12, ఫిబ్రవరి 2022, శనివారం

Sri Jaganmohana Swami Temple, Ryali

                   
జగన్మోహనం జగన్మోహన స్వామి రూపం 



ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరం దగ్గర జన్మించినది ఈ నది. జన్మస్థలమైన మహారాష్ట్ర నుండి తన ప్రయాణాన్ని ఆరంభించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘర్, ఒడిషా రాష్ట్రాల గుండా ప్రవహించి చివరికి మన రాష్ట్రంలోని గోదావరి జిల్లాలలో సముద్రంతో సంగమిస్తుంది ఈ పవిత్ర నదీమ తల్లి. 
 స్వయం గంగాధరుని జటాజూటాల నుండి జాలువారి భారత దేశంలోని అనేక రాష్ట్రాలలోని లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ ప్రవహించే పరమ పావన గంగా నది తరువాత అంతటి ప్రాముఖ్యం గల నది గోదావరి. పై సమాచారం ఆ నది గురించే !
మన దేశంలో రెండవ పెద్ద నదిగా సుమారు పదిహేను వందల కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ అయిదు రాష్ట్రాల లోని ఎన్నో వేల ఎకరాలను సాగు భూములుగా మారుస్తూ, వందల నగరాల ప్రజల దాహార్తిని తీరుస్తుంది గోదావరి తల్లి. 
ప్రతి నదీ తీరంలో మాదిరిగానే గోదావరి తీరం కూడా కొన్ని వందల పుణ్య తీర్థ ధామాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రం లోని ఉభయ గోదావరి జిల్లాలలో అనేక పురాణ, చారిత్రక విశేషాలు కలిగిన క్షేత్రాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో దేశంలో మరెక్కడా కనపడని ఒక ప్రత్యేక ఆలయం ఒకటి గోదావరి తీరంలో తొలి యుగం నుండి ఉన్నట్లుగా తెలుస్తోంది. 
అదే శ్రీ జగన్మోహన స్వామి కొలువు తీరిన "ర్యాలి". 
ముందు శ్రీ జగన్మోహన స్వామిగా, వెనుక జగన్మోహినిగా ఒకే విగ్రహంలో శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దర్శనమిచ్చే మరో ఆలయం మరెక్కడా కనపడదు. 
గతంలో "రత్నగిరి" అని పిలవబడిన ఈ క్షేత్రం నేడు ర్యాలి అని పిలవబడడానికి, శ్రీ మన్నారాయణుడు ఇలాంటి విశేష రూపంలో ఇక్కడ దర్శనమివ్వడానికి సంబంధించిన గాధ కృత యుగంలో జరిగిన క్షీర సాగర మధన సమయం నాటిదిగా ఆలయ పురాణ గాధ తెలుపుతోంది. 

పౌరాణిక గాధ 

తమ మధ్య ఉన్న వైరత్వ భావాన్ని అవసరార్ధం చేతులు కలిపి చేపట్టిన కార్యక్రమం పాల సముద్ర మధనం. అమరత్వాన్ని అందించే అమృతం కొరకు వీరు తాత్కాలికంగా  ఏకమైనారు. మంధర పర్వతాన్ని కవ్వంగా , వాసుకిని తాడుగా చేసుకొని వారు చేపట్టిన సాగర మధనానికి శ్రీహరి కూర్మావతారం ధరించి మంధర పర్వతం మునిగి పోకుండా తన వంతు సహకారం అందించారు. 
ఐరావతం, కామధేనువు, చంద్రుడు, శ్రీ మహాలక్ష్మి, హాలాహలం ఇలా ఒకదాని తరువాత మరొకటి వచ్చి చివరగా అమృత భాండం తీసుకొని శ్రీ ధన్వంతరి ఆవిర్భవించారు. 
అప్పటి దాకా ఒకటిగా శ్రమించిన దేవదానవుల మధ్య తిరిగి కలహం చోటు చేసుకున్నది. ఎవరికి వారు అమృతాన్ని పొందాలన్న ఉద్దేశ్యంతో పోరుకు సిద్ధం అవ్వసాగారు. సృష్టికర్త, లయకారుడు దేవేంద్రునితో కలిసి వైకుంఠవాసుని సహాయం చేయమని ప్రార్ధించారు. వారి కోరికను మన్నించిన మహా విష్ణువు అతిలోక సౌందర్యాన్ని కలిగిన మోహిని అవతారాన్ని ధరించారు. 
విష్ణు పురాణం ప్రకారం లోకకల్యాణం కొరకు శ్రీహరి ధరించిన అవతారాలు ఇరవై నాలుగు అని తెలుస్తోంది. కానీ భక్త సమాజంలో అధిక గుర్తింపు పొందినవి మాత్రం దశావతారాలు. 
వాదులాడుకొంటున్న దేవదానవులు తమ ముందు ప్రత్యక్షమైన భువనైక సుందరిని చూసి చేష్టలుడిగి పోయారు. అంతా అమృతం గురించి మర్చిపోయారు. ప్రతి ఒక్కరూ జగన్మోహిని దృష్టిని ఆకర్షించడానికి తాపత్రయ పడసాగారు. 
దానిని ఆసరాగా తీసుకొని మాయామోహిని రాక్షస మూకలను మరింత ప్రలోభపరుస్తూ అమృతాన్ని దేవతలకు పంచసాగింది. ఆమె క్రీగంటి చూపులకు దానవులు అందరూ దాసోహమన్నా "స్వరభాను" అనే దానవుడు మాత్రం తమకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి దేవతా రూపం ధరించి అమృతాన్ని స్వీకరించాడు. 
అది గమనించిన సూర్య చంద్రులు మోహినిని అప్రమత్తం చేయగా ఆమె సుదర్శన చక్రంతో వానిని రెండుగా ఖండించింది. కానీ అమృత ప్రభావంతో ఆ రెండు భాగాలు సజీవంగా ఉండిపోయాయి. వారే రాహుకేతువులు. వీరే సూర్య చంద్ర గ్రహణాలు కారణం అంటారు. అది వేరే కధ. 
ఎప్పుడైతే  స్వరభాను మీద చక్ర ప్రయోగం జరిగిందో అప్పుడే రాక్షసులను ఆవహించిన మాయ తొలగిపోయింది. కానీ అప్పటికే జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది. అమృతాన్ని స్వీకరించిన దేవతల ముందు నిలువలేక దానవులు పలాయనం చిత్తగించారు. 
తాను వచ్చిన పని పూర్తి కావడంతో మోహిని వెళ్ళడానికి సిద్ధం అయ్యింది. ఆమె అద్భుత సౌందర్యానికి చలించిన కైలాసవాసుడు ఆమె చేతిని పట్టుకొన్నాడట. చేతిని వెనక్కి తీసుకొనే క్రమంలో చోటు చేసుకొన్న పరిణామం కారణంగా ఆమె కర్ణాభరణం నెల రాలిందట. 
మోహిని దానిని తీసుకోకుండా ముందుకు వెళుతూ వెనక్కు తిరిగి మహేశ్వరుని చూసి నవ్విందట. దానితో ఆయన మీద ప్రభావం చూపిన మాయ తొలగిపోయిందట. సత్యం అవగతమై స్థాణువుగా మారిపోయారట సర్వేశ్వరుడు. ఈ కారణంగా శ్రీ జగన్మోహన స్వామి ఆలయం, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం ఎదురెదురుగా ఉంటాయి. 
అలా జగన్మోహిని కర్ణాభరణం రాలిన ప్రదేశం ఇదే అని అంటారు. అలా  "ర్యాలి"  అన్న పేరు స్థిరపడి పోయింది.  






అపురూపం జగన్మోహనుని రూపం 

అయిదు అడుగుల సాలగ్రామ శిలా రూపంలో స్థానిక భంగిమలో కొలువైన శ్రీ జగన్మోహన స్వామి రూపం నయన మనోహరంగా కనపడుతుంది. విధాత బ్రహ్మ ప్రతిష్టగా పేర్కొంటారు. 
చతుర్భుజాలతో శంఖ , చక్ర , గద ధరించి అభయ హస్తంతో చిరు మందహాసంతో శ్రీ జగన్మోహన స్వామి కనపడతారు. 
అర్చక స్వామి నేతి దీపపు వెలుగులో చూపించే పృష్ఠ భాగంలో కనిపించే జగన్మోహిని రూపం సంభ్రమ కలిగిస్తుంది. సన్నని నడుము, తీర్చిదిద్దినట్లుగా కనపడే కేశాలంకరణ కొప్పు, కేశాలు  చక్కని చీర కట్టు,చేతి వేళ్ళు వాటి గోర్లు అత్యంత సహజంగా కనిపిస్తాయి. 
నేతి దీపపు కాంతిలో సుందర నల్లనయ్య రూపం మెరుస్తూ మైమరపిస్తుంది. శ్రీ జగన్మోహన స్వామికి ఇరువైపులా శ్రీ దేవి భూదేవి అమ్మవార్లు ఉండటం మరింత విశేషం. మకర తోరణం మీద వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులను, స్వామి వాహనమైన గరుత్మంతుని, శ్రీరామ బంటు అయిన హనుమంతుని, దశావతారాలను జీవం ఉట్టిపడేలా మలిచారు. 
నఖశిఖ పర్యంతం నేత్రపర్వంగా దర్శనమిచ్చే శ్రీ జగన్మోహన స్వామి దివ్య మంగళ శిలా రూపాన్ని చూసి మానవమాత్రులమైన మనం మైమరచిపోతాం. జీవమున్న శ్రీ జగన్మోహిని రూపాన్ని వీక్షించిన పరమేశ్వరుడు ఇతరులు మాయలో పడిపోవడంతో ఏమాత్రం ఆశ్చర్యం లేదనిపిస్తుంది. 

విష్ణు పాదోద్భవ గంగ 

గోదావరి తీరంలో వెలసిన శ్రీ జగన్మోహన స్వామి పాదాల నుండి నిరంతరం జలం ఊరుతుంటుంది. దీనినే విష్ణు పాదోద్భవ గంగ అని పిలుస్తారు. జలశిల అని కూడా అంటారు. ఈ జలాన్ని తీర్థంగా భక్తులకు ఇస్తారు. 
ఆలయ ప్రాంగణంలో దశావతార శిల్పాలు కనువిందు చేస్తాయి. 

శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి 






హరిహర క్షేత్రమైన ర్యాలిలో శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి శ్రీ జగన్మోహన స్వామివార్ల ఆలయాలు ఎదురెదుగా ఉంటాయి. 
బ్రహ్మదేవుడు లింగాన్ని ప్రతిష్టించిన అనంతరం తన కమండలం లోని పవిత్ర జలంతో తొలి అభిషేకాన్ని నిర్వహించారట. అందువలన ప్రత్యేక సన్నిధిలో కొలువైన శ్రీ ఉమాదేవితో కలిపి స్వామిని శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి అని పిలుస్తారు. 

ఆలయ చరిత్ర 










గోదావరి నదీ దక్షిణ తీరం లోని ఈ ప్రదేశం గతంలో పెద్ద అడవి అని అంటారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని చోళ రాజులు పాలించేవారట. పదకొండవ శతాబ్దంలో శ్రీ విక్రమ దేవ చోళుడు ఈ ఆలయాలను నిర్మించినట్లుగా చరిత్ర తెలుపుతోంది. 
అనంతరం చాళుక్యులు, విజయనగర రాజులు ఆలయానికి ఎన్నో కైంకర్యాలను సమర్పించుకొన్నారట. 
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి 
రాత్రి ఎనిమిది గంటల వరకూ తెరిచి ఉండే ఈ ఆలయాలలో ప్రతి నిత్య పూజలు జరుగుతాయి. హిందూ పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. 
శివరాత్రికి పెద్ద ఉత్సవం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. 
చెన్నై కోల్కతా ప్రధాన రహదారి మీద ఉన్న రావుల పాలెం కి చాలా సమీపంలో ఉంటుంది ర్యాలి. చేరుకోడానికి ఆటోలు, కార్లు లాంటి ప్రెవేటు వాహనాలు లభిస్తాయి. వసతి సౌకర్యాలు రాజమండ్రి, రావుల పాలెంలో లభిస్తుంది. 
చుట్టుపక్కల ఎన్నో విశేష ఆలయాలున్నాయి. అన్నీ దర్శనీయాలే !





 ఓం నమో నారాయణ !!!! 

1, ఫిబ్రవరి 2022, మంగళవారం

Thiruvannikkaval ( Jambukeshwaram)

 శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయం, జంబుకేశ్వరం (శ్రీ రంగం)




మానవునికి జీవాధారమైనవి పంచ భూతాలైన  నీరు, నిప్పు, నేల, నింగి మరియు గాలి. లోకాలను పాలించే సర్వేశ్వరుడు వీటికి ప్రతి రూపం. అందుకే మన పూర్వీకులు చరాచర సృష్టికర్త పట్ల కృతజ్ఞతా భావంతో ఆలయాలలో స్థాపించి ఆరాధిస్తున్నారు యుగయుగాల నుండి. అవే పంచ భూత స్థలాలైన సి చిదంబరం (ఆకాశం), కాంచీపురం (పృథ్వి), తిరువణ్ణామలై (అగ్ని), శ్రీకాళహస్తి (వాయువు) మరియు జంబుకేశ్వరం (జలం). 
ఈ క్షేత్రాలలో నాలుగు తమిళనాడులో ఉండగా వాయు లింగం మన రాష్ట్రం లోని శ్రీకాళహస్తి లో ఉన్నది. 







తొలి యుగంలో ఏర్పడిన ఆ స్థలాల విశేషాలు లెక్కలేనన్ని. ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం విశేష చారిత్రక  విషయాలతో, పురాణ గాధలతో, భక్తుల అనుభవాలతో అలరారుతున్నాయి. కొలిచిన వారికి కొంగు బంగారంగా పిలవబడుతున్నాయి. 
వీటిల్లో సర్వ జీవులకు ప్రధాన జీవాధారమైన జలంతో ముడిపడి ఉన్న క్షేత్రం తమిళనాడులోని తిరుచునాపల్లి నగరానికి సమీపంలో కావేరి మరియు కొల్లిడాం నదుల మధ్య ఏర్పడిన శ్రీరంగ ద్వీపంలో ఉన్నది. 
నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ప్రధమ స్థానంలో ఉన్న శ్రీ రంగనాధ స్వామి ఆలయానికి చేరువలో నెలకొని ఉంటుంది శ్రీ అఖిలాండేశ్వరి సమేత శ్రీ జంబుకేశ్వర స్వామి కొలువైన జంబుకేశ్వరం. 
ఈ క్షేత్రం గురించి సంగమ సాహిత్యంలో, నయనారుల పాటికాలలో, ఆళ్వారుల పాశురాలతో పాటు పెరియ పురాణం. నళయర దివ్య ప్రబంధం, శిలప్పాధికారం మరియు మణిమేఖల లాంటి పురాతన గ్రంధాలలో పేర్కొనబడినది.  తొలితరం చోళ రాజులు వేయించిన రాగి శాసనాలలో కూడా జంబుకేశ్వరం ప్రస్తాపన ఉన్నట్లుగా తెలుస్తోంది. 










తిరువనైకావాల్ 

శాసనాలలో ఈ క్షేత్రం పేరు "తిరువనైకావాల్" అని పేర్కొనబడినది. తిరు అన్నది  గౌరవ వాచకమైన శ్రీ తో సమానం. యానై అనగా ఏనుగు, కా అంటే అడవి లేదా వనము. దరిదాపుగా శ్రీకాళహస్తి క్షేత్రం యొక్క పురాణ గాధను పోలి వుండే ఈ పేరు వెనుక ఉన్న కధ క్రీస్తు పూర్వం   నాటిదిగా తెలుస్తోంది. 
నిరంతరం శివసాన్నిధ్యంలో ఉండే శివగణాలలో మాల్యవంతుడు మరియు పుష్పదంతుడు అనే వారివురికి ఏ విషయంలోనూ పొసగదు. నిరంతరం ఒకరినొకరు నిందించుకొంటూ, దూషించుకొంటూ ఉండేవారట. శృతి మించి రాగాన పడినట్లుగా వివాదం ముదిరి శాపాలు వరకు వెళ్లిందట. శాప కారణంగా మాల్యవంతుడు సాలీడుగా, పుష్పదంతుడు ఏనుగుగా భూలోకంలో జంబూ ద్వీపంలోని వనంలో జన్మించారట. 
గత జన్మలో శివ సేవలో ఉండటం వలన ఈ జన్మలో కూడా వారివురూ లింగారాధనలో ఉండేవారట. అడవిలో జంబూ వృక్షం క్రింద కొలువైన కైలాసనాధునికి ప్రతి నిత్యం గజరాజు పవిత్ర కావేరి నదీజలాలతో అభిషేకించేవాడట. లింగరాజు మీద దుమ్మూ, ధూళి, ఎండిన ఆకులు పడకుండా సాలీడు పైన గూడు లాగ అల్లేవాడట. అభిషేక సమయంలో దానిని తొలగించేవాడట కరిరాజు. అది సాలీడుకి కోపకారణమైనది. ఆవేశంతో ఒకనాడు ఏనుగు తొండం లో ప్రవేశించి తన విషం వెదజల్లినదట. భరించలేని బాధతో ఏనుగు రాతికి తల మోదుకోవడంతో ఇద్దరూ మరణించారు. చూడండి శత్రుత్వం ఎంతటి క్రూరమైనదో. జన్మజన్మలకు వదలదు. 













చేయని తప్పుకు దండన పొందిన పుష్పదంతుడు శాపవిముక్తుడై కైలాసానికి వెళ్ళిపోయాడు. కానీ రెండో జన్మలో కూడా వైషమ్యాన్ని వీడని మాల్యవంతుడు చేసిన శివపూజకు ఫలితంగా ఆ ప్రాంతాన్ని పాలించే చోళ రాజ దంపతులకు జన్మించాడట. 
 క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన శుభ దేవ చోళుడు చక్కని పాలకుడు. అన్నీ ఉన్నా ఆయనకు రాణి కమలావతికి ఉన్న ఒకేఒక్క దిగులు సంతానం లేదని. దైవజ్ఞుల సలహా మేరకు చిదంబరం వెళ్లి శ్రీ నటరాజ స్వామిని సేవించుకొన్నారట. స్వామి వారి అనుగ్రహంతో రాణి చిదంబరం వెళ్లిన కొద్ది రోజుల లోనే గర్భం దాల్చినది. నెలలు నిండాయి. జోతిష్యం పట్ల అపార నమ్మకం ఉన్న చోళరాజు జ్యోతిష్యులను ఏ బిడ్డ పుడతాడు ? ఏ సమయంలో పుడితే గొప్ప జాతకుడు అవుతాడు ? అని అడిగారట. వారు ఖచ్చితంగా మగబిడ్డ జన్మిస్తాడు అని చెప్పి ఏ సమయంలో శిశువు తల్లి గర్భం నుండి భూమి మీదకు వస్తాడో అంచనా వేసి చెప్పారట. కానీ వారు చెప్పిన సమయానికి కొన్ని ఘడియల ముందు గానే మహారాణికి పురిటి నొప్పులు ఆరంభం అయ్యాయట. జ్యోతిష్యులు చెప్పిన సమయానికి ముందు పుడితే నష్ట జాతకుడు అవుతాడన్న నమ్మకంతో రాణి తనను తాను తల్లక్రిందులుగా కట్టేసుకుని బలవంతంగా నొప్పులను ఆపుకొన్నదట. అలా రావలసిన సమయానికి రాకుండా నిర్బంధంగా గర్భంలో ఎక్కువ సమయం ఉన్నందున పుట్టిన శిశువు ఎఱ్ఱటి కళ్ళతో జన్మించాడట. పుట్టిన బిడ్డను చూసి తల్లి " కొచ్చెంగనన్" (ఎఱ్ఱని కళ్ళ వాడు) అని పిలచి మరణించిందట. 











అనంతర కాలంలో అతను అదే పేరుతొ ప్రసిద్ధుడు అయ్యాడు. అతను మరెవరో కాదు గత జన్మలో సాలీడుగా పుట్టిన మాల్యవంతుడు. గత జన్మలలో చేసిన శివ పూజల  ఫలితంగా ఈ రాజ జన్మ పొందిన అతను తన గతంలో చేసిన పాపకర్మలు తొలిగి పోవడానికి మార్గనిర్దేశికత్వం చేయమని దైవజ్ఞులను అర్ధించాడట. వారు అతనికి వీలైనన్ని శివాలయాలను నిర్మించమని చెప్పారట. వారి మాట ప్రకారాం కొచ్చెంగనన్ డెబ్బై అయిదు ఆలయాలను నిర్మించాడట. వాటిల్లో శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయం ఒకటి. 
కొచ్చెంగనన్ శివభక్తి గురించి  ప్రశంసిస్తూ నయనారులలో ప్రముఖులైన సుందరార్, అప్పార్, తిరుజ్ఞాన సంబంధార్ తమ పాటికాలలో ప్రస్తావించారు. అనంతర కాలంలో కొచ్చెంగనన్ కూడా అరవై మూడు మంది శివగాయక భక్తులైన నయనారులలో ఒకరుగా గుర్తింపు పొందారు. 
అసలు కైలాస నాధుడు ఇక్కడ కొలువు తీరడానికి  ఆయనను  శ్రీ జంబుకేశ్వర స్వామిగా పిలవబడటానికి సంబంధించిన పూర్వగాథ కృత యుగం నాటిదిగా తెలియవస్తోంది. 

శ్రీ జంబు మహర్షి 

మహా శివ భక్తుడైన జంబూ మహర్షి పావన కావేరి నదీ తీరంలో పరమేశ్వర సాక్షాత్కారం కొరకు తీవ్రమైన తపస్సు చేశారట. ఆయన భక్తికి సంతసించిన సదాశివుడు దర్శనం ఇచ్చారట. సంతోషంతో ముని ముక్కంటికి జంబూఫలాన్ని అందించారట. స్వీకరించి సేవించిన సర్వేశ్వరుడు ఫలం తాలూకు గింజలను ఉమ్మి వేశారట. గురు ఉచ్ఛిష్టకం గా వాటిని ఆరగించారట జంబూ మహర్షి. వెంటనే ఆ విత్తనాలు ముని శిరస్సు నుండి  మొలకెత్తి పెను వృక్షాలుగా పెరిగిపోయాయట. తన పేరుకు, ఈ ప్రాంతానికి శాశ్విత కీర్తి ప్రసాదించామన్న మహర్షి కోర్కెను మన్నించి మహేశ్వరుడు ఆయనకు కైలాస ప్రాప్తిని అనుగ్రహించారు. 









శ్రీ జంబుకేశ్వర స్వామి వృత్తాంతం 

కైలాసంలో కపర్ది అంతర ధ్యాన నిమగ్నులై ఉన్న సమయంలో దేవతలు,దిక్పాలకులు, మునులు,   తరలి వచ్చి అసుర బాధ నుండి కాపాడమని ప్రార్ధించారట. వారి విజ్ఞప్తులు వృషభ వాహనుని చెవికి చేరలేదు. ధ్యానం నుండి వెలుపలికి రాలేదట. కానీ వారి దీనాలాపనలు లోకమాతను కదలించాయట. ఎంతైనా అమ్మ కదా !
 ఆగ్రహానికి లోనుకావలసి వస్తుందని తెలిసీ ఆమె  ఆయన ధ్యానం భగ్నం చేసిందట. దాని వలన లోకాలకు రాక్షస బాధ తొలగి పోయింది కానీ లోకపావని భూలోకానికి రావలసి వచ్చినదట. పార్వతీ దేవి జంబూ ద్వీపం చేరుకొని కావేరి నది ఇసుకతో ఒక సైకత లింగాన్ని సృష్టించి జంబు వృక్షం క్రింద ప్రతిష్టించి తదేక దీక్షతో ధ్యానించసాగిందట.  
ఆమె తపస్సుకు సంతుష్టుడైన సోమసుందరుడు ప్రత్యక్షమై "శివ జ్ఞానం"బోధించారట. 
పై ఉదంతం జరపడంలో గల ముఖ్య ఉద్దేశ్యం అమ్మవారికి శివ జ్ఞానం తెలపడమే !
అయ్యవారు అమ్మవారికి ఇక్కడ గురువుగా మారి శివ జ్ఞానం ఉపదేశించడం వలన ఉత్సవాల సమయంలో ఆదిదంపతుల కళ్యాణం నిర్వహించరు ఈ క్షేత్రంలో ! వారిరువురి మధ్య ఉన్నది గురుశిష్య సంబంధం కదా!









దానికి తగినట్లుగానే రెండు ఆలయాలు ఎదురెదురుగా ఉంటాయి. ఇలా మరెక్కడా చూడము. అందుకే జంబుకేశ్వరం ఉపదేశ క్షేత్రం గా పిలవబడుతోంది. 
జంబూ మహర్షి శరీరం నుండి మొలకెత్తిన జంబూ వృక్షం  స్వామివారి గర్భాలయం పక్కనే ఉంటుంది. 
జంబు వృక్షాల వనం మరియు మహర్షి తపమాచరించిన ప్రదేశంగా జంబుకేశ్వరం అని పిలవబడుతోంది. అక్కడ కొలువు తీరిన లింగరాజు శ్రీ జంబుకేశ్వరునిగా పిలవబడుతున్నారు. 











ఆలయ విశేషాలు 

శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ప్రధమ స్థానంలో ఉన్న శ్రీ రంగనాధ స్వామి ఆలయానికి చేరువలో ఉన్న శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయం ఒక సుందర,రమణీయ, అద్భుత నిర్మాణం గా పేర్కొనబడుతున్నది. 
ఈ రెండు ఆలయాలు దరిదాపుగా ఒకే కాలంలో నిర్మించినా జంబుకేశ్వర ఆలయంలోని శిల్ప కళ
 రంగనాథుని ఆలయంలో కనపడదు. 
సుమారు  పద్దెనిమిది ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో అయిదు ప్రాకారాలతో ఏడు గోపురాలతో ఎన్నో మండపాలతో అలరారుతుంటుందీ ఆలయం. తమిళనాడులో మొత్తం ఎనిమిది ఆలయాలలో వెయ్యి కాళ్ళ మండపాలుఉన్నాయి . వాటిల్లో జంబుకేశ్వర ఆలయం ఒకటి. ప్రాంగణాలు అన్నింటిలో కలిపి మొత్తం తొమ్మిది కోనేరులు ఉంటాయి.అవి బ్రహ్మ, శ్రీమాత, ఇంద్ర, చంద్ర, రామ, అగ్ని, అగస్థ్య, జంబు మరియు సూర్య తీర్థాలు.  
సహజంగా ప్రాకారాల గణన అన్నింటికన్నా లోపల గర్భాలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణ పధంతో 
ప్రారంభం అవుతుంలేకపోవడం ది. కానీ మన సౌలభ్యం కొరకు వెలుపలి నుండి ప్రాకారాలను లెక్క పెట్టుకొందాము. అప్పుడు ఆలయం గురించి పూర్తిగా సులభంగా గ్రహించగలము. 

విభూది ప్రాకారం 

సుమారు ఒక మైలున్నారు పొడుగు, ముప్పై అయిదు అడుగుల ఎత్తు, ఆరు అడుగుల వెడల్పుతో అన్నింటికన్నా వెలుపల ఉండే ప్రాకారాన్ని "విభూధి ప్రాకారం" అని పిలుస్తారు. దీనిని స్వయంగా శ్రీ జంబుకేశ్వరుడే దగ్గర ఉండి నిర్మించుకొన్నారట. రాజు వద్ద నిధులు లేకపోవడంతో పని వారికి ఇవ్వడానికి ధనం లేకపోవడంతో పరమేశ్వరుని ఆదేశం మేరకు అందరికి విభూధి ఇచ్చారట రాజు. వారు ఇండ్లకు పోయి చూసుకొంటే విభూధి స్థానంలో  బంగారు నాణేలు ఉన్నాయట. ఈ కారణంగా దీనిని విభూధి ప్రాకారం అని పిలుస్తారు. 
దీనికి పడమర పక్కన ఏడు  అంతస్థుల రాజగోపురం ఉంటుంది. తూర్పున  పదమూడు అంతస్థుల రాజ గోపురం కనపడుతుంది. 





















