాణం ఉంటుంది. శ్రీ లింగరాజ , శ్రీ జగన్నాథ మందిరాలలో "నట మండపం" అని మరొక నిర్మాణం కనపడుతుంది.
ఒడిశాలో మూడు రకాల ఆలయాలు కనపడతాయి."రేఖ మరియు పిద శైలి" ఆలయాలు ముఖ్యంగా విష్ణు, శివ, సూర్య దేవులకు ఉద్దేశించబడినవి. మూడో రకమైన "ఖాఖర శైలి" ఎక్కువగా కాళి, చండి, దుర్గ దేవి ఆలయాలలో కనపడుతుంది.
సోమవంశీ రాజులు నిర్మించిన ఈ ఆలయ విమానం ఎత్తు సుమారు అరవై అడుగులు. రాజారాణి మందిరం పంచరథ శైలి నిర్మాణంగా పేర్కొనబడుతున్నది. జగన్మోహన మరియు దేవుల వెలుపలి గోడల పైన నర్తకీమణుల, నాగుల శిల్పాలు జీవం ఉట్టిపడేలా చెక్కబడినాయి. కొన్ని శృంగార శిల్పాలు కూడా కనపడతాయి. రాతి మీద సూక్ష్మాతి సూక్ష్మ చెక్కడాలను ఎంతో నైపుణ్యంతో మలచారు నాటి శిల్పులు.
ఎనిమిది దిక్కులలో అష్ట దిక్పాలకులను కూడా మలచారు.
జగన్మోహన చేరుకోడానికి మెట్లు ఉంటాయి. ద్వారానికి ఇరుపక్కలా కైలాస ద్వారపాలకులు, నాగ నాగిని స్థంభాలు, ద్వారానికి పైన నవగ్రహాలను సుందరంగా చెక్కారు. స్థంభాల క్రింద ఏనుగులను, సింహాలను ఏర్పాటు చేసిన విధానం ముచ్చట గొలుపుతుంది. పైన సింహాన్ని పోలిన ఒక ఇతిహాస మృగం మరియు కలశం ఏర్పాటు చేశారు.
లోపల ఒకప్పుడు దేవతా మూర్తులు ఉన్న దాఖలాలు కనపడతాయి. ప్రస్తుతం అవి ఖాళీగా దర్శనమిస్తాయి.
దేవుల పై భాగాన వర్తులాకార "అమలక" మరియు కలశం ఏర్పాటు చేశారు. నగారా శైలి లో ఉన్న దేవుల వెలుపలి భాగంలో అనేక చిన్న చిన్న శిఖరాలు, విమానాలు మధ్య మధ్యలో నాయకీ మణుల శిల్పాలను ఒక పద్దతిలో అమర్చారు.
ఈ విధమైన నిర్మాణ శైలి భువనేశ్వర్ లోని మిగిలిన ఆలయాలలో కనపడదు. అందుకే కాబోలు రాజారాణీ మందిరం ఎందరో చరిత్రకారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రాజారాణీ మందిర నిర్మాణం ఖాజారాహో లోని నిర్మాణాలను పోలి ఉంటుంది అన్నది కొందరు చరిత్రకారుల అభిప్రాయం.
నేడు భువనేశ్వర్ లో కనిపించే నిర్మాణాలను పరిశీలిస్తే వాటికి రాజారాణీ మందిరానికి ఉన్ననిర్మాణపరమైన బేధం తెలుస్తుంది.
గర్భాలయంలో ప్రధాన అర్చనామూర్తి ఉండిన ప్రదేశం ఖాళీగా ఉంటుంది. లోపల ఎలాంటి శిల్పాలు కనపడవు.
మందిర పరిసరాలను పచ్చని పచ్చిక బయలుతో, మొక్కలతో సుందరంగా మలచారు. హడావుడి, రణగొణ ధ్వనుల నగర వాతావరణంలో కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది.
ఒక సాయంత్రాన్నిజీవితాంతం గుర్తుంచుకోతగినదిగా మార్చుకోవాలంటే భువనేశ్వర్ సందర్శనలో రాజారాణీ మందిర పరిసరాలలో గడపడం తప్పనిసరి!!
To,
The Editor,
Vaartha Daily (sunday Magazine),
Hyderabad
Dear sir,
నేను మీకు పంపుతున్న " సింగరకొండ శ్రీ ఆంజనేయ ఆలయం " అన్న ఆలయ సందర్శనా వ్యాసం స్వయంగా సందర్శించి సేకరించిన విశేషాలతో రాసినది. ఇందులోని అంశాలకు నేను బాధ్యత వహించగలనని తెలుపుకొంటున్నాను.
కావలసిన చిత్రాలను కూడా జత చేస్తున్నాను.
ప్రచురణార్హమైన యెడల ప్రచురించగలరు.
Regards,
ఇలపావులూరి వెంకటేశ్వర్లు
I J Venkateswarlu,
Vijayawada
9052944448
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి