1, ఫిబ్రవరి 2022, మంగళవారం

Sri Abirameshwara Temple, Thiruvamattur

       శ్రీ అభిరామేశ్వర స్వామి ఆలయం, తిరువామత్తూర్ 



నయనారులు పాటికాలు గానం చేసిన రెండువందల డెబ్భై అయిదు పడాల్ పెట్ర స్థలాలలో ఒకటి  శ్రీ అభిరామేశ్వర స్వామి అమ్మవారు శ్రీ ముతాంబికై తో కొలువైన దివ్య క్షేత్రం తిరువామత్తూర్. 
ఎన్నో పౌరాణిక విశేషాలకు నిలయమీ ఆలయం. 

పురాణ గాధ 

దక్షిణ పెన్నా నదిగా ప్రసిద్ధికెక్కిన పాలరు నది ఉప నది అయిన పంపా నదీతీరంలో ఉన్న ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్న గాధ తొలి యుగం నాటిదిగా తెలుస్తోంది. 
భృంగి మహర్షి పరమ శివ భక్తుడు. ఒకసారి స్వామివారి దర్శనార్ధం కైలాసానికి వెళ్లారట. ఆది దంపతులు ఏకాంతంలో ఉన్నారని నంది మహర్షిని కైలాసం లోనికి అనుమతించలేదు. పైగా హేళన చేసాడట. 
ఆగ్రహించిన మహాముని ఎలాగైనా శివ దర్శనం చేసుకోవాలని తలంచి తపశ్శక్తితో ఈగగా మారి స్వామివారి ఏకాంత మందిరం చేరి కనులు మూసుకొని ఒక్క స్వామివారికి మాత్రమే ప్రదక్షిణ చేసి వెళ్లిపోయారట. 
విషయం తెలుసుకొన్న పార్వతీదేవి ఆగ్రహించి భృంగిని వన్ని వృక్షంగా మారిపొమ్మని శపించినదట. వన్నివృక్షం అనగా జమ్మి చెట్టు. 
సదాశివుడు అమ్మవారిని శాంత పరచి భృంగి యొక్క శివ భక్తిని ఆమెకు తెలిపారట. ఆమె సంతృప్తి చెంది స్వామితో కలిసి భూలోకంలో వన్ని చెట్టుగా ఉన్న మహర్షికి సాక్షాత్కారమిచ్చి శాపం తొలగించారట. 
తన ఎదుట నిలచిన పార్వతీ పరమేశ్వరులు స్తుతించి వారివురికీ వన్ని చెట్టు సన్నిహితమైనది కావాలని అదేవిధంగా వారు ఇక్కడ కొలువు తీరాలని కోరారట. రానున్న కాలంలో ఆయన కోరిక నెరవేరుతుంది అని అభయమిచ్చారట ఉమాశంకరులు. 
కొంత కాలానికి ఈ ప్రాంతం జమ్మి చెట్ల వనంగా మారిపోయిందిట. చుట్టుపక్కల ఎందరో గోపాలకులు తమ గోవులను మేత కోసం ఇక్కడకు తోలుకొని వచ్చేవారట. కానీ క్రూరమృగాలు ఆవులకు హాని చేస్తుండేవట. తట్టుకోలేక గోవులన్ని తమ నాయకుడు, సదాశివునికి వాహనుడు అయిన నందీశ్వరుని ప్రార్ధించారట. నంది ఆలమందల వద్దకు కామధేనువుతో కలిసి వచ్చి తమ జాతిని కాపాడేవాడు పశుపతి అని తెలిపి ఆయన సహాయం కొరకు తపస్సు చేద్దామని అన్నారట. ఆవులు, ఎద్దులు అన్నీ నంది మరియు కామధేనువుతో కలిసి తపస్సు ఆరంభించారట. కరుణాసముద్రుడైన కైలాసవాసుడు కనిపించి ఏమి కావాలి అని అడిగారట. దానికి ఆవులు తమకు క్రూరమృగాల నుండి ఎదురవుతున్న ఇక్కట్లను తెలుపుకొన్నాయట. మిమ్ములను మీరు కాపాడుకోడానికి, ఆత్మరక్షణార్థం వాడి అయిన కొమ్ములను మీకు ప్రసాదిస్తున్నాను అని వరం ఇచ్చారట. 
అప్పటి దాకా ఆవులకు కొమ్ములు లేవు శివుని వరం తరువాతనే వాటికి తమను తాము రక్షించుకోడానికి కొమ్ములు ఏర్పడ్డాయని అంటారు. 
గోవులు అనుగ్రహించబడిన స్థలంగా గౌరవ వాచకం తిరు  చేరి "తిరువామత్తూర్" అన్న పేరు ఈ స్థలానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. నందీశ్వరుని కోరిక మేరకు ఆదిదంపతులు ఇక్కడ శాశ్వితంగా కొలువైనారు. అలా భృంగి మహర్షి ఇచ్చిన వరం కూడా నిలిపారు స్వామి. అదే విధంగా జమ్మి చెట్టు ప్రతి శివాలయంలో కనపడుతుంది. దుర్గ నవరాత్రులలో జమ్మి చెట్టుకున్న ప్రాతినిధ్యత మనందరకు తెలిసినదే కదా ! ఈ క్షేత్రంలో జమ్మి చెట్టే ఆలయ వృక్షం. 