రెండో ప్రాకారం 

వెలుపలి నుండి ప్రాంగణం లోనికి వెళ్లే క్రమంలో వచ్చే రెండవ ప్రాకారాన్ని నిర్మించినది మదురై ని పాలించిన జటవర్మన్ సుందర పాండ్య పదమూడవ శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసన ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా ఈ ప్రాకారానికి తూర్పున ఉన్న ఏడు అంతస్థుల గోపురాన్ని సుందర పాండ్య గోపురం అని పిలుస్తారు. ఈ ప్రాకారంలో ఏడు వందల తొంభై ఆరు స్తంభాల మండపం, నిరంతర నీటి ప్రవాహ ధార ఏర్పాటు చేయబడ్డ పుష్కరణి కనపడతాయి. ద్వారం పక్కనే ప్రధమ పూజితుడు శ్రీ వినాయకుడు కొలువైన సన్నిధి ఉంటుంది. లోనికి వెళ్లే మార్గంలో కనపడే తొలి సన్నిధి ఇదే !

 మూడో ప్రాకారం 

సుందర పాండ్య ప్రాకారం తరువాత వచ్చేది విక్రమ చోళుడు పన్నెండో శతాబ్దంలో నిర్మించాడు. దీనికి తూర్పు  పడమరలలో రెండు గోపురాలుంటాయి.  తూర్పున ఉన్న  గోపురాన్ని మల్లప్పన్ గోపురం అంటారు. 
ద్వారానికి ఇరుపక్కలా ఆది దంపతుల ముద్దు బిడ్డలైన శ్రీ గణపతి శ్రీ కుమార స్వామి కొలువై ఉంటారు. చిన్న చిన్న మండపాలతో పాటు పెద్ద కొబ్బరి చెట్ల తోపు ఈ ప్రాకారంలో కనపడుతుంది. 

నాలుగో ప్రాకారం 

లోపలి నుండి రెండో ప్రాకారం అయిన ఇక్కడి నుండి ఆలయ శిల్ప శోభ , నిర్మాణ విలువలు కనపడతాయి. ఇక్కడి అరియ విట్టన్ గోపురాన్ని ఆనుకొని నిర్మించిన మండపానికి ఏక శిల స్తంభాలను అమర్చారు. వీటి మీద చెక్కిన శిల్పాలు, పన్నెండు రాశుల మూర్తులు, రాతి గొలుసులు ఆకర్షిస్తాయి. పడమరన ఉండే కార్తీక గోపురాన్ని మూడవ కుళోత్తుంగ చోళుడు నిర్మించాడు. 
ఈ ప్రాకార వాయువ్య మూలాన ఉండే వెయ్యి కాళ్ళ మండపం రధం ఆకారంలో స్తంభాల పైన సుందర శిల్పాలతో ఎంతో సుందరంగా ఉంటుంది. నైరుతిలో వంద కాళ్ళ మండపాన్ని, త్రిమూర్తి ,వసంత,సోమస్కంద మరియు ఊంజల్ మండపాలు కూడా ఇక్కడే ఉంటాయి.  
ఇంద్ర తీర్థంతో పాటు ఎన్నో ఉపాలయాలు ఈ ప్రాకారంలో కనపడతాయి. 
జంబు తీర్థం ఒడ్డున శ్రీ వల్లభ గణపతి సన్నిధి, పెద్ద కుబేర లింగం, చిన్నదైన శ్రీజంబుకేశ్వర లింగం, శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంటాయి. 











శ్రీ అఖిలాండేశ్వరి దేవి సన్నిధి 

 శ్రీ జంబులింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగా ప్రత్యేక ధ్వజస్థంభం, నంది మండపం కలిగి ఉన్న అమ్మవారి సన్నిధి ఈ ప్రాకారంలో కనపడుతుంది. అమ్మవారికి ఎదురుగా శ్రీ గణపతి కొలువై ఉంటారు. ఈ రెండు ఆలయాలు కలిపి ఓంకార ఆకారంలో ఉండటం విశేషం. 
తొలుత అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉండేదట. జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారికి ఎదురుగా కుమార గణపతిని, చెవులకు శ్రీ చక్ర చిహ్నాలున్న తాటంకాలను అమర్చడం వలన అమ్మవారు ప్రస్తుతం శాంతా రూపిణిగా దర్శనమిస్తున్నారని చెబుతారు. దీనికి తగినట్లే అమ్మవారు స్దానక భంగిమలో చతుర్భుజాలతో సుందర్ స్వర్ణాభరణ అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. 
రెండు ప్రాకారాల్లో ఉండే శ్రీ అఖిలాండేశ్వరి దేవి ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ సరస్వతి, శ్రీమతులైన రోహిణి, కృత్తికా నక్షత్రాలతో శ్రీ చంద్ర భగవానుడు ఉపాలయాలలో దర్శనమిస్తారు. గోష్ఠ దేవతలుగా ఇచ్ఛ, క్రియ, జ్ఞాన, దుర్గ మరియు చండికేశ్వరి కనిపిస్తారు. 

 శ్రీ జంబుకేశ్వర స్వామి సన్నిధి 

గర్భాలయానికి వెళ్లే క్రమంలో శ్రీ కళ్యాణ సుందర స్వామి, శ్రీ శివగామి సమేత శ్రీనటరాజు, శ్రీ మహాలక్ష్మి, శ్రీ భైరవ, సప్త మాతృకలు, సూర్య, చంద్ర, శ్రీ దక్షిణ మూర్తి, శ్రీ చండికేశ్వర మరియు అరవై మూడు మంది నయనారుల విగ్రహాలను దర్శించుకోవచ్చును. 
ఇక్కడ కనిపించే సహస్ర లింగాన్ని శ్రీ రామచంద్ర మూర్తి రామ రావణ యుద్ధానంతరం వెంటాడుతున్న బ్రహ్మ హత్య పాతకాన్ని తొలగించుకోడానికి సేవించారట. పక్కనే ఆయన ప్రతిష్టించిన మరకత లింగం కూడా కనపడుతుంది. 
నంది మండపం పక్కనే నవగ్రహ మండపం కూడా ఉంటుంది. ఆలయ వృక్షం అయిన జంబు ఫల చెట్టు ఆలయ ఈశాన్య భాగంలో గోడ పక్కనే కనపడుతుంది. 
ప్రధాన లింగం కొలువు తీరిన గర్భాలయానికి ఒక చిన్న అర్ధమండపం మరో చిన్న ముఖ మండపం ఉంటాయి. ముఖ మండపానికి ఉన్న తొమ్మిది రంధ్రాల రాతి కిటికీ గుండా స్వరి జంబులింగేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ప్రత్యేక దర్శనం సంధర్బంగానే తప్ప అర్ధ మండపం నుండి స్వామిని దర్శించుకొని అవకాశం భక్తులకు లభించదు. 
రాతి కిటికీకి ఎదురుగా అమ్మవారు శ్రీ పార్వతీ దేవి కొలువై ఉంటారు. 
గర్భాలయంలో రాగి వర్ణపు లింగ రూపంలో కొద్దిగా ఎత్తైన పానువట్టం మీద శ్రీ జంబులింగేశ్వర స్వామి దర్శనమిస్తారు. పానువట్టానికి నిరంతరం తెల్లని వస్త్రం కట్టి ఉంచుతారు. క్రింద నుండి ఉద్భవించే నీటి ధార వలన ఆ వస్త్రం ఎప్పుడూ తడిగానే ఉంటుంది. ఆ పవిత్ర జలాన్ని భక్తులకు ఇస్తారు. 
కావేరి నదీ పాయ ఒకటి లింగం క్రింద నుండి ప్రవహిస్తూ నిరంతరం లింగరాజును అభిషేకిస్తుంది అన్నది భక్తుల విశ్వాసం. 

