శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం, చేజెర్ల
(దక్షిణ కాశి క్షేత్రం)
తెలుగునాట ఎన్నో విశిష్ట క్షేత్రాలు తగిన గుర్తింపుకు నోచుకోక మారుమూల గ్రామాలలో సాధారణ ఆలయాల మాదిరిగా ఉండిపోతున్నాయి.
అలాంటి వాటిలో శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం ఒకటి.
ఒకప్పటి గుంటూరు జిల్లా నేటి పల్నాడు జిల్లాలో ఉన్న ఈ ఆలయ చరిత్ర సుమారు నాలుగవ శతాబ్ది నాటిదని చరిత్రకారులు నిర్ధారించారు. ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయం ఎన్నో విశేషాలకు నిలయం.
ఆలయ పురాణ గాథ
పూర్వం "కందర పురం", చేరంజెర్ల మరియు చేంజెఱువు" అని పిలవబడిన చేజెర్ల గ్రామంలో శ్రీ కపోతేశ్వర స్వామి కొలువు తీరడం వెనుక ఉన్న గాథ మహా భారతంలో ఉన్నట్లుగా చెప్పబడుచున్నది.
చంద్రవంశానికి చెందిన "శిబి చక్రవర్తి" ప్రజారంజకుడైన పాలకునిగా పేరొందారు. ఈయన గొప్ప దానశీలిగా ప్రసిద్ధి చెందారు. లోకోపకార నిమిత్తం నూరు యజ్ఞాలను చేయ సంకల్పించుకొని తొంభైతొమ్మిది పూర్తిచేసి నూరవ యజ్ఞం చేయడానికి సిద్దపడుతున్నారు శిబి. ఆ సమయంలో
శిబి దాన గుణాన్ని పరీక్షించడానికి నిర్ణయించుకున్నారట దేవతలు.
దేవేంద్రుడు డేగగా, అగ్ని దేవుడు పావుర రూపం ధరించారట. డేగ కపోతాన్ని వెంబడించగా అది ప్రాణభయంతో యజ్ఞానికి సిద్ధపడుతున్న శిబి ని చేరి శరణు కోరిందట. తన ఆహారాన్ని తనకు ఇమ్మని డేగ రాజుతో వాదనకు దిగిందట. ఆటవిక న్యాయాన్ని వివరిస్తూ తర్కం చేసిందట. అభయమిచ్చిన తానూ మాట తప్పలేనని, డేగ ఆకలి తీరడానికి తన శరీరం నుండి మాంసాన్ని ఇస్తానన్నాడట చక్రవర్త. డేగ అందుకు అంగీకరించడంతో ప్రజలు, పరివారం, కుటుంబం ఎదుట తన శరీరం కోయడానికి సిద్దపడ్డాడట.
త్రాసులో ఒక పక్క కపోతాన్ని ఉంచి రెండవ పక్క తన తొడ కండరాన్ని కోసి ఉంచారట శిబి. పావురమే బరువుగా ఉండినది. మరికొంత, మరికొంతగా తన శరీరంలోని మాంసాన్ని త్రాసులో ఉంచినా చిత్రంగా పావురం బరువుకు సరిపోలేదట. చివరకు తనే త్రాసులో కూర్చున్నాడట. అప్పుడు సరిపోవడమే కాదు దేవేంద్రుడు, అగ్ని దేవునితో సహా మిగిలిన దేవతలు, త్రిమూర్తులు అక్కడ సాక్షాత్కరించారట.
వారు శిబి యొక్క సత్యసంధతకు, దానగుణాన్ని అభినందించారట. ఆయన కోరిక మేరకు సర్వేశ్వరుని తో సహా అందరూ కొలువు తీరారట. అదే నేటి చేజర్ల.
స్థూలంగా ముందరకు తెలిసిన కధ ఇది.
వివాదం
కానీ దీనికి మరికొన్ని ఉపకథలను జోడించి చెప్పడం జరుగుతోంది. అన్నిటికన్నా ఎక్కువగా ప్రచారంలో ఉన్న విషయం ఈ ఆలయం ఒకప్పుడు బౌద్ధ ఆరామం అని చెప్పడం.
ఆలయంలోని కొన్ని నిర్మాణాలు బౌద్ధ స్థూపాలను ఇతర నిర్మాణాలను పోలిఉండటమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చును.
బౌద్ధ జాతక కధలలో కూడా శిబి ఉదంతం ఉండటం మరో కారణం.
ఈ రెండు తప్ప మరో ఖచ్చితంగా నిర్ధారించే ఆధారం ఇక్కడి నిర్మాణాలలో గాని, శాసనాలలో కానీ కనపడదు. జాతక కథల కన్నా ఎంతో ముందు కాలానికి చెందినది మహా పురాణమైన "మహా భారతం". వ్యాస భగవానుడు రాసినదానికన్నా ప్రమాణం ఇంకేముంటుంది ?
