29, జనవరి 2023, ఆదివారం

Sri Lakshmana Perumal Temple, Thirumuzhilikkulam

 

                   తిరుమూళిక్కుళం లక్ష్మణ పెరుమాళ్ 



ఆళ్వారుల కాలంలో నేటి కేరళ ప్రాంతాన్ని"మలై నాడు" అని పిలిచేవారు. ఈ ప్రాంతంలో మొత్తంగా పదమూడు శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఉన్నాయి. స్వతంత్ర భారత  రాష్ట్రాల విభజన సమయంలో రెండు దివ్యదేశాలు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో భాగమయ్యాయి. అయినా వీటిని నేటికీ మలైనాడు దివ్యదేశాలుగానే పరిగణిస్తున్నారు. 
ఈ పదమూడు దివ్యదేశాలలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, తిరువనంతపురం ఒకటి .
వీటిల్లో అయిదు ఆలయాలు పంచ పాండవుల నిర్మితాలు. మిగిలినవి కూడా విశేష పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగినవి కావడం పేర్కోవలసిన అంశం. 
కేరళలో ఎప్పటి నుండో రామాయణానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. కేరళీయులు వారి పంచాంగం అయిన "కొళ్ల వర్షం"  ప్రకారం వచ్చే "కర్కాటక మాసం (జులై-ఆగష్టు)లో "నలంబలం"(నాలుగు ఆలయాలు)పేరిట  రామాయణ యాత్ర చేపడతారు. 
నలంబలంలో  వారు దశరధ తనయులైన శ్రీరామ, భరత, లక్ష్మణ మరియు శతృఘ్నులు కొలువు తీరిన నాలుగు ఆలయాలను ఒక  సందర్శిస్తారు. 
మనదేశంలో గ్రామ గ్రామాన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర మూర్తి ఆలయాలు కనపడతాయి. కానీ ఎక్కడా లక్ష్మణ, భరత మరియు శత్రుఘ్న ఆలయాలు కేరళలో తప్ప మరెక్కడా కనపడవు. 
ప్రత్యేక ఆలయాల రాష్ట్రంగా గుర్తింపు పొందిన కేరళలోని నాలుగు  జిల్లాలలో శ్రీరామ, లక్ష్మణ,  ,శత్రుఘ్నుల ఆలయాలు ఉన్నాయి. అవి  కొట్టాయం,మలప్పురం, కన్నూరు మరియు ఎర్నాకుళం.  ఎర్నాకుళం లో ఉన్న ఆలయాలు బాగా ప్రసిద్ధి. 
త్రిప్రయార్ శ్రీ రామ చంద్ర మూర్తి, తిరుమూళి కుళం  శ్రీ లక్ష్మణ పెరుమాళ్, కూడల్ మాణిక్యం శ్రీ భారత, పయ్యమ్మాళ్ శ్రీ శత్రుఘ్న స్వామి ఆలయాలను కేరళీయులు కర్కాటక  అధికంగా సందర్శిస్తారు. ఆ నెలలో వారు నిత్యం రామాయణ పారాయణం చేస్తారు. ఒక రోజున నలంబల యాత్ర చేస్తారు. 
స్థానిక విశ్వాసం ప్రకారం ఈ నాలుగు విగ్రహాలు శ్రీ కృష్ణుని చేత పూజింప బడినాయని.  నాలుగు ఆలయాల యాత్ర {నలంబలం}లో దర్శించుకునే అన్ని చోట్ల చతుర్భుజాలతో శ్రీమన్నారాయణుడు మాత్రమే దర్శనమిస్తారు. 
శ్రీరాముడు కొలువైన త్రిప్రయార్ ఆరువాత తిరుమూళి కుళం  శ్రీ లక్ష్మణ పెరుమాళ్ ఆలయాలుఅధికంగా భక్తాదరణ కలిగినవి. శ్రీ లక్ష్మణ పెరుమాళ్ క్షేత్రం నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. 

క్షేత్ర  గాధ 

మూల విరాట్టు ప్రతిష్ట కలియుగంలో జరిగినా క్షేత్రం అత్యంత పుణ్యప్రదమైనదిగా  గత యుగాల లోనే గుర్తింపు పొందినట్లుగా తెలుస్తోంది. 
యుగాల ముందు హరిత మహర్షి ఇక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనాన్ని అపేక్షించి తపస్సు చేశారట. స్వామి దర్శనమిచ్చి మహర్షికి వానప్రస్థం గురించి ఉన్న సందేహాలను తీర్చారట. 
అనంతర కాలంలో వనవాస సమయంలో తమ వద్దకు వస్తున్న భరతుని ఉద్దేశం గురించి తప్పుగా భావించారట  లక్ష్మణుడు. ఆయన  పొరబాటును గురించి తెలుపుతూ శ్రీరాముడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అంటూ దాని వలన   కలిగే నష్టాలను గురించి హితోక్తులు పలికారట. 
మూళి క్కుళం అంటే హితోపదేశం చేసిన ప్రదేశం అని అర్ధం. దానికి గౌరవ వాచకం తిరు (శ్రీ) కలిపి తిరు మూళి క్కుళం అని పిలవసాగారు. 

ఆలయ విశేషాలు 

ఈ ఆలయం సువిశాల ప్రాంగణంలో కేరళ శైలిలో నిర్మించబడినది. పెద్ద పెద్ద గోపురాలు, ఆకర్షించే శిల్పాలు కనరావు. అయినా ప్రాంగణం చాలా ఆహ్లాదంగా, ఆధ్యాత్మిక వాతావరణం నిండి ఉంటుంది. ఎత్తైన ముఖమండపం సందర్శకులను ఆకర్షిస్తుంది. దాని వెనుక ధ్వజస్థంభం,బలి పీఠం ఉంటాయి.  ప్రాంగణంలో కూతంబళంగా పిలిచే నాట్య మండపం ఉంటుంది. ఇక్కడ నియమంగా ప్రతి నిత్యం  కేరళలో ప్రసిద్ధి చెంది, ప్రపంచంలో అతంత పురాతన నాట్య విధానాలలో ఒకటిగా గుర్తింపు పొందిన "కుట్టియాట్టం" ప్రదర్శిస్తారు. 
నలుచదరంగా పెంకులతో నిర్మించిన నల్లంబళం మధ్యలో ఉన్న  ద్వారం నుండి లోనికి వెళితే నమస్కార మండపం దాని వెనుక వర్తులాకార శ్రీ కోవెల (గర్భాలయం)కనిపిస్తాయి. 
గర్భాలయంలో స్థానిక భంగిమలో చతుర్భుజులై శ్రీ లక్ష్మణ స్వామి సుందర, పుష్ప అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. 
ఉపాలయాలలో శ్రీ కృష్ణ, శ్రీ కైలాసనాథుడు, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ ధర్మశాస్త మరియు శ్రీ భగవతి కొలువై ఉంటారు. 
చేర, పాండ్య, పందాళ, కొచ్చిన్, ట్రావెంకూర్ మరియు స్థానిక పాలకులు ఆలయాభివృద్దికి తమ వంతు కైకార్యాలను సమర్పించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆలయం ట్రావెంకూర్ దేవస్వం అధీనంలో ఉన్నది. 

పూజలు మరియు ఉత్సవాలు 

ఉదయం నాలుగు గంటల నుండి పది గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉండే ఆలయంలో నియమంగా నాలుగు పూజలు జరుగుతాయి. 
శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ రామనవమి, శ్రీ నృసింహ, శ్రీ కూర్మ, శ్రీ వరాహ, శ్రీ పరశురామ, శ్రీ బలదేవ  జయంతులను వేడుకగా జరుపుతారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా చేస్తారు. 
స్థానిక పండుగలైన విషు, ఓనం రోజులలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. 
మళయాళ నెల "మేడం"(చైత్ర మాసం)లో ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా పది రోజుల పాటు నిర్వహిస్తారు. 

దివ్యదేశం 

పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ప్రముఖుడైన నమ్మాళ్వార్ శ్రీ లక్ష్మణ స్వామిని కీర్తిస్తూ పదకొండు పాశురాలను గానం చేశారు. తిరుమంగై  ఆళ్వార్ కూడా కూడా మూడు పాశురాలను గానం చేశారని "నళయర దివ్య ప్రబంధం" తెలుపుతోంది. ఈ కారణంగా తిరుమూళి క్కుళం నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. 
ఈ దివ్యదేశానికి త్రిసూర్ లేదా ఎర్నాకుళం నుండి సులభంగా చేరుకోవచ్చును. 
జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరుల జన్మస్థలమైన కాలడి నుండి కూడా ఇక్కడికి మార్గం ఉన్నది. వసతి సౌకర్యాలు త్రిసూర్ లేదా ఎర్నాకుళంలో బాగుంటాయి. 

ఓం నమో నారాయణాయ !!!!  . 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...