చారిత్రక ఆధారాలు 

చరిత్రను మనకు తెలిపేవి ప్రధానంగా  శాసనాలే ! వాటి తరువాత వివిధ కాలాలలో నిర్మించబడిన నిర్మాణాలు.  గర్భాలయాన్ని తొలుత  నిర్మించినది కొచ్చెంగనన్ చోళుడు  అన్న విషయాన్ని నిరూపించడానికి వేరే ఆధారాలు లేవు. కానీ ఆయన తరవాతి తరం చోళ రాజులు గర్భాలయ సమీపంలో ఆయన సన్నిధిని ఏర్పాటు చేశారు. అలానే మండప స్తంభాల పైన వాటిని నిర్మించిన రాజుల శిల్పాలు కూడా కనపడతాయి. 
ఇక శాసనాల విషయానికి వస్తే చోళులు, పాండ్యులు, హొయసల, విజయనగర మరియు మదురై నాయక రాజుల కాలాల నాటి శిలా శాసనాలు ఎన్నో ఈ ఆలయంలో కనపడతాయి. వీటిల్లో వారు ఈ ఆలయాభివృద్దికి వారు చేసిన కృషి సమర్పించుకొన్న కైంకర్యాలు వివరాలుంటాయి. 









ఆలయ ఉత్సవాలు 

నిత్యం శైవాగమ సిద్ధాంతం ప్రకారం ఆరు పూజలు నిర్వహిస్తారు. ప్రతి రోజు ఒక విశేష పూజ  జరుగుతుంది ఆలయంలో. ప్రతి నెల ఒక ఉత్సవం చోటు చేసుకొంటుంది. త్రయోదశి నాడు ప్రదోష పూజ, మాస శివరాత్రి నాడు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. అన్నింటి లోనికి మధ్యాహన్నం నిర్వర్తించే పూజ ప్రత్యేకమైనది. అమ్మవారు సదాశివునికి మధ్యహాన్న పూజ చేసేవారన్న విశ్వాసంతో దీనిని నిర్వహిస్తారు. స్వామితో పాటు అరుదైన జాతికి చెందిన నల్ల ఆవుకు కూడా పూజ చేస్తారు. ఈ సందర్బంగా పూజారి ఒకరు చీర ధరించి అమ్మవారి ప్రతి రూపంగా స్వామికి మధ్యాహన్నం పూజలు చేస్తారు. 
ఆది పూరం, శివరాత్రి, గణేష చతుర్థి, దీపావళి, దసరా నవరాత్రులు, కార్తీక మాస పూజలు, శుక్రవారం పూజలు ఇలా ఎన్నో శ్రీ అఖిలాండేశ్వరి సమేత శ్రీ జంబుకేశ్వర స్వామి వారి ఆలయంలో. వీటిల్లో  అప్పాసి నెల(అక్టోబర్ - నవంబర్) నెలలో జరిగే అన్నాభిషేకం విశేషమైనది. ఏ అన్నాభిషేకాన్ని వైశాఖ మాసంలో కూడా చేస్తారు కానీ వర్షాలు ఎక్కువగా కురిసే ఆ రోజులలో లింగం క్రింద నుండి వచ్చే నీటి ధార ఎక్కువగా ఉంటుంది. అందువలన దానికి బదులుగా భస్మాభిషేకం జరుపుతారు. 
నయనారులలో ముఖ్యులైన తిరుజ్ఞాన సంబంధార్, అప్పార్ , సుందరార్ గానం చేసిన పాటికాల కారణంగా జంబుకేశ్వరం రెండువందల డెబ్భై అయిదు పడల్ పెట్ర స్థలాలలో ఒకటిగా శాశ్విత కీర్తిని పొందినది. 
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు ఆలయ ప్రవేశానికి భక్తులకు అవకాశం ఉంటుంది. 
శ్రీ రంగంలో ఉన్న శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయానికి చేరుకోడానికి దేశం నలుమూలల నుండి రైలు సౌకర్యం తిరుచునాపల్లి కి కలదు. అన్ని రైళ్లు శ్రీ రంగం స్టేషన్ లో కూడా ఆగుతాయి. 
తిరుచునాపల్లికి విమాన మార్గం కూడా ఉన్నది. తిరుచ్చి పట్టణంలోనూ,  చుట్టుపక్కల ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. 
వసతికి అందుబాటు ధరలలో లాడ్జీలు లభిస్తాయి. 

నమః శివాయ !!!!

































 
   

Sri Abirameshwara Temple, Thiruvamattur

       శ్రీ అభిరామేశ్వర స్వామి ఆలయం, తిరువామత్తూర్ 



నయనారులు పాటికాలు గానం చేసిన రెండువందల డెబ్భై అయిదు పడాల్ పెట్ర స్థలాలలో ఒకటి  శ్రీ అభిరామేశ్వర స్వామి అమ్మవారు శ్రీ ముతాంబికై తో కొలువైన దివ్య క్షేత్రం తిరువామత్తూర్. 
ఎన్నో పౌరాణిక విశేషాలకు నిలయమీ ఆలయం. 

పురాణ గాధ 

దక్షిణ పెన్నా నదిగా ప్రసిద్ధికెక్కిన పాలరు నది ఉప నది అయిన పంపా నదీతీరంలో ఉన్న ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్న గాధ తొలి యుగం నాటిదిగా తెలుస్తోంది. 
భృంగి మహర్షి పరమ శివ భక్తుడు. ఒకసారి స్వామివారి దర్శనార్ధం కైలాసానికి వెళ్లారట. ఆది దంపతులు ఏకాంతంలో ఉన్నారని నంది మహర్షిని కైలాసం లోనికి అనుమతించలేదు. పైగా హేళన చేసాడట. 
ఆగ్రహించిన మహాముని ఎలాగైనా శివ దర్శనం చేసుకోవాలని తలంచి తపశ్శక్తితో ఈగగా మారి స్వామివారి ఏకాంత మందిరం చేరి కనులు మూసుకొని ఒక్క స్వామివారికి మాత్రమే ప్రదక్షిణ చేసి వెళ్లిపోయారట. 
విషయం తెలుసుకొన్న పార్వతీదేవి ఆగ్రహించి భృంగిని వన్ని వృక్షంగా మారిపొమ్మని శపించినదట. వన్నివృక్షం అనగా జమ్మి చెట్టు. 
సదాశివుడు అమ్మవారిని శాంత పరచి భృంగి యొక్క శివ భక్తిని ఆమెకు తెలిపారట. ఆమె సంతృప్తి చెంది స్వామితో కలిసి భూలోకంలో వన్ని చెట్టుగా ఉన్న మహర్షికి సాక్షాత్కారమిచ్చి శాపం తొలగించారట. 
తన ఎదుట నిలచిన పార్వతీ పరమేశ్వరులు స్తుతించి వారివురికీ వన్ని చెట్టు సన్నిహితమైనది కావాలని అదేవిధంగా వారు ఇక్కడ కొలువు తీరాలని కోరారట. రానున్న కాలంలో ఆయన కోరిక నెరవేరుతుంది అని అభయమిచ్చారట ఉమాశంకరులు. 
కొంత కాలానికి ఈ ప్రాంతం జమ్మి చెట్ల వనంగా మారిపోయిందిట. చుట్టుపక్కల ఎందరో గోపాలకులు తమ గోవులను మేత కోసం ఇక్కడకు తోలుకొని వచ్చేవారట. కానీ క్రూరమృగాలు ఆవులకు హాని చేస్తుండేవట. తట్టుకోలేక గోవులన్ని తమ నాయకుడు, సదాశివునికి వాహనుడు అయిన నందీశ్వరుని ప్రార్ధించారట. నంది ఆలమందల వద్దకు కామధేనువుతో కలిసి వచ్చి తమ జాతిని కాపాడేవాడు పశుపతి అని తెలిపి ఆయన సహాయం కొరకు తపస్సు చేద్దామని అన్నారట. ఆవులు, ఎద్దులు అన్నీ నంది మరియు కామధేనువుతో కలిసి తపస్సు ఆరంభించారట. కరుణాసముద్రుడైన కైలాసవాసుడు కనిపించి ఏమి కావాలి అని అడిగారట. దానికి ఆవులు తమకు క్రూరమృగాల నుండి ఎదురవుతున్న ఇక్కట్లను తెలుపుకొన్నాయట. మిమ్ములను మీరు కాపాడుకోడానికి, ఆత్మరక్షణార్థం వాడి అయిన కొమ్ములను మీకు ప్రసాదిస్తున్నాను అని వరం ఇచ్చారట. 
అప్పటి దాకా ఆవులకు కొమ్ములు లేవు శివుని వరం తరువాతనే వాటికి తమను తాము రక్షించుకోడానికి కొమ్ములు ఏర్పడ్డాయని అంటారు. 
గోవులు అనుగ్రహించబడిన స్థలంగా గౌరవ వాచకం తిరు  చేరి "తిరువామత్తూర్" అన్న పేరు ఈ స్థలానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. నందీశ్వరుని కోరిక మేరకు ఆదిదంపతులు ఇక్కడ శాశ్వితంగా కొలువైనారు. అలా భృంగి మహర్షి ఇచ్చిన వరం కూడా నిలిపారు స్వామి. అదే విధంగా జమ్మి చెట్టు ప్రతి శివాలయంలో కనపడుతుంది. దుర్గ నవరాత్రులలో జమ్మి చెట్టుకున్న ప్రాతినిధ్యత మనందరకు తెలిసినదే కదా ! ఈ క్షేత్రంలో జమ్మి చెట్టే ఆలయ వృక్షం. 

శ్రీ రాముడు కొలిచిన లింగం 

సీతాన్వేషణలో హనుమంతుని ద్వారా సుగ్రీవుని కలిసిన శ్రీ రామచంద్ర మూర్తి అతనితో మైత్రీ ఒప్పందం చేసుకొన్నది అమ్మవారి ఆలయంలో ఉన్న "సత్య పాళిగై" మండపంలోని అని అంటారు. నేటికీ అపవాదులు ఎదుర్కొంటున్న వారు ఇక్కడే సత్య ప్రమాణం చేస్తుంటారు.  
శ్రీ రాముడు లంకకు వెళ్లే ముందు విజయం కొరకు, విజయం సాధించి వచ్చిన తరువాత ఏ క్షేత్రంలోని స్వామిని సేవించుకొన్నారని స్థానిక గాధలు వలన అవగతమౌతుంది. అందువలననే స్వామిని "అభిరామేశ్వర స్వామి" అని పిలుస్తారు. 
నయనారులలో అగ్రస్థానంలో ఉన్న నలుగురు నయనారులలో ఒకరైన "అప్పార్" తన పాటికాలలో శ్రీరామునికి శ్రీ అభిరామేశ్వర స్వామి పట్ల గల అభిమానాన్ని ప్రముఖంగా ప్రస్తావించారట.  

అభిష్ట ప్రదాత అభిరామేశ్వరుడు 

భృంగి మహర్షికి లభించిన హోదా, ఆవులకు ఆత్మరక్షణార్థం  కొమ్ములను ప్రసాదించిన ఘటన, శ్రీరాముడు రావణుని మీద సాధించిన విజయం అన్నీ కలిసి స్వామి వారికి అభీష్ట వర ప్రదాత అన్న పేరు స్థిరపడిపోయింది. 
దీనిని నిరూపించే గాధ ఒకటి స్థానికంగా వినపడుతుంది. 
చాలా శతాబ్దాల క్రిందట ఇలం సూర్య మరియు ముడు సూర్య అనే ఇద్దరు బిచ్చగాళ్ళు ఈ ప్రాంతంలో నివసించేవారట. వీరిలో ఇలం అంధుడు. ముడు కుంటి వాడు. వారు అభిరామేశ్వరుని మహాత్యాల గురించి పాటలు పాడుతూ లభించిన దానితో జీవించేవారట. ఒకనాడు వారు పాడుతున్న పాటలో ఒక తప్పు చోటు చేసుకొన్నదిట. అదేమిటంటే శ్రీ అభిరమేశ్వర ఆలయం పంపా నదికి దక్షిణం పక్కన ఉంటుంది. కానీ వీరు పొరబాటున ఉత్తరం పక్కన ఉన్నది అని గానం చేయడంతో అందరూ వారిని గేలి చేశారట. జరిగిన తప్పు తెలుసుకోకుండా ఇలం మరియు ముడు గ్రామస్థులతో వాదనకు దిగి ఆలయం ఉత్తరం ఒడ్డునే ఉన్నది అని నిరూపిస్తాము అంటూ సవాలు చేశారట. 
గ్రామ పెద్ద సమక్షంలో మరునాడు నది ఒడ్డుకు వెళ్ళాలి అని నిర్ణయం జరిగిందిట. 
సవాలు చేసిన తరువాత నిజం అర్ధం చేసుకొన్న ఇలం, ముడు లలో భయం చోటు చేసుకొన్నదట. వేరే దారి లేక తమను కాపాడమని వారు శ్రీ అభిరామేశ్వరుని ప్రార్ధించారట. ఆ రాత్రి ఎప్పుడూ కురవని స్థాయిలో వర్షం కురిసిందట. వాగులు, వంకల నుండి నీరు అధిక మొత్తంలో చేరడం వలన ప్రవాహ వేగం పెరిగి నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకొన్నదట. దానితో ఆలయం నదికి ఉత్తరం పక్కన కనపడిందిట. గ్రామస్తులంతా ఇలం మరియు ముడు లకు స్వామివారిపట్ల గల విశ్వాసానికి అబ్బురపడ్డారట. 
వినాయకుడు, శ్రీ సుబ్రమణ్య స్వామి, పార్వతీ దేవి, అగస్త్య , వశిష్ట, దూర్వాస, భృంగి, పరాశర , విశ్వామిత్ర, వేదవ్యాస, రోమస, నారద, మాతంగ మహర్షులు, అష్టావసులు, నంది ఇక్కడ శ్రీ ముత్తంబికై సమేత శ్రీ అభిరమేశ్వర స్వామిని సేవించుకొన్నారని ఆలయ గాధ తెలుపుతోంది. 
శ్రీ సుబ్రమణ్య స్వామి దేవసేనానిగా నియమించబడిన తరువాత సూరపద్ముని మీదకు దండయాత్రకు తరలి వెళుతూ తల్లితండ్రులను పూజించి "వేల్" ఆయుధాన్ని పొందిన స్థలం ఇదే అని అంటారు. సుబ్రమణ్య భక్తుడైన అరుణగిరినాథర్ ఇక్కడ కొలువైన ఆరాధ్యదైవాన్ని కీర్తిస్తూ కీర్తనలను తన "తిరుపుగళ్" కావ్యంలో రచించారని చెబుతారు. 

ఆలయ విశేషాలు 

గతంలో ఈ ఊరిని గోమాతృపురం, గోమతి పురం, గోమతీశ్వరం అని పిలిచేవారట. శ్రీ ముత్తంబికై సమేత శ్రీఅభిరమేశ్వర స్వామి వార్ల తొలి ఆలయాన్ని పల్లవ రాజులు ఏడో శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. అనంతర కాలంలో చోళులు, హొయసల , పాండ్య మరియు విజయనగర రాజులు ఆలయాభివృద్దికి కృషి చేశారని ఆలయంలో ఉన్న వివిధ కాలాల పాలకులు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత ఆలయాన్ని అచ్యుత దేవ పల్లవ రాజు నిర్మించారు. 
సువిశాల ప్రాంగణంలో ఎదురెదురుగా రెండు రాజగోపురాలు కలిగిన రెండు ఆలయాలుంటాయి. తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలో శ్రీ అభిరామేశ్వరుడు, పడమర ముఖంగా గల సన్నిధిలో అమ్మవారు శ్రీ ముత్తంబికై కొలువై ఉంటారు. రెండు ఆలయాల మధ్య చిన్న రంధ్రం ఉంటుంది. ఆదిదంపతులు ఒకరినొకరు దాని నుండి చూసుకొంటారని అంటారు. 
స్వామివారి ఆలయంలో శ్రీ వినాయక, శ్రీ సుబ్రమణ్య, బ్రహ్మ, విష్ణు, దుర్గ, శ్రీ చండికేశ్వర, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ లక్ష్మి, శ్రీ రామ, శ్రీ భైరవ, సప్తమాతృకలు, శ్రీ బిక్షందార్  కొలువై ఉంటారు. విడిగా నవగ్రహ మండపం ఉన్నది. 
 గర్భాలయంలో శ్రీ అభిరమేశ్వర లింగం పైన ఆవు గిట్టల ముద్ర మరియు ఆవు పాలతో చేసిన అభిషేకం తాలూకు చారలు నేటికీ స్పష్టంగా కనపడతాయి. 
స్వామి వారి ఆలయంలో రెండు గోడల మధ్య గల సన్నని సందు లో చెయ్యి ఉంచి అబద్దం చెబితే చెయ్యి ఇరుక్కొని పోతుందని, నిజం చెప్పిన దాకా రాదని అంటారు. 
వంద స్తంభాల మండపములోని శిల్పాలు సుందరంగా ఉంటాయి. ముఖ్యంగా ఏక శిల మీద చెక్కిన శివ పూజ చేస్తున్న వినాయకుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు హనుమత్ సమేత శ్రీసీతారాముల శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. 
పడమర ముఖంగా ఉన్న ఆలయంలో శ్రీ ముత్తంబికై లేదా శ్రీ అళగియ నాయకి స్థానిక భంగిమలో దర్శనమిస్తారు. అమ్మవారి ఛాతీ మీద సర్పం తాలూకు తోక భాగం ఉంటుంది. అభిషేక సమయంలో చూడవచ్చును. సత్య పాళిగై మండపంలో, నలుచదరపు విశేష లింగం అయిన "తిరువత్తుపరై" వద్ద చేసుకొన్న ఒప్పందాన్ని గౌరవించక పోయినా, తెలిసి అసత్యం ఆడినా అమ్మవారు వారిని క్షమించదని పాము కాటుకు గురిచేస్తుంది అన్నది స్థానిక విశ్వాసం. 
ఉగ్ర రూపంలో ఉండే అమ్మవారిని శాంతిపచేయడానికి జగద్గురు శ్రీ ఆది శంకరులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్టించారని చెబుతారు. 
స్వామివారి గర్భాలయానికి ఎదురుగా మండపంలో పెద్ద నంది విగ్రహం ఉంటుంది. మరో చిన్న నంది భూమి లోనికి ఉంటుంది. పాతాళ నంది అని పిలుస్తారు. సరైన సమయానికి వర్షాలు పడకపోతే పాతాళ నందీశ్వరుని  నీటితో ముంచేస్తారు. అలా చేస్తే వానలు పడతాయని నమ్మకం. 
ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా శ్రమకు తగ్గ ఫలితం లభించక పోతే తగిన మార్గం చూపించమని అర్ధించడానికి, అవివాహితులు వివాహం కావాలని, సంతానం లేనివారు సంతానం కొరకు వస్తుంటారు. 
శ్రీ ముత్తంబికై సమేత శ్రీ అభిరామేశ్వర స్వామివార్లకు అభిషేకం జరిపిస్తే ఆలుమగల మధ్య గల అపోహలు తొలగిపోతాయి, ఇద్దరూ తిరిగి ఒకటి అవుతారని అంటారు. 
త్రయోదశి ప్రదోష పూజలు,మాసశివరాత్రి,  అమావాస్య,పౌర్ణమి పూజలు జరుగుతాయి. అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి  రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తులకు దర్శనం లభిస్తుంది. ఫాల్గుణ మాసంలో పది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. 
నయనారులలో అగ్రగణ్యులైన అప్పర్, సంబందర్, సుందరార్ శ్రీ అభిరామేశ్వర స్వామిని కీర్తిస్తూ పాటికాలు గానం చేశారు. ఈ గానం వలన శ్రీ అభిరామేశ్వర స్వామి ఆలయం రెండువందల డెబ్భై అయిదు పడల్  పెట్ర స్థలాలలో ఒకటి స్థిరపడింది. ఈ క్షేత్రానికి సమీపంలో ఇతర పడల్ పెట్ర స్థలాలైన "తిరువెన్నయి నల్లూరు , తిరుతురైయూరు, తిరువదిగై, తిరుమంది చరం, తిరునవలూరు" ఉన్నాయి. విల్లుపురం నుండి కారులో బయలుదేరితే ఒక్కరోజులో అన్ని ఆలయాలను సందర్శించుకోవచ్చును.  
ఈ విశేష క్షేత్రం విల్లుపురం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆటోలు, బస్సులు లభిస్తాయి. కానీ వసతి సౌకర్యాలకు విల్లుపురం మీద ఆధారపడాలి. 

నమః శివాయ !!!!!


 
 
  

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...