ఒకప్పుడు గుంటూరు సీమ బౌద్దాన్ని ఆదరించడం వలన కొంతకాలం బౌద్ధ భిక్షువులు ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఉండవచ్చును. బౌద్దానికి ఆదరణ తగ్గడంతో వారు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయి ఉంటారు. కానీ వారు చేసిన మార్పులు శాశ్వితంగా ఉండిపోయి కొంత వివాదానికి తావు నిస్తున్నాయి.
ఆలయ విశేషాలు
విశాల ప్రాంగణంలో ఉన్న శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయానికి రెండు ప్రాకారాలు ఉన్నాయి. మొదటి ప్రాకారానికి ఇరువైపులా రెండు పురాతన మండపాలు ఉంటాయి. పక్కనే నూతనంగా నిర్మించిన నవగ్రహ మండపం కనిపిస్తాయి.
రెండవ ప్రాకారానికి చిన్న గోపురంతో కూడిన ప్రధాన ప్రవేశ ద్వారం ప్రాంగణం లోనికి దారి తీస్తుంది. గోపురానికున్న మండప స్థంభాలపైనా శివ పుత్రులైన శ్రీ గణపతి, శ్రీ కుమారస్వామి రూపాలు చెక్కి ఉండటం గమనించవచ్చును.
ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలు, శాసనాలు, శివ లింగాలు కనిపిస్తాయి.
ఈశాన్య భాగంలో స్వామివారి కళ్యాణ మండపం ఉంటుంది.
నేరుగా వెళితే నంది మండపం దాటినా తరువాత కొద్దిగా లోపలికి ఒక గుహ మాదిరిగా కనిపించే గర్భాలయంలో శ్రీ కపోతేశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు. పక్కనే శ్రీ భ్రమరాంబ మరియు శ్రీ పార్వతీ దేవి విగ్రహాలు కూడా పూజలందుకొంటూ ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవాలి.
శ్రీ కపోతేశ్వర స్వామి
గర్భాలయంలో శ్రీ కపోతేశ్వర స్వామి లింగం మిగిలిన ఆలయాలలో కనిపించే లింగాలకు భిన్నంగా ఉంటుంది. భూమికి సమానంగా ఉన్న చతురస్రాకారపు పానువట్టం మధ్యలో గుంటలతో నిండిన లింగ రూపంలో దర్శనమిస్తారు.
లింగ పైభాగాన రెండు పెద్ద గుంతలు, మరి కొన్ని చిన్న గుంతలు కనిపిస్తాయి. ఒక పెద్ద రంధ్రములో కొంచెము నీరు పోసిన నిండిపోతుందట. రెండవ దానిలో ఎన్ని బిందెల నీరు పోసినా ఆనవాలు కనపడకుండా పోతాయని చెబుతారు. నిండిన రంధ్రంలోని నీటిని భక్తులకు తీర్థంగా ఇస్తారు.
మేళ్లచెరువు, వాడపల్లి లాంటి ప్రదేశాలలో కొలువైన శివ లింగాలకు కూడా పై భాగాన ఒక రంధ్రం ఉండటం తెలిసిన విషయమే ! కానీ ఇన్ని రంధ్రాలున్న లింగాన్ని చేజర్లలోనే చూడగలం.
అమ్మవార్లు ప్రత్యేక సన్నిధులలో కాకుండా ఒకేచోట కొలువై ఉండటం కూడా ఇక్కడే కనపడుతుంది.
శాసనాధారాల ద్వారా తొలి ఆలయాన్ని స్థానిక పాలకులైన ఆనంద గోత్రీకులైన రాజులు నిర్మించినట్లుగా తెలియవస్తోంది.
తదనంతర కాలంలో పల్లవ, తూర్పు చాళుక్యులు, చోళులు, విజయనగర రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అనేక కైంకర్యాలను సమర్పించుకొన్నట్లుగా తెలుస్తోంది.
తమిళనాడులో చాలా ఆలయాలలో కనిపించే "గజపృష్ఠ విమానం" ఇక్కడ గర్భాలయం పైన కనిపించడం చాలా అరుదైన విషయం.
ప్రాంగణంలో అనేక ఉపాలయాలు కనిపిస్తాయి.
ఉపాలయాలు
తమిళనాడులోని తిరువారూరు లోని శ్రీ త్యాగరాజస్వామి ఆలయంలో అధిక సంఖ్యలో ఉపాలయాలు ఉన్నాయని అంటారు. అది ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయం. కేవలం రెండు ఎకరాల వైశాల్యంలో ఉన్న శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలు ఎన్నో ! శాసనాల ప్రకారం ఒకప్పుడు ఎనభైదాకా ఉపాలయాలు, ముప్పై నందులు, లక్ష ఒక్క లింగాలు ఉండేవట. ప్రస్తుతం ముప్పై దాకా ఉపాలయాలు కనిపిస్తాయి. లింగాలు చెక్కిన అనేక ఫలకాలు కూడా ప్రాంగణమంతా చెదురుమదురుగా కనిపిస్తాయి. మరెన్నో శిధిల విగ్రహాలు, లింగాలు కూడా ఉంటాయి.
