జగన్మోహనం జగన్మోహన స్వామి రూపం
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరం దగ్గర జన్మించినది ఈ నది. జన్మస్థలమైన మహారాష్ట్ర నుండి తన ప్రయాణాన్ని ఆరంభించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘర్, ఒడిషా రాష్ట్రాల గుండా ప్రవహించి చివరికి మన రాష్ట్రంలోని గోదావరి జిల్లాలలో సముద్రంతో సంగమిస్తుంది ఈ పవిత్ర నదీమ తల్లి.
స్వయం గంగాధరుని జటాజూటాల నుండి జాలువారి భారత దేశంలోని అనేక రాష్ట్రాలలోని లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ ప్రవహించే పరమ పావన గంగా నది తరువాత అంతటి ప్రాముఖ్యం గల నది గోదావరి. పై సమాచారం ఆ నది గురించే !
మన దేశంలో రెండవ పెద్ద నదిగా సుమారు పదిహేను వందల కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ అయిదు రాష్ట్రాల లోని ఎన్నో వేల ఎకరాలను సాగు భూములుగా మారుస్తూ, వందల నగరాల ప్రజల దాహార్తిని తీరుస్తుంది గోదావరి తల్లి.
ప్రతి నదీ తీరంలో మాదిరిగానే గోదావరి తీరం కూడా కొన్ని వందల పుణ్య తీర్థ ధామాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రం లోని ఉభయ గోదావరి జిల్లాలలో అనేక పురాణ, చారిత్రక విశేషాలు కలిగిన క్షేత్రాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో దేశంలో మరెక్కడా కనపడని ఒక ప్రత్యేక ఆలయం ఒకటి గోదావరి తీరంలో తొలి యుగం నుండి ఉన్నట్లుగా తెలుస్తోంది.
అదే శ్రీ జగన్మోహన స్వామి కొలువు తీరిన "ర్యాలి".
ముందు శ్రీ జగన్మోహన స్వామిగా, వెనుక జగన్మోహినిగా ఒకే విగ్రహంలో శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దర్శనమిచ్చే మరో ఆలయం మరెక్కడా కనపడదు.
గతంలో "రత్నగిరి" అని పిలవబడిన ఈ క్షేత్రం నేడు ర్యాలి అని పిలవబడడానికి, శ్రీ మన్నారాయణుడు ఇలాంటి విశేష రూపంలో ఇక్కడ దర్శనమివ్వడానికి సంబంధించిన గాధ కృత యుగంలో జరిగిన క్షీర సాగర మధన సమయం నాటిదిగా ఆలయ పురాణ గాధ తెలుపుతోంది.
పౌరాణిక గాధ
తమ మధ్య ఉన్న వైరత్వ భావాన్ని అవసరార్ధం చేతులు కలిపి చేపట్టిన కార్యక్రమం పాల సముద్ర మధనం. అమరత్వాన్ని అందించే అమృతం కొరకు వీరు తాత్కాలికంగా ఏకమైనారు. మంధర పర్వతాన్ని కవ్వంగా , వాసుకిని తాడుగా చేసుకొని వారు చేపట్టిన సాగర మధనానికి శ్రీహరి కూర్మావతారం ధరించి మంధర పర్వతం మునిగి పోకుండా తన వంతు సహకారం అందించారు.
ఐరావతం, కామధేనువు, చంద్రుడు, శ్రీ మహాలక్ష్మి, హాలాహలం ఇలా ఒకదాని తరువాత మరొకటి వచ్చి చివరగా అమృత భాండం తీసుకొని శ్రీ ధన్వంతరి ఆవిర్భవించారు.
అప్పటి దాకా ఒకటిగా శ్రమించిన దేవదానవుల మధ్య తిరిగి కలహం చోటు చేసుకున్నది. ఎవరికి వారు అమృతాన్ని పొందాలన్న ఉద్దేశ్యంతో పోరుకు సిద్ధం అవ్వసాగారు. సృష్టికర్త, లయకారుడు దేవేంద్రునితో కలిసి వైకుంఠవాసుని సహాయం చేయమని ప్రార్ధించారు. వారి కోరికను మన్నించిన మహా విష్ణువు అతిలోక సౌందర్యాన్ని కలిగిన మోహిని అవతారాన్ని ధరించారు.
విష్ణు పురాణం ప్రకారం లోకకల్యాణం కొరకు శ్రీహరి ధరించిన అవతారాలు ఇరవై నాలుగు అని తెలుస్తోంది. కానీ భక్త సమాజంలో అధిక గుర్తింపు పొందినవి మాత్రం దశావతారాలు.
వాదులాడుకొంటున్న దేవదానవులు తమ ముందు ప్రత్యక్షమైన భువనైక సుందరిని చూసి చేష్టలుడిగి పోయారు. అంతా అమృతం గురించి మర్చిపోయారు. ప్రతి ఒక్కరూ జగన్మోహిని దృష్టిని ఆకర్షించడానికి తాపత్రయ పడసాగారు.
దానిని ఆసరాగా తీసుకొని మాయామోహిని రాక్షస మూకలను మరింత ప్రలోభపరుస్తూ అమృతాన్ని దేవతలకు పంచసాగింది. ఆమె క్రీగంటి చూపులకు దానవులు అందరూ దాసోహమన్నా "స్వరభాను" అనే దానవుడు మాత్రం తమకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి దేవతా రూపం ధరించి అమృతాన్ని స్వీకరించాడు.
అది గమనించిన సూర్య చంద్రులు మోహినిని అప్రమత్తం చేయగా ఆమె సుదర్శన చక్రంతో వానిని రెండుగా ఖండించింది. కానీ అమృత ప్రభావంతో ఆ రెండు భాగాలు సజీవంగా ఉండిపోయాయి. వారే రాహుకేతువులు. వీరే సూర్య చంద్ర గ్రహణాలు కారణం అంటారు. అది వేరే కధ.
ఎప్పుడైతే స్వరభాను మీద చక్ర ప్రయోగం జరిగిందో అప్పుడే రాక్షసులను ఆవహించిన మాయ తొలగిపోయింది. కానీ అప్పటికే జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది. అమృతాన్ని స్వీకరించిన దేవతల ముందు నిలువలేక దానవులు పలాయనం చిత్తగించారు.
తాను వచ్చిన పని పూర్తి కావడంతో మోహిని వెళ్ళడానికి సిద్ధం అయ్యింది. ఆమె అద్భుత సౌందర్యానికి చలించిన కైలాసవాసుడు ఆమె చేతిని పట్టుకొన్నాడట. చేతిని వెనక్కి తీసుకొనే క్రమంలో చోటు చేసుకొన్న పరిణామం కారణంగా ఆమె కర్ణాభరణం నెల రాలిందట.
మోహిని దానిని తీసుకోకుండా ముందుకు వెళుతూ వెనక్కు తిరిగి మహేశ్వరుని చూసి నవ్విందట. దానితో ఆయన మీద ప్రభావం చూపిన మాయ తొలగిపోయిందట. సత్యం అవగతమై స్థాణువుగా మారిపోయారట సర్వేశ్వరుడు. ఈ కారణంగా శ్రీ జగన్మోహన స్వామి ఆలయం, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం ఎదురెదురుగా ఉంటాయి.
అలా జగన్మోహిని కర్ణాభరణం రాలిన ప్రదేశం ఇదే అని అంటారు. అలా "ర్యాలి" అన్న పేరు స్థిరపడి పోయింది.
అపురూపం జగన్మోహనుని రూపం
అయిదు అడుగుల సాలగ్రామ శిలా రూపంలో స్థానిక భంగిమలో కొలువైన శ్రీ జగన్మోహన స్వామి రూపం నయన మనోహరంగా కనపడుతుంది. విధాత బ్రహ్మ ప్రతిష్టగా పేర్కొంటారు.
చతుర్భుజాలతో శంఖ , చక్ర , గద ధరించి అభయ హస్తంతో చిరు మందహాసంతో శ్రీ జగన్మోహన స్వామి కనపడతారు.
అర్చక స్వామి నేతి దీపపు వెలుగులో చూపించే పృష్ఠ భాగంలో కనిపించే జగన్మోహిని రూపం సంభ్రమ కలిగిస్తుంది. సన్నని నడుము, తీర్చిదిద్దినట్లుగా కనపడే కేశాలంకరణ కొప్పు, కేశాలు చక్కని చీర కట్టు,చేతి వేళ్ళు వాటి గోర్లు అత్యంత సహజంగా కనిపిస్తాయి.
నేతి దీపపు కాంతిలో సుందర నల్లనయ్య రూపం మెరుస్తూ మైమరపిస్తుంది. శ్రీ జగన్మోహన స్వామికి ఇరువైపులా శ్రీ దేవి భూదేవి అమ్మవార్లు ఉండటం మరింత విశేషం. మకర తోరణం మీద వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులను, స్వామి వాహనమైన గరుత్మంతుని, శ్రీరామ బంటు అయిన హనుమంతుని, దశావతారాలను జీవం ఉట్టిపడేలా మలిచారు.
నఖశిఖ పర్యంతం నేత్రపర్వంగా దర్శనమిచ్చే శ్రీ జగన్మోహన స్వామి దివ్య మంగళ శిలా రూపాన్ని చూసి మానవమాత్రులమైన మనం మైమరచిపోతాం. జీవమున్న శ్రీ జగన్మోహిని రూపాన్ని వీక్షించిన పరమేశ్వరుడు ఇతరులు మాయలో పడిపోవడంతో ఏమాత్రం ఆశ్చర్యం లేదనిపిస్తుంది.
విష్ణు పాదోద్భవ గంగ
గోదావరి తీరంలో వెలసిన శ్రీ జగన్మోహన స్వామి పాదాల నుండి నిరంతరం జలం ఊరుతుంటుంది. దీనినే విష్ణు పాదోద్భవ గంగ అని పిలుస్తారు. జలశిల అని కూడా అంటారు. ఈ జలాన్ని తీర్థంగా భక్తులకు ఇస్తారు.
ఆలయ ప్రాంగణంలో దశావతార శిల్పాలు కనువిందు చేస్తాయి.
శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి
హరిహర క్షేత్రమైన ర్యాలిలో శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి శ్రీ జగన్మోహన స్వామివార్ల ఆలయాలు ఎదురెదుగా ఉంటాయి.
బ్రహ్మదేవుడు లింగాన్ని ప్రతిష్టించిన అనంతరం తన కమండలం లోని పవిత్ర జలంతో తొలి అభిషేకాన్ని నిర్వహించారట. అందువలన ప్రత్యేక సన్నిధిలో కొలువైన శ్రీ ఉమాదేవితో కలిపి స్వామిని శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి అని పిలుస్తారు.
ఆలయ చరిత్ర
గోదావరి నదీ దక్షిణ తీరం లోని ఈ ప్రదేశం గతంలో పెద్ద అడవి అని అంటారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని చోళ రాజులు పాలించేవారట. పదకొండవ శతాబ్దంలో శ్రీ విక్రమ దేవ చోళుడు ఈ ఆలయాలను నిర్మించినట్లుగా చరిత్ర తెలుపుతోంది.
అనంతరం చాళుక్యులు, విజయనగర రాజులు ఆలయానికి ఎన్నో కైంకర్యాలను సమర్పించుకొన్నారట.
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి
రాత్రి ఎనిమిది గంటల వరకూ తెరిచి ఉండే ఈ ఆలయాలలో ప్రతి నిత్య పూజలు జరుగుతాయి. హిందూ పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు.
శివరాత్రికి పెద్ద ఉత్సవం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
చెన్నై కోల్కతా ప్రధాన రహదారి మీద ఉన్న రావుల పాలెం కి చాలా సమీపంలో ఉంటుంది ర్యాలి. చేరుకోడానికి ఆటోలు, కార్లు లాంటి ప్రెవేటు వాహనాలు లభిస్తాయి. వసతి సౌకర్యాలు రాజమండ్రి, రావుల పాలెంలో లభిస్తుంది.
చుట్టుపక్కల ఎన్నో విశేష ఆలయాలున్నాయి. అన్నీ దర్శనీయాలే !
Pandit Sairam is an expert in performing readings and reveal things about your future and past.
రిప్లయితొలగించండిBest Psychic in New York
Pandit Bhairav Ji, a Famous Indian Astrologer has become a dependable name in the field of astrology.
రిప్లయితొలగించండిBest Astrologer in Florida