శ్రీ రాముడు కొలిచిన లింగం 

సీతాన్వేషణలో హనుమంతుని ద్వారా సుగ్రీవుని కలిసిన శ్రీ రామచంద్ర మూర్తి అతనితో మైత్రీ ఒప్పందం చేసుకొన్నది అమ్మవారి ఆలయంలో ఉన్న "సత్య పాళిగై" మండపంలోని అని అంటారు. నేటికీ అపవాదులు ఎదుర్కొంటున్న వారు ఇక్కడే సత్య ప్రమాణం చేస్తుంటారు.  
శ్రీ రాముడు లంకకు వెళ్లే ముందు విజయం కొరకు, విజయం సాధించి వచ్చిన తరువాత ఏ క్షేత్రంలోని స్వామిని సేవించుకొన్నారని స్థానిక గాధలు వలన అవగతమౌతుంది. అందువలననే స్వామిని "అభిరామేశ్వర స్వామి" అని పిలుస్తారు. 
నయనారులలో అగ్రస్థానంలో ఉన్న నలుగురు నయనారులలో ఒకరైన "అప్పార్" తన పాటికాలలో శ్రీరామునికి శ్రీ అభిరామేశ్వర స్వామి పట్ల గల అభిమానాన్ని ప్రముఖంగా ప్రస్తావించారట.  

అభిష్ట ప్రదాత అభిరామేశ్వరుడు 

భృంగి మహర్షికి లభించిన హోదా, ఆవులకు ఆత్మరక్షణార్థం  కొమ్ములను ప్రసాదించిన ఘటన, శ్రీరాముడు రావణుని మీద సాధించిన విజయం అన్నీ కలిసి స్వామి వారికి అభీష్ట వర ప్రదాత అన్న పేరు స్థిరపడిపోయింది. 
దీనిని నిరూపించే గాధ ఒకటి స్థానికంగా వినపడుతుంది. 
చాలా శతాబ్దాల క్రిందట ఇలం సూర్య మరియు ముడు సూర్య అనే ఇద్దరు బిచ్చగాళ్ళు ఈ ప్రాంతంలో నివసించేవారట. వీరిలో ఇలం అంధుడు. ముడు కుంటి వాడు. వారు అభిరామేశ్వరుని మహాత్యాల గురించి పాటలు పాడుతూ లభించిన దానితో జీవించేవారట. ఒకనాడు వారు పాడుతున్న పాటలో ఒక తప్పు చోటు చేసుకొన్నదిట. అదేమిటంటే శ్రీ అభిరమేశ్వర ఆలయం పంపా నదికి దక్షిణం పక్కన ఉంటుంది. కానీ వీరు పొరబాటున ఉత్తరం పక్కన ఉన్నది అని గానం చేయడంతో అందరూ వారిని గేలి చేశారట. జరిగిన తప్పు తెలుసుకోకుండా ఇలం మరియు ముడు గ్రామస్థులతో వాదనకు దిగి ఆలయం ఉత్తరం ఒడ్డునే ఉన్నది అని నిరూపిస్తాము అంటూ సవాలు చేశారట. 
గ్రామ పెద్ద సమక్షంలో మరునాడు నది ఒడ్డుకు వెళ్ళాలి అని నిర్ణయం జరిగిందిట. 
సవాలు చేసిన తరువాత నిజం అర్ధం చేసుకొన్న ఇలం, ముడు లలో భయం చోటు చేసుకొన్నదట. వేరే దారి లేక తమను కాపాడమని వారు శ్రీ అభిరామేశ్వరుని ప్రార్ధించారట. ఆ రాత్రి ఎప్పుడూ కురవని స్థాయిలో వర్షం కురిసిందట. వాగులు, వంకల నుండి నీరు అధిక మొత్తంలో చేరడం వలన ప్రవాహ వేగం పెరిగి నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకొన్నదట. దానితో ఆలయం నదికి ఉత్తరం పక్కన కనపడిందిట. గ్రామస్తులంతా ఇలం మరియు ముడు లకు స్వామివారిపట్ల గల విశ్వాసానికి అబ్బురపడ్డారట. 
వినాయకుడు, శ్రీ సుబ్రమణ్య స్వామి, పార్వతీ దేవి, అగస్త్య , వశిష్ట, దూర్వాస, భృంగి, పరాశర , విశ్వామిత్ర, వేదవ్యాస, రోమస, నారద, మాతంగ మహర్షులు, అష్టావసులు, నంది ఇక్కడ శ్రీ ముత్తంబికై సమేత శ్రీ అభిరమేశ్వర స్వామిని సేవించుకొన్నారని ఆలయ గాధ తెలుపుతోంది. 
శ్రీ సుబ్రమణ్య స్వామి దేవసేనానిగా నియమించబడిన తరువాత సూరపద్ముని మీదకు దండయాత్రకు తరలి వెళుతూ తల్లితండ్రులను పూజించి "వేల్" ఆయుధాన్ని పొందిన స్థలం ఇదే అని అంటారు. సుబ్రమణ్య భక్తుడైన అరుణగిరినాథర్ ఇక్కడ కొలువైన ఆరాధ్యదైవాన్ని కీర్తిస్తూ కీర్తనలను తన "తిరుపుగళ్" కావ్యంలో రచించారని చెబుతారు. 

ఆలయ విశేషాలు 

గతంలో ఈ ఊరిని గోమాతృపురం, గోమతి పురం, గోమతీశ్వరం అని పిలిచేవారట. శ్రీ ముత్తంబికై సమేత శ్రీఅభిరమేశ్వర స్వామి వార్ల తొలి ఆలయాన్ని పల్లవ రాజులు ఏడో శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. అనంతర కాలంలో చోళులు, హొయసల , పాండ్య మరియు విజయనగర రాజులు ఆలయాభివృద్దికి కృషి చేశారని ఆలయంలో ఉన్న వివిధ కాలాల పాలకులు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత ఆలయాన్ని అచ్యుత దేవ పల్లవ రాజు నిర్మించారు. 
సువిశాల ప్రాంగణంలో ఎదురెదురుగా రెండు రాజగోపురాలు కలిగిన రెండు ఆలయాలుంటాయి. తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలో శ్రీ అభిరామేశ్వరుడు, పడమర ముఖంగా గల సన్నిధిలో అమ్మవారు శ్రీ ముత్తంబికై కొలువై ఉంటారు. రెండు ఆలయాల మధ్య చిన్న రంధ్రం ఉంటుంది. ఆదిదంపతులు ఒకరినొకరు దాని నుండి చూసుకొంటారని అంటారు. 
స్వామివారి ఆలయంలో శ్రీ వినాయక, శ్రీ సుబ్రమణ్య, బ్రహ్మ, విష్ణు, దుర్గ, శ్రీ చండికేశ్వర, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ లక్ష్మి, శ్రీ రామ, శ్రీ భైరవ, సప్తమాతృకలు, శ్రీ బిక్షందార్  కొలువై ఉంటారు. విడిగా నవగ్రహ మండపం ఉన్నది. 
 గర్భాలయంలో శ్రీ అభిరమేశ్వర లింగం పైన ఆవు గిట్టల ముద్ర మరియు ఆవు పాలతో చేసిన అభిషేకం తాలూకు చారలు నేటికీ స్పష్టంగా కనపడతాయి. 
స్వామి వారి ఆలయంలో రెండు గోడల మధ్య గల సన్నని సందు లో చెయ్యి ఉంచి అబద్దం చెబితే చెయ్యి ఇరుక్కొని పోతుందని, నిజం చెప్పిన దాకా రాదని అంటారు. 
వంద స్తంభాల మండపములోని శిల్పాలు సుందరంగా ఉంటాయి. ముఖ్యంగా ఏక శిల మీద చెక్కిన శివ పూజ చేస్తున్న వినాయకుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు హనుమత్ సమేత శ్రీసీతారాముల శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. 
పడమర ముఖంగా ఉన్న ఆలయంలో శ్రీ ముత్తంబికై లేదా శ్రీ అళగియ నాయకి స్థానిక భంగిమలో దర్శనమిస్తారు. అమ్మవారి ఛాతీ మీద సర్పం తాలూకు తోక భాగం ఉంటుంది. అభిషేక సమయంలో చూడవచ్చును. సత్య పాళిగై మండపంలో, నలుచదరపు విశేష లింగం అయిన "తిరువత్తుపరై" వద్ద చేసుకొన్న ఒప్పందాన్ని గౌరవించక పోయినా, తెలిసి అసత్యం ఆడినా అమ్మవారు వారిని క్షమించదని పాము కాటుకు గురిచేస్తుంది అన్నది స్థానిక విశ్వాసం. 
ఉగ్ర రూపంలో ఉండే అమ్మవారిని శాంతిపచేయడానికి జగద్గురు శ్రీ ఆది శంకరులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్టించారని చెబుతారు. 
స్వామివారి గర్భాలయానికి ఎదురుగా మండపంలో పెద్ద నంది విగ్రహం ఉంటుంది. మరో చిన్న నంది భూమి లోనికి ఉంటుంది. పాతాళ నంది అని పిలుస్తారు. సరైన సమయానికి వర్షాలు పడకపోతే పాతాళ నందీశ్వరుని  నీటితో ముంచేస్తారు. అలా చేస్తే వానలు పడతాయని నమ్మకం. 
ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా శ్రమకు తగ్గ ఫలితం లభించక పోతే తగిన మార్గం చూపించమని అర్ధించడానికి, అవివాహితులు వివాహం కావాలని, సంతానం లేనివారు సంతానం కొరకు వస్తుంటారు. 
శ్రీ ముత్తంబికై సమేత శ్రీ అభిరామేశ్వర స్వామివార్లకు అభిషేకం జరిపిస్తే ఆలుమగల మధ్య గల అపోహలు తొలగిపోతాయి, ఇద్దరూ తిరిగి ఒకటి అవుతారని అంటారు. 
త్రయోదశి ప్రదోష పూజలు,మాసశివరాత్రి,  అమావాస్య,పౌర్ణమి పూజలు జరుగుతాయి. అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి  రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తులకు దర్శనం లభిస్తుంది. ఫాల్గుణ మాసంలో పది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. 
నయనారులలో అగ్రగణ్యులైన అప్పర్, సంబందర్, సుందరార్ శ్రీ అభిరామేశ్వర స్వామిని కీర్తిస్తూ పాటికాలు గానం చేశారు. ఈ గానం వలన శ్రీ అభిరామేశ్వర స్వామి ఆలయం రెండువందల డెబ్భై అయిదు పడల్  పెట్ర స్థలాలలో ఒకటి స్థిరపడింది. ఈ క్షేత్రానికి సమీపంలో ఇతర పడల్ పెట్ర స్థలాలైన "తిరువెన్నయి నల్లూరు , తిరుతురైయూరు, తిరువదిగై, తిరుమంది చరం, తిరునవలూరు" ఉన్నాయి. విల్లుపురం నుండి కారులో బయలుదేరితే ఒక్కరోజులో అన్ని ఆలయాలను సందర్శించుకోవచ్చును.  
ఈ విశేష క్షేత్రం విల్లుపురం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆటోలు, బస్సులు లభిస్తాయి. కానీ వసతి సౌకర్యాలకు విల్లుపురం మీద ఆధారపడాలి. 

నమః శివాయ !!!!!


 
 
  

1 కామెంట్‌:

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...