నిత్యపూజలు అందుకొంటున్న ఉపాలయ దేవీ దేవతలు శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రుడు, శ్రీ దత్తాత్రేయ, శ్రీ నగరేశ్వర, శ్రీ కోటేశ్వర, శ్రీ చిదంబరేశ్వర, శ్రీ మార్కండేయ, శ్రీ కాళేశ్వర, శ్రీ శంభు లింగేశ్వర, శ్రీ సర్వేశ్వర, శ్రీ భృంగేశ్వర, శ్రీ త్రికోటేశ్వర, శ్రీ అగస్థేశ్వర, ఇలా ఎన్నో.
కళ్యాణ మండపం వద్ద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ మాధవాంజనేయ ఉపాలయాలు కనపడతాయి. సప్తమాతృక శిల్పాలు ఎలాంటి నిర్మాణం లేకుండా ఉంటాయి.
ఇక్కడే ఎత్తైన గద్దె మీద సహస్రలింగం ఉంటుంది. ధ్వజస్థంభం వద్ద ప్రత్యేక మండపంలో దీప వృక్షం గా పిలిచే దీపస్థంభం కలదు. స్వామివారి అనుగ్రహాన్ని ఆపేక్షించేవారు కార్తీక, మాఘ మాసాల్లో అన్నిదినాలు సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు.
గమనించదగిన అంశం ఏమిటంటే ప్రాంగణంలో కనిపించే చిన్న పెద్ద లింగాలన్నీ బ్రహ్మసూత్రం కలిగి ఉండటం. ఒకే చోట ఇన్ని బ్రహ్మ సూత్ర లింగాలు ఉండటం గొప్ప విషయంగా పేర్కొనాలి. దీనివెనుక ఉన్న అసలు విశేషం ఏమిటన్నది తెలియదు.
శాసనాలు
ఆలయంలో మొత్తంగా తొమ్మిది శాసనాలు కనిపిస్తాయి. ఇవి సంస్కృత, నాగర, తెలుగు భాషలలో ఉంటాయి. అన్నింటి లోనికి పురాతన దాన శాసనం పల్లవ రాజు మహేంద్రవర్మ ఆరవ శతాబ్దంలో వేయించినది గా చెబుతారు. మరొకటి తూర్పు చాళుక్య రాజు విష్ణువర్ధనుడు ఏడవ శతాబ్దంలో వేయించింది. మిగిలినవి పది, పదకొండు, పన్నెండవ శతాబ్దాలకు చెందినవిగా తెలుస్తోంది.
వీటిల్లో ఆలయ విశేషాలు, దానాల వివరాలు ఉన్నాయి.
శ్రీ సుబ్రహ్మణ్య(కుమార) పర్వతం
ఆలయానికి ఉత్తరాన చిన్న కొండ ఉంటుంది. పైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఉండటం వలన అలా పిలుస్తున్నారు. కుజ, సర్ప దోషం గలవారు నియమంగా స్వామిని సేవించుకొంటే దోషం తొలగిపోతుంది అని విశ్వసిస్తారు. పైకి చేరుకోడానికి సోపాన మార్గం కలదు.
ఈ పర్వతం సంజీవని సమానమన్నది స్థానిక నమ్మకం.
"హిరణ్య బాహవే తుభ్యం , సేనానం పతయే నమః" అన్న మంత్రాన్ని భక్తిశ్రద్దలతో పఠిస్తూ కొండ చుట్టూ నియమంగా ప్రదక్షిణ చేస్తే దీర్ఘ రోగాల నుండి స్వాంతన లభిస్తుంది అని నమ్ముతారు.
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్నది.
ప్రతి నిత్యం నియమంగా అభిషేకాలు, అర్చనలు, అలంకారాలు, ఆరగింపులు నిర్వహిస్తారు. శుక్రవారాలు అమ్మవార్లకు కుంకుమార్చన జరుపుతారు.
మాస శివరాత్రి, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. గణేష చతుర్థి, జన్మాష్టమి, హనుమజ్జయంతి, శ్రీరామ నవమి, దేవీనవరాత్రులు విశేషంగా చేస్తారు.
శివరాత్రికి చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుండి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న చేజర్ల చేరుకోడానికి స్వంత లేదా ప్రవేటు వాహనాల మీద ఆధారపడవలసినదే !
వసతి మరియు భోజనానికి నరసరావుపేట మీద ఆధారపడాలి.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల నుండి నరసరావుపేట చేరుకోడానికి రైలు మరియు బస్సు సౌకర్యం లభిస్తుంది.
పౌరాణిక మరియు చారిత్రక ప్రాశస్త్యం గల విశేష క్షేత్రాన్ని సందర్శించాము అన్న సంతృప్తిని అందించే పురాతన ఆలయం శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం, చేజెర్ల.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి