14, మే 2021, శుక్రవారం

64 Yogini Temple, Hirapur, Bhubaneswar

 

                    అరుదైన ఛౌసటి యోగిని ఆలయం 


                                                                       





                              

"మీకు భువనేశ్వర్లో ఛౌసటి జోగిని మందిరం ఎక్కడున్నదో తెలుసా రాజేష్ బాబు" అనడిగాను మా ఒడిశా కొలీగ్ అయిన రాజేష్ పాల్ ని. 
ఆశ్చర్యపోయాడు అతను. " సార్ ! భువనేశ్వర్ లో పుట్టి, పెరిగాను నేను. ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. కానీ ఛౌసటి జోగిని మందిరం గురించి ఎప్పుడూ వినలేదు. మీకు ఎలా  తెలుసు ?" అన్నాడు. అతనికి పురాతన, ప్రత్యేక ఆలయాల సందర్శన పట్ల నాకు గల ఆసక్తి గురించి తెలుసు. 
"తొమ్మిదో శతాబ్దానికి చెందిన అరవై నాలుగు యోగినిలు కొలువైన మందిరం భువనేశ్వర్ కి దగ్గరలో హీరాపూర్లో ఉన్నదని తెలిసింది" అని జవాబిచ్చాను. 
"నేను కనుక్కొంటాను సార్ ! రేపు ఆదివారం కదా వెళదామా !" అనడిగాడు. తల ఊపాను.   
రాత్రి పది గంటలకు ఫోన్ చేసి " ఎలా వెళ్లాలో కనుక్కున్నాను సార్ ! ఉదయాన్నే ఎనిమిది గంటలకు వస్తాను. రెడీగా ఉంటే వెళదాము" అన్నాడు. 
 "సరే" అన్నాను.
అనుకున్నట్లుగా ఎనిమిది గంటలకు బయలుదేరాము మోటార్ సైకిల్ మీద. 
ప్రస్తుత  ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ గతంలో  "ఏకామ్ర క్షేత్రం" (మామిడి వనం)గా పిలవబడేది. ఈ నగరం క్రీస్తుపూర్వం రెండు మూడు శతాబ్దాల నుండి క్రీస్తు శకం పదహారో శతాబ్దం వరకు నిర్మించిన ఎన్నో ఆలయాలు, గుహలు, వివిధ రకాల నిర్మాణాలకు ప్రసిద్ధి. అధిక శాతం మందిరాలు పాతనగరంలోని బిందు సాగర్ సరోవరానికి సమీపంలో ఉంటాయి. వీటిల్లో ఎక్కువగా 
శివాలయాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇసుక రాతితో కళింగ శైలిలో నిర్మించబడినవి. సుమారుగా ముప్పయ్ దాకా ఉన్నఆలయాల్లో పూజాదికాలు జరుగుతున్నా వాటిల్లో అగ్రస్థానం  లింగరాజ్ ఆలయానిదే ! మిగిలిన ఆలయాలలో పూజాదికాలు జరగక పోయినా వాటిల్లోని శిల్ప సౌందర్యం అద్భుతం అని చెప్పాలి. రాతిని మట్టి ముద్దను మలచినట్లుగా మలచిన నాటి శిల్పులు అభినందనీయులు. 
పెద్ద శిల్పాల నుండి సూక్ష్మ రూపాల వరకు అన్ని శిల్పాలు  ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఆకర్షణీయంగా ఉండటం విశేషం. 
కొంత దూరం "శ్రీ జగన్నాధ క్షేత్రం పూరి" దారిలో ప్రయాణించిన తరువాత ఎడమ పక్కకు తిరిగి దయా నది తీరానికి చేరుకున్నాము. 

















దయా నది 

మహానదికి ఉపనది అయిన "కువాఖాయి నది"కి ఉపనది దయానది. ప్రవాహ మార్గంలో "మాలగుని నది" ని కలుపుకొని ఖుర్దా మరియు పూరి జిల్లాలలో ప్రహించి చివరికి ప్రపంచ ప్రసిద్ధి "చిలకా సరస్సు"ఈశాన్య భాగంలో కలిసిపోతుంది. ప్రవాహ మార్గంలో రెండు జిల్లాలలోని  కొన్నివేల   ఎకరాలను సశ్యశ్యామలం చేస్తూ, ప్రజలకు జీవనాధారంగా సాగుతుంది దయానది ప్రవాహం. 
ఈ నదీ తీరంలో చిన్న పర్వతం మీద నిర్మించబడిన బౌద్ధ స్థూపం "దౌలీ". చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం  కళింగ యుద్ధం జరిగింది ఇక్కడే ! ఆ సమయంలో దయానదిలో నీటికి  బదులు నెత్తురు ప్రవహించినట్లుగా చెబుతారు. యుద్ధానంతరం  అవధులు దాటిన రక్తపాతాన్ని చూసి వికల మనస్కుడైన అశోక చక్రవర్తి అహింసామార్గాన్ని ప్రభోదించే బౌద్ధ మతాన్ని స్వీకరించారని కూడా చెబుతారు. 
దయానది మీద నిర్మించిన వంతెన దాటి తీరం వెంబడి మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత అరవై నాలుగు యోగినుల ఆలయానికి దారి అన్న బోర్డు కనిపించింది.   
చిన్న పల్లె. పూర్తిగా గ్రామీణ వాతావరణం. ఊరికి ఆ చివర పచ్చని పొలాల మధ్య ఉన్నది మేము చూడాలనుకొంటున్న ఆలయం. పక్కనే పెద్ద చెరువు. మహామాయ పుష్కరణి అంటారట తరువాత పూజారిగారు చెప్పారు. స్వచ్ఛంగా ఉన్న నీటిలో పిల్లలు ఉత్సాహంగా ఈత కొడుతున్నారు. పెద్దలు ఆడ, మగ విడివిగా స్నానం చేస్తున్నారు. 
ప్రస్తుతం పురావస్తు శాఖ అధీనంలో ఉన్న ఈ ఆలయం నిర్వహణ చాలా చక్కగా ఉన్నది. ప్రాంగణమంతా పచ్చని పచ్చిక బయలు, దారికి ఇరువైపులా పూల మొక్కలతో సుందరంగా ఉన్నది ప్రాంగణం. మొదట్లోనే కనిపిస్తుంది ఆలయ చరిత్రను తెలిపే బోర్డు. కాకపొతే అక్షరాలు స్పష్టంగా కనపడలేదు.  

 యోగిని లేదా జోగిని మందిరాలు  

ఎన్నో సంప్రదాయాలకు నిలయమైన భారత భూమిలో "తంత్ర పూజా లేదా ఉపాసన విధానం"  ఒకటిగా గుర్తించబడినది. ఈ విధానం కొన్ని యుగాలుగా, శతాబ్దాలుగా అనుసరిస్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉండినది. ముఖ్యంగా ఎనిమిది నుండి పదహారో శతాబ్దాల మధ్య కాలంలో తంత్ర విధానం అనుసరించే వారి సంఖ్య అధికమయ్యింది అని అంటారు. ఆ సమయంలో వారు పాలకులను ప్రభావితులను చేసి మందిరాలను నిర్మించేలా చేసారు అన్నది చరిత్రకారుల అభిప్రాయం. 
ఈ అరవై నాలుగు యోగిని మందిరాలు ఎక్కువగా ప్రస్తుత మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా మరియు బెంగాల్ రాష్ట్రాలలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటి సంఖ్య పదహారని కూడా చెబుతారు. వీటిల్లో కొన్ని అరవై నాలుగు, మరికొన్ని నలభై రెండు కాగా ఒకటి మాత్రం ఎనభై ఒకటి గా ఉన్నాయి. చాలా మటుకు శిధిలమయ్యాయి. ఆకార మాత్రంగా కనపడేవి ఖజ్రహో, మితౌలి (గ్వాలియర్ దగ్గర), భేదఘాట్ (జబల్పూర్ దగ్గర. ఇది ఎనభై ఒక్క యోగిని మందిరం),  హీరాపూర్  (భువనేశ్వర్ దగ్గర), రాణీపూర్ ( బలంగీర్ జిల్లా, ఒడిశా), దుదహి ( ఖుషినగర్ జిల్లా, ఉత్తరప్రదేశ్), బాధొహ్ (విదిశా జిల్లా, మధ్యప్రదేశ్). చివరవి రెండు నలభై రెండు యోగినిల ఆలయాలు. 
మిగిలినవన్నీ పూర్తిగా శిధిలమయ్యాయి అని తెలుస్తోంది. 
యోగినిల సంఖ్య ఏదైనా కానీ ఆలయం మాత్రం వర్తులాకారంగా ఉంటుంది. గుండ్రని గోడ అంతరభాగంలో ఉన్నఏర్పాటు చేసిన అరలలో లేదా చిన్న చిన్న సన్నిధులలో యోగినిలు కొలువై ఉంటారు. మధ్య భాగంలో నిర్మించిన మండపంలో  మహాదేవుడు లేదా కాలభైరవుడు ఉంటారు. సరిగ్గా చెప్పాలంటే ఆలయ నిర్మాణం యోనిని లేదా పానువట్టాన్ని పోలి ఉంటుంది.   మహాశివునికి చేసే అభిషేకం జరిపినప్పుడు అభిషేక జలం ప్రవహించే మార్గమే ప్రవేశ ద్వారంగా ఉంటుంది. 
ప్రస్తుతం పూజాదికాలు నిర్వహిస్తున్నది మాత్రం హీరాపూర్ ఛౌసటి యోగిని ఆలయంలో మాత్రమే. 
ఇక్కడ ప్రస్తావించవలసిన విషయం ఒకటున్నది మన దేశరాజధాని న్యూ ఢిల్లీలో ఆంగ్లేయుల పాలనలో నిర్మించిన నేటి పార్లమెంట్ భవనాన్ని "మితౌలి"లో ఉన్న యోగిని మందిరాన్ని చూసి  ఉత్తేజితులై అదే పద్దతిలో నిర్మించినట్లుగా చెబుతారు. 
















ఎవరీ యోగినులు 

ప్రధాన ద్వారం దాటి ప్రాంగణం లోనికి వెళ్ళగానే ఆలయ పూజారి గారు మమ్మల్ని చూసి కొత్త వారం అర్ధమైందేమో " ఏ ఊరు ?" అని ఒడియాలో ప్రశ్నించారు. ఒడియా భాష ధారాళంగా మాట్లాడగలను. విజయవాడ అని చెప్పానో లేదో ఆయన మాపట్ల  ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆలయ విశేషాలను దగ్గర ఉండి వివరించారు.  
చాలా పురాతన మహేశ్వర, శ్రీ దుర్గా దేవి  ఆలయాలలో మనం సప్త మాతృకలు సన్నిధిని చూస్తూ ఉంటాము. వివిధ దేవతల అంశాలైన వీరు అసలు ఆది దేవి రూపాలే అని చెబుతారు. వారు "బ్రాహ్మణి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండ, మహేశ్వరి, కుమారి మరియు వారాహి".  కానీ తంత్ర విధానంలో మరో శక్తి రూపం ఉంటుందిట. ఆ శక్తి పేరు తార, మంజు శ్రీ, వసుంధర లేక నారసింహిని అని అంటారట.  ఈ అష్ట మాతృకలు ఒకొక్కరూ తమ నుండి ఎనిమిది రూపాలను సృష్టిస్తారట. అన్నీ కలిసి అరవై నాలుగు అవుతాయి. వీరి రూపాలు భిన్నంగా ఉంటాయి. వీరి వాహనాలు కూడా రకరకాల జంతువులై ఉంటాయి. ఆలయంలోని శిల్పాలను చూస్తే ఆ విషయం అర్థమైనది.  వీరు కొన్నియోగిని ఆలయాలలో ఉపస్థిత భంగిమలో, మరికొన్నచోట్ల స్థానక భంగిమలో కనపడతారు.  కానీ ఇక్కడ మాత్రం యోగినిలు స్థానక భంగిమలో ఉంటారు. వీరి పేర్ల చివర యోగిని అని ఉంటుంది. దివ్య యోగిని, సిద్ధయోగిని ఇలా.















హీరాపూర్ యోగిని ఆలయం 

భువనేశ్వర్ కి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో హీరాపూర్ గ్రామంలో ఉన్న ఈ ఆలయం తొమ్మిదో శతాబ్దంలో బ్రహ్మ వంశానికి చెందిన రాణి హీరాదేవి నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఆమె పేరు మీదగా ఈ గ్రామానికి ఈ పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. 
వర గర్వంతో ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తున్న అసురుని దుర్గా దేవి మహామాయగా అవతరించి తన గణమైన అరవై నాలుగు మంది యోగినిలతో కలిసి ఇక్కడ అంతం చేశారట. ఆ కారణంగా ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారని తెలుస్తోంది. 
ఈ ఆలయంలో ప్రధాన అర్చనా మూర్తి  అయిన మహామాయ దేవి మధ్యలో ఉంటారు. 
ఇరవై అయిదు అడుగుల వ్యాసార్థంలో వర్తులాకారంలో, ఆరు అడుగుల ఎత్తులో పై కప్పు లేకుండా ఉంటుందీ ఆలయం. ఒడిశాలో ప్రతి ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ఇసుక రాతిని ఈ ఆలయ నిర్మాణంలో కూడా వాడారు.  
వెలుపలి భాగంలో ఎనిమిది కాత్యాయని మూర్తులుంటాయి. వీరంతా చేతిలో ఆయుధం ధరించి, మానవ శిరస్సు మీద స్థానక భంగిమలో కనపడతారు. పక్కన సేవిక ఛత్రాన్ని పట్టుకొని ఉండగా మానవ శిరస్సు పక్కన రెండు శునకాలు ఉంటాయి. ఈ శిల్పాల గురించి పూజారి గారు శ్లోకాల రూపంలో చెప్పారు కానీ మాకు పూర్తిగా అర్ధం కాలేదు. వీరు ఆలయ కావలి దేవతలు అని మాత్రం తెలిసింది.   


















ఆలయం లోపలి దారి తీసే చిన్న ద్వారానికి ఇరుపక్కలా ద్వారపాలికలు ఉంటారు. లోపలి భాగంలో నల్లరాతిలో మలచిన అరవై యోగినిలు తమ వాహనాలుగా రకరకాల జంతువులను, మానవులను చేసుకొని వివిధ భంగిమలలో స్థానక భంగిమలో దర్శనమిస్తారు. 
ఈ యోగినుల మధ్యలో శ్రీ దుర్గా దేవి మహామాయ రూపంలో కొలువు తీరి ఉంటారు. రకరకాల భంగిమలలో కొంత మేర భిన్నమైనా యోగిని విగ్రహాలలో ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. ఏ రెండు యోగిని విగ్రహాలు ఒక మాదిరిగా ఉండకపోవడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రతి ఒక్క యోగిని తలకట్టు, ఆయుధం, పాదాల క్రింద ఉన్న వాహనం భిన్నంగా ఉండటం నాటి శిల్పుల గొప్పదనంగా భావించాలి. 
వర్తులాకార మందిర మధ్య భాగంలో చండీ మండపం ఉంటుంది. నాలుగు స్తంభాల మీద ఉన్న  యోగినిల విగ్రహాలతో కలిపితే మొత్తం అరవై మూడు యోగినిలు ఉంటారు. ఈ విషయం గురించి  పూజారి గారిని అడిగితే  ఆయన చెప్పిన దాని ప్రకారం 1953లో ప్రముఖ చరితకారుడు శ్రీ కేదారనాథ్ మహాపాత్ర మట్టితో కప్పబడి ఉన్నఈ  నిర్మాణాన్నివెలికితీశారట. అప్పుడు చండీ మండపంలో  శివలింగం, స్థంభం మీద "సర్వమంగళ విగ్రహం" ఉండేవిట. కానీ కొద్ది కాలంలోనే అవి రెండు అదృశ్యమైనాయట. కనిపెట్టడానికి చేసిన ప్రయత్నాలు వ్యర్ధమైనాయి అని చెప్పారు. 
నిర్మాణం తరువాత సుమారు ఆరు శతాబ్దాల పాటు ఈ ఆలయం తాంత్రికుల పూజలకు కేంద్రంగా ఉన్నది. అయినా ఎలాంటి భయంకర, భీకర విగ్రహాలు కనపడవు. రహస్యంగా జరిగే ఈ తాంత్రిక పూజల గురించి కూడా ఆయన కొద్దిగా వివరించారు. దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు జరుగుతాయట.  














ప్రాంగణంలో చిన్న శివాలయం, పక్కనే వెలుపల ప్రతిష్టించిన శ్రీ కాళీమాత  విగ్రహం ఉన్నాయి. 
పూజారి గారు మా పేర్ల మీద శివాలయంలో పూజ చేశారు. ఆయనకు కృతఙ్ఞతలు తెలుపుకొని మరో మారు ప్రాంగణమంతా తిరగాడాము.  మహామాయా సమేత  ఇతర యోగినులకు నమస్కరించుకుని మరో ప్రత్యేక అరుదైన ఆలయాన్ని సందర్శించానన్న సంతృప్తితో వెనుతిరిగాము. 
విచారకరమైన అంశం ఏమిటంటే భువనేశ్వర్ కి సమీపంలో ఉన్నా ఇక్కడికి చేరుకోడానికి వాహన  సదుపాయం లేదు. సొంత వాహం లేదా అద్దె వాహనం మీదనే చేరుకోగలం. బస్సు ఏర్పాటు చేస్తే సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. 



Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...